న్యూఢిల్లీ: హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో 11 శాతం మేర క్షీణించాయి. మొత్తం 1.07 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో విక్రయాలు 1,20,290 యూనిట్లుగా ఉన్నాయి. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది.
కొత్త ఆవిష్కరణలు తక్కువగా ఉండడం, అదే సమయంలో ఇళ్ల ధరలు సగటున 23 శాతం పెరగడం అమ్మకాల క్షీణతకు కారణాలుగా పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో అమ్మకాలు ఏకంగా 22 శాతం తగ్గి 12,735 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 16,375 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం.
పట్టణాల వారీగా..
» పుణెలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 17 శాతం తక్కువగా 19,050 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.
» ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో అమ్మకాలు 15,570 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాల కంటే 2% తక్కువ.
» బెంగళూరులో ఇళ్ల విక్రయాలు 8 శాతం క్షీణించి 15,025 యూనిట్లుగా ఉన్నాయి.
» కోల్‌కతా పట్టణంలో 25 తక్కువగా 3,980 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
» చెన్నైలో 4,510 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 4,945 యూనిట్ల కంటే 9% తగ్గాయి.
హైదరాబాద్‌లో ధరల పెరుగుదల అధికం
ఏడు ప్రముఖ పట్టణాల్లో హైదరాబాద్‌లోనే ఇళ్ల ధరల పెరుగుదల అధికంగా 32 శాతం మేర నమోదైంది. ‘‘నిర్మాణంలోకి వినియోగించే ఉత్పత్తుల ధరలు పెరగడం, అమ్మకాల్లోనూ గణనీయమైన వృద్ధితో.. ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు మొత్తం మీద 23 శాతం మేర పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.6,800 నుంచి రూ.8,390కు పెరిగింది’’అని అనరాక్ నివేదిక తెలిపింది.
పండుగల కాలంలో డిమాండ్
‘‘అన్ని ప్రముఖ పట్టణాల్లోనూ ఇళ్ల అమ్మకాలు క్షీణించాయి. టాప్–7 పట్టణాల్లో నూతన ఇళ్ల యూనిట్ల సరఫరా జూలై–సెపె్టంబర్ మధ్య 19 శాతం తగ్గి 93,750 యూనిట్లుగానే ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 1,16,220 కొత్త యూనిట్ల సరఫరా నమోదైంది. ఆవిష్కరణల కంటే విక్రయాలు ఎక్కువగా ఉండడం.. డిమాండ్–సరఫరా సమీకరణం బలంగా ఉండడాన్ని సూచిస్తోంది’’అని అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి తెలిపారు. అధిక ధరలకు తోడు, వర్షాకాలం కావడం విక్రయాలు తగ్గడం వెనుక ఉన్న అంశాలుగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment