న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(జీఐసీ) ఆర్‌ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో టర్న్‌అరౌండ్ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 1,201 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 28.5 కోట్ల నికర నష్టం ప్రకటించింది. స్థూల ప్రీమియం ఆదాయం రూ. 10,240 కోట్ల నుంచి రూ. 10,099 కోట్లకు స్వల్పంగా తగ్గింది. నికర ప్రీమియం మాత్రం రూ. 9,333 కోట్ల నుంచి రూ. 9,561 కోట్లకు బలపడింది.
అయితే ఆర్జన ప్రీమియం రూ. 8,907 కోట్ల నుంచి రూ. 8,649 కోట్లకు నీరసించింది. ఈ కాలంలో క్లెయిముల విలువ రూ. 10,858 కోట్ల నుంచి రూ. 8,381 కోట్లకు క్షీణించడం లాభాలకు దోహదం చేసింది. దీనికితోడు అండర్‌రైటింగ్ నష్టం సైతం రూ. 2,371 కోట్ల నుంచి రూ. 1,537 కోట్లకు తగ్గడం, పెట్టుబడుల ఆదాయం రూ. 2,271 కోట్ల నుంచి రూ. 3,026 కోట్లకు పుంజుకోవడం జత కలిశాయి. 2022 డిసెంబర్‌కల్లా కంపెనీ నికర విలువ రూ. 53,723 కోట్ల నుంచి రూ. 61,617 కోట్లకు ఎగసింది.
ఫలితాల నేపథ్యంలో జీఐసీ ఆర్‌ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 167 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment