కవిత నివాసంలో ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం. చిత్రంలో హరీశ్‌రావు
కవిత విషయంలో ఈడీ తొందరపాటు చర్య: మాజీ మంత్రి కేటీఆర్
దీనిపై సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది
బీజేపీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం
చట్టబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని వెల్లడి
తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల బీజేపీ పాలనలో రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు కోసం అధికారాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేయడం సర్వసాధారణంగా మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు అప్రజాస్వామికమని పేర్కొన్నారు. కవిత అరెస్టుపై కేటీఆర్ ‘ఎక్స్ (ట్విటర్)’లో తీవ్రంగా స్పందించారు. ‘‘ఈ కేసులో కవిత అరెస్టు విషయం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది.
అయినా ఈడీ తొందరపాటుతో, దుందుడుకుగా వ్యవహరించింది. ఈడీ స్వయంగా సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీ (అండర్ టేకింగ్)ని తుంగలో తొక్కి మరీ అరెస్టు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనిపై ఈడీ సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 19వ తేదీన జరిగే సుప్రీంకోర్టు విచారణలో ఈ అంశం పరిగణనలోకి వస్తుందని ఆశిస్తున్నా. కచ్చితంగా న్యాయం గెలుస్తుంది. చట్టబద్ధంగా ఈ అంశంలో పోరాటం కొనసాగిస్తాం..’’అని కేటీఆర్ పేర్కొన్నారు.
కవిత అరెస్టు అక్రమం: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
మోదీ ప్రభుత్వం ఈడీని అడ్డుపెట్టుకుని కవితను అరెస్టు చేయడం అక్రమమని, ఈ బూటకపు అరెస్టును ఖండిస్తున్నామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘బీజేపీ కుటిల ఎత్తుగడలకు తలొగ్గకుండా తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బీఎస్పీతో బీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంది. దీంతో మోదీ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు తెరతీశారు. కవిత అప్రజాస్వామిక అరెస్టు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై దెబ్బకొట్టడమే. ఈ దుశ్చర్య కాంగ్రెస్, బీజేపీ లోపాయకారీ ఒప్పందంలో భాగమే..’’అని ఆరోపించారు.
ఓటమి భయంతో ప్రతిపక్షాలపై దాడులు
బీజేపీ ఓటమి భయంతో ప్రతిపక్ష పార్టీలు, నేతలను లక్ష్యంగా చేసుకుంటోందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. కవిత అరెస్టును ఖండించారు. ఇక శివసేన రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది కూడా కవిత అరెస్టును ఖండించారు. బీజేపీ అణచివేత విధానాలు, అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment