
2024లో అమ్మకాలు రూ.1.05 లక్షల కోట్లు
దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో సానుకూలం
ప్రాప్ ఈక్విటీ సంస్థ నివేదిక విడుదల
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో గతేడాది ఇళ్ల అమ్మకాల విలువ చెప్పుకోతగ్గ స్థాయిలో పడిపోయింది. 2023తో పోల్చి చూస్తే 18 శాతం తక్కువగా రూ.1.05 లక్షల కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. 2023లో విక్రయాల విలువ రూ.1.28 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. కానీ, దేశవ్యాప్తంగా టాప్ 9 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాల విలువ 2024లో నికరంగా 12 శాతం పెరిగి రూ.6,73,000 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. రియల్ ఎస్టేట్ డేటా అనలైటిక్స్ సంస్థ ‘ప్రాప్‌ఈక్విటీ’ ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. 2023లో రూ.6,00,143 కోట్ల విలువైన ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి.
ఢిల్లీలో సానుకూల పరిస్థితులు
‘‘ఢిల్లీ–ఎన్‌సీఆర్ మార్కెట్లో సగటు విక్రయ ధర చదరపు అడుగుకి (ఎస్‌ఎఫ్‌టీ) రూ.12,469గా ఉంది. మౌలిక వసతుల అభివృద్ధి మెరుగ్గా ఉండడం, కార్పొరేట్ కంపెనీల ప్రాతినిధ్యం పెరుగుతుండడం, విస్తృత ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావడంతో డిమాండ్ పెరుగుతోంది’’అని ప్రాప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజ తెలిపారు.
నగరాల వారీగా అమ్మకాలు..
⇒ గురుగ్రామ్‌లో 2023లో రూ.64,314 కోట్ల ఇళ్ల విక్రయాలు జరిగితే, 2024లో రూ.1,06,739 కోట్లకు పెరిగాయి.
⇒ ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతంలో గతేడాది ఇళ్ల అమ్మకాలు 63 శాతం పెరిగి రూ.1,53,000 కోట్లకు చేరాయి. 2023లో అమ్మకాల విలువ రూ.94,143 కోట్లుగానే ఉంది.
⇒ ముంబై మార్కెట్లో అమ్మకాల విలువ 13 శాతం పెరిగి రూ.1.38 లక్షల కోట్లకు చేరింది.
⇒ నవీ ముంబైలోనూ 32 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు రూ.25,000 కోట్లకు చేరాయి.
⇒ థానేలో 6 శాతం అధికంగా రూ.56,000 కోట్ల అమ్మకాలు 2024లో జరిగాయి.
⇒ బెంగళూరు మార్కెట్లో రూ.85,000 కోట్ల విలువైన ఇళ్ల విక్రయాలు గతేడాది జరిగాయి. అంతకుముందు ఏడాది విక్రయాలు రూ.75వేల కోట్లతో పోల్చి చూస్తే 13 శాతం పెరిగాయి.
⇒ చెన్నై మార్కెట్లో 5 శాతం వృద్ధితో ఇళ్ల విక్రయాలు రూ.20,000 కోట్లుగా ఉన్నాయి.
⇒ కోల్‌కతాలో రూ.15,000 కోట్ల అమ్మకాలు చోటుచేసుకున్నాయి. 2023లో విక్రయాలు రూ.13,000 కోట్లతో పోల్చి చూస్తే 15 శాతం వృద్ధి నమోదైంది.
⇒పుణెలో అమ్మకాల విలువ కేవలం ఒక శాతం క్షీణించి రూ.76,000 కోట్లుగా ఉంది. 2023లో ఇక్కడ రూ.77,000 కోట్ల విక్రయాలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment