సాక్షి, న్యూఢిల్లీ : నల్లధనంపై నియంత్రణలతో 2014 నుంచి పెద్దసంఖ్యలో డాలర్ మిలియనీర్లు భారత్‌ను విడిచివెళ్లారు. చైనా, ఫ్రాన్స్ కంటే భారత్ నుంచే డాలర్ మిలియనీర్లు అత్యధికంగా విదేశాలకు తరలివెళ్లారు. 2014 నుంచి 23,000 మంది మిలియనీర్లు దేశం వీడివెళ్లగా వీరిలో కేవలం 2017లోనే 7000 మంది విదేశాలకు చెక్కేశారని మోర్గాన్ స్టాన్లీలో చీఫ్ గ్లోబల్ స్ట్రేటజిస్ట్ రుచిర్ శర్మ విశ్లేషించారు. భారత సంపన్నుల్లో 2.1 శాతం మంది దేశాన్ని వీడగా, ఫ్రాన్స్ సంపన్నుల్లో 1.3 శాతం, చైనా సంపన్నుల్లో 1.1 శాతం ఆయా దేశాలను విడిచివెళ్లారని చెప్పుకొచ్చారు. 1,50,000 మంది మిలియనీర్లపై ఎన్‌డబ్ల్యూ వరల్డ్ వెల్లడించిన గణాంకాలను బట్టి ఈ వివరాలు వెల్లడయ్యాయి.కారణమేదైనా సంపన్నులు ఇంత పెద్ద సంఖ్యలో దేశం వీడటం ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చబోదని రుచిర్ శర్మ పేర్కొన్నారు.
ప్రపంచ సంపన్నులంతా అక్లాండ్, మోంట్రీల్, టెల్‌అవీవ్, టొరంటో వంటి నగరాలను ఎంచుకుంటున్నారని ఆయన విశ్లేషించారు.ఇక భారత్ నుంచి సంపన్నులు అధికంగా బ్రిటన్, దుబాయ్, సింగపూర్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. దేశం వెలుపల ఆరు నెలలుపైగా గడిపిన వారిని ఈ జాబితాలో చేర్చారు.
మరోవైపు ఫ్రాన్స్ నుంచీ కూడా మిలియనీర్లు పెద్దసంఖ్యలోనే వేరే దేశాలకు తరలివెళ్లారు. ఐరోపా యూనియన్ విచ్ఛిన్నమైన అనంతరం బ్రిటన్ నుంచి సైతం పలువురు సంపన్నులు ప్రపంచంలోని ఇతర నగరాలకు వలసవెళ్లారు. భారత్‌లో పన్ను చట్టాలను కఠినతరం చేయడం, బ్లాక్ మనీపై నియంత్రణలు, ఎన్‌పీఏల ఒత్తిడితో కొందరు సంపన్నులు ఇతర దేశాలకు తరలివెళ్లినట్టు ఈ గణాంకాలు స్పష్టం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment