రియల్ ఎస్టేట్ సంస్థ మాక్రోటెక్ డెవలపర్స్ (Macrotech Developers)ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్‌లో రూ.944 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. ఇళ్లకు డిమాండ్ పెరగడం ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. గతేడాది ఇదే క్యూ3లో ఆర్జించిన రూ. 503 కోట్లతో పోలిస్తే ఇది 88 శాతం అధికంగా ఉంది. మొత్తం ఆదాయం రూ.2,958 కోట్ల నుంచి రూ.4,146 కోట్లకు చేరింది.
‘‘డిసెంబర్ క్వార్టర్‌లో మొత్తం రూ.4,510 కోట్ల ముందస్తు విక్రయాలు జరిగాయి. ప్రీ–సేల్స్ రూ.4వేల కోట్ల పైగా జరగడం ఇది వరుసగా నాలుగో త్రైమాసికం. ఎన్నడూ లేని విధంగా ఈ క్యూ3లో మొత్తం రూ.4,290 కోట్ల వసూళ్లు జరిగాయి’’ అని కంపెనీ ఎండీ–సీఈవో అభిషేక్ లోధా తెలిపారు.
– 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో నికరలాభం రూ.883 కోట్ల నుంచి రూ.1,842 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.6,385 కోట్ల నుంచి రూ.9,749 కోట్లకు చేరింది. ఇదే కాలంలో ముందస్తు విక్రయాలు 25% వృద్ది చెంది రూ.12,820 కోట్లు జరిగాయి.
మైండ్‌స్పేస్ రీట్ లాభం అప్
రియల్టీ రంగ సంస్థ మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ (Mindspace REIT) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. నికర నిర్వహణ ఆదాయం(ఎన్‌వోఐ) 8 శాతం పుంజుకుని రూ. 522 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 473 కోట్లు మాత్రమే ఆర్జించింది.
యూనిట్ హోల్డర్లకు ఒక్కో యూనిట్‌కు రూ. 5.32 చొప్పున పంపిణీ చేయనున్నట్లు కంపెనీ తెలియజేసింది. తద్వారా రూ. 315.5 కోట్లు వెచ్చించనుంది. దీనిలో ఒక్కో యూనిట్‌కు రూ. 3.2 చొప్పున డివిడెండ్ కలసి ఉంది. ఇందుకు రూ. 190 కోట్లు చెల్లించనుంది. ఈ కాలంలో 1.7 మిలియన్ చదరపు అడుగులను లీజ్ కిచ్చినట్లు కంపెనీ సీఈవో రమేష్ నాయిర్ పేర్కొన్నారు.
కాగా.. సస్టెయిన్ ప్రాపర్టీస్‌లో 100 శాతం వాటా కొనుగోలుకి ఆఫర్ ఇచ్చినట్లు మైండ్‌స్పేస్ రీట్ వెల్లడించింది. హైదరాబాద్ రాయ్‌దుర్గ్‌లోని కామర్‌జోన్ ఐటీ పార్క్‌లో 1.8 మిలియన్ చదరపు అడుగులను సస్టెయిన్ కలిగి ఉన్నట్లు తెలియజేసింది. బీఎస్‌ఈలో మైండ్‌స్పేస్ రీట్ షేరు 0.6 శాతం క్షీణించి రూ. 375 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment