బడా రియల్‌ కంపెనీలతో బంధం | Shiva balakrishna ACB custody will end today | Sakshi
Sakshi News home page

బడా రియల్‌ కంపెనీలతో బంధం

Published Wed, Feb 7 2024 4:13 AM | Last Updated on Wed, Feb 7 2024 4:13 AM

Shiva balakrishna ACB custody will end today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ అవినీతి లావాదేవీలు ఏసీబీ అధికారులు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పలు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు అనుమతులిచ్చిన శివబాలకృష్ణ..అందుకు ప్రతిఫలంగా కోట్ల రూపాయలు మూటగట్టుకున్నట్టు ఏసీబీ అధికారుల దర్యాప్తులో వెలుగుచూసినట్టు సమాచారం. ఎన్నికలకోడ్‌ సమయంలోనూ శివబాలకృష్ణ అనుమతుల జారీ ప్రక్రియ కొనసాగినట్టు ఏసీబీ గుర్తించింది.

పుప్పాలగూడ, నార్సింగి పరిధిలో రెండు రియల్‌ఎస్టేట్‌ కంపెనీలకు సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో శివబాలకృష్ణకు పెద్దమొత్తంలో ‘లబ్ది’చేకూరినట్టు కీలక వివరాలు సేకరించారు.

‘చేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూస్‌’ ప్రక్రియలో పెద్దసంఖ్యలో పెండింగ్‌ ఫైల్స్‌ క్లియర్‌ చేసినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన అనుమతులపైనా ఆరా తీసేందుకు వరుసగా రెండోరోజూ ఏసీబీ అధికారుల బృందం అమీర్‌పేట్‌లోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు ఫైళ్లు పరిశీలించి వివరాలు సేకరించినట్టు సమాచారం. అక్రమార్జన కేసులో ఏసీబీకి పట్టుబడిన శివబాలకృష్ణను కోర్టు ఎనిమిది రోజుల కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే.

ఏసీబీ అధికారులు ఏడో రోజు కస్టడీలో భాగంగా చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రధానంగా ఏసీబీ అధికారులు సేకరించిన భూలావాదేవీల వివరాలు, ఇతర పత్రాలు శివబాలకృష్ణ ముందు ఉంచి మంగళవారం ప్రశ్నించినట్టు సమాచారం.
  
లోతుగా పరిశీలన  
డాక్యుమెంట్లు, బినామీ ఆస్తుల వివరాల ఆధారంగా బాలకృష్ణను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇతర మార్గాల్లో సేకరించిన వివరాలపై ఏసీబీ అధికారు­లు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రెరా కార్యాలయంలోనూ సోదాలు చేసి కోట్ల రూపా­యల భూములకు సంబంధించిన అనుమతుల విషయంలో వివరాలు సేకరించారు. సోమ, మంగళవారాల్లో అమీర్‌పేట్‌లోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో జరిపిన సోదాల్లో మరిన్ని వివరాలు ల­భిం­చాయి.

వీటన్నింటినీ విశ్లేషిస్తున్న ఏసీబీ అధికారుల ప్రత్యేక బృందం ఆ విషయాలతో ప్ర­శ్నా­వళి రూపొందిస్తూ శివబాలకృష్ణ నుంచి వివరా­లు సేకరిస్తోంది. శివబాలకృష్ణకు సహకరించిన సిబ్బందిపైనా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. శివబాలకృష్ణ నుంచి నిబంధనలకు విరుద్ధంగా అనమతులు పొందిన పలు రియల్‌ఎస్టేట్‌ కంపెనీల ప్రతినిధులను ఏసీబీ ప్రశ్నించనున్నట్టు సమాచారం.  

శివబాలకృష్ణ సోదరుడు శివనవీన్‌కుమార్‌ అరెస్టు  
హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటు చే సుకుంది. ఆయనకు బి నామీగా వ్యవహరించిన ట్టు ఆధారాలు లభించడంతో ఏసీబీ అధికారులు శివబాలకృష్ణ సో దరుడు శివనవీన్‌కుమార్‌ను మంగళవారం అరె స్టు చేశారు. ఇప్పటికే శివ బాలకృష్ణను ఎనిమిది రోజుల కస్టడీలో భాగంగా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.

ఏసీబీ సోదాల్లో భాగంగా గుర్తించిన ఆస్తులు, ఆ తర్వాత లాక ర్లు ఓపెన్‌ చేసి స్వాదీనం చేసుకున్న పలు డాక్యుమెంట్లు, రేరా, హెచ్‌ఎండీఏ కార్యాలయంలో సోదాల్లో భాగంగా తెలుసుకున్న సమాచారం మేరకు ఏసీబీ అధికారులు శివ నవీన్‌కుమార్‌ను ప్రశ్నించారు.

ప్రాథమిక ఆధారాలతోపాటు, శివబాలకృష్ణ విచారణలో తెలుసుకున్న అంశాల మేరకు శివనవీన్‌కుమార్‌ తన సోదరుడికి బినామీగా వ్యవహరించినట్టు ఏసీబీ అధికారులు ధృవీకరించుకున్నారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసినట్టు ఏసీబీ వర్గాలు తెలిపాయి.  

నేటితో ముగియనున్న ఏసీబీ కస్టడీ  
హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ బుధవారంతో ముగియనుంది. గత బుధవారం నుంచి శివబాలకృష్ణను కస్టడీకి తీసుకొని విచారిస్తున్న ఏసీబీ అధికారులు, మరోవైపు ఇతర ఆధారాల కోసం తనిఖీలు కొనసాగిస్తున్నారు. బుధవారం చివరి రోజు కావడంతో మరిన్ని కీలక వివరాలు సేకరించేలా ఏసీబీ అధికారుల బృందం ఏర్పాట్లు చేసుకుంది. ఇప్పటికే సేకరించిన వివరాలతోపాటు తనిఖీల్లో గుర్తించిన ఫైళ్ల ఆధారంగా చివరి రోజు ప్రశ్నించే అవకాశముంది.

కాగా, హెచ్‌ఎండీఏ కార్యాలయాల్లో వరుస సోదాలు, బ్యాంకు లాకర్ల నుంచి సేకరించిన పత్రాలు, ఇతర ఆధారాలపై మరింత లోతుగా ఆరా తీయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజులు శివబాలకృష్ణను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ వేసే యోచనలో ఏసీబీ అధికారులు ఉన్నట్టు తెలిసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement