తెలుగుజాతి రుణం తీర్చుకుంటా
హైదరాబాద్: సమాజానికి చార్టెర్డ్ అకౌంటెంట్లు(సీఏలు) ప్రశంసనీయమైన సేవలు అందజేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి అన్నారు. సీఏల సమస్యలను చట్టసభలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాట్లాడి హైదారాబాద్‌లో సీఏ సంఘం భవనానికి భూమి కేటాయించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
శుక్రవారం అంతర్జాతీయ చార్టెర్డ్ అకౌంటెంట్స్‌డే సందర్భంగా హైదరాబాద్‌లోని ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 67 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సంఘానికి అభినందనలు తెలిపారు. తాను గతంలో వ్యక్తిగతంగా, కార్పొరేట్ స్థాయిలో వివిధ హోదా ల్లో పనిచేశానని, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడి హోదాలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, కన్నతల్లి, తెలుగుజాతి రుణం తీర్చుకుంటానన్నారు. తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడుతామన్నారు. రైల్వే మంత్రి సురేష్‌ప్రభు, తాను ఇద్దరం సీఏలమేనని, ఏపీ నుంచి ఇద్దరం ఒకేసారి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశామని చెప్పారు. సీఏ వృత్తి అంటే కేవలం లాభనష్టాల లెక్కలు మాత్రమే కాదని దేశ ప్రగతి, సమాజ అభ్యున్నతిలో వారి పాత్ర అత్యంత కీలకమన్నారు.
అనంతరం ఆయన్ను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీఏగా పనిచేస్తూ ఇటీవలే సివిల్స్‌కు ఎంపికైన స్నేహజతో పాటు పలువురు సీఏలు, సంఘం పూర్వ సభ్యులను సత్కరించారు. సంఘం హైదరాబాద్ బ్రాంచ్ చైర్మన్ రామచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ చెంగల్‌రెడ్డి, కార్యదర్శి మండవ సునీల్‌కుమార్, ట్రెజరర్ భానునారాయణరావు తదితరులు పాల్గొన్నారు.