బీమా నచ్చకుంటే మారిపోండి!
పోర్టబిలిటీతో పలు లాభాలు
రెండేళ్ల క్రితం... ఆరోగ్య బీమా ప్లాన్ తీసుకున్నాక అది నచ్చకపోతే సొమ్మో, ప్రయోజనాలో నష్టపోకుండా దాన్నుంచి బయటపడే మార్గం ఉండేది కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆరోగ్య బీమా పోర్టబిలిటీని బీమా రెగ్యులేటర్ ఐఆర్‌డీఏ అమల్లోకి తెచ్చింది. దీంతో... ప్రయోజనాలను కోల్పోనవసరం లేకుండానే ఒక బీమా కంపెనీ నుంచి మరో కంపెనీకి మారే స్వేచ్ఛ పాలసీదారులకు లభించింది. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారడమే కాకుండా ఒకే కంపెనీలోని ఒక ప్లాన్ నుంచి మరో ప్లాన్‌కు మారే వెసులుబాటు కూడా దక్కింది.
పోర్టబిలిటీ ద్వారా ఖాతాదారులకు సమకూరిన
హక్కులేంటంటే...
1) జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, స్పెషలైజ్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో దేని నుంచి దేనికైనా పాలసీలను మార్చుకోవచ్చు.
2) వ్యక్తిగత పాలసీలతో పాటు కుటుంబ పాలసీలకు వర్తిస్తుంది.
అయితే ఇలా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినపుడు, పాలసీ తీసుకున్నపుడు ఉండే 30 రోజుల వెయిటింగ్ పీరియడ్‌ను రద్దు చేస్తారు. దీనికి తోడు కొత్త కంపెనీలో బీమా చేసిన మొత్తం ఇంతకుముందు కంపెనీలో చేసిన మొత్తం కంటే తక్కువ ఉండకూడదు.
చేయాల్సిందేమిటంటే...
ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారే ముందు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కంపెనీని మార్చినపుడు కొత్త పాలసీదారు మాదిరిగానే అండర్‌రైటింగ్ ప్రక్రియలన్నీ పూర్తిచేయాలి. అండర్‌రైటింగ్ మార్గదర్శకాల ప్రకారం ఏ పాలసీనైనా తిరస్కరించే అధికారం కొత్త కంపెనీకి ఉంది.
ఆరోగ్య బీమా పాలసీ పోర్టబిలిటీ తీసుకున్నప్పటికీ మునుపటి ప్రయోజనాలన్నీ కొనసాగుతాయి. పోర్టబిలిటీ అంటే పాలసీని మధ్యలో ఆపేయడం కాదు, కొనసాగించడమే. అంతకుముందు ఉన్న వ్యాధులకు బీమా కవరేజీని నష్టపోవాల్సిన అవసరం లేదు. కొత్త కంపెనీల్లో ప్రీమియం చార్జీలు తక్కువగా ఉండడం, పాలసీదారులకు మరింత మెరుగైన సేవలు అందడం, కొత్త ప్లానులు అందుబాటులోకి రావడం, మరింత పారదర్శకత వంటి అదనపు ప్రయోజనాలు పోర్టబిలిటీ ద్వారా సమకూరుతాయి. ప్రీమియం, బెనిఫిట్ల పరంగా తమకు అనుకూలమైన కొత్త ప్లాన్‌ను పాలసీదారులు ఎంచుకోగలుగుతారు.
పోర్టబిలిటీని వినియోగించుకునే ముందు, ప్రస్తుత పాలసీతో పొందుతున్న ప్రయోజనాలను తాము మారదలుచుకున్న ప్లాన్‌తో వచ్చే లాభాలతో పోల్చిచూసుకోవడం ఎంతైనా అవసరం. సదరు ప్లాన్‌లోని ఫ్లెక్సిబిలిటీ, ధర, గరిష్ట వయోపరిమితి, వెయిటింగ్ పీరియడ్, వ్యాధుల కవరేజీ, పాలసీ తీసుకోవడానికి ముందునుంచే ఉన్న వ్యాధులకు సంబంధించిన నిబంధనలు, హాస్పిటల్ నెట్‌వర్క్ తదితర అంశాలను పరిశీలించడం ముఖ్యం.