నిమోనియా హాయైన శ్వాస కోసం!
శ్వాసక్రియ జరగకుండా మనిషి ఒక్క క్షణం కూడా జీవించి ఉండలేడు. ఈ ప్రక్రియలో ముక్కు నుంచి వెళ్లిన గాలి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. అది జీవక్రియలకు అవసరమైన ఆక్సిజన్‌ను ఊపిరితిత్తుల చివరి భాగమైన అల్వియైలై అనే గాలి గదిలో మార్పిడి చేసి... జీవక్రియల్లో విడుదలైన హానికర వ్యర్థవాయువులైన కార్బన్డయాక్సైడ్ వంటి వాటిని అక్కడి నుంచి బయటకు తీసుకువస్తుంది. ఈ కార్యక్రమం నిత్యం జరుగుతూ ఉండటం వల్లనే ప్రాణులు జీవించగలుగుతున్నాయి. ఊపిరితిత్తులలోని అత్యంత కీలకమైన గాలిగది ఆల్వియోలై అనే భాగంలో ఈ ఆక్సిజన్, కార్బన్డైయాక్సైడ్ల మార్పిడి జరుగుతుంటుంది. ఏదైనా కారణాల వల్ల ఆల్వియోలైలో ద్రవాలు చేరితే వాయుమార్పిడి జరగక శ్వాసక్రియ సక్రమంగా సాగదు. ఆ పరిస్థితినే నిమోనియా అంటారు. ఈ నెల 12న ప్రపంచ నిమోనియా దినం సందర్భంగా ఆ వ్యాధిపై అవగాహన కోసమే ఈ కథనం.
నిమోనియా వచ్చే పరిస్థితులు ఎవరెవరిలో..?
నిమోనియా అనేది ఊపిరితిత్తులకు వచ్చే ఒక ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ సోకడం అంటే అది కాస్త తీవ్రమైన పరిస్థితే. సాధారణంగా ఏ వయసు వారిలోనైనా కనిపించే ఇది పిల్లల్లోనూ, 65 ఏళ్లు పైబడ్డవారిలోనూ ఎక్కువ. దీనికి తోడు సాధారణంగా గుండెజబ్బులు, డయాబెటిస్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, వంటివి ఉన్నవారికి తేలిగ్గా వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా చలికాలంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. పొగతాగే అలవాటు ఉన్నవారికి నిమోనియా వచ్చే అవకాశాలు మరీ ఎక్కువ. ఇరుకుగా ఉండే ప్రదేశాల్లో ఒకే చోట ఎక్కువ మంది ఉంటే ఇది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
ఊపిరితిత్తుల పనితీరు ఇలా..!
మనం శ్వాసించే సమయంలో ముక్కు ద్వారా గాలిని పీల్చుకుంటాం. ఇది తొలుత ట్రాకియా అనే గాలిగొట్టం నుంచి లోనికి ప్రవేశిస్తుంది. ఇదే ట్రాకియా బ్రాంకై అనే రెండు గొట్టాలుగా విడిపోయి- ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి... బ్రాంకియోల్స్ అని పిలిచే అనేక శాఖలుగా చీలిపోతాయి. ఈ బ్రాంకియోల్స్ చివర గాలి తిత్తులు ఉంటాయి. వీటినే ఆల్వియోలై అంటారు. మనం గాలి పీల్చే సమయంలో మన ముక్కు, నోరు ద్వారా రోగకారక క్రిములు ట్రాకియా మార్గం నుంచి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి ఆల్వియోలైలోకీ చేరే అవకాశం ఉంది. ఈ క్రిములు శరీరంలోకి ప్రవేశించకుండా చూసేందుకు మన రోగనిరోధక శక్తి, దాంతోపాటు... మన ముక్కు ఆకృతి, ఫ్యారింగ్స్ తోడ్పడతాయి. అవి ప్రవేశించినప్పుడు దగ్గడం ద్వారా వాటిని బయటకు పంపే ఏర్పాటుతో పాటు... బ్రాంకై అనే గాలిగొట్టాల్లో ఉన్న సీలియా అనే వెంట్రుకల వంటి నిర్మాణం... ఎల్లప్పుడూ ఒక ఎస్కలేటర్లా స్పందిస్తూ రోగకారక అంశాలను బయటకు పంపివేస్తూ ఉంటాయి. ఏదైనా కారణాల వల్ల మన రోగనిరోధక శక్తి లోపించినప్పుడు, రోగకారక క్రిములు శరీరంలోకి ప్రవేశించడమో లేదా మనమే ఎక్స్పోజ్ కావడమో జరిగినప్పుడు అవి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. ఇలాంటి సమయాల్లో మన తెల్లరక్తకణాలు ఆల్వియోలైలోకి ప్రవేశించి అక్కడ ఉన్న రోగకారక క్రిములపై దాడి చేస్తాయి. ఇలా జరిగే క్రమంలో మన ఆల్వియోలైలో తెల్లరక్తకణాలు, ప్రోటీన్లు, ఇతర ద్రవాలు, ఎర్రరక్తకణాలు నిండిపోతాయి. ఫలితంగా నిమోనియా లక్షణాలు బయటపడతాయి.
నిమోనియా - దుష్ర్పభావాలు
నిమోనియాను యాంటీబయాటిక్స్‌తో చాలా తేలిగ్గానే తగ్గించవచ్చు. అయితే కొందరిలో కొన్ని సందర్భాల్లో నిమోనియాను నిర్లక్ష్యం చేయడం వల్ల కనిపించే దుష్ర్పభావాలు (కాంప్లికేషన్స్) చాలా త్రీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా హై-రిస్క్ గ్రూపునకు చెందిన వారిలో ఈ దుష్ర్పభావాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇక దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులైన సీఓపీడీ (ఎంఫసిమా) లేదా కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవారిలోనూ ఈ దుష్ర్పభావాలు తీవ్రంగా ఉంటాయి. అవి...
ఊపిరితిత్తుల్లో ద్రవాలు నిండటం : ఊపిరితిత్తుల పొరలైన ప్లూరాకూ, ఛాతీ లోపలి పొరకూ మధ్య ఒక్కోసారి ద్రవాలు నిండవచ్చు. ఈ కండిషన్ ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు. నిమోనియా వల్ల ఇలా ద్రవాలు నిండితే... ఒక్కోసారి ఛాతీలో ట్యూబ్ వేసిగానీ లేదా చిన్న శస్త్రచికిత్స ద్వారాగాని ఆ ద్రవాలను తొలగించాల్సి వస్తుంది.
ఆబ్సెస్ : నిమోనియాతో ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రాంతంలో చీము నిండటాన్ని యాబ్సెస్ అంటారు. ఈ పరిస్థితి తలెత్తినప్పుడు సాధారణంగా యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేస్తారు. అయితే చీమును తొలగించడానికి అరుదుగా సర్జరీ కూడా అవసరం కావచ్చు.
బ్యాక్టీరిమియా : ఒక్కోసారి ఊపిరితిత్తులకు సోకిన నిమోనియా వాటికే పరిమితం కాకుండా రక్తప్రవాహానికీ వ్యాపించవచ్చు. ఇలా వ్యాపించడం అన్నది చాలా తీవ్రమైన పరిస్థితి. ఎందుకంటే ఒకసారి రక్తప్రవాహానికి విస్తరించాక ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించడంతో పాటు అన్ని అవయవాలకూ విస్తరిస్తుంది. ఈ కండిషన్‌ను బ్యాక్టీరిమియా అంటారు. ఇది ఒక్కోసారి రోగి తాలూకు రక్తపోటును గణనీయంగా పడిపోయేలా చేస్తుంది.సాధారణంగా నిమోనియా వచ్చిన రోగుల్లో కోలుకోడానికి ఉండే అవకాశాలే చాలా ఎక్కువ. కానీ చాలా అరుదైన సందర్భాల్లో మాత్రం కేవలం 5 నుంచి 10 శాతం కేసుల్లో మాత్రమే ఒక్కోసారి పరిస్థితి విషమించిపోయే పరిస్థితికి దారితీయవచ్చు.
నిమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నవారు
సాధారణంగా కొందరిలో నిమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువ. వారినే హై-రిస్క్ గ్రూప్ గా అభివర్ణిస్తారు. వారు ఎవరంటే... 65 ఏళ్లు పైబడినవారు పొగతాగే అలవాటు ఉన్నవారు ఆరోగ్యకారణాల వల్లగానీ లేదా ఇతరపరిస్థితుల వల్లగాని తగినంత పోషకాహారం తీసుకోనివారు ఏదైనా ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు (అంటే... సిస్టిక్ ఫైబ్రోసిస్, ఆస్తమా లేదా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్, ఎంఫసిమా వంటివి) డయాబెటిస్ లేదా గుండెజబ్బుల వంటి ఇతర వ్యాధులు ఉన్నవారు హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ వల్లగానీ లేదా అవయవమార్పిడి చికిత్స వల్లగాని, కీమోథెరపీతోగాని లేదా దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్ వాడుతుండటం వల్ల స్వతహాగా ఉండే వ్యాధినిరోధకశక్తి లోపించిన వారు ఆల్కహాల్ లేదా డ్రగ్స్ తీసుకోవడం వల్ల సమర్థంగా దగ్గలేనివారు శ్వాసకోశవ్యవస్థలో పైభాగానికి ఇన్ఫ్లుయెంజా వంటి ఇన్ఫెక్షన్ సోకిన వారు.
వ్యాధి నిర్ధారణ
రోగి చెప్పిన లక్షణాలను బట్టి, రోగిని పరీక్షించడం ద్వారా నిమోనియా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. దాంతోపాటు ఎక్స్‌రే, కళ్లె పరీక్ష, కొన్ని సందర్భాల్లో యూరిన్ యాంటిజెన్ పరీక్ష, రక్త పరీక్ష వంటివి వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. ఇక రక్తంలో ఆక్సిజన్ పాళ్లను పరీక్షిస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి నిమోనియా వల్ల రక్తంలోని ఆక్సిజన్ పాళ్లు తగ్గే అవకాశం ఉంది. తీవ్రమైన నిమోనియాతో ఆసుపత్రిలో చేరిన రోగులకు యాంటీబయాటిక్ చికిత్స తర్వాత కూడా మెరుగుదల కనిపించని సందర్భాల్లోనూ లేదా చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితి నిలకడగా లేక దిగజారుతున్న సందర్భాల్లోనూ బ్రాంకోస్కోపీ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ఎటుపడితే అటు తేలిగ్గా ఒంగే ఒక గొట్టానికి కెమెరాను అమర్చి ట్రాకియా, బ్రాంకైలలోని లోపలి దృశ్యాలను పరిశీలించడంతో పాటు అక్కడి ద్రవాల నమూనాలను సేకరించడం, అవసరాన్ని బట్టి చిన్న ముక్కను సేకరించి బయాప్సీ పరీక్షకు పంపడం వంటివి చేస్తారు.
నివారణ
నిమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా నిమోనియాను చాలా ప్రభావపూర్వకంగా నివారించవచ్చు.పొగతాగే అలవాటు ఉన్నవారు దాన్ని పూర్తిగా మానేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తాము నివసించే ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవడం, చేతులను నిత్యం సబ్బుద్వారాగాని లేదా ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ వాష్‌ల సహాయంతోగాని శుభ్రపరచుకోవడం వంటి జాగ్రత్తల ద్వారా దీన్ని నివారించవచ్చు. రోగి తుమ్మినప్పుడు చేతి రుమాలు అడ్డుపెట్టుకోవడమో, పొడవు చేతుల చొక్కా ఉంటే చేతి మడతలో తుమ్మడమో చేయాలి.
చికిత్స
సాధారణంగా ఇరుకు ప్రదేశాల్లో గుంపులుగా ఉండటం వల్ల వచ్చే కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా ఇన్ఫెక్షన్కు చికిత్సతో పాటు నిమోనియా వల్ల వచ్చే ఇతర కాంప్లికేషన్లకూ చికిత్స చేస్తారు. నిమోనియా కేసుల్లో తొలుత దానికి కారణమైన అంశాలను కనుగొని దానికి అనుగుణంగా చికిత్స అందిస్తారు. సాధారణంగా నిమోనియా రోగుల్లో అత్యధికులకు నోటిద్వారా యాంటీబయాటిక్స్ ఇస్తారు. అయితే నిమోనియా తీవ్రత ఎక్కువగా ఉంటే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో నిమోనియా రోగులకు నిత్యం గుండె స్పందన రేటు, శ్వాసించే తీరు, రక్తంలో ఆక్సిజన్ పాళ్లు వంటి అంశాలను నిత్యం పర్యవేక్షిస్తూ చికిత్స చేయాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో చేర్చిన రోగులకు రక్తనాళం (ఐవీ) ద్వారా యాంటీబయాటిక్స్‌ను అందిస్తారు. రోగికి ఉన్న ఇతర వ్యాధులు, అతడు చికిత్సకు స్పందిస్తున్న తీరును బట్టి ఎంతకాలం ఆసుపత్రిలో ఉండాలన్నది నిర్ణయిస్తారు. అప్పటికే ఊపిరితిత్తులకు ఏదైనా వ్యాధి ఉన్నవారు, ఊపిరితిత్తులలో ఒకదాని కంటే ఎక్కువ తమ్మెల (లోబ్స్)లో వ్యాధి ఉండే వాళ్లు కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. రోగికి ఎలాంటి యాంటీబయాటిక్ వాడాలన్నది... రోగికి సంక్రమించిన సూక్ష్మజీవి ఎలాంటిదన్న అంశంతో పాటు... ఆ మందుకు అతడు ఎలా స్పందిస్తున్నాడనేలాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే... ఏదైనా వ్యాధి వల్ల అప్పటికే రోగి ఇతర యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటే ఆ తరహా యాంటీబయాటిక్స్‌కు ఆ క్రిములు నిరోధకత పెంచుకొని ఉండవచ్చు. అందుకే చికిత్స ప్రక్రియలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
కారణాలు
సాధారణంగా అనేక రకాల బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మక్రిముల వల్ల నిమోనియా సోకవచ్చు. అయితే ఫంగస్‌తో వచ్చే అవకాశాలు ఒకింత తక్కువ. ఏదైనా ఇతర వ్యాధులు లేదా హెచ్ఐవీ వంటి ఇన్ఫెక్షన్ల కారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండేవారిలో ఇది ఫంగై కారణంగా రావచ్చు. ఇక మైకోప్లాస్మా అని పిలిచే మరికొన్ని సూక్ష్మక్రిముల వల్ల కూడా నిమోనియా రావచ్చు. కానీ ఇది అంత తీవ్రమైనది కాదు. అయితే ఒక్కోసారి ఇది కూడా తీవ్రమైన పరిస్థితికి దారితీయవచ్చు. నిమోకాకస్ అనే బ్యాక్టీరియా వల్ల ఇది సోకుతుంది. అలాగే ఇరుకుగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువ మంది గుంపులుగా నివసించాల్సిన పరిస్థితుల్లోని 20 శాతం కేసుల్లో కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా (సీఏపీ) అనే ఈ వ్యాధి చాలా సాధారణంగా కనిపిస్తుంటుంది.
లక్షణాలు
జ్వరం చలిగా అనిపించడం ఊపిరి సరిగా అందకపోవడం శ్వాస తీసుకునే సమయంలో ఒక్కోసారి నొప్పి చాలా వేగంగా శ్వాసతీసుకోవడం గుండెవేగం పెరగడం వికారం వాంతులు దగ్గు ఒక్కోసారి దగ్గుతున్నప్పుడు ఆకుపచ్చ లేదా పసుపు రంగులో కళ్లె పడటం కొన్ని సందర్భాల్లో కళ్లె తుప్పు రంగులో కనిపించడం అయోమయానికి గురికావడం, ఆలోచనల్లో స్పష్టతలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
డా. టి. అనూరాధ,
పల్మొనాలజిస్ట్,
స్టార్ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్