ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌  | ED Arrests BRS MLC K Kavitha After Raids In Connection With Delhi Liquor Policy Case, Details Inside - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ 

Published Sat, Mar 16 2024 3:44 AM | Last Updated on Sat, Mar 16 2024 10:17 AM

ED arrests BRS MLC K Kavitha after raids in connection with Delhi liquor policy case - Sakshi

ఈడీ అరెస్టు అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయటకు వస్తూ పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తున్న కవిత. చిత్రంలో కేటీఆర్, హరీశ్, బాల్క సుమన్‌

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలతో అరెస్టు చేసిన ఈడీ 

శుక్రవారం మధ్యాహ్నం నుంచే కవిత నివాసంలో తనిఖీలు 

సాయంత్రం 5:20 గంటలకు అదుపులోకి తీసుకుంటున్నట్టు ప్రకటన 

కవిత ఇంటికి చేరుకున్న హరీశ్‌రావు, కేటీఆర్, బీఆర్‌ఎస్‌ నేతలు 

అరెస్టు అక్రమమంటూ ఈడీ అధికారులతో కేటీఆర్‌ వాగ్వాదం 

పూర్తి ఆధారాలతోనే అరెస్టు చేసినట్టు పేర్కొన్న ఈడీ అధికారులు 

భారీగా చేరుకున్న అభిమానులు.. వారి ఆందోళనతో స్వల్ప ఉద్రిక్తత 

కవితను ప్రత్యేక కాన్వాయ్‌లో ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లిన అధికారులు 

అక్కడి నుంచి విమానంలో 8:45 గంటలకు ఢిల్లీకి తరలింపు 

నేడు అక్కడి రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్న ఈడీ

నేడు ఢిల్లీకి కేసీఆర్, కేటీఆర్‌.. న్యాయ నిపుణులతో చర్చించే చాన్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) అధికారుల బృందం శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసింది. బీఆర్‌ఎస్‌ శ్రేణుల ఆందోళన, పోలీసుల స్వల్ప లాఠీచార్జ్, నాటకీయ పరిణామాల మధ్య ఈడీ అధికారులు రాత్రి 8:45 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లి.. విమానంలో ఢిల్లీకి తరలించారు.

ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ జోగిందర్‌ నేతృత్వంలోని 12 మంది ఢిల్లీ అధికారుల బృందం హైదరాబాద్‌ ఈడీ అధికారుల సహకారంతో శుక్రవారం మధ్యాహ్నమే హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 14లోని ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకుంది. సుమారు 1.45 గంటల సమయంలో సోదాలు ప్రారంభించారు. కవిత, ఆమె భర్త అనిల్‌కుమార్‌ సహా అక్కడున్నవారి సెల్‌ఫోన్లను సీజ్‌ చేశారు. సోదాల్లో పలు పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో కవిత మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఆధారాలు లభించాయని, పీఎంఎల్‌ఏ యాక్ట్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌–2002)లోని 3, 4 సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నట్టు ఎమ్మెల్సీ కవితకు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

అరెస్టుకు కారణాలను తెలియజేస్తూ 14 పేజీల కాపీని కవితకు అందజేశారు. తర్వాత సాయంత్రం 5.20 గంటల సమయంలో కవితను ఈడీ బృందం అరెస్టు చేసింది. దీనికి సంబంధించిన సమాచార లేఖను ఆమె భర్త అనిల్‌కుమార్‌కు అందించింది. కవితను ఢిల్లీకి తరలించేందుకు సిద్ధమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది ఈడీ అధికారుల బృందంలో ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు. 

తీవ్ర ఉద్రిక్తత మధ్య తరలింపు.. 
ఈడీ సోదాల విషయం తెలుసుకుని భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కవిత నివాసం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈడీ సోదాలు కొనసాగినంత సేపూ నిరసన తెలిపారు. బీజేపీ, ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు, హరీశ్‌రావు, ఇతర నేతలు, న్యాయవాదులు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. వారు లోనికి వెళ్లకుండా ఈడీ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీనితో సుమారు ఇరవై నిమిషాల పాటు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర నేతలు గేటు వద్దే వేచి ఉన్నారు. ఒకదశలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు గేటు తోసుకుని కవిత నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాయి. దీనితో పోలీసులు బందోబస్తు పెంచారు. రోప్‌ పారీ్టలను పిలిపించారు. స్వల్పంగా లాఠీచార్జి చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. 

అరెస్టు అక్రమమంటూ వాగ్వాదం! 
కొంతసేపటి తర్వాత కేటీఆర్, ఇతర నేతలు కవిత నివాసం లోపలికి వెళ్లారు. కవిత అరెస్టు అక్రమం, చట్టవ్యతిరేకమని ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఈడీ అధికారి భానుప్రియ మీనా కల్పించుకుని కేటీఆర్, ఇతర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీలు జరుగుతున్నప్పుడు అనుమతి లేకుండా లోపలికి వచ్చారని మండిపడ్డారు. వారందరినీ వీడియో తీయాలంటూ మరో ఈడీ అధికారిని ఆదేశించారు. ఈ సమయంలో కేటీఆర్‌ కలగజేసుకుని.. ‘‘మేడం.. సెర్చ్‌ చేయడం అయిపోయింది.

అరెస్టు వారెంట్‌ ప్రొడ్యూస్‌ చేసిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు లోపలికి రావొద్దని ఎలా చెప్తున్నారు? ఎలాంటి ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా, మెజి్రస్టేట్‌ ముందు హాజరుపర్చకుండానే కేసు చేస్తాను అంటున్నారు. కావాలనే శుక్రవారం వచ్చి అరెస్టు చేస్తున్నారు. మీరు (ఈడీ అధికారులు) ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టుకు అండర్‌టేకింగ్‌ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని మీరే ఉల్లంఘిస్తున్నారు. దీనివల్ల సీరియస్‌ ట్రబుల్‌లో పడతారు..’’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 

అందరికీ అభివాదం చేసి.. 
సుమారు 7 గంటల సమయంలో ఈడీ అధికారులు కవితను శంషాబాద్‌ విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు బయటికి వచ్చారు. ఈ సమయంలో కవిత ఉద్వేగానికి లోనయ్యారు. అక్కడే ఉన్న తన కుమారుడిని హత్తుకుని ముద్దుపెట్టుకున్నారు. కుమారుడి కన్నీటిని తుడిచి, త్వరగా వస్తానని చెప్పారు. ఆందోళన చేస్తున్న అభిమానులకు నమస్కరించారు. కవితను విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు ఈడీ అధికారులు పోలీసులతో కలసి ప్రత్యేక కాన్వాయ్‌ సిద్ధం చేశారు. అయితే కవిత తన భర్త అనిల్‌కుమార్‌ కారులో వస్తానని చెప్పారు.

ఈడీ అధికారులు అంగీకరించడంతో భర్తతో కలసి కారులో బయలుదేరారు. ఈ కారు ముందు వెనుక ఈడీ, పోలీసు వాహనాలు కాన్వాయ్‌గా శంషాబాద్‌కు చేరుకున్నాయి. విమానాశ్రయం లోపలికి వెళ్లే సమయంలోనూ కవిత పిడికిలి ఎత్తి అభివాదం చేశారు. ఈడీ అధికారుల బృందం విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూకే–870 విమానంలో రాత్రి 8.58 గంటలకు కవితను ఢిల్లీకి తరలించింది. 

నేడు కోర్టు ఎదుట హాజరు 
కవితను ఢిల్లీకి తరలించిన ఈడీ అధికారులు శుక్రవారం రాత్రి ఆమెను ఈడీ కార్యాలయంలోనే ఉంచారు. శనివారం మధ్యాహ్నం ఆమెను ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నట్టు సమాచారం. 
 
లిక్కర్‌ కేసులో అరెస్టులు ఇవీ.. 
సమీర్‌ మహేంద్రు (ఇండో స్పిరిట్‌ యజమాని) సెప్టెంబర్‌ 27, 2022 

శరత్‌చంద్రారెడ్డి (ట్రైడెంట్‌ కెంఫర్‌ లిమిటెడ్‌) నవంబర్‌ 10, 2022 

వినయ్‌బాబు (ఫెర్నాడ్‌ రికార్డ్‌ కంపెనీ) నవంబర్‌ 10, 2022 

అభిషేక్‌ బోయినపల్లి (రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌) నవంబర్‌ 14, 2022 

విజయ్‌ నాయర్‌ (మద్యం వ్యాపారి) నవంబర్‌ 14, 2022 

అమిత్‌ అరోరా (బడ్డీ రిటైల్‌ డైరెక్టర్‌) నవంబర్‌ 30, 2022 

గోరంట్ల బుచ్చిబాబు (కవిత మాజీ ఆడిటర్‌) ఫిబ్రవరి 9, 2023 

గౌతం మల్హోత్రా (మద్యం వ్యాపారి) ఫిబ్రవరి 9, 2023 

మాగుంట రాఘవ (మద్యం వ్యాపారి) ఫిబ్రవరి 11, 2023 

మనీష్‌ సిసోదియా (ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం) ఫిబ్రవరి 26, 2023 

కల్వకుంట్ల కవిత (ఎమ్మెల్సీ) మార్చి 15, 2024 
 
నేడు కేసీఆర్, కేటీఆర్‌ ఢిల్లీకి.. 
ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావుతోపాటు మరికొందరు కీలక నేతలు శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. తండ్రిగా కేసీఆర్, సోదరుడిగా కేటీఆర్‌ నైతికంగా కవితకు అండగా నిలబడేందుకు, న్యాయ నిపుణులతో చర్చించేందుకు వెళ్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌ విచారణలో ఉన్న సమయంలో ఈడీ అరెస్టు చేసిన అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. కవిత అరెస్టుతోపాటు తెలంగాణ, జాతీయ రాజకీయాలు, మోదీ–బీజేపీ విధానాలపై కేసీఆర్‌ జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. 
 
ఈడీ తీరు చట్టవిరుద్ధం: కవిత న్యాయవాది మోహిత్‌రావు 
సాక్షి, న్యూఢిల్లీ:  ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో ఈడీ చట్టవిరుద్ధంగా వ్యవహరించిందని సుప్రీంకోర్టులో ఆమె తరఫున వాదిస్తున్న న్యాయవాది మోహిత్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కవిత అరెస్టు నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్‌ మంగళవారానికి వాయిదాపడిందని.. ఈ కేసులో కవితపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోమని ఈడీ గతంలో కోర్టుకు హామీ ఇచ్చిందని వివరించారు. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు కఠిన చర్యలు తీసుకోబోమన్న ఈడీ హామీ వర్తిస్తుందని చెప్పారు. అయినా ముందస్తు పథకంలో భాగంగా సోదాల పేరిట వచ్చి కవితను అరెస్ట్‌ చేశారని.. విమానం టికెట్లు కూడా ముందుగానే బుక్‌ చేశారని ఆరోపించారు. కవిత ముందు న్యాయపరంగా చాలా అవకాశాలు ఉన్నాయని, అరెస్ట్‌ను సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement