general insurance company
-
జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్రం నిధులు!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలకు కేంద్రం మరిన్ని నిధులు సమకూర్చనుంది. వాటి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేందుకు ఇది తప్పనిసరి అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం గతేడాది రూ.5,000 కోట్ల నిధులను సమకూర్చింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో పనితీరు ఆధారంగా, నియంత్రణపరమైన నిధుల అవసరాలను చేరుకునేందుకు వీలుగా వీటికి ఎంత మేర సమకూర్చాలనే దానిపై ఆర్థిక శాఖ ఒక నిర్ణయం తీసుకుంటుందని సదరు అధికారి తెలిపారు. వాటి ఆర్థిక పరిస్థితి ఆరోగ్యంగా లేదని, సాల్వెన్సీ మార్జిన్ పెంచేందుకు నిధుల సాయం అవసరమని చెప్పారు. కంపెనీలు తమకు వచ్చే క్లెయిమ్‌లకు చెల్లింపులు చేస్తుంటాయని తెలిసిందే. ఈ చెల్లింపులకు మించి నిధులను బీమా సంస్థలు కలిగి ఉండడాన్ని సాల్వెన్సీ మార్జిన్‌గా చెబుతారు. ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం కనీసం 1.5 సాల్వెన్సీ మార్జిన్ అయినా ఉండాలి. -
అదానీ కంపెనీల్లో బీమా సంస్థలకు ఎక్స్పోజర్
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు కంపెనీల్లో ప్రభుత్వరంగ ఐదు సాధారణ బీమా సంస్థలకు రూ.347 కోట్ల ఎక్స్పోజర్ (రుణాలు, పెట్టుబడులు) ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవంత్ కరాడ్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అదానీ గ్రూప్‌నకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చిన రుణాల వివరాలపై సభ్యుల నుంచి ప్రశ్న ఎదురైంది. బ్యాంకులు సమర్పించిన రుణాల సమాచారాన్ని వెల్లడించరాదని ఆర్బీఐ చట్టం చెబుతున్నట్టు సహాయ మంత్రి తెలిపారు. ఎల్ఐసీ జనవరి 30 నాటికి అదానీ గ్రూపు కంపెనీల్లో ఈక్విటీ వాటాలు, డెట్ కలిపి రూ.35,917 కోట్ల ఎక్స్పోజర్ కలిగి ఉందని, సంస్థ మొత్తం నిర్వహణ ఆస్తులు రూ.41.66 లక్షల కోట్లలో ఇది కేవలం 0.975 శాతానికి సమానమని పేర్కొన్నారు. న్యూ ఇండియా అష్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు అదానీ గ్రూపు కంపెనీల్లో జనవరి చివరికి రూ.347.64 కోట్ల ఎక్స్పోజర్ ఉంది. -
లాభాల్లోకి జీఐసీ ఆర్ఈ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(జీఐసీ) ఆర్ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 1,201 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 28.5 కోట్ల నికర నష్టం ప్రకటించింది. స్థూల ప్రీమియం ఆదాయం రూ. 10,240 కోట్ల నుంచి రూ. 10,099 కోట్లకు స్వల్పంగా తగ్గింది. నికర ప్రీమియం మాత్రం రూ. 9,333 కోట్ల నుంచి రూ. 9,561 కోట్లకు బలపడింది. అయితే ఆర్జన ప్రీమియం రూ. 8,907 కోట్ల నుంచి రూ. 8,649 కోట్లకు నీరసించింది. ఈ కాలంలో క్లెయిముల విలువ రూ. 10,858 కోట్ల నుంచి రూ. 8,381 కోట్లకు క్షీణించడం లాభాలకు దోహదం చేసింది. దీనికితోడు అండర్‌రైటింగ్ నష్టం సైతం రూ. 2,371 కోట్ల నుంచి రూ. 1,537 కోట్లకు తగ్గడం, పెట్టుబడుల ఆదాయం రూ. 2,271 కోట్ల నుంచి రూ. 3,026 కోట్లకు పుంజుకోవడం జత కలిశాయి. 2022 డిసెంబర్‌కల్లా కంపెనీ నికర విలువ రూ. 53,723 కోట్ల నుంచి రూ. 61,617 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో జీఐసీ ఆర్ఈ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 167 వద్ద ముగిసింది. -
జనరల్ ఇన్స్యూరెన్స్ ఉద్యోగులకు త్వరలో తీపికబురు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ(పిఎస్‌యు) జనరల్ ఇన్స్యూరెన్స్ లో పనిచేసే ఉద్యోగులు చివరకు రాబోయే కొద్ది రోజుల్లో 15 శాతం వేతన సవరణ జరిగే అవకాశం ఉన్నట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం.. 60 వేల మంది పిఎస్‌యు ఉద్యోగులకు వేతనాల సవరణలు 2021లో జరగనున్నాయి. అంటే రాబోయే రోజుల్లో వీరికి గుడ్‌న్యూస్ అందే అవకాశం ఉంది. వేతన సవరణ సాధారణంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. జనరల్ ఇన్స్యూరెన్స్ ఉద్యోగులకు చివరిసారిగా 2017లో వేతన సవరణ జరిగింది. అందువల్ల, వేలాది మంది ఉద్యోగులు తమ వేతనాల పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల, జీఐపీఎస్‌ఏ ఛైర్మన్, న్యూ ఇండియా అస్యూరెన్స్ సీఎండీ అతుల్ సహాయ్ మాట్లాడుతూ.. " వేతన సవరణ సమస్య త్వరలో పరిష్కరించబడుతుంది. డిసెంబర్లో ఉద్యోగులకు వేతన పెంపు ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని అన్నారు. కానీ, ఉద్యోగులు బకాయిల కోసం పోరాడటానికి సిద్ధంగా ఉండాలి" అని ఆయన ఉద్యోగుల బృందాన్ని ఉద్దేశించి ప్రసంగించారని నివేదిక తెలిపింది. ప్రస్తుతం సాధారణ బీమా రంగంలో నాలుగు పిఎస్‌యులు ఉన్నాయి. అని నేషనల్ ఇన్స్యూరెన్స్, న్యూ ఇండియా అస్యూరెన్స్, ఓరియంటల్ ఇన్స్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్. 60,000 మందికి పైగా ఉద్యోగులు ఈ సంస్థలలో పనిచేస్తున్నారు. నాలుగు సంస్థలలో న్యూ ఇండియా అస్యూరెన్స్ మాత్రమే పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ, ఇది ఒకటి మాత్రమే మంచి ఆర్థిక స్థితిలో ఉన్నట్లు కనిపిస్తుంది. మార్కెట్ వాటా తగ్గడం, ప్రైవేట్ సంస్థల నుంచి పెరుగుతున్న పోటీ కారణంగా మిగిలిన బీమా కంపెనీలు ప్రస్తుతం ఆర్థికంగా నష్టపోతున్నాయి. (చదవండి: ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాలకు అడ్డాగా భారత్.. లక్షల కోట్ల బిజినెస్!) -
ఏపీజీఐసీఎల్‌కు చైర్మన్‌గా ఎస్ఎస్ రావత్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చైర్మన్, ఎండీలను నామినేట్ చేసింది. ఈ మేరకు మంగళవారం రోజున ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీజీఐసీఎల్‌కు చైర్మన్‌గా ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఎండీగా ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణను ప్రభుత్వం నియమించింది. (రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తాం: వైఎస్ జగన్) -
3 బీమా సంస్థల విలీన ప్రక్రియ షురూ..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన మూడు జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల విలీన ప్రక్రియపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. దీనిపై చర్చలు జరుపుతోంది. ఇప్పటికే కొన్ని సమావేశాలు జరిగాయని, అయితే ఇవింకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. విలీనానికి సంబంధించి పూర్తి మార్గదర్శక ప్రణాళిక ఇంకా రూపొందించాల్సి ఉందని వివరించాయి. 2018–19 బడ్జెట్లో ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థల విలీన ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. ఈ మూడు బీమా సంస్థలు కలిసి 2016–17లో మొత్తం రూ. 44,000 కోట్ల ప్రీమియం వసూళ్లు సాధించాయి. సాధారణ బీమా రంగంలో ఈ మూడింటి వాటా 35 శాతం దాకా ఉంటుంది. వీటిని విలీనం చేసిన పక్షంలో భారీ జనరల్ ఇన్సూరెన్స్ దిగ్గజ సంస్థ ఏర్పాటు అవుతుంది. 2018–19లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వం నిర్దేశించుకున్న రూ. 80,000 కోట్ల నిధుల సమీకరణలో ఈ విలీనం కీలక పాత్ర పోషించనుంది. గతేడాదే ప్రభుత్వ రంగానికి చెందిన న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థలు లిస్టయ్యాయి. -
బీమా నచ్చకుంటే మారిపోండి!
పోర్టబిలిటీతో పలు లాభాలు రెండేళ్ల క్రితం... ఆరోగ్య బీమా ప్లాన్ తీసుకున్నాక అది నచ్చకపోతే సొమ్మో, ప్రయోజనాలో నష్టపోకుండా దాన్నుంచి బయటపడే మార్గం ఉండేది కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆరోగ్య బీమా పోర్టబిలిటీని బీమా రెగ్యులేటర్ ఐఆర్డీఏ అమల్లోకి తెచ్చింది. దీంతో... ప్రయోజనాలను కోల్పోనవసరం లేకుండానే ఒక బీమా కంపెనీ నుంచి మరో కంపెనీకి మారే స్వేచ్ఛ పాలసీదారులకు లభించింది. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారడమే కాకుండా ఒకే కంపెనీలోని ఒక ప్లాన్ నుంచి మరో ప్లాన్‌కు మారే వెసులుబాటు కూడా దక్కింది. పోర్టబిలిటీ ద్వారా ఖాతాదారులకు సమకూరిన హక్కులేంటంటే... 1) జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, స్పెషలైజ్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో దేని నుంచి దేనికైనా పాలసీలను మార్చుకోవచ్చు. 2) వ్యక్తిగత పాలసీలతో పాటు కుటుంబ పాలసీలకు వర్తిస్తుంది. అయితే ఇలా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినపుడు, పాలసీ తీసుకున్నపుడు ఉండే 30 రోజుల వెయిటింగ్ పీరియడ్‌ను రద్దు చేస్తారు. దీనికి తోడు కొత్త కంపెనీలో బీమా చేసిన మొత్తం ఇంతకుముందు కంపెనీలో చేసిన మొత్తం కంటే తక్కువ ఉండకూడదు. చేయాల్సిందేమిటంటే... ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారే ముందు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కంపెనీని మార్చినపుడు కొత్త పాలసీదారు మాదిరిగానే అండర్‌రైటింగ్ ప్రక్రియలన్నీ పూర్తిచేయాలి. అండర్‌రైటింగ్ మార్గదర్శకాల ప్రకారం ఏ పాలసీనైనా తిరస్కరించే అధికారం కొత్త కంపెనీకి ఉంది. ఆరోగ్య బీమా పాలసీ పోర్టబిలిటీ తీసుకున్నప్పటికీ మునుపటి ప్రయోజనాలన్నీ కొనసాగుతాయి. పోర్టబిలిటీ అంటే పాలసీని మధ్యలో ఆపేయడం కాదు, కొనసాగించడమే. అంతకుముందు ఉన్న వ్యాధులకు బీమా కవరేజీని నష్టపోవాల్సిన అవసరం లేదు. కొత్త కంపెనీల్లో ప్రీమియం చార్జీలు తక్కువగా ఉండడం, పాలసీదారులకు మరింత మెరుగైన సేవలు అందడం, కొత్త ప్లానులు అందుబాటులోకి రావడం, మరింత పారదర్శకత వంటి అదనపు ప్రయోజనాలు పోర్టబిలిటీ ద్వారా సమకూరుతాయి. ప్రీమియం, బెనిఫిట్ల పరంగా తమకు అనుకూలమైన కొత్త ప్లాన్‌ను పాలసీదారులు ఎంచుకోగలుగుతారు. పోర్టబిలిటీని వినియోగించుకునే ముందు, ప్రస్తుత పాలసీతో పొందుతున్న ప్రయోజనాలను తాము మారదలుచుకున్న ప్లాన్‌తో వచ్చే లాభాలతో పోల్చిచూసుకోవడం ఎంతైనా అవసరం. సదరు ప్లాన్‌లోని ఫ్లెక్సిబిలిటీ, ధర, గరిష్ట వయోపరిమితి, వెయిటింగ్ పీరియడ్, వ్యాధుల కవరేజీ, పాలసీ తీసుకోవడానికి ముందునుంచే ఉన్న వ్యాధులకు సంబంధించిన నిబంధనలు, హాస్పిటల్ నెట్వర్క్ తదితర అంశాలను పరిశీలించడం ముఖ్యం.