ఇంకా అజ్ఞాతంలోనే సూత్రధారి వాసవి | fake baba sudhakar maharaj in hospital police searching for vasavi | Sakshi
Sakshi News home page

బురిడీ బాబా

Published Fri, Feb 23 2018 11:48 AM | Last Updated on Fri, Feb 23 2018 11:48 AM

fake baba sudhakar maharaj in hospital police searching for vasavi - Sakshi

వాసవి (ఫైల్‌),భక్తులతో మాట్లాడుతున్న సుధాకర్‌ మహరాజ్‌(ఫైల్‌)

నాడు రెండు గదుల చిన్న ఇంటికి అద్దె చెల్లించటానికి తంటాలు పడ్డాడు. నేడు సినీ, రాజకీయ ప్రముఖులు అతని ఇంటి ముందు బారులు తీరారు. దీనిని గమనించిన అమాయక ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. వెంటనే క్యాష్‌ కౌంటర్లు తెరుచుకున్నాయి. రోజుల వ్యవధిలో రూ.3.70 కోట్లు వసూలు చేశారు. చివరకు అంతా మాయ అని తేలటంతో బాబా ఆస్పత్రి బాట పట్టగా వసూలు చేసిన కీలక సూత్రధారి రాష్ట్రాలు దాటేసింది. చివరకు బాబును నమ్మి డబ్బులు కట్టిన జనం ఆయన ఇంటి ముందు న్యాయం చేయాలని రిలే నిరహారదీక్షలు ప్రారంభించారు. ఇది   నెల్లూరు కిసాన్‌నగర్‌ సమీపంలోని ప్రశాంతినగర్‌లోని నయా బాబా సుధాకర్‌ మహరాజ్‌ మోసం.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నగరంలోని కిసాన్‌నగర్‌లోని ప్రశాంతి నగర్‌లో ఉన్న సుధాకర్‌ మహరాజ్‌ అలియాస్‌ టీచర్‌ సుధాకర్‌  గత ఏడాది డిసెంబర్‌ 13 నుంచి 108రోజులు పాటు నిర్వహించే విధంగా నవనాథ సంప్రదాయ దత్తాత్రేయ మహామంత్ర ఇష్టకామ్య మహా యాగాన్ని ప్రారంభించారు. యాగం ప్రారంభం సమయంలో భక్తులకు వెయ్యి పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. పుస్తకంలో తాము ఇచ్చిన మంత్రం రాసి ఇవ్వాలని, హోమంలో వేయాలని ప్రచారం చేశారు. ఈ క్రమంలో భక్తుల నుంచి స్పందన తక్కువగా ఉండటంతో ఉచితం ఆపేశారు. పుస్తకానికి రూ.వెయ్యి ధర నిర్ణయించారు. 14 రోజుల పాటు పుస్తకంలో మంత్రం రాసి తిరిగి పుస్తకం ఇస్తే వెయ్యికి మూడు వందలు అదనంగా కలిపి రూ.1,400 ఇస్తామని ప్రచారం చేశారు.

ప్రచార తీవ్రతతో వేల మంది భక్తులు వచ్చారు. శివరాత్రి సమీపిస్తుండటంతో చివరి రెండు రోజుల్లో రూ.1,400ను రూ.1,500 గా ప్రకటించటంతో భక్తులు సుమారు రూ.3.70 కోట్ల విలువైన పుస్తకాలు కొనుగోలు చేశారు. దీంతో శివరాత్రికి ముందు రెండు రోజులు.. అంటే గత నెల 14,15 తేదీల్లో  సుమారు రూ.2 కోట్లు వసూలు చేశారు. సుధాకర్‌కు సహాయకురాలిగా వచ్చిన వాసవి రూ.కోట్లు డబ్బు కనిపించటంతో 15వ తేదీ రాత్రి ఆ నగదుతో పరారైంది. దీంతో భక్తులంతా డబ్బుల కోసం ప్రశ్నించటంతో సుధాకర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొంతసేపు హైడ్రామా నడుమ బాబాను అతని అనుచరులు సింహపురి హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నాడు.

రాజకీయ అండతో బాబాగా..
15 ఏళ్ల క్రితం ముదివర్తిపాళెంలో ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా చేరిన సుధాకర్‌ ఇంటి అద్దె చెల్లించటానికి నానా ఇబ్బందులు పడేవాడు. అక్కడ బాకీలు పడి ప్రశాంతినగర్‌కు మకాం మార్చారు. నగరంలో ఒక ప్రముఖ సినీ థియేటర్‌ యజమానితో స్నేహంతో అక్కడ 20 అంకణాల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించాడు. కాలక్రమంలో ఇంటిపై రెండు ఫ్లోర్లు నిర్మించాడు. అంతా సాయి కృప అని చెప్పుకుంటూ ఇంటి సమీపంలోని స్థలాల్లో తరచూ హోమాలు నిర్వహిస్తుండేవాడు. టీడీపీ నేతలు ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డితో పాటు అనేక మంది రాజకీయ ప్రముఖులు సుధాకర్‌కు భక్తులుగా మారిపోయారు. ఈ క్రమంలో సినీ పరిశ్రమలోకి ఇతని పరిచయాలు విస్తరించారు. దీంతో ఇద్దరు పాత తరం హీరోలు,  ప్రొడ్యూసర్లు, సంగీత దర్శకులు బాబా వద్దకు క్యూకట్టారు. అలాగే చెన్నై, హైదరాబాద్‌లోనూ ఇదే తరహాలో హోమాలు నిర్వహించి అక్కడ సర్కిల్‌ను పెంచుకున్నాడు. చివరకు 108 రోజుల మహాయాగం పేరుతో వసూళ్లకు పాల్పడటం, వసూలు చేసిన నగదుతో సూత్రధారిగా ఉన్న వాసవి పరారు కావటంతో సుధాకర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.

270 దాటిన ఫిర్యాదులు
సుధాకర్‌బాబాపై నమ్మకంతో భక్తులు తమ ఇళ్లలోని బంగారం, ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మరీ ఆశ్రమంలో నగదు చెల్లించారు. వీరిలో అత్యధికంగా మహిళలే ఉన్నారు. ఇప్పటి వరకు 270 మంది నెల్లూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుమారు రూ.3.70 కోట్లు వసూలైనట్లు నిర్ధారించారు.

వాసవి కోసం సీరియస్‌గా
నగదుతో పరారైన వాసవి విషయాన్ని తొలుత పోలీసులు సీరియస్‌గా తీసుకునున్నారు. అయితే వారం దాటినా కనీస పురోగతి లేదు. సుధాకర్‌ హాస్పిటల్‌లో ఉండటం, వాసవి పరారీలో ఉండటంతో న్యాయం చేయాలని బాబా భక్తులు ఆయన ఇంటి వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి గురువారానికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. వాసవిది ఒంగోలు నగరంలోని మిర్యాలపాళెంలో నివసిస్తోంది. ఆమె ఇద్దరు వ్యక్తులను పెళ్లిచేసుకుని ప్రస్తుతం వేరుగా ఉంటోంది. ఒంగోలులోని ఓ వ్యక్తితో సహజీవనం చేస్తుందని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో వాసవి రూ.కోట్ల సంచులను విజయవాడలోని ఓ రైల్వే అధికారికి, తన కుటుంబ సభ్యులు, సహజీవనం చేసే వ్యక్తికి అందజేసిందని భక్తులు భావిస్తున్నారు. కాగా వాసవికి ఓ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధి సహకారం అందించినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement