Q3 profits
-
ఆయిల్ ఇండియా లాభం రికార్డ్.. షేరుకి రూ.10 డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఆయిల్ ఇండియా పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 40 శాతం జంప్‌చేసి రూ. 1,746 కోట్లను అధిగమించింది. ఒక త్రైమాసికంలో ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,245 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు ఉత్పత్తి సహా చమురు, గ్యాస్ విక్రయ ధరలు పుంజుకోవడం సహకరించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 10 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇప్పటికే రూ. 4.5 చెల్లించింది. కాగా.. ప్రస్తుత సమీక్షా కాలంలో కంపెనీ ప్రతీ బ్యారల్ చమురుకు 88.33 డాలర్ల ధరను పొందింది. గత క్యూ3లో 78.59 డాలర్ల ధర లభించింది. ఇక నేచురల్ గ్యాస్ ఒక్కో బీటీయూకి 8.57 డాలర్ల చొప్పున అందుకుంది. గత క్యూ3లో గ్యాస్ విక్రయ ధర 6.1 డాలర్లుగా నమోదైంది. చమురు ఉత్పత్తి 0.75 మిలియన్ టన్నుల నుంచి 0.81 ఎంటీకి ఎగసింది. గ్యాస్ ఉత్పత్తి సైతం 0.79 బిలియన్ ఘనపు మీటర్ల నుంచి 0.8 బీసీఎంకు పుంజుకుంది. చమురు విక్రయాలు 1.35 ఎంటీ నుంచి 1.41 ఎంటీకి వృద్ధి చూపాయి. మొత్తం టర్నోవర్ 27 శాతం పురోగమించి రూ. 5,982 కోట్లను తాకింది. -
లాభాల్లోకి జీఐసీ ఆర్ఈ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(జీఐసీ) ఆర్ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 1,201 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 28.5 కోట్ల నికర నష్టం ప్రకటించింది. స్థూల ప్రీమియం ఆదాయం రూ. 10,240 కోట్ల నుంచి రూ. 10,099 కోట్లకు స్వల్పంగా తగ్గింది. నికర ప్రీమియం మాత్రం రూ. 9,333 కోట్ల నుంచి రూ. 9,561 కోట్లకు బలపడింది. అయితే ఆర్జన ప్రీమియం రూ. 8,907 కోట్ల నుంచి రూ. 8,649 కోట్లకు నీరసించింది. ఈ కాలంలో క్లెయిముల విలువ రూ. 10,858 కోట్ల నుంచి రూ. 8,381 కోట్లకు క్షీణించడం లాభాలకు దోహదం చేసింది. దీనికితోడు అండర్‌రైటింగ్ నష్టం సైతం రూ. 2,371 కోట్ల నుంచి రూ. 1,537 కోట్లకు తగ్గడం, పెట్టుబడుల ఆదాయం రూ. 2,271 కోట్ల నుంచి రూ. 3,026 కోట్లకు పుంజుకోవడం జత కలిశాయి. 2022 డిసెంబర్‌కల్లా కంపెనీ నికర విలువ రూ. 53,723 కోట్ల నుంచి రూ. 61,617 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో జీఐసీ ఆర్ఈ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 167 వద్ద ముగిసింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 1,247 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) నికర లాభం రూ. 1,247 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నమోదైన రూ. 706 కోట్లతో పోలిస్తే ఇది 77 శాతం అధికం. విదేశీ మారకంపరంగా సానుకూలతలు, కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడం తదితర అంశాలు ఇందుకు దోహదపడ్డాయని సంస్థ సీఎఫ్‌వో పరాగ్ అగర్వాల్ వెల్లడించారు. సమీక్షాకాలంలో ఆదాయం 27 శాతం పెరిగి రూ. 5,320 కోట్ల నుంచి రూ. 6,770 కోట్లకు పెరిగినట్లు వివరించారు. గతేడాది సెప్టెంబర్‌లో అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టిన రెవ్లిమిడ్ ఔషధం .. కంపెనీ ఆదాయాలకు అర్ధవంతమైన రీతిలో తోడ్పడుతోందని ఆయన పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో అయిదు కొత్త ఔషధాలను ప్రవేశపెట్టామని, పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఉత్తర అమెరికా మార్కెట్లో 25 కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని వివరించారు. ధరలపరమైన తగ్గుదల ధోరణులు దాదాపుగా గత రెండు త్రైమాసికాల్లో చూసిన విధంగానే ఉన్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ పేర్కొన్నారు. అమెరికా, రష్యా మార్కెట్లలో వృద్ధి తోడ్పాటుతో పటిష్టమైన ఆర్థిక పనితీరు కనపర్చగలిగామని డీఆర్ఎల్ కో–చైర్మన్ జి.వి. ప్రసాద్ తెలిపారు. ఫలితాల్లో ఇతర ముఖ్య విశేషాలు.. ► కొత్త ఔషధాల ఆవిష్కరణ, ఉత్పత్తుల రేట్ల పెంపుతో భారత్ మార్కెట్లో ఆదాయం 10 శాతం పెరిగి రూ. 1,130 కోట్లకు చేరింది. ► కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం 64 శాతం వృద్ధి చెంది రూ. 3,060 కోట్లుగా నమోదైంది. వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 14 శాతం, యూరప్‌లో అమ్మకాలు ఆరు శాతం పెరిగాయి. ► క్యూ3లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై రూ. 480 కోట్లు వెచ్చించారు. పెట్టుబడి వ్యయాలపై కంపెనీ రూ. 1,500 కోట్లు వెచ్చించనుంది. -
సన్‌ఫార్మా : అంచనాలు మిస్
సాక్షి, ముంబై: ఫార్మా దిగ్గజం సన్ ఫార్యాస్యూటికల్స్ నిరాశాజనక క్యూ3 ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్ క్వార్టర్లో నికరలాభం 26 శాతం తగ్గి 913.52 కోట్ల డాలర్లకు చేరుకుంది. గత క్యూ3లో రూ.1,242 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ క్యూ3లో రూ.914 కోట్లకు తగ్గిందని సన్ ఫార్మా తెలిపింది. వ్యయాలు రూ.6,203 కోట్ల నుంచి రూ.6,923 కోట్లకు పెరగడం వల్ల నికర లాభం తగ్గిందని సన్ ఫార్మా ఎండీ దిలిప్ సంఘ్వి తెలిపారు. కార్యకలాపాల ఆదాయం రూ.7,657 కోట్ల నుంచి రూ.8,039 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. భారత్‌లో బ్రాండెడ్ వ్యాపారం బాగా ఉందని, క్యూ 3 తో పాటు తొమ్మిది నెలల కాలానికి రెండంకెల వృద్ధిని సాధించిందని సంఘ్వి తెలిపారు. ఆంకాలజీ ఉత్పత్తులకు చైనాలోని ఆస్ట్రాజెనెకాతో లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా కొత్త మార్కెట్లలో తమ పోర్ట్‌ఫోలియోను పెంచుకోనున్నామన్నారు. ఏఐఓసీడీ అవాక్స్ డిసెంబర్, 2019 నివేదిక ప్రకారం భారత ఫార్మా మార్కెట్లో అగ్రస్థానం తమ కంపెనీదేనని, రూ1.4 లక్షల కోట్ల మార్కెట్లో 8.2 శాతం మార్కెట్ వాటా తమ చేతిలోనే ఉందని పేర్కొన్నారు. -
స్ట్రైడ్స్ ఫార్మా లాభం రూ.296 కోట్లు
న్యూఢిల్లీ: ఫార్మా సంస్థ, స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.296 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత క్యూ3లో రూ.88 కోట్ల నికర లాభం ఆర్జించామని ఈ కంపెనీ తెలిపింది. ఆదాయం రూ.749 కోట్ల నుంచి రూ.795 కోట్లకు పెరిగింది. ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని స్డ్రైడ్స్ ఫార్మా సైన్స్ వ్యవస్థాపకులు, గ్రూప్ సీఈఓ అరుణ్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన ఆరో ఫార్మాస్యూటికల్స్‌లో వాటాను రూ.2,000 కోట్లకు తమ అనుబంధ సంస్థ స్ట్రైడ్స్ ఫార్మా గ్లోబల్ పీటీఈ విక్రయించనున్నదని వివరించారు. వివిమెడ్తో ఈ కంపెనీ ఏర్పాటు చేసిన 50:50 జాయింట్ వెంచర్లో వాటాను వంద శాతానికి పెంచుకోనున్నదని పేర్కొన్నారు. మరోవైపు అమెరికాకు చెందిన వెన్సమ్ ఫార్మాలో వంద శాతం వాటాను కొనుగోలు చేయడానికి తమ మరో అనుబంధ కంపెనీ స్ట్రైడ్స్ ఫార్మా ఇన్‌కార్పొ ఒక ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. అలాగే ఫార్మాపర్ ఇన్కార్పొలో 80 శాతం వాటాను 40 లక్షల కెనడా డాలర్లకు కొనుగోలు చేయడానికి మరో అనుబంధ కంపెనీ, స్ట్రైడ్స్ ఫార్మా కెనడా ఇన్‌కార్పొ ఒప్పందాన్ని కుదుర్చుకుందన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేర్ 2.5% నష్టపోయి రూ.492 వద్ద ముగిసింది. -
మారుతి లాభాలు జూమ్
న్యూఢిల్లీ: దేశీయ నంబర్ వన్ కార్ మేకర్ మారుతి సుజుకి ఇండియా ఆసక్తికరమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో నికర లాభం 48 శాతం (47.46) జూమ్ అయ్యాయి. బుధవారం విడుదల చేసిన మూడో త్రైమాసిక ఫలితాల్లో రూ. 1744 కోట్లను నికర లాభాలను ఆర్జింయింది. మొత్తం ఆదాయం 13 శాతం పెరిగి రూ. 19,173 కోట్లకు చేరినట్టు మారుతి ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ 16,957.6 కోట్లుగా ఉంది. నిర్వహణ లాభం(ఇబిటా) 16 శాతం ఎగసి రూ. 2489 కోట్లుకాగా, ఇబిటా మార్జిన్లు 14.4 శాతం నుంచి 14.8 శాతానికి బలపడ్డాయి. ఈ కాలంలో ఇతర ఆదాయం రూ. 243 కోట్ల నుంచి రూ. 592 కోట్లకు ఎగసింది. డిశెంబర్31 నాటికి 8 శాతం వృద్ధితో మొత్తం1,154,164 వాహనాలను విక్రయించింది. ఇందులో 92,291యూనిట్లను ఎగుమతిచేసినట్టు రిపోర్ట్ చేసింది. ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ హెయ్యర్ సెగ్మెంట్ మోడల్స్ పై పెరిగిన పెట్టుబడులు, తక్కువ అమ్మకాలు ప్రమోషన్ అండ్ మార్కెటింగ్ వ్యయం, వ్యయ తగ్గింపు ప్రయత్నాలు తదితర చర్యలు తమ లాభాలు పెంచడానికి దోహదపడింది. అలాగే వస్తువు ధరలు , ప్రతికూల విదేశీ మారక పెరుగుదల ఈ త్రైమాసికంలో పాక్షికంగా ప్రభావం చూపినట్టు పేర్కొంది. .కాగా ఈ ఫలితాల నేపథ్యంలో మారుతి సుజుకి 0.62 శాతం స్వల్ప లాభంతో బీఎస్ఈలో రూ 5,775 వద్ద కొనసాగుతోంది. ఇటీవల బాలెనో, బ్రెజ్జా లాంటి మోడల్స్ తో కారు లవర్స్ ను బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.