ముంబై: దేశీయంగా డాలర్ మిలియనీర్ల (రూ. 7 కోట్ల పైగా వ్యక్తిగత సంపద ఉన్న వారు) సంఖ్య 2021లో 4.58 లక్షల కుటుంబాల స్థాయికి చేరింది. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 11 శాతం అధికం. హురున్ రిపోర్ట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2026 నాటికి భారత్‌లో డాలర్ మిలియనీర్ల సంఖ్య 30 శాతం పెరిగి 6 లక్షల కుటుంబాల స్థాయికి చేరనుంది. ముంబైలో అత్యధికంగా 20,300 కుటుంబాలు, ఢిల్లీలో 17,400, కోల్‌కతాలో 10,500 కుటుంబాలు డాలర్ మిలియనీర్ల కేటగిరీలో ఉన్నాయి. మరోవైపు, ఇటు వ్యక్తిగత అటు వృత్తిగత జీవితాల్లో సంతోషంగా ఉన్న వారి సంఖ్య మాత్రం 72 శాతం నుంచి 66 శాతానికి తగ్గింది.
ఈ అంశానికి సంబంధించి హురున్ నిర్వహించిన సర్వేలో 350 మంది డాలర్ మిలియనీర్లు పాల్గొన్నారు. ‘భారత మార్కెట్‌లో అడుగు పెట్టడానికి లేదా ఇప్పటికే ఉన్న తమ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకోవడానికి లగ్జరీ బ్రాండ్లు, సర్వీస్ ప్రొవైడర్లకు వచ్చే దశాబ్ద కాలంలో ఎన్నో అర్థవంతమైన అవకాశాలు లభించగలవు‘ అని హురున్ ఇండియా ఎండీ, చీఫ్ రిసర్చర్ అనాస్ రెహ్మాన్ జునైద్ చెప్పారు. 130 కోట్ల పైగా జనాభా గల దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో కుబేరులపై హురున్ నివేదికలోని అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ ఇటీవలి నివేదిక ప్రకారం భారత్‌లోని టాప్ 100 మంది సంపన్నుల సంపద ఏకంగా 775 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021లో ప్రపంచం మొత్తం మీద కడు పేదరికంలోకి జారిపోయే వారి సంఖ్యలో దాదాపు సగభాగం (4.6 కోట్ల మంది) భారత్‌లోనే ఉంటారని ఆక్స్‌ఫామ్ అంచనా వేసింది.
సర్వేలోని ఇతర విశేషాలు..
► పన్నులు చెల్లించడమనేది తమ సామాజిక బాధ్యతకు నిదర్శనంగా భావించే వారి సంఖ్య.. సర్వేలో పాల్గొన్న వారిలో మూడో వంతుకన్నా తక్కువే ఉంది.
► సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని అభిప్రాయపడిన వారి సంఖ్య కేవలం 19 శాతమే.
► మూడింట రెండొంతుల మంది తమ సంతానాన్ని ఉన్నత విద్య కోసం విదేశాలు పంపించేందుకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఫేవరెట్ గమ్యంగా అమెరికా ఉండగా, బ్రిటన్, న్యూజిలాండ్, జర్మనీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
► ఇక వినియోగంపరమైన అంశాల విషయానికొస్తే.. నాలుగో వంతు మంది తమ కార్లను ప్రతి మూడేళ్లకోసారి మార్చేస్తున్నారు. చాలా మందికి మెర్సిడెస్ బెంజ్ కార్లు ఫేవరెట్‌గా ఉంటున్నాయి. ఇంకా మిలియనీర్లకు అత్యంత ఇష్టమైన హాబీల్లో.. వాచీల కలెక్షన్ కూడా ఉంది. సర్వేలో పాల్గొన్న మూడింట రెండొంతుల మంది.. తమ దగ్గర కనీసం నాలుగు వాచీలైనా ఉన్నట్లుగా తెలిపారు. మళ్లీ వీటిలో రోలెక్స్ అత్యంత ఇష్టమైన బ్రాండ్‌గా ఉంది.
► ఆతిథ్యానికి సంబంధించి అత్యధిక శాతం మంది ఇష్టపడే హోటల్‌గా ఇండియన్ హోటల్స్‌కి చెందిన తాజ్, ఫేవరెట్ ఆభరణాల రిటైలర్‌గా తనిష్క్ (రెండూ టాటా గ్రూప్‌నకు చెందివే) అగ్రస్థానంలో ఉన్నాయి. లగ్జరీ ఉత్పత్తుల బ్రాండ్ లూయి విటన్, ప్రైవేట్ జెట్ బ్రాండ్ గల్ఫ్‌స్ట్రీమ్.. అత్యధిక శాతం మంది డాలర్ మిలియనీర్లకు ఫేవరెట్‌గా ఉన్నాయి.
► చెల్లింపుల కోసం యూపీఐని ఉపయోగిస్తున్న డాలర్ మిలియనీర్ల సంఖ్య 2021లో రెట్టింపై 36 శాతానికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment