సాక్షి, హైదరాబాద్: కరోనా నేర్పిన చక్కని పాఠం ఆరోగ్యంపై శ్రద్ధ. తినే తిండి మాత్రమే కాదు ఉండే ఇల్లు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేలా ఉండాలని జనం కోరుకుంటున్నారు. అందుకే హరిత (గ్రీన్) భవనాలకు డిమాండ్ పెరిగింది. ఇంటి చుట్టూ పచ్చని చెట్లు, ధారాళమైన గాలి, వెలుతురు వచ్చే ఏర్పాట్లు, సౌర విద్యుత్, వర్షపు నీటి వినియోగం, జీవ వైవిధ్య పరిరక్షణ.. ఈ ఏర్పాట్లు, సదుపాయాలు ఉన్నవే హరిత భవనాలు.
కొనుగోలుదారుల అభిరుచి మేరకు ఇటీవల రియల్‌ఎస్టేట్ సంస్థలు ఈ తరహా నిర్మాణాలకే మొగ్గుచూపిస్తుండటంతో..హైదరాబాద్‌లో గ్రీన్ బిల్డింగ్స్ పెరుగుతున్నాయి. ఆనందం, ఆహ్లాదంతోపాటు కాలుష్యానికి దూరంగా, ఆరోగ్యానికి దగ్గరగా ఉండటమే హరిత భవనాల అసలు లక్ష్యం.
సాధ్యమైనంత వరకు సహజ సిద్ధమైన ఇంధన వనరులను వినియోగిస్తూ.. జీవ వైవిధ్యాన్ని కాపాడే నిర్మాణాలను హరిత భవనాలుగా పరిగణిస్తారు. నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం, జీవన కాల పరిమితిని పెంచడమే హరిత భవనాల ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం దేశంలో 975 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం మేర 8,600 హరిత భవనాలు ఉన్నాయి. తెలంగాణలో 178 నివాస, 256 వాణిజ్య భవనాలు ఐజీబీసీ గుర్తింపు పొందాయి.
రేటింగ్‌ను బట్టి సర్టిఫికెట్లు
ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్రమాణాల మేరకు ఉన్న నివాస, వాణిజ్య సముదాయాలను గుర్తించి ప్లాటినం, గోల్డ్, సిల్వర్ కేటగిరీలలో సర్టిఫికెట్లను ప్రదానం చేస్తుంటారు. 80కిపైగా పాయింట్లు వస్తే ప్లాటినం, 60–79 మధ్య వస్తే గోల్డ్, 50–59 మధ్యవస్తే సిల్వర్ సర్టిఫికెట్లు ఇస్తారు. ఆయా భవనాల్లో విద్యుత్, నీటి వినియోగం, నిర్మాణ సామగ్రి ఎంపిక, ల్యాండ్ స్కేపింగ్ మీద ఆధారపడి ఈ రేటింగ్స్ ఉంటాయి.
‘గ్రీన్ బిల్డింగ్’ ప్రయోజనాలివే..
►సాధారణ భవనాలతో పోలిస్తే గ్రీన్ బిల్డింగ్స్‌లో విద్యుత్ 30–50% ఆదా ఆవుతుంది.
►20–30 % నీటి వినియోగం తగ్గుతుంది.
►12–16% మేర కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి.
పాత భవనాలూ ‘గ్రీన్’గా..
కొత్త భవనాలను పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించవచ్చు. మరి పాత భవనాల పరిస్థితేంటి అనే సందేహాలు వస్తుంటాయి. వాటిని కూడా గ్రీన్ బిల్డింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంది. గచ్చిబౌలిలోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు బిల్డింగ్‌ను హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా మార్చారు. బిల్డింగ్‌లో త్రీస్టార్, ఫైవ్‌స్టార్ రేటింగ్ ఉండే ఎలక్ట్రికల్ వస్తువులను వినియోగించడం, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా పైకప్పులో మా ర్పులు, సౌర విద్యుత్ వినియోగం, నీటి వృథాను అరికట్టడం, మొక్కలను పెంచడం వంటివి చేస్తే ‘గ్రీన్’గా మారొచ్చు.
హరిత భవనాలు ఎలా ఉండాలంటే?
►భవన నిర్మాణంలో నీరు, విద్యుత్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి.
►వేడిని విడుదల చేసే ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలి.
►వాన నీటిని వృథా చేయకుండా ఇంకుడు గుంతలు, నీటి శుద్ధి కేంద్రం ఉండాలి.
►భవనంలో సాధ్యమైనంత వరకు సౌరశక్తిని వినియోగించాలి.
►ఇంటి లోపలికి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి.
►భవనం చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి.
►ఖాళీ స్థలంలో పచ్చదనం ఎక్కువగా ఉండే మొక్కలను పెంచాలి.
‘తొలి’ ఘనత మనదే..
హరిత భవనాల గుర్తింపులో హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దేశంలోనే తొలి ఐజీబీసీ ప్లాటినం గ్రేడ్ స్టేషన్‌గా గుర్తింపు పొందగా.. ఆసియాలోనే తొలి హరిత భవనంగా గచ్చిబౌలిలోని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సొహ్రబ్జి గ్రీన్ బిజినెస్ సెంటర్ నిలిచింది. ఇక ప్రపంచంలో మొదటి గ్రీన్ ప్యాసింజర్ టెర్మినల్‌గా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఖ్యాతి గడించింది. తాజాగా తెలంగాణ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు గ్రీన్ బిల్డింగ్ గుర్తింపు దక్కగా.. కొత్తగా నిర్మించనున్న సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారకం కూడా ఐజీబీసీ ప్రమాణాల మేరకు నిర్మిస్తున్నారు.
అనుమతుల్లో తప్పనిసరి చేయాలి
2070 నాటికి కార్బన్ న్యూట్రల్ ఇండియాగా మారాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దాన్ని చేరాలంటే భవన నిర్మాణాలు కూడా హరితంగా ఉండాలి. దేశంలో ప్రతి ప్రభుత్వ భవనాన్ని హరిత భవనంగా మార్చాలి. అలాగే నిర్మాణ అనుమతులలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఐజీబీసీ సర్టిఫికెట్ లెవల్‌ను తప్పనిసరి చేయాలి. – సి.శేఖర్‌రెడ్డి, ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment