
పాలసీల విక్రయంలో ప్రత్నామ్నాయాలు వెతకాలని సూచన
బీమా పాలసీలను విక్రయించేందుకు ఏదో ఒక సంస్థ మీదో లేదా బ్యాంకులపైనో అధికంగా ఆధారపడకూదని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏఐ) బీమా కంపెనీలకు సూచించింది. ఇందుకు ప్రత్యామ్నాయాలను వెతకాలని తెలిపింది. పాలసీలను విక్రయించేందుకు ఇతర అనువైన వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలని పేర్కొంది.
బీమా కంపెనీలు వాటి మాతృ సంస్థలుగా ఉన్న బ్యాంకుల ద్వారానే దాదాపు 90 శాతం పాలసీలను విక్రయిస్తున్నాయని బీమా నియంత్రణ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీన్ని అరికట్టేందుకు ఐఆర్‌డీఏఐ మార్కెట్ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. సమీప భవిష్యత్తులో పాలసీల విక్రయానికి సంబంధించి కొత్త నిబంధనలతో ముసాయిదాను తీసుకురావాలని ఐఆర్‌డీఏఐ యోచిస్తోంది. ఇప్పటివరకు అధికంగా బ్యాంకుల ద్వారానే పాలసీలు విక్రయిస్తున్నందున ఒక్కసారిగా ఈ విధానంలో మార్పు రాదని, అందుకు కొంత సమయం పడుతుందని ఒక అధికారి తెలిపారు. పాలసీల విక్రయానికి సంబంధించి ఐఆర్‌డీఏఐ నిబంధనలు తీసుకురాబోతున్న నేపథ్యంలో కంపెనీలు ఇతర పంపిణీ వ్యవస్థలను సిద్ధం చేసుకోవాలని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్‌పై రూ.5 తగ్గింపు!
బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్లు తమ కస్టమర్లకు మోసపూరిత బీమా పాలసీలను అంటగడుతున్నట్లు ఇప్పటికే బీమా నియంత్రణాధికార సంస్థ ఐఆర్‌డీఏఐ గుర్తించింది. ఇలా మోసపూరితంగా పాలసీలు విక్రయించకూడదని ఐఆర్‌డీఏఐ ఛైర్మన్ దేబాశీస్ పాండా గతంలో స్పష్టం చేశారు. బ్యాంకర్లు తమ ప్రధాన వ్యాపారంపైనే దృష్టి సారించాలన్నారు. దేశంలో అందరికీ బీమాను చేరువ చేయడంలో బ్యాంకులు కీలకపాత్రే పోషిస్తున్నప్పటికీ, బలవంతంగా మోసపూరిత పాలసీలను అంటగడుతున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment