
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 18 మంది ప్రాణాలు కోల్పోగా, పదిమందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఆ బాధితులలో ఐదుగురు మాత్రం బాధకరమైన పరిస్థితితో మరణించినట్లు ఆర్‌ఎంఎల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. నిజానికి ఈ ఘటన ఫుట్‌ఓవర్ వంతెనపై నుంచి దిగుతుండగా కొంతమంది ప్రయాణికులు జారిపడి పడిపోవడంతో చోటుచేసుకుందన్న సంగతి తెలిసిందే. అయితే అందరూ అనుకున్నట్లు ఆ ఐదుగురు బాధితులు మాత్రం తొక్కిసలాట కారణంగా చనిపోలేదంటూ పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు వైద్యులు. ప్రయాణీకులతో కిక్కిరిసిన ప్రదేశాల్లో కొందరికి అలాంటి వైద్య పరిస్థితి ఎదురై ప్రాణాంతకంగా మారుతుందని చెబుతున్నారు. ఇంతకీ అస్సలు ఆ బాధితులు మరణానికి ప్రధాన కారణం ఏంటి..?. ఆ వైద్య పరిస్థితిని ఏమని పిలుస్తారు..? ఎలా నివారించాలి..?
ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌లో రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నిఖిల్ మోడీ ఐదుగురు బాధితుల మరణానికి ప్రధాన కారణాన్ని వివరించారు. వారంతా ట్రామాటిక్ అస్ఫిక్సియా అనే శ్వాసకోశ వ్యాధి కారణంగా మృతి చెందినట్లు వెల్లడించారు. బాధితుల్లో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఈ పరిస్థితికి గురయ్యినట్లు తెలిపారు.
అలాగే ఆ ఆస్పత్రి సీనియర్ వైద్యుడు మాట్లాడుతూ..గాయపడిన బాధితులను ఆర్‌ఎంఎల్ ఆస్పత్రికి తీసుకురాలేదని, కానీ ఈ ఐదు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి నుంచి ఆర్‌ఎంఎల్‌కి తరలించడంతో ఈ విషయం నిర్థారణ అయినట్లు తెలిపారు. అంతేగాదు ఆ నివేదికలో ఆ వైద్య పరిస్థితి గురించి సవివరంగా పేర్కొన్నారని సదరు వైద్యుడు వెల్లడించారు. ఇంతకీ ఏంటీ ట్రామాటిక్ అస్ఫిక్సియా..?
ట్రామాటిక్ అస్ఫిక్సియా
ట్రామాటిక్ అస్ఫిక్సియాను క్రష్ అస్ఫిక్సియా అని కూడా పిలుస్తారు. ఇది ఛాతీ లేదా పొత్తికడుపు పైభాగంపై తీవ్ర ఒత్తిడిని కలుగజేసితే సంభవిస్తుంది. ఈ తీవ్రమైన శక్తి డయాఫ్రాగమ్ విస్తరించకుండా నివారిస్తుంది. ఫలితంగా సాధారణ శ్వాస కూడా కష్టమవుతుంది. అదనంగా పీడనం రక్తాన్ని పైశరీరంలోకి తిరిగి నెట్టివేస్తుంది.
దీనివలన ముఖం, మెడ, కళ్లల్లో పెటెచియే(కేశనాళికలు పగిలిపోవడం వల్ల ఊదా-ఎరుపు రంగు మారడం) వంటి సంకేతాలు కనిపిస్తాయి. అంటే తల, పై శరీరం వాపుకి గురైనట్లుగా ఉంటుంది. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే బాధితుడు నిమిషాల్లోనే స్ప్రుహ కోల్పోవచ్చు. తదనంతర అంతర్గత అవయవాలు వైఫల్యం జరిగి నిమిషాల వ్యవధిలోనే మరణం సంభవిస్తుందని చెబుతున్నారు వైద్యులు.
అలాంటి వ్యక్తులకు పరిస్థితి విషమించక మునుపే సకాలంలో ఆక్సిజన్ థెరపీ వంటి వైద్య చికిత్సలు అందిస్తే తొందరగా ఆ విషమ పరిస్థితి నుంచి బయటపడేలా చేయడం సాధ్యమవుతుంది. ఈ పరిస్థితి ఊపిరాడనంత రద్దీ ప్రదేశాల్లో కొందరికి ఎదురవుతుందని చెబుతున్నారు.
అయితే ఇలాంటి శ్వాసకోశ సమస్యను నివారించాలంటే ప్రమాదకరమైన వాతావరణం లేదా రద్దీ ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటేనే సాధ్యమని తేల్చి చెప్పారు వైద్యులు. అంతేగాదు అధికారులు సైతం ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఉత్ఫన్నం కాకుండా నివారించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కసరత్తులు చేపట్టారు.
(చదవండి: జుట్టు రాలిపోవడంతో 40 కిలోలు బరువు తగ్గింది..! 80/20 రూల్‌తో..)
Comments
Please login to add a commentAdd a comment