చలనం ఉండాలి; మనకు చలనం అన్నది కావాలి. చలనంతో మనం సాగుతూ ఉండాలి. మనలోని రక్తంలో చలనం లేకపోతే మనం ఉండం. మన రక్తంలో ఉన్న చలనం మన తీరులోనూ ఉండాలి. చలనం లేకుండా ఆగిపోయిన నీరు బురద అయిపోతుంది. చలనం లేకపోతే ఎవరి జీవనం అయినా ఎందుకూ పనికి రాకుండా పోవడమే కాదు హానికరం అయిపోతుంది కూడా.
చలనం పరంగా ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు మనకు తొలిపాఠాలు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల చలనం లేకపోతే మనం మనకే చెందం కదా? శ్వాసకు చలనం ఉండడంవల్లే మనం బతుకుతూ ఉన్నాం; మనకు ఉన్నవి ఉండడానికి కారణం శ్వాసకు చలనం ఉండడమే. మనం చలనంతో ఉండాలి అన్న ఆలోచన శ్వాసలాగా మనకు ఎప్పుడూ ఉంటూనే ఉండాలి.
మనిషికి ప్రధానమైన వ్యాధి స్తబ్దత. ఈ స్తబ్దతకు వైద్యం, విరుగుడు చలనం. అడుగు వేస్తే పడిపోతాం అనుకుని స్తబ్దతలో ఉండిపోవడం సరికాదు. భద్రత కోసం అనో, జరిగిపోతోంది కదా అనో స్తబ్దతలో, స్తబ్దతతో ఉండిపోవడం పెనుదోషం. ఆ దోషం ముదిరితే అది పాపంగా కూడా పరిణమిస్తుంది.
‘జీవితం వెనక్కు వెళ్లదు; అది నిన్నటితో ఉండిపోదు’ అని కవి–తాత్త్వికుడు ఖలీల్ జిబ్రాన్ ఒక సందర్భంలో అంటారు. చలనం అన్నది ఉంటుంది, ఉండాలి కాబట్టి ఆయన అలా అన్నారు. చలనం లేకుండా స్తబ్దతలో ఉండిపోతే జీవితం వెనక్కు, ఆ వెనక్కు పడిపోతుంది, జీవితం నిన్నటితో ఉండిపోవడం కాదు మొన్నటికీ, అటు మొన్నటికీ జారిపోతుంది.
జీవితం నుంచి జీవనం జారిపోకూడదు; జీవనానికి జీవితం లేకుండా పోకూడదు. అందుకు స్తబ్దత కాదు చలనం కావాలి; చలనం ఉండాలి. సేద తీరచ్చు కానీ స్తబ్దతలో ఉండిపోకూడదు. అలిసిపోవడం సహజమైందే కానీ బిగుసుకుపోవడం అసహజమైంది. స్తబ్దతకు మలిదశ బిగుసుకుపోవడం. స్తబ్దత, బిగుసుకుపోవడం మనుగడలో ఉన్న మనిషి లక్షణాలు కావు, కాకూడదు.
మరణించిన వ్యక్తి లక్షణాలు స్తబ్దత, బిగుసుకుపోవడం. మరణించాక తప్పనిసరిగా వచ్చేవి అవి. కాబట్టి మరణం రానంత వరకూ అవి మన దగ్గరకు రాకూడదు. మనుగడ ఉన్నంతవరకూ మనం వాటిని రానివ్వకూడదు. స్తబ్దత కారణంగా మనుగడలో ఉన్న మనం మరణించిన వ్యక్తులంలాగా మారిపోకూడదు. మరణించాక కూడా జీవించి ఉండేందుకు మనం చలనాన్ని ఒంటపట్టించుకోవాలి.
మెరుపు మెరుపయింది చలనం వల్లే. గాలికి చలనం లేకపోతే మన పరిస్థితి ఏమిటి? మేఘాలకు, భూమికి చలనం అన్నది లేకపోతే మనకు ఉండేది ఏమిటి? మనకు మనగడే ఉండదు. చలనం అన్నది లేకపోతే మనం ప్రపంచానికి ఉండం; మనకు ప్రపంచం ఉండదు. చలనం లేకపోతే గమనం ఉంటుందా? ఉండదు. జీవనం అంటేనే గమనం. గమనానికి ఆరంభం చలనం. గమనానికి మాత్రమే కాదు ఏ గమ్యానికైనా తొలిచుక్క చలనమే.
జీవితానికి జీవనం ఉన్నప్పుడు జీవనానికి చలనం ఉండాలి. స్తబ్దతలో మనల్ని మనం మోసుకుంటూ ఉండిపోవడం జీవనం కాదు; స్తబ్దతతో మనం మనకే బరువైపోవడం జీవితం కాదు. చలనం ఇంధనం కాగా జీవితం పండాలి. జీవితానికి జ్వలనం కావాలంటే జీవనానికి చలనం కావాలి.
నది నది అయ్యేది చలనం వల్లే. చలనమే లేకపోతే నది అన్నదే లేదు; నది లేకపోతే జరగాల్సిన మేలు జరగదు. చలనం వల్ల ఏం మేలు జరుగుతుందో, ఎంత మేలు జరుగుతుందో నది మనకు తెలియజెబుతునే ఉంది. నదిని మనం స్ఫుర్తిగానూ, ఆదర్శంగానూ తీసుకోవాలి. మనం చలనంతో నదిలాగా బతకాలి; బతుకే గెలుపై మనం మునుముందుకు నడుస్తూ ఉండాలి.
జీవనం అంటేనే గమనం.
గమనానికి ఆరంభం చలనం. గమనానికి మాత్రమే కాదు ఏ గమ్యానికైనా తొలిచుక్క చలనమే.
– రోచిష్మాన్
జీవన చలనం
Published Mon, Apr 24 2023 5:33 AM | Last Updated on Mon, Apr 24 2023 5:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment