మహిళల్లో ప్రధానంగా కనిపిస్తున్న కేన్సర్ రొమ్ము కేన్సర్... పట్టణాలు, పల్లెలనే తేడా లేదు. అలాగే పెద్ద వయసు, చిన్న వయసు అనే తేడాలేకుండా దాడి చేస్తోంది. చాలామంది మహిళలు ఈ కేన్సర్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. దురదృష్టవశాత్తూ చాలా సందర్భాల్లో వ్యాధి ముదిరేంతవరకూ దీన్ని గుర్తించలేకపోతున్నారు. తొలిదశలోనే గుర్తించగలిగితే ప్రాణాలు దక్కించుకునే అవకాశాలూ పెరుగుతాయి. భారతదేశం లాంటి దేశాల్లో ఈ పరిస్థితి మరి ఎక్కువగా ఉంది. అసలు తొలిదశలోనే ఈ కేన్సర్‌ని గుర్తించడంలో ఎదురవుతున్న అడ్డంకులు, ఎలాంటి ప్రయత్నాలతో ప్రజలకు అవగాహన కల్పించాలో తదితర విషయాలపై అమూల్యమైన సలహాలు సూచనలు అందించారు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బ్రెస్ట్ ఆంకాలజిస్ట్ అండ్ ఆంకోప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ప్రజ్ఞ చిగురుపాటి.
ప్ర: రొమ్ము కేన్సర్‌పై అవగాహన, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఏడాది పొడవునా కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఏమిటి?
జ: మహిళలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న భారత్ లాంటి దేశాల్లో రొమ్ము కేన్సర్‌పై నిత్యం కార్యక్రమాలు నిర్వహించాలి. చాలామందిలో వ్యాధిపై అవగాహన ఉండదు. కుటుంబ బాధ్యతల పేరుతో మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూంటారు. పైగా వ్యాధి నిర్ధారణ, పరీక్షలకు తగిన వసతులు కూడా ఇక్కడ తక్కువే. రొమ్ము కేన్సర్ పరీక్షలు సొంతంగా ఎలా చేసుకోవచ్చో మామోగ్రామ్ వంటి ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలు ఎక్కడ చేయించుకోవాలో మహిళలకు తెలిసే అవకాశాలు తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో వీటి గురించి అస్సలు మాట్లాడుకోరు. దగ్గరలో కేన్సర్ చికిత్స కేంద్రాలూ ఉండవు.
ప్ర: వీలైనంత తొందగా రొమ్ము కేన్సర్‌ను గుర్తించడం ఎలా ముఖ్యమవుతుంది?
జ: అవగాహన లేమి, స్క్రీనింగ్ సౌకర్యాలు లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల రొమ్ము కేన్సర్‌ను చాలా సార్లు ముదిరిన తరువాత మాత్రమే గుర్తిస్తున్నారు. మెరుగైన చికిత్స అందించేందుకు వ్యాధి నుంచి బయటపడేందుకు తొలిదశల్లోనే గుర్తించడం చాలా కీలకం. అందుకే మేము గ్రామాలతోపాటు చిన్న చిన పట్టణాల్లో రొమ్ము కేన్సర్‌పై అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నాం. వ్యాధి లక్షణాలు, సక్రమంగా గుర్తించడం ఎలా? నిర్ధారణ చేసుకోవడమెలా? సొంతంగా పరీక్షించుకునే విధానం, ట్రిపుల్ టెస్ట్ వంటి విషయాల గురించి వివరిస్తున్నాం.
ప్ర: సాధారణంగా ఏ ఏ కారణాలతో మహిళలు తొలిదశ పరీక్షలకు ముందుకు రావడం లేదు?
జ: ఎక్కువమంది కుటుంబ బాధ్యతలు చూసుకోవడంలో తలమునకలై ఉంటారు. తమ ఆరోగ్య అవసరాలను నిర్లక్ష్యం చేస్తూంటారు. తరచూ వైద్యపరీక్షలు చేసుకోవాలన్న అవగాహన లేకపోవడమే పెద్ద ప్రతిబంధకం. కొంతమందికి ఈ పరీక్షలు ఎలా చేయించుకోవాలో కూడా తెలియదు. పైగా కేన్సర్ వ్యాధ నిర్ధారణకు సంబంధించి చాలా అపోహలున్నాయి. తెలియకపోవడమే మేలని చాలామంది అనుకుంటూంటారు. ఈ కారణాల వల్లనే మేము ‘బ్రెస్ట్ హెల్త్ ఎక్స్‌ప్రెస్’ పేరుతో గ్రామ ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపడుతున్నాం.
ప్ర: రొమ్ము కేన్సర్‌పై ఉన్న అతిపెద్ద అపోహలేమిటి?
జ: కుటుంబంలో ఎవరికైనా రొమ్ము కేన్సర్ ఉంటే మాత్రమే మామోగ్రామ్ చేయించుకోవాలన్నది అతి పెద్ద అపోహ. వాస్తవానికి ప్రతిమహిళ రొమ్ము కేన్సర్ బారిన పడే అవకాశం ఎంతో కొంత ఉంటుంది. అంటే కుటుంబంలో ఎవరికీ రొమ్ము కేన్సర్ లేనప్పటికీ మీకు వచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకే నలభై ఏళ్లు దాటిన వారందరూ కచ్చితంగా ఏటా మామోగ్రామ్ చేయించుకోవాలి. ఒకవేళ కుటుంబంలో ఎవరికైనా రొమ్ము కేన్సర్ ఉంటే వారు ఈ పరీక్షలు చేయించుకోవడం మరీ ముఖ్యమవుతుంది.
ప్ర: రొమ్ము కేన్సర్, అంకప్లాస్టిక్ సర్జరీని మీ వృత్తిగా ఎంచుకునేందుకు స్ఫూర్తి ఏమిటి?
జ: దేశంలో కేన్సర్ సర్జన్లు చాలా తక్కువమంది ఉన్నారు. హైదరాబాద్‌లోనూ అంతే. అందుకే నేను ఈ రంగాన్ని ఎంచుకున్నా. మా అమ్మ శరీరంలోంచి కణితి (కేన్సర్ కాదు)ని తొలగించేందుకు తీసుకువెళ్లాల్సి రావడం ఒక రకంగా నేను ఆంకోప్లాస్టిక్ సర్జన్ అయ్యేందుకు కారణం.
ప్ర: సాధారణ రొమ్ము కేన్సర్ శస్త్రచికిత్సలతో పోలిస్తే ఆంకోప్లాస్టీ సర్జరీ ఎలా భిన్నం?
జ: ప్రధానమైన తేడా ఆంకోప్లాస్టిక్ సర్జరీ విధానంలో కేన్సర్ సోకిన రొమ్మును పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకూ రొమ్మును మిగల్చడం లక్ష్యంగా శస్త్రచికిత్స చేయడం వల్ల ప్రత్యేక కృత్రిమ పొరలను ఏర్పాటు చేసి కేన్సర్ తిరగబెట్టకుండా రేడియేషన్ థెరపీ ఇచ్చేందుకు అనువుగా చేయవచ్చు కూడా. ఒకవేల రొమ్ము మొత్తాన్ని తీసివేసినా.. శరీరంలోని కొవ్వు, కండరాల సాయంతో రొమ్మును మళ్లీ సిద్ధం చేయవచ్చు. కాబట్టి ఆంకోప్లాస్టిక్ సర్జరీ అంటే కేన్సర్ చికిత్సకు ప్లాస్టిక్ సర్జరీ తోడవడం అన్నమాట.
ప్ర: బ్రెస్ట్ ఆంకాలజిస్ట్, ఆంకోప్లాస్టిక్ సర్జన్‌గా మీకు తృప్తినిచ్చే అంశం...?
జ: శస్త్రచికిత్స తాలూకూ తుది ఫలితం. సర్జరీకి బాధితులు ఎలా స్పందిస్తున్నారు? అన్నది. కొన్ని కేసుల విషయంలో వ్యాధి నిర్ధారణ కూడా చాలా ముఖ్యమవుతుంది. తమ సమస్యలను అర్థం చేసుకునేందుకు తగినంత సమయం ఇచ్చారని రోగి నవ్వుతూ చెప్పినప్పుడు కలిగే ఆనందం అంత ఇంత కాదు. ఎంత పనిచేశామన్న దానికంటే ఎంత నాణ్యమైన పని చేశామన్నది ముఖ్యమని అనుకుంటా
(చదవండి: 20 ఏళ్లకే డాక్టర్, 22 ఏళ్లకు ఐఏఎస్ ఆఫీసర్..ఇవాళ ఏకంగా..!)
Comments
Please login to add a commentAdd a comment