vasavi
-
సింగపూర్‌లో వాసవి జయంతి సంబరాలు
వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ (VCMS) ఆధ్వర్యంలో ఇక్కడి సింగపూర్ ఆర్యవైశ్యులు చైనాటౌన్‌లోని శ్రీ మారియమ్మన్ ఆలయంలో శ్రీ వాసవి మాత జయంతిని అత్యంత వైభవంగా జరుపుకున్నారు. వాసవి జయంతితో పాటు VCMS దశమ వార్షికోత్సవ సంబరాలు కూడా ఇదే సందర్భంగా నిర్వహించారు. సుమారు ఎనిమిది గంటల పాటు పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆద్యంతమం ఆసక్తికరంగా జరిగాయి. కార్యక్రమాల్లో సుమారు 350 మందికి పైగా ఆర్య వైశ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎప్పటిలాగే వాసవి అమ్మవారికి కుంకుమార్చన, అలంకార పూజ, రథయాత్ర కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్బంగా తెలుగు సంప్రదాయ భోజనాలు, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆర్యవైశ్య కుటుంబాలకు చెందిన పలువురు ఔత్సాహిక కళాకారులు తమ కళా ప్రతిభతో అలరించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన శ్రీ మరియమ్మన్ ఆలయం వైస్ చైర్మన్ బొబ్బ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. VCMS కార్యనిర్వాహక బృందానికి చెందిన నాగరాజు కైల, నరేంద్ర కుమార్ నారంశెట్టి, సరిత విశ్వనాథన్, ముక్క కిషోర్ వేదికను అలంకరించారు. ఈ సందర్భంగా నాగరాజ్ కైల, శ్రీధర్ మంచికంటి మాట్లాడుతూ అతి కొద్దిమంది ఆర్యవైశ్యులతో చిన్న సంస్థగా ప్రస్థానాన్ని ప్రారంభించిన VCMS పది సంవత్సరాలలో ఒక వటవృక్షంగా ఎదగటం శ్లాఘనీయమని, దీని వెనక ఎందరో సింగపూర్ ఆర్యవైశ్యుల అంకితభావం, కృషి ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు రంగా రవికి చిరు సత్కారం జరిగింది. 'గణానాం త్వ గణపతిం' అంటూ చిన్నారి కారె సాయి కౌశాల్ గుప్త చేసిన రుగ్వేదం లోని గణపతి ప్రార్థనతో కార్యక్రమాలు మొదలయ్యాయి. శిల్పా రాజేష్ సారధ్యంలో కోలాట నృత్య ప్రదర్శన బృందం వేదికపై వాసవి మాతకు కోలాటంతో వందనాలు సమర్పించారు. సింగపూర్‌లో మొట్టమొదటిసారిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్రను దృశ్య శ్రవణ మాధ్యమాల సహాయంతో నాటక రూపంలో ప్రదర్శించారు. ఈ వాసవి మాత నాటక రూపానికి మూల ప్రతిపాదనను చైతన్య రాజా బాలసుబ్రహ్మణ్యం చేయగా, కథ, కూర్పు, సంభాషణలు ఫణేష్ ఆత్మూరి వెంకట రామ సమకుర్చారు. కిషోర్ కుమార్ శెట్టి దర్శకత్వం వహించారు. యువ కళాకారులు కుమారి అక్షర శెట్టి మాడిచెట్టి, చిరంజీవి ముక్తిధ మేడం, చిరంజీవి ఉమా మోనిష నంబూరిల భరతనాట్య ప్రదర్శనలు, చిన్నారి తన్వి మాదారపు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకున్నాయి. ఆనంద్ గంధే, కిరణ్ కుమార్ అప్పన, కొండేటి ఈశాన్ కృష్ణ తమ గాత్ర ప్రతిభతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, అలంకార పూజ అనంతర జరిగిన రథయాత్రలో భాగంగా శ్రీమతి గాదంశెట్టి నాగ సింధు గారి నేతృత్వంలో 16 మంది కళాకారిణులు చేసిన కోలాటం ప్రదర్శన కూడా అందరినీ ఎంతో ఆకట్టుకుంది. ఇదే సందర్భంగా VCMS నూతన కార్యవర్గ బృంద సభ్యులను ప్రకటించారు. ప్రెసిడెంట్ గా మురళీకృష్ణ పబ్బతి, సెక్రటరీగా సుమన్ రాయల, కోశాధికారిగా ఆనంద్ గంధే, మహిళా విభాగానికి సారథిగా సరిత విశ్వనాథన్‌లను ఆహూతులకు పరిచయం చేశారు. అనంతరం సంస్థ అభివృద్ధికి చేసిన ఇతోధిక కృషిని గుర్తిస్తూ నరేంద్ర కుమార్ నారంశెట్టికి ‘వాసవి సేవా కుసుమ’గా సత్కరించారు. సింగపూర్‌లో గత పది సంవత్సరాలుగా VCMS వైశ్య ధర్మాన్ని నిలబెడుతూ అనేక సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమాలకు వారధిగా ఎనలేని సేవలు చేస్తూ సింగపూర్ లో పెరుగుతున్న ఆర్యవైశ్య భావితరానికి దీపస్తంభంగా వెలుగొందుతోందని నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంధానకర్తగా ఆత్మూరి వెంకట రామ ఫణేష్, సహ వ్యాఖ్యాతగా వాసవి ఫణేష్ ఆత్మూరి వ్యవహరించారు. కార్యనిర్వాహక బృందం, దాతలు, సేవాదళ సభ్యుల అంకితభావం వల్లనే ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైందని నూతన ప్రెసిడెంట్ మురళీకృష్ణ పబ్బతి పేర్కొంటూ వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. -
రియల్ ఎస్టేట్ సంస్థలపై ఆదాయపన్ను శాఖ సోదాలు
సాక్షి, హైదరాబాద్/మణికొండ: హైదరాబాద్‌లో పేరుమోసిన రియల్ ఎస్టేట్ సంస్థలపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. వాసవి కన్స్ట్రక్షన్స్, సుమధుర కన్స్ట్రక్షన్స్ సంస్థలపై పెద్దస్థాయిలో సోదాలు జరుగుతున్నాయి. 20 మంది ఐటీ అధికారులు వివిధ నగరాల్లో వాసవి కన్స్ట్రక్షన్‡్షకు సంబంధించిన ప్రధాన కార్యాలయంతో సహా పది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. సుమధుర కన్స్ట్రక్షన్స్కు సంబంధించి హైదరాబాద్, బెంగళూరుల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. వాసవి సంస్థ వాసవి రియల్టీ, వాసవి నిర్మాణ్, శ్రీముఖ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, వాసవి ఫిడిల్ వెంచర్స్ పేరుతో వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, ఆదాయానికి సంబంధించిన పన్ను చెల్లింపులో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ రెండు సంస్థలు టాలెస్ట్ టవర్స్ నిర్మాణాల పేరుతో కూడా భారీగా వినియోగదారుల నుంచి బుకింగ్స్ పొందినట్లు తెలిసింది. భారీగా నగదు రూపంలో పెట్టుబడులు పెట్టీ ప్రీ లాంచ్ పేరుతో వసూలు చేసిన వ్యవహారంపై ఐటీ ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. వాసవిలో స్లీపింగ్ భాగస్వామిగా పెద్ద మొత్తంలో బయట వ్యక్తులు పెట్టుబడి పెట్టడం గురించి ఆరా తీయడంతోపాటు, మొత్తం ఆరుగురు ప్రముఖుల వాటాలు ఇందులో ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. -
Hyderabad: వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్‌పై ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్‌పై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఏకకాలంలో 20 చోట్ల సోదాలు చేశారు. ఉదయం నుంచి దాడులు కొనసాగుతున్నాయి. వాసవి కన్స్ట్రక్షన్స్, వాసవి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ ప్రధాన కార్యాలయాల్లో 20 మంది ఐటీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించారు. వేల కోట్లు పనులు చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. కంపెనీ అక్రమ లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. వాసవీ గ్రూప్స్ ఇప్పటి వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఈ సోదాల్లో సంస్థకు అక్రమాలకు సంబంధించి పలు కీలక ఫైళ్లను, సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. చదవండి: (హాస్టళ్లపై పోలీసుల ఫోకస్.. ఈ పది నిబంధనలు పాటించాల్సిందే) -
1,000 కోట్లతో ఒలింపస్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు సుమధుర, వాసవి గ్రూప్‌లు సంయుక్తంగా కలిసి నానక్‌రాంగూడలో ఒలింపస్ పేరిట లగ్జరీ హైరైజ్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. రూ.1,000 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌లోనే ఎత్తయిన నివాస సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు సుమధుర గ్రూప్ చైర్మన్ జీ మధుసూదన్ తెలిపారు. 5.06 ఎకరాలు, 20 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో నాలుగు బేస్మెంట్లు, స్టిల్ట్+ 44 అంతస్తులలో ప్రాజెక్ట్ ఉంటుంది. మొత్తం 854 ఫ్లాట్లుంటాయి. 1,670–3,000 చ.అ. మధ్య 3 బీహెచ్‌కే, 3.5 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. 2025 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుంది. 50 వేల చ.అ. క్లబ్‌హౌస్‌తో పాటు స్విమ్మింగ్ పూల్, జిమ్, గెస్ట్ సూట్స్, స్పోర్ట్స్ బార్, బ్యాడ్మింటన్ కోర్ట్, స్పా వంటి అన్ని రకాల వసతులుంటాయి. -
కర్నాటకలో ‘త్రీ ఇడియట్స్ కాన్పు’
భారతదేశంలో అన్ని సక్రమంగా ఉంటేనే కాన్పులు చిత్ర విచిత్ర పరిస్థితుల్లో జరుగుతుంటాయి. కరోనా సమయంలో అయితే కొన్ని కాన్పులు మరీ బాధ పెట్టేలా కొన్ని మరీ సంతోషపెట్టేలా జరుగుతున్నాయి. ఈ కాన్పు అయితే మనల్ని సంతోషపెట్టేదే. ‘త్రీ ఇడియెట్స్’ సినిమా క్లయిమాక్స్‌లో ఐఐటి స్టూడెంట్ అయిన ఆమిర్ ఖాన్ తన డీన్ కుమార్తె కాన్పును వీడియో కాల్లో డాక్టర్ అయిన కరీనా కపూర్ సలహా ప్రకారం చేస్తాడు. హటాత్తుగా నొప్పులు మొదలై భోరువానలో ఆమె హాస్పిటల్‌కు వెళ్లే పరిస్థితి ఉండనందున ఈ కాన్పు చూసే ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగిస్తూ జరుగుతుంది. జూలై 26 ఆదివారం కర్నాటకలో కూడా ఇలాంటి కాన్పే జరిగింది. హుబ్లీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉండే హనగల్ అనే ఊళ్లో వాసవి అనే మహిళకు డ్యూ డేట్ కన్నా ముందే హటాత్తుగా నొప్పులు మొదలయ్యాయి. సహాయం కోసం తక్షణం ఇరుగుపొరుగు స్త్రీలు చేరే సమయానికి ఇంచుమించు ప్రసవం జరిగిపోయే పరిస్థితి ఉంది. భర్త అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే కరోనా హడావిడి వల్ల రావడానికి 45 నిమిషాలు పడుతుందన్నారు. ఆగే సమయం లేదని సహాయానికి వచ్చిన మహిళలకు అర్థమైంది. వారిలోని ఒకామె తనకు తెలిసిన ప్రియాంక అనే డాక్టరుకు వాట్సప్ కాల్ చేసింది. ప్రియాంకది ఆ ఊరే. హుబ్లీ కిమ్స్‌లో గైనకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. కాన్పు అర్జెన్సీని గ్రహించిన ప్రియాంక ‘నేను వీడియో కాల్ ద్వారా మిమ్మల్ని గైడ్ చేస్తాను. మీరు కాన్పు చేసేయండి’ అని చెప్పింది. మహిళలు ఆమె ఉన్నదన్న ధైర్యంతో రంగంలోకి దిగారు. కొత్త బ్లేడ్ తెచ్చి కాన్పుకు సిద్ధమయ్యారు. ‘నేను వారికి చెప్పిందల్లా బొడ్డుతాడు ఎలా జాగ్రత్తగా కట్ చేయాలన్నదే’ అని చెప్పింది డాక్టర్ ప్రియాంక. మహిళలు ప్రియాంక సూచనల ప్రకారం కాన్పు చేయడం, బిడ్డను శుభ్రం చేసి పొడిబట్టలో చుట్టడం, పాలకు తల్లి ఎద దగ్గర పరుండబెట్టడం చేసే సమయానికి అంబులెన్స్ వచ్చి తల్లి బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లింది. ‘తల్లిబిడ్డ క్షేమంగా ఉండటం మాకెంతో సంతోషంగా ఉంది’ అని కాన్పులో పాల్గొన్న స్త్రీలు చెప్పారు. ప్రస్తుతం ఆ స్త్రీలు, డాక్టరమ్మ ప్రశంసలలో తడిచి ముద్దవుతున్నారు. -
బిడ్డను విసిరి.. తనూ దూకి
కర్నూలు: చిన్నచిన్న కారణాలకే కొందరు క్షణికావేశానికి లోనై మృత్యుమార్గాన్ని ఎంచుకుంటున్నారు. వారితో పాటు అన్నెంపుణ్యం ఎరుగని పిల్లలనూ బలి చేస్తున్నారు. భర్తతో గొడవ పడి మనస్తాపానికి గురైన ఓ మహిళ బుధవారం తనబిడ్డను బ్రిడ్జిపై నుంచి కిందకు విసిరి, తానూ దూకేసింది. అదృష్టం బాగుండి ఇద్దరూ ప్రాణాలతో బయటపడినా బాధితురాలు చేయి కోల్పోయింది. నగరంలోని బళ్లారి చౌరస్తాలో భర్త విశ్వనాథ్‌రెడ్డితో గొడవ పడి భార్య వాసవి తన బిడ్డతో సహా బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనంతపురం జిల్లా కొట్టాలపల్లి గ్రామానికి చెందిన విశ్వనాథ్‌రెడ్డికి, వెల్దుర్తికి చెందిన వాసవితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల కుమారుడు ఆదర్శ ఉన్నాడు. కుటుంబ కలహాలతో కొంతకాలంగా వీరు దూరముంటున్నారు. విశ్వనాథ్‌రెడ్డి ఐసీఐసీఐ బ్యాంకులో పనిచేస్తూ కర్నూలులోని స్కందన్షీ హౌసింగ్ కాలనీలో నివాసముంటున్నాడు. వాసవి బుధవారం యాడికి నుంచి కర్నూలుకు వచ్చి బస్టాండ్ నుంచి భర్తకు ఫోన్ చేయగా, ఎందుకొచ్చావంటూ మందలించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అందుకు మనస్తాపంతో ఆమె రెండేళ్ల కుమారున్ని బ్రిడ్జిపై నుంచి కిందకు విసిరి, తనూ దూకింది. ప్రమాదంలో ఆమె చెయ్యి విరిగిపోయింది. స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. సంవత్సర కాలంగా భర్తతో దూరంగా ఉంటడం వల్లే గొడవపడి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
సింగపూర్‌లో ఘనంగా వాసవి జయంతి వేడుకలు
సింగపూర్ : వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సింగపూర్ విభాగం ఆధ్వర్యంలో వాసవి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో 400 మందికి పైగా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక మారియమ్మన్ దేవాలయంలో సామూహిక వాసవి కుంకుమార్చన, అభిషేకం, ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారి పల్లకి సేవ నిర్వహించారు. ఆర్యవైశ్యులు ఎక్కడున్నా ఐకమత్యంగా కలిసి మెలిసి ఉండాలని వాసవి క్లబ్ ప్రెసిడెంట్ అరుణ్‌కుమార్ గొట్లూరు అన్నారు. జనరల్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి మాట్లాడుతూ వైశ్యుల సంస్కృతీ సంప్రదాయాలు, దాన ధర్మముల విశిష్టతను వివరించారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సింగపూర్ ప్రెసిడెంట్ భాస్కర్ నల్ల మాట్లాడుతూ.. వైశ్యుల అభ్యున్నతికి అందరు చేయూత నివ్వాలని ప్రోత్సహించారు. ప్రెసిడెంట్ వల్లంకొండ విజయ్ మాట్లాడుతూ సింగపూర్ లో వైశ్యులు అన్ని రంగాల్లో ముందుకు రాణిస్తున్నారని, ఇలాగే కలిసి కట్టుగా మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలతో వైశ్యులందరిని భాగస్వామ్యం చేసి అమ్మవారి ఆశీస్సులతో ముందుకు వెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో రాజా విశ్వనాథుల, ముకేశ్ భూపతి, మురళి, శ్రీధర్ మంచికంటి, శశిధర్, సతీష్ వుద్దగిరి, కిరణ్ పట్టోరి, రమణ, సతీష్ కోట, శరత్, సంతోష్ జూలూరి, రవి శంకా, వాసవి అనుబంధ విభాగమైన సేవాదళ్ టీమ్ సభ్యులు తమవంతు కృషి చేశారు. -
ఇంకా అజ్ఞాతంలోనే సూత్రధారి వాసవి
నాడు రెండు గదుల చిన్న ఇంటికి అద్దె చెల్లించటానికి తంటాలు పడ్డాడు. నేడు సినీ, రాజకీయ ప్రముఖులు అతని ఇంటి ముందు బారులు తీరారు. దీనిని గమనించిన అమాయక ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. వెంటనే క్యాష్ కౌంటర్లు తెరుచుకున్నాయి. రోజుల వ్యవధిలో రూ.3.70 కోట్లు వసూలు చేశారు. చివరకు అంతా మాయ అని తేలటంతో బాబా ఆస్పత్రి బాట పట్టగా వసూలు చేసిన కీలక సూత్రధారి రాష్ట్రాలు దాటేసింది. చివరకు బాబును నమ్మి డబ్బులు కట్టిన జనం ఆయన ఇంటి ముందు న్యాయం చేయాలని రిలే నిరహారదీక్షలు ప్రారంభించారు. ఇది నెల్లూరు కిసాన్‌నగర్ సమీపంలోని ప్రశాంతినగర్‌లోని నయా బాబా సుధాకర్ మహరాజ్ మోసం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నగరంలోని కిసాన్‌నగర్‌లోని ప్రశాంతి నగర్లో ఉన్న సుధాకర్ మహరాజ్ అలియాస్ టీచర్ సుధాకర్ గత ఏడాది డిసెంబర్ 13 నుంచి 108రోజులు పాటు నిర్వహించే విధంగా నవనాథ సంప్రదాయ దత్తాత్రేయ మహామంత్ర ఇష్టకామ్య మహా యాగాన్ని ప్రారంభించారు. యాగం ప్రారంభం సమయంలో భక్తులకు వెయ్యి పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. పుస్తకంలో తాము ఇచ్చిన మంత్రం రాసి ఇవ్వాలని, హోమంలో వేయాలని ప్రచారం చేశారు. ఈ క్రమంలో భక్తుల నుంచి స్పందన తక్కువగా ఉండటంతో ఉచితం ఆపేశారు. పుస్తకానికి రూ.వెయ్యి ధర నిర్ణయించారు. 14 రోజుల పాటు పుస్తకంలో మంత్రం రాసి తిరిగి పుస్తకం ఇస్తే వెయ్యికి మూడు వందలు అదనంగా కలిపి రూ.1,400 ఇస్తామని ప్రచారం చేశారు. ప్రచార తీవ్రతతో వేల మంది భక్తులు వచ్చారు. శివరాత్రి సమీపిస్తుండటంతో చివరి రెండు రోజుల్లో రూ.1,400ను రూ.1,500 గా ప్రకటించటంతో భక్తులు సుమారు రూ.3.70 కోట్ల విలువైన పుస్తకాలు కొనుగోలు చేశారు. దీంతో శివరాత్రికి ముందు రెండు రోజులు.. అంటే గత నెల 14,15 తేదీల్లో సుమారు రూ.2 కోట్లు వసూలు చేశారు. సుధాకర్‌కు సహాయకురాలిగా వచ్చిన వాసవి రూ.కోట్లు డబ్బు కనిపించటంతో 15వ తేదీ రాత్రి ఆ నగదుతో పరారైంది. దీంతో భక్తులంతా డబ్బుల కోసం ప్రశ్నించటంతో సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొంతసేపు హైడ్రామా నడుమ బాబాను అతని అనుచరులు సింహపురి హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నాడు. రాజకీయ అండతో బాబాగా.. 15 ఏళ్ల క్రితం ముదివర్తిపాళెంలో ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా చేరిన సుధాకర్ ఇంటి అద్దె చెల్లించటానికి నానా ఇబ్బందులు పడేవాడు. అక్కడ బాకీలు పడి ప్రశాంతినగర్‌కు మకాం మార్చారు. నగరంలో ఒక ప్రముఖ సినీ థియేటర్ యజమానితో స్నేహంతో అక్కడ 20 అంకణాల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించాడు. కాలక్రమంలో ఇంటిపై రెండు ఫ్లోర్లు నిర్మించాడు. అంతా సాయి కృప అని చెప్పుకుంటూ ఇంటి సమీపంలోని స్థలాల్లో తరచూ హోమాలు నిర్వహిస్తుండేవాడు. టీడీపీ నేతలు ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డితో పాటు అనేక మంది రాజకీయ ప్రముఖులు సుధాకర్‌కు భక్తులుగా మారిపోయారు. ఈ క్రమంలో సినీ పరిశ్రమలోకి ఇతని పరిచయాలు విస్తరించారు. దీంతో ఇద్దరు పాత తరం హీరోలు, ప్రొడ్యూసర్లు, సంగీత దర్శకులు బాబా వద్దకు క్యూకట్టారు. అలాగే చెన్నై, హైదరాబాద్‌లోనూ ఇదే తరహాలో హోమాలు నిర్వహించి అక్కడ సర్కిల్‌ను పెంచుకున్నాడు. చివరకు 108 రోజుల మహాయాగం పేరుతో వసూళ్లకు పాల్పడటం, వసూలు చేసిన నగదుతో సూత్రధారిగా ఉన్న వాసవి పరారు కావటంతో సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. 270 దాటిన ఫిర్యాదులు సుధాకర్బాబాపై నమ్మకంతో భక్తులు తమ ఇళ్లలోని బంగారం, ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మరీ ఆశ్రమంలో నగదు చెల్లించారు. వీరిలో అత్యధికంగా మహిళలే ఉన్నారు. ఇప్పటి వరకు 270 మంది నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుమారు రూ.3.70 కోట్లు వసూలైనట్లు నిర్ధారించారు. వాసవి కోసం సీరియస్‌గా నగదుతో పరారైన వాసవి విషయాన్ని తొలుత పోలీసులు సీరియస్‌గా తీసుకునున్నారు. అయితే వారం దాటినా కనీస పురోగతి లేదు. సుధాకర్ హాస్పిటల్లో ఉండటం, వాసవి పరారీలో ఉండటంతో న్యాయం చేయాలని బాబా భక్తులు ఆయన ఇంటి వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి గురువారానికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. వాసవిది ఒంగోలు నగరంలోని మిర్యాలపాళెంలో నివసిస్తోంది. ఆమె ఇద్దరు వ్యక్తులను పెళ్లిచేసుకుని ప్రస్తుతం వేరుగా ఉంటోంది. ఒంగోలులోని ఓ వ్యక్తితో సహజీవనం చేస్తుందని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో వాసవి రూ.కోట్ల సంచులను విజయవాడలోని ఓ రైల్వే అధికారికి, తన కుటుంబ సభ్యులు, సహజీవనం చేసే వ్యక్తికి అందజేసిందని భక్తులు భావిస్తున్నారు. కాగా వాసవికి ఓ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి సహకారం అందించినట్లు సమాచారం. -
కోట్లు వసూలు చేసిన కిలేడి..
నెల్లూరు సిటీ: భక్తి ముసుగులో మోసానికి పాల్పడిన కిలాడి లేడీ మెతుకు వెంకట నాగవాసవిపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. నగరంలోని ప్రశాంతినగర్‌లో గురుదత్తాత్రేయ ఆశ్రమాన్ని అడ్డాగా చేసుకొని భక్తుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మహిళ పరారైన ఘటన గురువారం వెలుగులోకి వచ్చిన విషయం తెలి సిందే. ఒంగోలు నగరంలోని మిర్యాలపాళేనికి చెందిన మెతుకు వెంకటనాగవాసవికి తొమ్మిదేళ్ల క్రితం సునీల్ అనే వ్యక్తితో వివాహమైంది. విభేదాలతో దంపతులిద్దరూ విడిపోయారు. అనంతరం ఆంజనేయులును రెండో వివాహం చేసుకున్నారు. అనంతరం ఆయనకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఒంగోలులో ని ట్రంక్‌రోడ్డులో ఓ ఫర్నిచర్ దు కాణాన్ని నిర్వహిస్తున్న బాషా అలియాస్ మస్తాన్‌తో స్నేహం చేస్తోంది. మహామంత్రయా గం పేరు తో నెల్లూరులోని ప్రశాంతినగర్‌లో కొన్ని వారాలుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో భక్తులను ముగ్గులోకి దించుతూ వాసవి రూ. కోట్ల మేర వసూలు చేసింది. ఇలా దాదాపు రూ.నాలుగు కోట్ల మేర వసూలు చేసినట్లు సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా నగదు బదిలీ వాసవి పక్కా స్కెచ్‌తో గుట్టుచప్పుడు కాకుండా రూ.కోట్లను కుటుంబసభ్యులకు చేరవేసిందనే ఆరోపణలు ఉన్నా యి. దాదాపు రూ.రెండు కోట్ల నగదుతో కూడిన సంచులను కుటుం బసభ్యులకు అందజేసినట్లు తెలు స్తోంది. ఒంగోలులోని తన స్నేహితుడు బాషా అలియాస్ మస్తాన్, సోదరుడు మెతు కు రాజా, విజయవాడలో మామయ్య అయిన రైల్వే ఉద్యోగి వెంకటసురేష్‌బాబుకు సంచుల నిండా నగదును భారీగా అందజేసినట్లు సమాచారం. పరారీలో కిలాడి లేడీ వాసవి ముందస్తు ప్రణాళికలో భాగంగా తన ఆరేళ్ల చిన్నారితో కలిసి పరారైంది. ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. వాసవికి సుధాకర్‌బాబాతో ఏ విధమైన సంబంధాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రణాళికలో భాగంగా జరిగిందా.. లేక వాసవి నమ్మించి మోసానికి పాల్పడిందా అనే విషయం తెలియాల్సి ఉంది. -
వెండి రథంపై వాసవీ మాత
తాడేపల్లిగూడెం రూరల్ : శ్రీ దేవీ శరన్నవరాత్ర మహోత్సవాల ముగింపు సందర్భంగా తాడేపల్లిగూడెంలో వాసవీ మాత రథోత్సవాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు శిరమున కలశాలు ధరించి వెంటరాగా, వాసవీ మాత వెండి రథంపై పుర వీధుల్లో ఊరేగారు. పట్టణంలోని వాసవీ మాత రోథత్సవం గురువారం కనుల పండువగా సాగింది. సాయంత్రం స్థానిక ఏలూరు రోడ్డులోని వాసవి మాత పంచాయతన క్షేత్రం నుంచి పురవీధుల్లోకి రథం బయల్దేరింది. తొలుత రథంలో అమ్మవారిని ఉంచి వేద పండితులు పూజలు నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గమిని సుబ్బారావు వెండి రథాన్ని లాగి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పట్టణ పురవీధుల్లో రథోత్సవం ఉత్సాహంగా సాగింది. -
ఆవోపా ఉపకార వేతనాల పంపిణీ
హుజూర్నగర్ : పట్టణంలోని వాసవీ భవన్లో ఆదివారం ఆవోపా ఆధ్వర్యంలో ఆర్యవైశ్య విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యలో రాణిస్తున్న పలువురు విద్యార్థులకు ప్రోత్సహకాలు, నోటుపుస్తకాలు, పెన్నులు, డ్రస్‌లతో పాటు నిరుపేద ఆర్యవైశ్య మహిళలకు పింఛన్లను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంది స్వరాజ్యబాబు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆవోపా పట్టణ అధ్యక్షుడు వంగవీటి హనుమంతరావు, తహసీల్దార్ శ్రీదేవి, రాష్ట్ర ఆవోపా ఉపాధ్యక్షులు సామా నారాయణ, నాగేశ్వరరావు, కృష్ణమూర్తి, బూర్లె లక్ష్మీనారాయణ, గుండా భద్రయ్య, గెల్లి అప్పారావు, రామ్మోహన్రావు, ప్రభాకర్‌రావు, శ్రీనివాసరావు, ఆనంద్, మల్లికార్జున్‌రావు, పి.శ్రీనివాస్, కె.రామారావు, పి.వెంకటేశ్వర్లు, వి.న రేష్ పాల్గొన్నారు. -
పాల్టెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య
పాల్టెక్నిక్ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో పాల్టెక్నిక్ ద్వితియ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని హాస్టల్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. వీర్లపాడు మండల కేంద్రానికి చెందిన వాసవి(18) హాస్టల్లో ఉంటూ ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో పాట్‌టెక్నిక్ ద్వితియ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులతో గొడవ పడుతోంది. తను ప్రేమించిన వ్యక్తితో తన పెళ్లికి నిరాకరిస్తుండటంతో.. తల్లిదండ్రులతో గొడవ పడుతుండేది. ఇదే విషయంపై ఆదివారం రాత్రి తమ్ముడు ఫోన్లో మందలించడంతో... మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఇది గుర్తించిన తోటి విద్యార్థినులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటానా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి కొద్ది సేపటి క్రితం ఆమె ఫోన్‌కు తమ్ముడు ఫోన్ చేసినట్లు గుర్తించిన పోలీసులు ప్రేమ వ్యవహారంలో తమ్ముడు మందలించడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. -
లైంగికంగా వేధిస్తున్నారు
సిద్దిపేట: మాస్టర్ మైండ్స్ కళాశాల డెరైక్టర్లు తనను లైంగిక వేధింపులతో పాటు ఈవ్ టీజింగ్ చేస్తున్నారంటూ అదే కళాశాలలో సంస్కృతం బోధిస్తున్న లెక్చరర్ వాసవీ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. కొంత కాలంగా కళాశాల డెరైక్టర్లు కిరణ్‌కుమార్‌రెడ్డి, మల్లారెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డిలు తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని వాసవి తన భర్త తిరుపతికి తెలిపింది. దీంతో ఆయన విషయాన్ని పట్టణ ఏబీవీపీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. వారు గురువారం కళాశాలకు వెళ్లి ఇదే విషయమై డెరైక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డిని నిలదీశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహించిన పలువురు ఏబీవీపీ నాయకులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కళాశాల యాజమాన్యం ద్వారా విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు ఏబీవీపీ నాయకులపై లాఠీ ఝళిపించారు. అనంతరం వారితోపాటు కళాశాల డెరైక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు.