సాక్షి, హైదరాబాద్/మణికొండ: హైదరాబాద్‌లో పేరుమోసిన రియల్ ఎస్టేట్ సంస్థలపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. వాసవి కన్‌స్ట్రక్షన్స్, సుమధుర కన్‌స్ట్రక్షన్స్ సంస్థలపై పెద్దస్థాయిలో సోదాలు జరుగుతున్నాయి. 20 మంది ఐటీ అధికారులు వివిధ నగరాల్లో వాసవి కన్‌స్ట్రక్షన్‡్షకు సంబంధించిన ప్రధాన కార్యాలయంతో సహా పది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
సుమధుర కన్‌స్ట్రక్షన్స్‌కు సంబంధించి హైదరాబాద్, బెంగళూరుల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. వాసవి సంస్థ వాసవి రియల్టీ, వాసవి నిర్మాణ్, శ్రీముఖ్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, వాసవి ఫిడిల్ వెంచర్స్ పేరుతో వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, ఆదాయానికి సంబంధించిన పన్ను చెల్లింపులో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
అలాగే ఈ రెండు సంస్థలు టాలెస్ట్ టవర్స్ నిర్మాణాల పేరుతో కూడా భారీగా వినియోగదారుల నుంచి బుకింగ్స్ పొందినట్లు తెలిసింది. భారీగా నగదు రూపంలో పెట్టుబడులు పెట్టీ ప్రీ లాంచ్ పేరుతో వసూలు చేసిన వ్యవహారంపై ఐటీ ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. వాసవిలో స్లీపింగ్ భాగస్వామిగా పెద్ద మొత్తంలో బయట వ్యక్తులు పెట్టుబడి పెట్టడం గురించి ఆరా తీయడంతోపాటు, మొత్తం ఆరుగురు ప్రముఖుల వాటాలు ఇందులో ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment