న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఆయిల్ ఇండియా పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 40 శాతం జంప్‌చేసి రూ. 1,746 కోట్లను అధిగమించింది. ఒక త్రైమాసికంలో ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,245 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు ఉత్పత్తి సహా చమురు, గ్యాస్ విక్రయ ధరలు పుంజుకోవడం సహకరించింది.
వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 10 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇప్పటికే రూ. 4.5 చెల్లించింది. కాగా.. ప్రస్తుత సమీక్షా కాలంలో కంపెనీ ప్రతీ బ్యారల్ చమురుకు 88.33 డాలర్ల ధరను పొందింది. గత క్యూ3లో 78.59 డాలర్ల ధర లభించింది. ఇక నేచురల్ గ్యాస్ ఒక్కో బీటీయూకి 8.57 డాలర్ల చొప్పున అందుకుంది. గత క్యూ3లో గ్యాస్ విక్రయ ధర 6.1 డాలర్లుగా నమోదైంది.
చమురు ఉత్పత్తి 0.75 మిలియన్ టన్నుల నుంచి 0.81 ఎంటీకి ఎగసింది. గ్యాస్ ఉత్పత్తి సైతం 0.79 బిలియన్ ఘనపు మీటర్ల నుంచి 0.8 బీసీఎంకు పుంజుకుంది. చమురు విక్రయాలు 1.35 ఎంటీ నుంచి 1.41 ఎంటీకి వృద్ధి చూపాయి. మొత్తం టర్నోవర్ 27 శాతం పురోగమించి రూ. 5,982 కోట్లను తాకింది.
Comments
Please login to add a commentAdd a comment