పంచనామా నివేదికలో పేర్కొన్న ఈడీ అధికారులు
కవిత సంతకం తీసుకుని వాంగ్మూలం నమోదు చేశాం
ప్రశాంతంగా తనిఖీలు చేశాం.. పలు ఆస్తుల డాక్యుమెంట్లు, 5 ఫోన్లు సీజ్ చేశాం
కవిత సోదరుడు, మరికొందరు చట్టవిరుద్ధంగా తనిఖీల చోటికి వచ్చి
ఆటంకం కలిగించారు... సాయంత్రం 6.45కు తనిఖీలు ముగించామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ కీలక నేత, ఎమ్మెల్సీ కవిత ఇంట్లో తనిఖీలు ప్రశాంతంగా సాగాయని, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రకటించారు. శుక్రవారం కవిత నివాసంలో తనిఖీలు ముగిశాక పంచనామా నివేదికను విడుదల చేశారు. ఆ వివరాలు ‘‘పంచ్‌లు (వీరి సమక్షంలో అధికారులు విచారణ చేస్తారు) బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ పి.శ్రీనివాస్‌రెడ్డి, బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ మేనేజర్ ఏద్దుల వివేకానందకుమార్‌రెడ్డి ఎదుట వివరాలు సేకరించాం. ఈడీ అదనపు డైరెక్టర్ కపిల్‌రాజ్ ఆదేశాల మేరకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో శుక్రవారం తనిఖీలు నిర్వహించాం.
మొదట తనిఖీల అధికారిక పత్రంపై కవిత సంతకాన్ని తేదీతో సహా తీసుకున్నాం. తర్వాత అదే పత్రంపై మేం కూడా తేదీతో సహా సంతకం చేశాం. మధ్యాహ్నం 1.45 గంటలకు తనిఖీలు ప్రారంభించాం. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)–2002లోని సెక్షన్ 17 ప్రకారం కవిత వాంగ్మూలాన్ని నమోదు చేశాం. సెక్షన్ 19 ప్రకారం సాయంత్రం 5.20 గంటలకు ఆమెను అరెస్టు చేశాం. ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నామో కారణాలను ఆమెకు వివరించాం. పలు రికార్డులు/ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లతోపాటు 5 ఫోన్ల సీజ్ చేశాం. సాయంత్రం 4.15 గంటలకు అధికారి మమత నారా వెళ్లడంతో మరో అధికారి వరలక్ష్మి వచ్చి పాల్గొన్నారు.
సుమారు సాయంత్రం 6 గంటల సమయంలో కవిత సోదరుడు, మరికొందరు వ్యక్తులు, న్యాయవాదులు చట్టవిరుద్ధంగా తనిఖీల ప్రాంతంలోకి వచ్చారు. వారెవరో మాకు వివరాలు చెప్పలేదు. విచారణకు ఆటంకం కలిగించారు. సాయంత్రం 6.45 గంటలకు తనిఖీలు ముగించాం. ప్రశాంతంగా, ఇంట్లోని ఏ వస్తువులకూ ఎలాంటి నష్టం కలగకుండా కొనసాగించాం. ప్రారంభంలో తనిఖీలను కవిత సున్నితంగా తిరస్కరించారు’’అని పంచనామాలో ఈడీ అధికారులు వివరించారు. ఈ తనిఖీల్లో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్‌తోపాటు డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ, అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్‌గోయల్, అధికారులు విక్రాంత్‌కుమార్, కార్తీక్ మెహ్రా, హిమాన్షు చౌదరి, మమతా నారా, బ్రజేష్ చౌరాసియా పాల్గొన్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment