rochishman
-
మనిషి... మనుగడ
మనుగడ అనేది ప్రతి మనిషికీ ఉంటుంది. మనిషికి మాత్రమే మనుగడ ఉంటుందా? ప్రతి జీవికీ మనుగడ ఉంటుంది. ఏ జీవి మనుగడ దానిదే. కొన్ని జంతువుల మనుగడ మనిషికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి మనిషి మనుగడా తనకు, సమాజానికి ప్రయోజనకరంగానే ఉండాలి; ప్రయోజనకరంగా ఉండేందుకు మనిషి తన మనుగడను ఒక అవకాశంగా తీసుకుని, చేసుకుని ప్రయత్నించాలి. మనుగడ ప్రయోజనకరంగా పరిణమించడానికి ఏ మనిషికి ఐనా మెదడు, మనసు ఈ రెండూ కీలకం ఐనవి. మనసు తిన్ననైంది కాకపోవడం మాత్రమే మనిషికి లోటు కాదు; మెదడు సరిగ్గా పనిచెయ్యక పోవడం మాత్రమే మనిషికి లోటు కాదు. మెదడుకు మనసు లేకపోవడమే, మనసుకు మెదడు లేకపోవడమే మనిషికి లోతైన లోటు! మెదడుకు మనసు ఉండాలి; మనసుకు మెదడు ఉండాలి. మెదడు, మనసు కలిసి ఉద్యుక్తం ఐతే, ఉన్ముఖం ఐతే, ఉద్యమిస్తే ఉన్నతం ఐన ఫలితం వస్తుంది. మనుగడ ఉచ్చస్థితికి చేరుతుంది. సగటు మనిషి తన చేతిలోనే తాను ఓడిపోతూ ఉంటాడు; తన ప్రవర్తనవల్ల తాను సరిగ్గా ఉండడం జరగదు సగటు మనిషికి; చేసిన లేదా జరిగిన తప్పులు దిద్దుకోబడడం ఉండదు చాలమంది విషయంలో; చెడిపోవడం అన్నది చెరిగిపోవడం జరగడం లేదు పలువురిలో. వీటికి కారణం మెదడుకు మనసు లేకపోవడమే; మనసుకు మెదడు లేకపోవడమే. మనిషి మెదడు, మనసు ఎప్పుడూ ఖాళీగా ఉండవు. ఏవేవో, ఎన్నెన్నో వాటిలో ఉంటూ ఉంటాయి. అవసరం ఐనవి తక్కువగా, ఎక్కువగా అనవసరం ఐనవి మెదడు, మనసుల్లో ఉండి మనిషి మనుగడ మందమైపోవడానికి, మొద్దుబారిపోవడానికి కారణాలు ఔతూ ఉంటాయి. మెదడు, మనసుల పనితీరువల్లే మనిషికి మేలు, కీడులు కలుగుతూ ఉంటాయి; మనిషిని పనికి వచ్చేట్టుగానూ, పనికిరానట్టుగానూ చేసేవి మెదడు, మనసులే. మెదడుకు మనసును, మనసుకు మెదడును నేర్పుతో అనుసంధానం చేసుకోవడమూ, ఆ అనుసంధానంతో దైనందిన జీవనాన్ని ఎదుర్కోవడమూ తెలిసిన మనిషికి అభివృద్ధి అలవడుతుంది. మనిషి అభివృద్ధిని అలవాటు చేసుకోవాలి; మనిషికి అభివృద్ధిలో అభినివేశం ఉండి తీరాలి. అభివృద్ధిలేని మనిషి అక్కరకురాని మనిషి ఔతాడు ఆపై అక్కర్లేని మనిషి ఔతాడు. మనిషి మనుగడ అనవసరం ఐంది, పనికిరాంది కాకూడదు; మనిషి మనుగడ వెలవెలపోకూడదు. మనిషి మనుగడ విలువైంది కావాలి. మనిషి తన మనుగడకు తానే విలువను, వన్నెను సమకూర్చుకోవాలి. మెదడు, మనసుల్ని సంయుక్తంగా సంప్రయోగించి మనిషి తన మనుగడను విజయవంతంగా నడుపుకోవాలి. ‘తిండిని వెతుక్కుంటూ రోజూ తిని/ ఏవేవో అల్పమైన కథలు చెప్పుకుని/ మనసు ఒడిలి బాధల్ని అనుభవించి/ ఇతరుల్ని బాధించేవెన్నో చేసి/ తల నెఱుపు వచ్చి ముసలితనాన్ని పొంది/ ఘోరమైన మరణానికి బలై / మాసిపోయే పలు విదూషకుల్లా నేను కూలిపోతాననుకున్నావా?’ అని, అని తమిళ్ కవి సుబ్రమణియ బారతి పేలవంగా ఉండడాన్ని తిరస్కరించారు. కూలిపోయేందుకు కాకుండా, విదూషకత్వంతో కాకుండా, మాసిపోయేందుకు కాకుండా, ఇతరుల్ని బాధించేందుకు కాకుండా, బాధల్ని అనుభవిస్తూ ఉండేందుకు కాకుండా, అల్పుడుగా కాకుండా, ఏదో తింటూ కాలం గడిపేందుకు కాకుండా మిన్నగా మసలేందుకు, మిన్నులా ఎత్తుల్లో నిలిచేందుకు మెదడుతో మనసును, మనసుతో మెదడును సంయుక్తం చేసుకుని మనిషి కార్యాచరణకు పూనుకోవాలి. మనిషి మనుగడ ప్రయోజనకరంగా ఎందుకు ఫలించకూడదు? మనిషి తన మనుగడను పట్టుదలతో ప్రయోజనకరం చేసుకోవాలి. మెదడు, మనసుల సమన్వయంతో, సంయోగంతో మనిషి సంపూర్ణంగా సఫలం అవాలి. మనిషి తన మనుగడకు సత్ప్రయోజనాన్ని సాధించుకోవాలి; సమాజానికీ సాధ్యం ఐనంత ప్రయోజనకరంగా మనిషి మెదులుతూ ఉండాలి. మనిషికి మెదడు, మనసు ఉంటాయి. అవి సరిగ్గా, మెరుగ్గా ఉంటే మనిషి సరిగ్గా, మెరుగ్గా ఉంటాడు; అవి మేలుగా ఉంటే మనిషి మేలుగా ఉంటాడు. మెదడు, మనసు రెండూ కలిసి జతగా పనిచేస్తూ ఉంటేనే మనిషి గొప్ప స్థితిని, స్థాయిని, గతిని ఆపై ప్రగతిని పొందుతూ ఉంటాడు. – రోచిష్మాన్ -
Inspiration is freedom: స్ఫూర్తిదాయకం స్వాతంత్య్రం
ఏ దేశానికైనా ప్రధానంగా ఉండాల్సింది స్వాతంత్య్రం. ప్రపంచంలో పలుదేశాలు ఏదో సందర్భంలో ఇతర దేశాల పాలనకు లోబడి అటుపైన స్వాతంత్య్రాన్ని సాధించు కున్నవే. స్వాతంత్య్రాన్ని సాధించుకున్న దినాన్ని ఉత్సవ దినంగా ప్రతి దేశమూ జరుపుకుంటూ ఉంటుంది. స్వాతంత్య్ర దినోత్సవం ప్రతి దేశానికి స్ఫూర్తిదాయకమే. ‘దేశానికి రూపకల్పన చేసేది ఏది? ఎత్తైన నిర్మాణాలు, భవనాల గోపురాలతో ఉండే గొప్ప నగరాలు కాదు; విశాలమైన ఓడరేవులు కాదు, కాదు; మనుషులు, గొప్ప మనుషులు’ అని ఒక గ్రీక్ చాటువును ఆధారంగా తీసుకుని ఇంగ్లిష్ కవి విలిఅమ్ జోన్స్ చెప్పారు. ఆ మాటల్ని తీసుకుని గురజాడ అప్పారావు ‘దేశమంటే మట్టికాదోయ్ /దేశమంటే మనుషులోయ్’ అని చెప్పారు. ఔను, దేశం అంటే మనుషులే. ‘నువ్వు నీ దేశాన్ని ప్రేమించు’ అని ఇంగ్లిష్ కవి ఆల్ఫెడ్ టెన్నిసన్ అన్నారు. ఆ మాటల్ని తీసుకునే గురజాడ అప్పారావు ‘దేశమును ప్రేమించుమన్నా‘ అని అన్నారు. దేశాన్ని ప్రేమించడం దేశ ప్రజల్ని ప్రేమించడం ఔతుంది; దేశప్రజల్ని ప్రేమించడం దేశాన్ని ప్రేమించడం ఔతుంది. దేశాన్ని ప్రేమించలేనివాళ్లు దేశ పౌరులుగా ఉండేందుకు ఎంతమాత్రమూ అర్హులు అవరు; వాళ్లు దేశానికి హానికరం ఔతారు. ‘నితాంత స్వాతంత్య్రమ్ము వెల్లి విరియు స్వర్గాన/నా మాతృదేశమును మేలుకొన నిమ్ము ప్రభూ’ ఈ మాటల్లో పలికిన రవీంద్రనాథ్ ఠాగూర్ భావం మాతృదేశం, దేశ స్వాతంత్య్రం ఆవశ్యకత నూ, ప్రాముఖ్యతనూ ఘోషిస్తూ ఉంది. విదేశీ ఆక్రమణ దారుల క్రూరమైన, భయానకమైన పాలనలో పెనుబాధను అనుభవించి, లెక్కలేనంత సంపదను కోల్పోయి, ఎన్నిటినో వదులుకున్న మనదేశం వందల సంవత్సరాల పరపీడన నుండి విముక్తమై 75 యేళ్లుగా స్వాతంత్య్రాన్ని శ్వాసిస్తోంది. మనం ఇవాళ స్వతంత్ర దేశంలో ఉన్నాం; మన దేశంలో మనం మనదేశ పౌరులుగా ఉన్నాం. ఈ దేశం మనది; ఈ మనదేశం మన సంతతికి పదిలంగా అందాలి. ఈ చింతన మనల్ని నడిపించే ఆశయమై మనలో, మనతో సర్వదా, సర్వథా ఉండాలి. ‘నువ్వు, నీ దేశం నీకు ఏం చేస్తుంది అని అడిగే రాజకీయవాదివా? లేకపోతే నువ్వు, నీ దేశానికి ఏం చెయ్యగలను అని ఆడిగే పట్టుదల ఉన్నవాడివా? మొదటి ప్రశ్న అడిగేవాడివి ఐతే నువ్వు పరాన్నజీవివైన పురుగువి, రెండవ ప్రశ్న అడిగేవాడివి ఐతే నువ్వు ఎడారిలో ఉద్యానవనంవి’ అని ఖలీల్ జిబ్రాన్ మాటలు మన మెదళ్లను కదిలించాలి; మనదేశానికి మనం ఉద్యానవనాలం అవ్వాలి. ‘జంబూద్వీపే వైవస్వత మన్వంతరే భరతఖండే... ‘ఇలా ఆలయాల్లో సంకల్పం చెప్పడం మనకు తెలిసిందే. ఈ సంకల్పం చెప్పడం కాశ్మీర్ నుండీ కన్యాకుమారి వరకూ ఉండే ఆలయాల్లో ఉంది. ఇప్పటి పాకిస్తాన్ ప్రాంతంలోనూ, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలోనూ ఉండే ఆలయాల్లోనూ ఉండేది. దీని ద్వారా భరతఖండం సాంస్కృతికంగా ఒకటే అన్న సత్యం విశదం ఔతోంది. 2,000 ఏళ్లకు పూర్వందైన తమిళ్ సాహిత్యం పుఱనానూఱులో ఉత్తరాన హిమాలయాల నుండీ దక్షిణాన కన్యాకుమారి వరకు ఉన్న దేశం ఇది అని చెప్పబడింది. దీని ద్వారా ఎప్పటి నుండో భారతం భౌగోళికంగా ఒకటే అన్న సత్యం అవగతం ఔతోంది. 2,300 యేళ్ల క్రితంనాటి గ్రీక్ చరిత్రకారుడు మెగస్తనీస్ హిమాలయం నుండీ దక్షిణాన కడలి వరకు ‘ఇండికా’ అని గుర్తించాడు. అవగాహనారాహిత్యంతో కొందరు మనదేశం అసలు ఒక దేశమే కాదని, మరొకటని మనలో దేశవ్యతిరేక భావ అనలాన్ని రగిలిస్తూ ఉంటారు. ఆ అనలాన్ని చదువుతోనూ, విజ్ఞతతోనూ మనం ఆర్పేసుకోవాలి. ‘నా తల్లీ, తండ్రీ సంతోషంగా ఉన్నది ఈ దేశంలోనే’ అనీ, ‘తియ్యనైన ఊపిరినిచ్చి కని, పెంచి అనుగ్రహించింది ఈ దేశమే’ అని అన్నారు తమిళ్ మహాకవి సుబ్రమణియ బారతి. ఆయన జాతీయతా సమైక్యతను కాంక్షిస్తూ ‘కాశి నగర పండితుల ప్రసంగాన్ని కంచిలో వినడానికి ఒక పరికరాన్ని చేద్దాం’ అనీ అన్నారు. జాతీయతా సమైక్యత ఆపై సమగ్రత దేశానికి ముమ్మాటికీ ముఖ్యం. ‘వందేమాతరం జయ వందేమాతరం; ఆర్యభూమిలో నారీమణులూ, నరసూర్యులూ చేసే వీరనినాదం వందేమాతరం’ అనీ, ‘వందేమాతరం అందాం; మా దేశమాతను పూజిస్తాం అందాం’ అనీ నినదించారు సుబ్రమణియ బారతి. మనదేశాన్ని ప్రేమిస్తూ ఉందాం, మనదేశాన్ని పూజిస్తూ ఉందాం, మనం దేశభక్తులుగా మసలుతూ ఉందాం. దేశభక్తితో, భారతీయతతో బతుకుతూ ఉందాం. భారతీయులమై మనసారా, నోరారా అందాం, అంటూ ఉందాం ‘వందేమాతరం’. ‘దేశవాసులు అందరికీ జాతీయతా భావం ఉండాలి. జాతీయతా భావం లేకపోవడం క్షంతవ్యం కాదు. జాతీయతా వ్యతిరేకత, దేశ వ్యతిరేకత అనేవి భయంకరమైన మానసికవ్యాధులు. అవి ఉండకూడదు. జాతీయత–దేశ విద్వేషవాదం నుండి మనల్ని, మనదేశాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి’ ‘భారత(ప్ర)దేశం... ‘భా’ అంటే ‘కాంతి’ లేదా ‘ప్రకాశం’ అనీ, ‘రత’ అంటే అంకితమైన, అసక్తి కల అనీ అర్థాలు. భగవంతుడు కాంతిరూపుడు. ‘భారతం’ అంటే ‘భగవంతుడికి అంకితమైంది’ లేదా ‘భగవంతుడిపై ఆసక్తి కలది’ అని అర్థం. ఈ అర్థాన్ని మనం ఆకళింపు చేసుకుందాం‘ – రోచిష్మాన్ -
పథం దృక్పథం
దృక్పథం... ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా ఉండేది దృక్పథం. మనస్థితి, పరిస్థితి వీటిని బట్టి ఎవరికైనా దృక్పథం అన్నది ఉంటూనే ఉంటుంది. దృక్పథం ఉండని మనిషి ఉండడు. మనిషి అన్నాక దృక్పథం ఉండకుండా ఉండదు. దృక్పథం మనిషి మనుగడ స్థాయిని, తీరును, నిర్ణయిస్తుంది. దృక్పథం మనిషి ప్రగతికి, పతనానికి మూలం ఔతుంది. సరైన దృక్పథం లేకపోతే మనుగడ సరిగ్గా లేనట్టే; మేలైన దృక్పథం ఉంటే మనుగడ మేలుగా ఉన్నట్టే. చంద్రుడిపై కాలు మోపిన తొలి మనిషి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అన్నది మనకు తెలిసిందే. కానీ ప్రణాళిక ప్రకారం ఎడ్విన్ ఆల్డ్రిన్ ముందుగా చంద్రుడిపై దిగాలి. ఆల్డ్రిన్ చంద్రుడిపై కాలు పెట్టబోయే తొలి మానవుడుగా నిర్ణయం అయిపోయింది. అయితే చంద్రుడిపై రాకెట్ దిగి తలుపులు తెరుచుకున్నాక ఆల్డ్రిన్ కదల్లేదు. అతడికి దిగమని ఆదేశాలు అందినా అతడు కదల్లేదు. ముందుగా చంద్రుడిపై దిగితే తనకు ఏం జరుగుతుందో అన్న దృక్పథం ఎడ్విన్ ఆల్డ్రి¯Œ ను కదలనివ్వలేదు. ఆల్డ్రిన్ కదలకపోవడంతో ఆర్మ్‌స్ట్రాంగ్‌కు దిగమని ఆదేశాలు అందాయి. ఏమైనా పరవాలేదు అన్న దృక్పథంతో ఆర్మ్‌స్ట్రాంగ్ రాకెట్ నుంచి చంద్రుడిపై దిగాడు; చంద్రుడిపై కాలు మోపిన తొలి మానవుడుగా చరిత్రలో నమోదు అయ్యాడు. ఆల్డ్రిన్ ఆ అవకాశాన్ని తన దృక్పథం కారణంగా జారవిడుచుకున్నాడు; చారిత్రిక ప్రాశస్త్యాన్ని కోల్పోయాడు. ‘మనం మన దృక్పథానికి అంటిపెట్టుకుని ఉంటాం అన్నీ దాని ఆధారంగానే ఉంటాయి అని. అయినా మన అభిప్రాయాలకు శాశ్వతత్వం లేదు. వసంతం, హేమంతాలలాగా అవి తొలగిపోతూంటాయి’ ఆని ప్రఖ్యాత చైనీస్ తత్త్వవేత్త జువాంగ్ చి ఒక సందర్భంలో అన్నారు. తన దృక్పథం సరైంది అనుకుంటూ దాన్నే అంటిపెట్టుకుని ఉండడం మనిషి బలహీనతల్లో బలమైంది. దృఢమైన దృక్పథం అన్నది మనిషికి బరువైన అవరోధం ఔతుంది. కదలని నీరు కాలక్రమంలో బురద అయిపోయినట్టుగా మారని దృక్పథం మనిషిని పాడుచేస్తుంది. మనిషి తన దృక్పథాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. పరిణామాలను బట్టి దృక్పథం ఉండాలి. దృక్పథం ప్రయోజనాల్ని సాధించగలిగేదై ఉండాలి. కొందరు నేతల దృక్పథ దోషాలవల్ల ప్రపంచానికి ఎంతో హాని జరిగింది, జరుగుతోంది. ఇవాళ్టి రోజున రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఉక్రెయి¯Œ పై రష్యా దృక్పథం, రష్యాపై ఉక్రెయిన్ దృక్పథం వల్లే యుద్ధం సాగుతూ పెనువినాశనం జరుగుతోంది. ఆ దృక్పథ వైరుద్ధ్యం పలు ఇతర దేశాల్ని అవాంఛనీయ పర్యవసానానికి గురిచేస్తోంది. ఈ దుస్థితి తొలగిపోవాలంటే ఇంకా విధ్వంసం జరగకుండా ఉండాలంటే ఆ ఇరుదేశాల దృక్పథాలూ మారాలి. వ్యక్తిపరంగానూ, సామాజికంగానూ, సాంస్కృతికంగానూ, కళల పరంగానూ, భాషపరంగానూ దృక్పథం తిన్నగా ఉండడమే కావల్సింది. దృక్పథం తిన్నగా ఉండకపోవడం నష్టాన్ని, నాశనాన్ని కలిగిస్తుంది. కొన్ని దశాబ్దుల క్రితం మెరుగైన దృక్పథం లోపించడంవల్ల ఇవాళ తెలుగు భాష, తెలుగు కవిత్వం వైభవాన్ని కోల్పోవడం కాదు వికృతం అయిపోయిన వైనాన్ని అందుకు ఉదాహరణగా మనం చూడచ్చు. పలువురు తమ దృక్పథాల్ని మార్చుకోలేక తాము పతనమైపోవడమే కాకుండా తమ కుటుంబాలకు తీక్షణమెన హాని చేస్తున్నారు. దృక్పథ వక్రత అన్న దానివల్ల సమాజానికి తీవ్రమైన చేటు కలుగుతోంది. దృక్పథం అన్నది మనిషి మనుగడలో ప్రముఖమైంది ఆపై ప్రధానమైంది. ప్రతిమనిషికి దృక్పథం అన్నది ప్రత్యగ్రంగా ఉండాలి. మనిషికి దృక్పథం భవ్యంగా ఆపై సవ్యంగా ఉంటే సత్పథం అమరుతుంది. సత్పథం అమరితే మనుగడ ఉన్నతంగా ఆపై ఉజ్జ్వలంగా ఉంటుంది. కనుక మనిషి తన దృక్పథాన్ని సరిచూసుకుంటూ ఆపై సరిచేసుకుంటూ మనుగడకు మహత్తును సాధించుకోవాలి. ‘దృక్పథం మనిషిని ఎత్తులకు తీసుకు వెళుతుంది. దృక్పథం మనిషిని చిత్తు చేస్తుంది. దృక్పథం ఎత్తుల్లో ఉన్న వ్యక్తిని చిత్తు అయేట్టు చేస్తుంది. దృక్పథం చిత్తు అయిన వ్యక్తిని ఎత్తులకు చేరుస్తుంది. ఎత్తులకు చేరుకోవడానికైనా, చిత్తు అయిపోవడానికి అయినా దృక్పథం కీలకం’ – రోచిష్మాన్ -
గెలుపు.. గమనం.. మలుపు
గెలవాలి అని మనం దృఢంగా నిర్ణయించుకోవాలి; మనం మనస్పూర్తిగా గెలుపును కోరుకోవాలి; మనం గెలిచేందుకు త్రికరణ శుద్ధిగా పూనుకోవాలి; మనం గెలవాలి. మనకు మనుగడ ఉంది అని అంటే అది గెలుస్తూ ఉండేందుకే అని తెలుసుకోవాలి. ఎన్ని అవరోధాలు ఉన్నా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎంత వ్యతిరేకత పైనపడినా మనం గెలవాలి అని నిలవాలి; మనం గెలుస్తూ మెరుస్తూ ఉండాలి. ‘యమే వైష వృణుతే తేన లభ్యస్తైష ఆత్మా వివృణుతే తనూమ్ స్వామ్’ అని కఠోపనిషత్ చెబుతోంది. అంటే అతడి చేత ఏదైతే కోరుకోబడి అడగబడిందో దానివల్ల అతడు పొందబడతాడు; అతడికి ఆ ఆత్మ తన సహజ ప్రకృతిని తెరుస్తుంది అని అర్థం. ఈ సత్యాన్నే తెలియజేస్తూ ‘అడుగుడీ మీకియ్యబడును; వెదకుడీ మీకు దొరకును; తట్టుడీ మీకు తియ్యబడును’ అని చెప్పింది మత్తయి సువార్త. మనం గెలుపును కోరుకుని ప్రయత్నిస్తే మనకు గెలుపు తన తలుపును తెరుస్తుంది. మనం గెలుపును పొందాలనుకుని ఉద్యుక్తులం ఐతే మనం గెలుపు చేత పొందబడతాం. మనం ఉన్న ఈ ప్రపంచం ఒక పద్మవ్యూహం. కానీ మనలో ఎవరూ అభిమన్యుడు కారాదు. ప్రతివ్యక్తీ అర్జునుడే అవాలి; అర్జునుడి తీరే మనకు ఆదర్శం కావాలి; మనకు మార్గదర్శకం కావాలి. తాను ఏ స్థితిలో ఉన్నా, శాపవశాత్తు తన స్థితే మారి తాను పేడిగా మారిపోయినా అర్జునుడు గెలుపునే కోరుకుని, గెలిచేందుకు పూనుకుని గెలుపు తలుపును తట్టాడు. గెలుపు తలుపు తెరుచుకోబడి ఆ గెలుపుచేత పొందబడ్డాడు; అర్జునుడు విజయుడుగా పేరుపొందాడు. గెలుపు అనేది లక్ష్యమా? కాదు, కాదు. గెలుపు లక్ష్యంగా కాదు మనకు లక్షణంగా ఉండాలి. మనుగడ ఉన్నంతవరకూ మనం గెలుపు కోసమే, గెలుపుతోనే రోజుల్ని గడుపుతూ ఉండాలి. రోజు అనేది రావడమే ఒక గెలుపు. అదిగో ఆ రోజు రావడమే మనకు ప్రేరణ. రోజులాగా మనుగడ ఆసాంతమూ మనకు గెలుపు అనేది వస్తూనే ఉండాలి. రోజు ఒకసారి మాత్రమే వచ్చేదే ఐతే కాల గమనమూ, ప్రపంచ గమనమూ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుందాం. అలా జరిగితే కాలానికి, ప్రపంచానికి గమనమే ఉండదు కదా? రోజు అనేది వస్తూ ఉండడమే గమనం జరుగుతోంది అన్నదానికి ఋజువు. మనకు గెలుపు వస్తూ ఉండడమే మనుగడ గమనాన్ని నిర్ధారణ చేస్తుంది. పొందే ప్రతి గెలుపు మనిషికి ఒక మలుపు. మలుపులు తిరుగుతూ పయనం సాగాలి. గెలుపులతో సాగడమే మనుగడకు సార్థకత. మనుగడ అన్నది ఒక సాగే తీగ అయితే ఆ తీగకు గెలుపుల పూలు పూస్తూ ఉండాలి. మనుగడ గెలుపుల పూలు పూచే ఒక వల్లరి కావాలి లేదా మనుగడ గెలుపుల పుష్పగుచ్ఛం కావాలి. గెలుపుల పూల పరిమళానికి ఆకృతిగా మనిషి మంచి మాటకెక్కాలి. ‘గెలుపును పొందాలని తలపోద్దాం; గెలుపును పొందుదాం. గెలుస్తూ ఉన్నవాళ్లమై తల ఎత్తుకుని మనుగడ చేద్దాం; మన తలలకు విలువను పొదువుకుందాం. గెలుపు మనకు అభిరుచి కావాలి; గెలుపును మనం చవి చూస్తూ ఉండాలి; మనం మనుగడకు చవిని చేకూర్చుకోవాలి‘. 100% – నేను గెలిచాను. 90% – నేను గెలుస్తాను. 80% – నేను గెలవగలను. 70% – నేను గెలవగలను అని అనుకుంటున్నాను. 60% – నేను గెలవగలనేమో. 50% – నేను గెలవచ్చేమో అని అనుకుంటున్నాను. 40% – ఏది గెలుపు? 30% – నాకు గెలవాలని ఉంది. 20% – ఎలా గెలవాలో నాకు తెలియదు. 10% – నేను గెలవలేను. 0% – నేను గెలవను. ఇది గెలుపునకు నిచ్చెన. మనిషి ఈ నిచ్చెనను ఎక్కాలి; తప్పకుండా ఈ నిచ్చెనను ఎక్కి తనను తాను మనిషిని అని నిరూపించుకోవాలి. – రోచిష్మాన్ -
రూపం లేని ఇంధనం ఆశ
ఆశ మనిషిని కదిలించి నడిపించే రూపంలేని ఇంధనం; ఆశ మనిషిని ఎప్పటికప్పుడు బతికిస్తూ ఉండే ఆకృతి లేని మూలకం. ఆశలేకపోతే మనిషికి మనుగడే ఉండదు. మనుగడకు మనుగడ ఉండాలంటే మనిషికి ఆశ ఉండాలి. మనిషి పొందుతున్న ప్రతిదానికీ ఆశపడడమే కీలకం. మనిషి గమ్యానికీ ఆశ ఆరంభం. మనిషికి ఆశ అంతం అవడం ఉండకూడదు. ఆశ అన్నది అంతం అవడం అంటే మనిషి అంతం అవడం తప్పితే మరొకటి కాకూడదు. మనిషి క్రియాశీలకం అవడానికి ఆశే ప్రేరణ. ఆశవల్లే మొత్తం ప్రపంచం క్రియాశీలకం ఔతోంది. ‘ఆశ అనేది మనుషులకు ఉన్న శృంఖలాల్లో అత్యంత ఆశ్చర్యకరమైంది. దానికి బద్ధులైనవాళ్లు పరుగులు పెడతూ ఉంటారు; ఆ శృంఖలాల నుంచి విముక్తులైనవాళ్లు చతికిలబడిపోతూ ఉంటారు’ అని హితోపదేశం తెలియజెబుతోంది. ఆశ ఉన్న మనిషి పరుగెడుతూ ఉంటాడు; ఆశలేని మనిషి చతికిలబడిపోతాడు; చచ్చుబడిపోతాడు. ఆశను కలిగించే మాటలు నీకు శక్తిని ఇస్తాయి‘ అని జపనీస్ కవి–బౌద్ధతాత్త్వికుడు దైసకు ఇకెద ఒక కవితలో అంటారు. ఈ దైసకు ఇకేదకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేర్వేరు విశ్వవిద్యాలయాల నుంచి 300కు పైగా డాక్టరేట్స్ వచ్చాయి! 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా అణుబాంబు దాడికి ఆయన మినహా కుటుంబం మొత్తం బలి అయిపోయింది. అ పరిస్థితి నుంచి ఆయన ఆశతో, ఆశ ఇచ్చిన శక్తితో విశ్వ – విశ్వవిద్యాలయాల నుంచి 300కు పైగా డాక్ట రేట్స్ అందుకున్న మహోన్నతుడిగా ఎదిగారు. శక్తై, మహాశక్తై ఆశ మనిషిని ముందుకు, మునుముందుకు నడిపిస్తూ ఉంటుంది; మహోన్నతుణ్ణి చేస్తూ ఉంటుంది. ఆశ వేరు దురాశ వేరు. మనిషికి ఆశపడడంపై అవగాహన ఉండాలి. ఏ వ్యక్తి ఐనా తనను తాను చూసుకోకుండా లేదా తనను తాను తెలుసుకోకుండా ఆశపడుతూ ఉండడం తప్పు. ఆశ అనేదే లేకపోతే మనుగడ జరగదు. కానీ దురాశవల్ల మనుగడ తిన్నగా ఉండదు, సాగదు. ఆశ వికటిస్తే దురాశ ఔతుంది; వికృతమైన మనస్తత్వానికి దురాశ ఒక అభివ్యక్తి. ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలి అన్న హిట్లర్ దురాశ పెనువినాశనానికి కారణమై చివరికి అతడి అంతానికీ కారణం ఐంది. నెపోలియన్ కూడా ప్రపంచాన్ని జయించేయాలన్న దురాశతో యుద్ధాలు చేసుకుంటూ వెళ్లి చివరికి బ్రిటిష్ వాళ్ల చేతికి చిక్కి చెరసాలపాలై ఆపై అనాథై మరణించాడు. ‘దురాశ దుఃఖానికి చేటు’ అని ఎప్పుడో చెప్పబడ్డ మాట ఇప్పటికీ, ఎప్పటికీ సరైందే; ఎప్పటికప్పుడు అది మనకు దిశానిర్దేశం చేసేదే. మనం ఎప్పుడూ దురాశకు అతీతంగానే ఉండాలి. ఆశ ఫలించని వేళల్లో మనిషిని నిరాశ చుట్టుకుంటుంది. నిరాశకు లోనుకాని మనిషి ఉండడం ఉండదు. నిరాశకు బలి ఐపోయినవాళ్లూ ఉన్నారు. నిరాశ అనే వ్రణం ఎవరినైనా సలుపుతుంది. నిరాశ కలిగినప్పుడు ఆ నిరాశకు చిత్తైపోకుండా ఉండాలంటే, నిరాశపై విజయం సాధించి రాణించాలంటే మనిషికి ఉండాల్సింది ఆశే. ఆశతోనే మనిషి నిరాశపై నెగ్గాలి. పుట్టిన ప్రతివ్యక్తికి పాలు తాగడం నుంచీ ఆశ మొదలు ఔతుంది. నిజానికి వ్యక్తికి పాలు తాగడంకన్నా ముందే ఆశ మొదలు ఔతుంది; ఆ ఆశవల్లే పాలుతాగడం మొదలు ఔతుంది; ఆశ మొదలుకాగా మనిషికి మనుగడ మొదలు ఔతుంది. మనిషి పోయేంత వరకూ మనిషిని వీడిపోకుండా ఉండాల్సింది ఆశ. వర్తమానం భవిష్యత్తును ఆవాహన చెయ్యాలంటే మనకు కావాల్సినవి ఆశ ఆపై సదాశ. ఆశ, సదాశలతో మనం అభ్యున్నతిని పొందాలి. ఆశ ప్రగతికి మూలం; దురాశ పతనానికి మూలం. ఈ విషయాన్ని మనిషి అవగతం చేసుకోవాలి. మనిషికి ఆశ ఉండాలి; తన ఆశకు తగినట్టు మనిషి తనను తాను సిద్ధం చేసుకోవాలి. ఆశ, సదాశల్ని ప్రయుక్తం చేసుకుని ప్రతిమనిషీ ప్రశస్తం అవాలి. – రోచిష్మాన్ -
సహృదయం.. సామరస్యం.. ద్వేష రాహిత్యం
ఏ దేశంలో అయినా, ఏ సమాజంలో అయినా, ఏ కాలంలో అయినా మానవుల్లో ఉండాల్సినవి ఏవి? సహృదయత, సామరస్యం, ద్వేషరాహిత్యం ఇవి ప్రపంచ మానవుల్లో ఉండాల్సినవి. మానవులు క్షేమంగా ఉండాలంటే ఉండి తీరాల్సినవి ఇవే. అదేంటో మానవ చరిత్ర మొదలు అయినప్పటి నుంచీ ఇవి ఉండాల్సినంతగా, ఉండాల్సినట్టుగా ఉండడం లేదు. అందువల్లే మానవులకు శాంతి, భద్రతలు కరువైపోయాయి. ఈ దుస్థితి ఇకనైనా మారాలి; ఇకపైనైనా మనిషి వల్ల మనిషికి కలుగుతున్న ముప్పుకు ముగింపు రావాలి; మనకు సుస్థితి సమకూడాలి. అథర్వ వేదపాఠం అయిన సాంమనస్య సూక్తం ఎప్పటి నుంచో ‘సహృదయం సాంమనస్యం అవిద్వేషం కృణోమి వః’ అనీ, ‘అన్యో అన్యమభి హర్యత వత్సం జాతమివాఘ్న్యా’ అనీ ఘోషిస్తూనే లేదా చాటిస్తూనే ఉంది. అంటే సహృదయులుగానూ, సామరస్యంతోనూ లేదా ఏకమనస్కులుగానూ, ద్వేషరహితులుగానూ మిమ్మల్ని రూపొందిస్తాను అనీ, అపుడే పుట్టిన దూడను తల్లి ఆవు ప్రేమించేట్టుగా పరస్పరం ప్రేమించుకోవాలి అనీ అర్థం. ఈ మాటల్ని మనం అర్థం చేసుకోనేలేదు. అందుకే మనలో అపాయం అతిగా వ్యాపిస్తూనే ఉంది. ఈ పరిస్థితిని మనం వెనువెంటనే పరిష్కరించుకోవాలి. ప్రపంచం, దేశం, సమాజం వీటికి తొలిదశ ఇల్లు. ఒక ఇంట్లోని వ్యక్తుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలో తెలియజేస్తూ సాంమనస్య సూక్తం ‘అనువ్రతః పితుః పుత్రో మాత్రా భవతు సంమనాః‘ అనీ, ‘జాయా పత్యే మధుమతీమ్ వాచమ్ వదతు శాన్తివామ్‘ అనీ చెబుతోంది. అంటే ఒక కొడుకు తన తండ్రిని అనుసరించే వాడుగానూ, తన తల్లితో సామరస్యంతోనూ ఉండాలి, భార్య భర్తతో మధురమైనదై ప్రశాంతతను ఇచ్చే మాటల్ని చెప్పనీ అని అర్థం. ఒకరిని ఒకరు వెన్నంటి ఉండడం, ప్రశాంతత, హితవచనం ఇవి ఇంటి నుంచే మొదలు అవ్వాలి. ద్వేషరాహిత్యం అన్నది కూడా ఇంటి నుంచే రావాలి అని తెలియజేస్తూ సాంమనస్య సూక్తం ‘మా భ్రాతా భ్రాతరం దదిక్షన్మా స్వసారముత స్వసా’ అనీ, సమ్యఞ్చః సవ్రతా భూత్వా వాచం వదత భద్రయా’ అనీ చెబుతోంది. అంటే సోదరీ సోదరులు ద్వేషించుకోకూడదు, కలిసికట్టుగా పనిచెయ్యండి, అందరూ శుభం కలిగించే మాటల్ని పలకండి అని అర్థం. అభిప్రాయ భేదాలతో ఒక ఇంట్లోని సభ్యులు పరస్పరం ద్వేషించుకుంటూ విడిపోవడం కాదు ఉమ్మడిగా ఉండడానికి వాళ్ల మధ్య అవగాహన ఉండాలి అని తెలియజేస్తూ సాంమనస్య సూక్తం ‘యేన దేవా న వియన్తి నో చ విద్విషతే మిథః’ అనీ,‘తత్ కృణ్మో బ్రహ్మ వో గృహే సంజ్ఞానం పురుషేభ్యః’ అనీ చెబుతోంది. అంటే దేనివల్ల దేవతలు విడిపోరో, ద్వేషించుకోరో అవగాహన అన్న ఆ ఉన్నతమైన భావన ఇంట్లోని సభ్యుల్లో ఉండాలి అని అర్థం. సంజ్ఞానం లేదా అవగాహన మనకు ఉండి తీరాలి. చిన్నవాళ్లు పెద్దలను వెన్నంటి వెళుతున్నట్టుగా ఒకరికి ఒకరై ఏకమనస్కులుగా, సామూహిక ఆరాధన చేసేవాళ్లుగా, పరస్పరం ప్రీతితో మాట్లాడుకునేవాళ్లుగా కలిసి మెలిసి బతకండి అని సూచిస్తూ ‘జాయస్వన్తశ్చిత్తినో మా వి యౌష్ట సమారాధయన్తః సధురాశ్చరన్తః’ అని సాంమనస్య సూక్తం మనకు చెబుతోంది. అంతేకాదు ప్రేమ అనే తాడుతో అందరూ కట్టబడాలి అన్న సూచ్య అర్థం వచ్చేట్టుగా ‘సమానే యోక్త్రే సహ వో యునజ్మి’ అనీ, ‘దేవా ఇవామృతమ్ రక్షమాణాః సాయం ప్రాతః సౌమనసో వో అస్తు‘ అంటూ దేవతలు అమృతాన్ని రక్షిస్తున్నట్టుగా ఉదయ, సాయం కాలాల్లో సద్భావనల్ని రక్షించండి అనీ చెబుతోంది సాంమనస్య సూక్తం. సాంమనస్య సూక్తం చేసిన ఈ సూచనను అందుకుని సద్భావనల్ని రక్షించుకుంటూ మనల్ని మనం రక్షించుకోవాలి; ఆపై మనం రాణించాలి. ‘భారతీయ వైదిక సాహిత్యం సహృదయత, సామరస్యం, ద్వేషరాహిత్యం వీటితో మానవులు మెలగాలని ప్రగాఢంగా ప్రవచించింది. దాన్ని మనం అర్థం చేసుకుని ఆచరణలోకి తెచ్చుకోవాలి. అది జరగకపోతే మన జీవితాలు అనర్థ దాయకమూ, అల్లకల్లోలమూ అయిపోతాయి‘. – రోచిష్మాన్ -
Guru Purnima 2023: కదిలించే కాంతి గురువు
‘గు’ అంటే చీకటి. ‘రు’ అంటే కాంతి. అజ్ఞానపు చీకటిని నిర్మూలించేది గురు. కాంతి లేకపోతే మనకు ఏదీ తెలియరాదు. గురువులు కాంతిని ఇస్తారు. జీవనం అనే చీకటిని ఛేదించడానికి ప్రతి మనిషికి కాంతిని ఇచ్చే గురువు ఎంతో అవసరం. వ్యాసుడు కీలకమైన గురువుకాగా ఆది శంకరాచార్య భారతీయతకు మహోన్నతమైన గురువు అయ్యారు. శంకరాచార్యే ఉండి ఉండకపోతే ఒక దశలో భారతీయత చిందరవందరైపోయేది. గౌతమ బుద్ధుడు, మహావీరుడు, రామానుజుడు, అరవిందుడు వంటి పలువురు మేలైన గురువులు మన మట్టికి, మనకు మేలు చేశారు. శంకరుల తరువాత స్వామి వివేకానందవల్ల ఒకదశలో భారతీయతకు రావాల్సిన చలనం, జ్వలనం వచ్చాయి. భారతీయ తత్త్వానికి, సత్వానికి విశ్వవ్యాప్తిని కలిగించారు వివేకానందులు. మనదేశానికి రాజకీయ స్వాతంత్య్రం రావడానికి వివేకానందులు పరోక్ష కారణం. వారు వెలిగించిన భారతీయస్ఫూర్తి పలువురిని జాతీయ ఉద్యమంవైపు నడిపించింది. వైదికత్వం కోసం, జాతి కోసం తన ఆత్మానుభూతిని సైతం త్యాగం చేసిన అత్యున్నతమైన యోగి–గురువు వారు. ఒక దశలో శంకరులు, ఒక దశలో వివేకానందులు అందివచ్చిన గురువులై మనల్ని కదిలించే కాంతులు అయ్యారు. ‘కృష్ణం వందే జగద్గురుం’ అన్నది మన మట్టిలో మెరుస్తూ ఉండే మాట. కృష్ణుడు చెప్పిన పాఠం భగవద్గీత ప్రపంచం అంతా విలసిల్లుతోంది. ‘తుచ్ఛమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచి పైకిలే’ అంటూ కృష్ణుడు మనల్ని ఉన్ముఖుల్ని చేస్తూనే ఉన్నాడు. ‘భగవద్గీత సందేశం అంతా ఈ మాటల్లో ఇమిడి ఉంది’ అని చెప్పారు వివేకానందులు. ఈ మాటల స్ఫూర్తితో వారు ‘లే, జాగృతి పొందు, లక్ష్యాన్ని చేరే వరకూ ఆగకు’ అని అన్నారు. ‘పనిలో నేర్పరితనమే యోగం’ అనీ, ‘హీనమైన పనిని దూరంగా వదిలెయ్యి’ అనీ, ‘నిర్ణయించబడిన పనిని చెయ్యి’ ఆనీ, ‘శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం లభిస్తుంది’ అనీ, ‘అనుమానస్తుడికి సుఖం లేదు’ అనీ కృష్ణుడు చెప్పినవి మన జీవితాలకు కాంతిని ఇచ్చేవి. ‘మానవ విజ్ఞానంలో సాటిలేనివాడు, అద్వితీయమైన వ్యక్తిత్వం ఉన్నవాడు కృష్ణుడు’ అని వివేకానందులు చెప్పిందాన్ని అర్థం చేసుకుందాం. ఏది అన్నిటికన్నా ప్రయోజనకరమైంది? అన్న సంశయానికి ‘ధర్మం’ అని చెప్పి శంకరాచార్య సంశయ నివృత్తి చేశారు. ఏది వాంఛింపదగింది? అన్న సంశయానికి ‘స్వ, పర హితం’ అనీ, శత్రువు ఎవరు? అన్న సంశయానికి ‘సోమరితనం’ అనీ, ఏది దుఃఖం? అన్న సంశయానికి ‘ఉత్సాహం లేకపోవడం’ అనీ, ఏది జాడ్యం? అన్న సంశయానికి ‘నేర్చుకున్నది ఆచరించకపోవడం’ అనీ, ఎవరు స్నేహితులు? అన్న సంశయానికి ‘పాపాన్ని నివారించే వాళ్లు’ అనీ, ఏది పాతకం? అన్న సంశయానికి ‘హింస’ అనీ, ఎవరు ఎదుగుతారు? అన్న సంశయానికి ‘వినయం ఉన్నవాళ్లు’ అనీ, ఎవరు ప్రత్యక్ష దేవత? అన్న సంశయానికి ‘అమ్మ’ అనీ, వేటిని మనుషులు సంపాదించాలి? అన్న సంశయానికి ‘విద్య, ధనం, బలం, కీర్తి, పుణ్యం’ అనీ, ఎవరి చేత ప్రపంచం జయించబడుతుంది? అన్న సంశయానికి ‘సత్యం, ఓర్పు ఉన్న వ్యక్తి చేత’ అనీ తెలియజెప్పి మనకు దిశానిర్దేశం చేశారు శంకరాచార్య. ‘మీరు అపారమైన ఓర్పు కలిగి ఉన్నారా, అయితే విజయం మీదే’ అని శంకరుల స్ఫూర్తితో వివేకానందులు ఉవాచించారు. ‘సత్యం, నిగ్రహం, తపస్సు, శుచి, సంతోషం, సిగ్గు, ఓర్పు, నిజాయితీ, జ్ఞానం, శాంతి, దయ, ధ్యానం కలిగి ఉండాలి; ఇదే సనాతన ధర్మం’ అన్న వ్యాసుడి ఉపదేశాన్ని వ్యక్తిత్వంలో నింపుకుని ప్రతి వ్యక్తీ ఉదాత్తంగా బతకాలి. మనకు అత్యవసరమైన గురువులుగా ఆది శంకరాచార్యను, స్వామి వివేకానందను మనం ఇకపై సంభావించి స్వీకరించాలి. ఈ ఇరు గురువుల ఉపదేశాల్ని అందుకుని భారతీయులమైన మనం దేశ సంక్షేమం కోసం, సౌభాగ్యం కోసం, ప్రగతి కోసం పనిచెయ్యాలి; మనమూ పరిఢవిల్లాలి. – రోచిష్మాన్ -
సంగీతం..సంస్కారానికి ఆవిష్కారం
సంగీతం మనసును, మెదడును ఒకేసారి కదిలిస్తుంది. సంగీతంవల్ల మనసులో మెదడు, మెదడులో మనసు ఒకేసారి మెదులుతూ ఉంటాయి. మనిషిలోంచి మనిషిని బయటకులాగి తనలోకి తీసుకుంటుంది సంగీతం. జీవనావసరాలకు అతీతంగా మనిషిని మనిషిని చేస్తుంది సంగీతం. ‘భూమి సారం నీరు, నీటి సారం మొక్క , మొక్క సారం మనిషి , మనిషి సారం మాట, మాట సారం సంకీర్తన లేదా సంగీతం‘ అని ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. సంగీతం అన్నిటికన్నా గొప్పది అని ఉపనిషత్ కాలం నుంచీ నేలపై నెలకొన్న సత్యం. మనిషికన్నా సంగీతం గొప్పది కాబట్టే మనిషికి సంగీతం మేలు చెయ్యగలిగేది అయింది. ‘ఆశతో బతికే వ్యక్తి సంగీతంతో నాట్యం చేస్తాడు’ అని ఒక ఇంగ్లిష్ సామెత తెలియజెబుతోంది‘. ‘తనలో సంగీతం లేని వ్యక్తి, మధురమైన శబ్దాలతో కలిసిపోని వ్యక్తి అననురాగానికి, కపటోపాయానికి, దోపిడికి తగిన వాడు అవుతాడు‘ అని ఇంగ్లిష్ కవి షేక్స్పియర్ ఒకచోట చెబుతాడు. అన్నింటికన్నా సంగీతం మనిషికి ఉన్నతమైన తోడు. సంగీతాన్ని వింటున్నప్పుడు మనల్ని మనం ఒకసారి చూసుకుంటే మనకు మనం కనిపించం! ఇంతకన్నా మనకు జరిగే మంచి మరొకటి ఉంటుందా? సంగీతం వింటున్నంత సేపూ మనం మెరుగైన స్థితిలో ఉంటాం. మన నుంచి మనం కోలుకోవడానికి సంగీతం కావాలి. సంగీతం మనల్ని ఎప్పుడూ మోసం చెయ్యదు! బంధువులవల్లా, స్నేహితుల వల్లా, సమాజంవల్లా మనం మోసపోతూ ఉంటాం. కానీ సంగీతంవల్ల మనం మోసపోవడం లేదు. కొన్ని రచనలు మనల్ని పాడుచెయ్యచ్చు. కొన్ని వాక్యాలు మనల్ని తప్పుడు దారి పట్టించచ్చు. కానీ సంగీతం మనల్ని పాడుచెయ్యదు. సంగీతం మనల్ని తప్పుడువాళ్లను చెయ్యదు. కొన్ని సందర్భాల్లో సాహిత్యం కొందరికి చెడుపు చేసింది. కానీ సంగీతం ఎప్పుడూ ఎవరికీ ఏ చెడుపూ చెయ్యదు. సంగీతం సలహాలు ఇవ్వదు. సంగీతం సూచనలు చెయ్యదు. సలహాలు, సూచనలు లేకుండా సంగీతం మనతో చెలిమి చేస్తుంది. సంగీతం మనదైపోతుంది. సంగీతాన్ని వింటున్నప్పుడు మైమరిచిపోయి తనకు తెలియకుండా మనిషి నిజంగా బతుకుతాడు. సంగీతం వల్ల మనిషి బుద్ధికి అతీతంగా సిద్ధుడు అవుతాడు. మనుగడలో భాగంగా మనం మనల్ని కోల్పోతూ ఉంటాం. సంగీతం వింటూ ఉండడంవల్ల మనల్ని మనం మళ్లీ మళ్లీ పొందచ్చు. వయసు రీత్యా ఎదిగాక పసితనం పోయిందని మరణించేంత వరకూ మనం మాటిమాటికీ బాధపడుతూ ఉంటాం. సంగీతాన్ని వింటున్నప్పుడు తెలివి, ప్రతిభ, పాండిత్యాలు లేని స్థితిలోకి వెళ్లిపోయి మనం మనంగా కాకుండా పసితనంతో ఉంటాం. ప్రతిమనిషికీ తెలుసు తాను కొంత మేరకు దుర్మార్గుణ్ణే అని. సంగీతాన్ని వింటున్నంతసేపూ తననుంచీ, తన మార్గం నుంచీ మనిషి బయటకు వచ్చేస్తాడు కాబట్టి సంగీతం కాసేపైనా మనిషిని మంచిలో ఉంచుతుంది. సంగీతం విన్నంతసేపూ అనడమో, ఏదో చెయ్యడమో ఉండవు కాబట్టి మనవల్ల అవకతవకలు, అన్యాయం, అకృత్యాలు జరగవు. శబ్దానికి సంస్కారం సంప్రాప్తిస్తే సంగీతం అవుతుంది. సంగీతం ఒక సంస్కారానికి ఆవిష్కారం. మనకూ, మన జీవనాలకూ కూడా సంస్కారం ఉండాలి. వీలైనంతగా సంగీతానికి చేరువ అవుదాం. సంగీతంలో మైమరిచిపోతూ ఉందాం. సంగీతంలో మైమరచిపోతూ ఉండడం మనం మళ్లీ, మళ్లీ పుడుతూ ఉండడం అవుతుంది. రండి, సంగీతం వల్ల మనం మళ్లీ మళ్లీ పుడుతూ ఉందాం. అద్భుతమైన అభివ్యక్తి సంగీతం; ఆస్వాదించాల్సిన ఆనందం సంగీతం. కృష్ణుడు తన పిల్లనగ్రోవి సంగీతంలో తాను ఆనందం పొందుతూ తన్మయుడు అవుతూ ఉండేవాడు. సంగీతం కృష్ణతత్త్వంలో ఒక అంశం. కృష్ణుణ్ణి సంపూర్ణ అవతారంగా చెబుతారు. ఆ సంపూర్ణ అవతారంలో సంగీతం ఒక అంశం. అంటే సంపూర్ణత్వానికి సంగీతం ముఖ్యం అని గ్రహించాలి. – రోచిష్మాన్ -
సద్గుణాల్లో ఉద్గుణం దాతృత్వం
దాతృత్వం లేదా ఈవి అన్నది ఉద్గుణాలు అన్నిటిలోకెల్లా ఉద్గుణం; సద్గుణాలు అన్నిటిలోకెల్లా సద్గుణం. అవసరమైంది లేనివాళ్లకు తగిన విధంగా అందించడానికి తన శక్తిమేరకు ప్రయత్నించడం ప్రతి మనిషికీ తప్పకుండా ఉండాల్సిన లక్షణం. అది లక్షణంగా మాత్రమే కాకుండా అంతకుమించి ప్రతివ్యక్తికీ ఉండాల్సిన ప్రధాన లక్ష్యంగా కూడా ఉండాలి. వేదవాఙ్మయంలో భాగంగా మనకు అందుబాటులో ఉన్న భిక్షుసూక్తం కమ్యూనిజంకన్నా ఎంతో ముందే అన్నార్తులకు అన్నం పెట్టడం, దీనులకు దానం చెయ్యడం గురించి ప్రగాఢంగా ప్రపంచానికి తెలియజెప్పింది. ‘దేవతలు ఆకలిని మరణానికి కారణంగా విధించలేదు. బాగా ఆహారం తిన్న వాళ్లకు కూడా మరణం వచ్చి తీరుతుంది. దానశీలికి సంపద తగ్గదు. ఇవ్వని లేదా పెట్టని వాడిని ఓదార్చే వారు కూడా ఉండరు‘ అంటూ భిక్షుసూక్తం తొలి శ్లోకం అర్థం చేసుకుని ఆచరించాల్సినదాన్ని ఆవిష్కృతం చేసింది. ఆకలికి ఆహారం కూడా కరువై అలమటిస్తున్నవాళ్లు ప్రపంచంలో ఇంకా ఉన్నారు. వాళ్లు ఎక్కడో, అక్కడక్కడో మాత్రమే కాదు మన చుట్టుపక్కల కూడా ఉన్నారు. వాళ్లను మనం చూడకపోవడం, చూడలేకపోవడం కాదు చూసినా చూడనట్టు ఉన్నాం, ఉంటున్నాం. మనకు ఎందుకులే అనుకుంటూ, అంటూ మనం వాళ్ల పక్కనే నివసిస్తున్నాం. ఇది అమానవీయం. ఈ అమానవీయత మనలో కొత్తగా చోటు చేసుకున్న అవలక్షణం కాదు. అది మనలో ఎప్పటి నుంచో గూడుకట్టుకుని లేదా పేరుకుపోయి ఉంది. ఆ లక్షణం మనలో ఉండకూడదు అని తెలియజేస్తూ, మనకు తగిన స్ఫూర్తిని ఇస్తూ ఎప్పటి నుంచో ఎంతో చెప్పబడింది; ఎందరో మహనీయులు మనకు ఈ విషయంలో ఆదర్శంగా నిలిచారు. అయినా కూడా ఆ అవలక్షణం అవనిలో అంతరించిపోలేదు. ప్రపంచం పరిణామాల్ని పొందుతూ ఇవాళ ఉన్న స్థితికి వచ్చాక కూడా ఆకలి అన్నది ప్రపంచంలో ఇంకా ఎందరినో బాధిస్తోంది. ఆకలి తన ఆకలిని తీర్చుకోలేకపోతోందేమో? అందువల్ల అది ఇంకా మనుషుల ప్రాణాల్ని తింటూనే ఉందేమో? ఎప్పటినుంచో ప్రపంచంలో ఆకలి అగ్నికి మనుషుల ప్రాణాలు ఆహుతి అవుతూనే ఉన్నాయి. ‘అన్నం కలిగిన వాడై ఉండీ, అవసరమైన దీనులకి ఆహారం పెట్టకుండా మనసును చంపుకుని ఆ దీనుల ముందే ఎవడయితే తాను అనుభవిస్తూ తింటాడో వాడికి అనునయించే వాళ్లు దొరకరు’ అన్న విషయాన్ని ఒక హెచ్చరికగా భిక్షుసూక్తం మనకు తెలియజెప్పింది. ఈ సూక్తం లో చెప్పబడినట్టుగా ఆకలి కారణంగా మన సమాజంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ‘ధనవంతుడు పేదలకు తప్పకుండా ఇవ్వాలి. దూరదృష్టితో మార్గాల్ని ఆలోచించి ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే రథచక్రాలు తిరుతున్నట్టుగా సంపద ఒకరి నుంచి మఱొకరికి వెళుతూ ఉంటుంది’ అనీ,‘మూర్ఖుడు అహారాన్ని ఇతరులకి పెట్టకుండా ఆశగా సేకరించి నిల్వ ఉంచుకుంటాడు. నిజం చెబుతున్నాను అది వాడికి చావునే ఇస్తుంది. దేవుడికో, స్నేహితుడికో ఇవ్వకుండా తాను తినే వాడు ఒట్టి పాపి అవుతాడు‘ అనీ భిక్షుసూక్తం ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది. కానీ మానవులు దాన్ని పెద్దగా పట్టించుకోకుండా పాపులుగా లేదా దోషులుగా మనుగడ చేస్తున్నారు. ‘ఆహారాన్ని వెతుక్కుంటూ తిరిగే బలహీనులకు ఎవరు వెంటనే ఆహారాన్ని ఇస్తారో వారి కోసం విలువైనవి వేచి ఉన్నాయి. వారు విరోధులతో కూడా స్నేహాన్ని పొందుతారు’ అని భిక్షుసూక్తం ఉపదేశించి దాన్ని మనం మనసుతోనూ, మెదడుతోనూ అందుకుని ఆచరణలోకి తీసుకురావాలి. ఆ పని చేస్తూ మనల్ని మనం మనుషులుగా మలుచుకోవాలి; తథాస్తు. పూవుకే కాదు ఈవికి కూడా తావి ఉంటుంది! ఆ తావి పేరు కీర్తి!! ఈవివల్ల మనం కీర్తిమంతులం అవుదాం. బతికి ఉండగానే కాదు, మరలిపోయాక కూడా మనం పరిమళిద్దాం. ఈవితో మనకు మనం తావిని అద్దుకుందాం. – రోచిష్మాన్ -
నిన్న నేడు రేపు
నేడులో ఉన్న మనం నిన్నను దాటుకుని వచ్చాం. నేడునూ దాటుకుని మనం రేపులోకి వెళ్లాల్సి ఉంది. నిన్న, నేడులకన్నా మనకు రేపు ఎంతో ముఖ్యం. నిన్న, నేడుల్లో లాభం, నష్టం, సుఖం, శోకం, ప్రగతి, పతనం మనకు వచ్చి ఉంటాయి. వీటి ప్రాతిపదికన మనం రేపులోకి వెళ్లాల్సి ఉంటుంది. మనం ఏ స్థితిలో ఉన్నా, మన పరిస్థితి ఏదైనా మనం తప్పకుండా రేపు వైపు కదలాలి; కదులుదాం. నిన్నవైపు కాదు మన చూపు రేపు వైపు ఉండాలి. నేడులో ఉండిపోవడం కాదు మనం రేపువైపు నడవాలి. రేపువైపు చూపు వేసి మనం కదులుతూ ఉండాలి. మన చూపు నిండా, మన కదలిక నిండా చేవను మనం నింపుకోవాలి. మనలో నీరసం ఉంటుంది. దాన్ని నిన్న మరిచిపోయినా నేడు నేల రాసేసుకోవాలి. మనలో చెడ్డతనం ఉంటుంది. అది నిన్నటి నుంచి నేడులోకి వచ్చేసినా రేపులోకి రాకుండా దాన్ని కూలదోసుకోవాలి. మనలోని మూర్ఖత్వాన్ని నేడు తప్పకుండా విడిచి పెట్టెయ్యాలి. మన జాడ్యాలు మన రేపులోకి రాకుండా నేడు మనమే వాటిని మట్టు పెట్టుకోవాలి. నిన్న మనకు మనమే వేసుకున్న కుత్సితాల సంకెలల్ని నేడైనా తెంచేసుకోవాలి. నిన్న మనలోకి వచ్చి చేరి నిలిచి ఉన్న మత్సరభావాల విషాన్ని నేడు పూర్తిగా ఒంపేసుకోవాలి. నిన్నకు నేడు కొనసాగింపు కాకూడదు. నిన్నకు నేడు కొనసాగింపు అయి ఉంటే అది తప్పు అని తప్పకుండా తెలుసుకోవాలి. ఆ తప్పు కొనసాగకుండా నేడు మనం జాగ్రత్తపడాలి. జాగరూకతతో మనం రేపును స్పృశించాలి. నిలిచి ఉండే చెలిమితోనూ, నిజమైన నైజంతోనూ, నిర్మలమైన హదయంతోనూ, చల్లటి ఆశయాలతోనూ, చక్కని ఆలోచనలతోనూ సత్ప్రవర్తనతోనూ మనం రేపులోకి వెళ్లాలి. మన నిన్నలో, నిన్న మనలో అవి లేకపోయినా రేపు అవి మనకు ఎంతో అవసరం అని నేడైనా గ్రహించి మనం రేపులోకి వెళ్లాలి. నిన్న మనం ఎలా ఉన్నా, నేడు మనం ఎలా ఉంటున్నా రేపు మాత్రం మనం గొప్పగా ఉండాలి; అధమపక్షం రేపు మనం బావుండాలి. అందుకు నేడు మనం సిద్ధపడాలి. రేపులో మనం మెరుగ్గానూ, మేలుగానూ ఉండేందుకు మనం నేడు తయారుగా ఉండాలి; మనల్ని మనం తయారు చేసుకోవాలి. అలవాటుపడ్డ సోమరితనానికి, అభిప్రాయాలకూ నేటితో స్వస్తి పలికి, ఉండాల్సిన ఉత్సాహానికి, అవగాహనకూ నేడైనా నాంది పలికి అభ్యున్నతికి ప్రస్తావన కలిగేందుకు, కల్పించుకునేందుకు రేపులోకి వెళ్లాలి మనం. పనిచేస్తూ ప్రయోజనాన్ని పొందే చేతులతో, మెరిసే తలపులు కలిగే మస్తిష్కంతో భేషజాల పరదాలు తొలగించుకుని, వేషాలు పోయే గుణాన్ని మరచిపోయి మనం రేపులోకి చేరాలి. పరుల బాధను పట్టించుకోవడం పాపం కాదు; తోటి వాడికి మంచి చెయ్యడం నేరం కాదు; సాటివాడికి చేయూతను ఇవ్వడం దోషం కాదు కాబట్టి వాటిని చేపట్టడానికి కూడా మనం రేపును వేదిక చేసుకోవాలి. రేపైనా మనల్ని మనం నరులం అని నిరూపించుకోవాలి. మన కోసం, మన రాక కోసం వేచి ఉన్నది సుమా రేపు అన్నది; లేచి వెళ్లి అందుకోవడానికే మనం ఉన్నది. మనంత మనంగా, మనం మనంగా నిజమైన మనుషులంగా జీవం ఉన్నవాళ్లంగా జీవించేందుకుగా మనం రేపును అందుకోవాలి. మన రాగం, మన యాగం, మన త్యాగాలతో గణనీయమైన మనుగడను సాధించేందుకు, ఆపై మన గానం, మన ధ్యానం, మన జ్ఞానాలతో స్మరణీయమైన మనుషులం అయ్యేందుకు మనం రేపును ఆవాహన చేసుకోవాలి. ‘బెదురు లేకుండా కదులుతూ ఎదురు వెళ్లి రేపులోకి ప్రవేశిద్దాం; ఏ మాత్రమూ చెదిరిపోకుండా ఎదిగేందుకు విఫలం అవకుండా రేపుకు ప్రయుక్తం అవుదాం‘. – రోచిష్మాన్ -
మంచి మాట: ఉండాల్సిన లక్షణం
మంచితనం; మానవ జాతి మొదలయిన రోజు నుంచి ప్రతిమనిషికి అతిముఖ్యంగా కావాల్సి వచ్చింది ఏదైనా ఉంది అంటే అది మంచితనం. ఒక మనిషి నుంచి మరొక మనిషికి జారి పోకుండా అందాల్సింది ఏది అని అంటే అది మంచితనం. మొత్తం మానవ జాతికి సర్వదా, సర్వథా క్షేమకరం అయిందీ, లాభకరం అయిందీ ఏదైనా ఉందీ అంటే అది మంచితనం. మానవజాతిలో మంచితనానికి ఆది నుంచీ కొరత ఉండడం కాదు అసలు మంచితనం మనలోకి, ప్రపంచం లోకి ఇంకా రానేలేదు. ఈ క్షేత్రవాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. అందువల్ల ఇకపైనైనా మనలో మంచితనం కోసం మంచి ప్రయత్నాలు మెదలు అవచ్చు. మంచితనం అని మనం అనుకుంటోంది నిజానికి మంచితనం కాదు. మంచితనం అని మనం అనుకుంటోంది మంచితనమే అయి ఉంటే మన ప్రపంచంలో జరుగుతూ వస్తున్న హాని, విధ్వంసం, ప్రాణ, ఆస్తి నష్టాలు, ద్రోహాలు, దొంగతనాలు, కుట్రలు, మనుషుల బతుకులు అల్లకల్లోలం అవడమూ మనకు తెలుస్తూ ఉన్నంత తెలుస్తూ ఉండేవి కావు; ఇప్పటిలా మనం వాటివల్ల దెబ్బతినేవాళ్లం కాము. మంచితనానికి మంచి జరగలేదేమో? అందుకే మనలోకి, ప్రపంచంలోకి రావడానికి మంచితనానికి ఇంకా మంచిరోజు రాలేదేమో? మంచితనానికి మంచి జరిగే ఉంటే ఎంతో బావుండేది. మనకు నెమ్మది, మన బతుకులకు భరోసా ఉండేవి. ఆది నుంచే లోకంలో మంచితనం లేదు కాబట్టే మాట వచ్చిన నాటి నుంచీ ప్రతిభాషా మంచితనం ఆవశ్యకతను పదేపదే చెబుతూనే ఉంది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోని యోగులు, గురువులు, కవులు, జ్ఞానులు అందరినీ మంచితనంవైపు మళ్లించే మాటలు చెప్పారు. ప్రపంచంలోని ప్రతి మతమూ మంచిగానూ, మంచితోనూ ఉండమని చక్కగా, చిక్కగా చెప్పింది. ఎందుకో చెడు అబ్బినట్టుగా మనిషికి మంచి అబ్బలేదు. ఏమిటో మరి చెడుకు మాలిమి అయినట్టుగా మనిషి మంచికి మాలిమి అవలేదు. ఇందుకు కారణాలు తెలిసిపోతే మంచికి రోజులు వచ్చేస్తాయేమో? చెడుకు రోజులు చెల్లిపోతాయేమో? మనిషి చెడుతోనే పుడతాడు. చెడు అన్నది ఎవరికైనా పుట్టకతోనే వచ్చేస్తుంది. మనిషిలో చెడు సహజంగానే ఉంటుంది. మనిషి తనలో ఉన్న చెడును తొలగించుకుంటూ మంచిని అభ్యసిస్తూ ఆపై దాన్ని సాధించాల్సి ఉంటుంది. మనిషికి చెడు అన్నది లక్షణం; మంచి అన్నది లక్ష్యం. మనిషి తన లక్షణాన్ని వదులుకుని ఆ లక్ష్యాన్ని సాధించలేకపోతున్నాడు. మనకు ప్రశాంతత కావాలి; అందుకు మంచితనం వచ్చి తీరాలి. మంచితనం వేగంగా రావాలి; మంచితనం నిజంగా రావాలి. కొత్తగా పుట్టిన నదిలా అది ఎప్పటికీ ఉండేలా మంచితనం మనలోకి ప్రవహించాలి. ‘ఓ మంచితనమా, నువ్వు ఎక్కడ ఉన్నావ్? నువ్వు ఎక్కడ ఉన్నా నీకు ఇదే మా స్వాగతం; ఇంకా నువ్వు వేచి ఉండకు రా మాలోకి. రాయని కవితలా ఎక్కడో ఉండిపోకు; సరైన తరుణం ఇదే రా మాలోకి. మాకు నీ అవసరం చాలా ఉంది; నువ్వు లేకపోవడం వల్ల మా ఈ లోకం అపాయకరం అయిపోతూ ఉంది. వెంటనే వచ్చేసెయ్ ఓ మంచితనమా, ఎదురు చూస్తూ ఉన్నాం రా మంచితనమా రా’ అంటూ మనం అందరమూ మన క్షేమం కోసం మంచితనాన్ని మనసా, వాచా తప్పనిసరిగా ఆవాహన చెయ్యాల్సిన అవసరం ఉంది. మంచితనం మనలో లేనందువల్ల మనం విరిగిపోయిన వాక్యాలం అయ్యాం; అందువల్ల మనం అనర్థదాయకం అయ్యాం. ఈ స్థితిని అధిగమించి మంచితనాన్ని సాధిద్దాం; మనుగడను సాత్వికం చేసుకుందాం. ఆది నుంచే లోకంలో మంచితనం లేదు కాబట్టే మాట వచ్చిన నాటి నుంచీ ప్రతిభాషా మంచితనం ఆవశ్యకతను పదేపదే చెబుతూనే ఉంది. ప్రపంచంలోని ప్రతి మతమూ మంచిగానూ, మంచితోనూ ఉండమని చక్కగా, చిక్కగా చెప్పింది. – రోచిష్మాన్ -
మంచి మాట: విడదియ్యరాని శ్రమ
శ్రమ నుంచి శ్రామికుల్ని, శ్రామికుల నుంచి శ్రమను ఎలా అయితే విడదియ్యలేమో అలా ప్రపంచం నుంచి శ్రమను, శ్రామికులను విడదియ్యలేం. శ్రమలేందే శ్రామికులు లేరు; శ్రామికులు లేందే శ్రమలేదు; శ్రమ, శ్రామికులు లేందే ప్రపంచం లేదు. మనిషికి ప్రపంచం ఆధారం; ప్రపంచానికి శ్రామికుడు ఆధారం. ప్రతి మనిషికి శ్రామికుడి అవసరం ఉంది; ప్రతిమనిషీ శ్రామికుడు అవ్వాల్సిన అవసరం ఉంది. మన ఈ ప్రపంచం మనకు ఇవాళ ఇలా ఉందీ అంటే అది శ్రామికులు శ్రమిస్తూనే ఉన్నందువల్ల వచ్చిన ఫలితమే. శ్రమతో శ్రామికులు సృజించిన ఆకృతి ప్రపంచం. శ్రమతో, శ్రమలో శ్రామికుడు జీవనం చేస్తున్నందువల్లే ప్రపంచానికి స్థితి, ద్యుతి ఉన్నాయి. అవి మనకు ఆలవాలమూ అయినాయి. మన మనుగడ సాగేందుకు అవి మనతో, మనకై ఉన్నాయి. ‘శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదు’ అని కవి శ్రీశ్రీ అన్నారు. శ్రమైకజీవనం సౌందర్యమై ప్రపంచం మొత్తానికి సౌందర్యాన్ని తీసుకు వచ్చింది! శ్రమ అన్నదాన్ని లుప్తం చేసి ఊహించుకుంటే ప్రపంచం వికృతంగా ఉంటుంది. శ్రమైక జీవనం అన్నది సౌందర్యం మాత్రమేనా? కాదు. శ్రమైకజీవనం ఈ ప్రపంచానికి లభించిన సౌభాగ్యం కూడా. అనాది గా ప్రపంచం పొందిన ప్రగతికి కారణం శ్రామికుడు. శ్రామికుడు ప్రపంచానికి సౌందర్యప్రదాత. శ్రామికుడు ప్రపంచానికి సౌభాగ్యప్రదాత. అటువంటి శ్రామికుడికి, అతడి శ్రమకు న్యాయం జరుగుతోందా? అనాదిగానే అది లేదు అన్నది క్షేత్ర వాస్తవంగా మనకు ప్రస్ఫుటంగా తెలుస్తూనే ఉంది.‘మన ప్రపంచంలో చాలా విషయాలు అన్యాయం; / పత్తిని నాటని వాళ్లు శ్రేష్ఠమైన పత్తి బట్టలు కట్టుకుంటారు. / అంతే కాదు పొలంలో పని చెయ్యని వాళ్లు తెల్లటి బియ్యం తింటారు’ అని అంటూ చైనాలోని ఒక అజ్ఞాత యూనాన్ జానపద కవి వందలయేళ్ల క్రితమే ఆవేదనను వ్యక్తపరిచాడు. చిందిన చెమట కు అందిన ఫలం చాలని స్థితి ఎప్పటి నుంచో ఉంది. ఈ పరిస్థితి ఇకనైనా మారాలి. శ్రమకు, శ్రామికుడికి తగిన ఫలం దక్కాలి. ‘మేఘాలు తియ్యటి నీరును ఇచ్చినట్టుగా, తేనెటీగలు తేనెను ఇచ్చినట్టుగా నువ్వు పశువుల్లో పాలను సృష్టించావు. అదే విధంగా పగలంతా శ్రమించిన శ్రామికుడికి ధాన్యాదిరూపంలో సంపదను ఇవ్వు’ అంటూ వేదంలో ఒక దైవ ప్రార్థన ఉంది. శ్రామికుడికి న్యాయం జరగాలన్న ఆకాంక్ష కూడా ఎప్పటినుంచో వస్తూనే ఉంది. ఇకనైనా శ్రమకు, శ్రామికులకు న్యాయం సాకారం కావాలి. ఏడాదిలో ఏ ఒక్కరోజునో శ్రామికుల రోజు అనీ, ఆ రోజున ఏదో హడావిడి చేసేసి, ఉపన్యాసాలు ఇచ్చేసి ఆ తరువాత శ్రామికుల్ని నిర్లక్ష్యం చెయ్యడం ఇక చాలు. ప్రతిరోజూ శ్రామికులకు, శ్రమకు న్యాయం చేస్తూ మనం మన మనుగడను సౌందర్యవంతమూ, సౌభాగ్యవంతమూ చేసుకుందాం. శ్రామికులకు, శ్రమకు గౌరవాన్ని, మన్నను ఇస్తూ మనల్ని మనం గౌరవించుకుందాం; మనకు మనం మన్ననను కలిగించుకుందాం. ఏ ఒక్కరోజో శ్రామికుల రోజు అవదు. ప్రతిరోజూ శ్రామికుల రోజే. సూర్యోదయంతో మొదలయ్యే ప్రతి దినమూ శ్రామికుల దినమే! శ్రమ అన్నది చిందే దినమే! శ్రమ చిందనిదే, శ్రామికులు పని చెయ్యనిదే ఏ దినమూ గడవదు కదా? ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అంటూ ఒక్కో పేరుతో ఒక్కో దినం ఉంది. ఏ పేరుతో ఉన్న దినమైనా శ్రమ, శ్రామికుల అభినివేశంతోనే అది దినంగా నడుస్తుంది, గడుస్తుంది. ప్రతిదినమూ శ్రామికుల దినమే! – రోచిష్మాన్ -
జీవన చలనం
చలనం ఉండాలి; మనకు చలనం అన్నది కావాలి. చలనంతో మనం సాగుతూ ఉండాలి. మనలోని రక్తంలో చలనం లేకపోతే మనం ఉండం. మన రక్తంలో ఉన్న చలనం మన తీరులోనూ ఉండాలి. చలనం లేకుండా ఆగిపోయిన నీరు బురద అయిపోతుంది. చలనం లేకపోతే ఎవరి జీవనం అయినా ఎందుకూ పనికి రాకుండా పోవడమే కాదు హానికరం అయిపోతుంది కూడా. చలనం పరంగా ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు మనకు తొలిపాఠాలు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల చలనం లేకపోతే మనం మనకే చెందం కదా? శ్వాసకు చలనం ఉండడంవల్లే మనం బతుకుతూ ఉన్నాం; మనకు ఉన్నవి ఉండడానికి కారణం శ్వాసకు చలనం ఉండడమే. మనం చలనంతో ఉండాలి అన్న ఆలోచన శ్వాసలాగా మనకు ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. మనిషికి ప్రధానమైన వ్యాధి స్తబ్దత. ఈ స్తబ్దతకు వైద్యం, విరుగుడు చలనం. అడుగు వేస్తే పడిపోతాం అనుకుని స్తబ్దతలో ఉండిపోవడం సరికాదు. భద్రత కోసం అనో, జరిగిపోతోంది కదా అనో స్తబ్దతలో, స్తబ్దతతో ఉండిపోవడం పెనుదోషం. ఆ దోషం ముదిరితే అది పాపంగా కూడా పరిణమిస్తుంది. ‘జీవితం వెనక్కు వెళ్లదు; అది నిన్నటితో ఉండిపోదు’ అని కవి–తాత్త్వికుడు ఖలీల్ జిబ్రాన్ ఒక సందర్భంలో అంటారు. చలనం అన్నది ఉంటుంది, ఉండాలి కాబట్టి ఆయన అలా అన్నారు. చలనం లేకుండా స్తబ్దతలో ఉండిపోతే జీవితం వెనక్కు, ఆ వెనక్కు పడిపోతుంది, జీవితం నిన్నటితో ఉండిపోవడం కాదు మొన్నటికీ, అటు మొన్నటికీ జారిపోతుంది. జీవితం నుంచి జీవనం జారిపోకూడదు; జీవనానికి జీవితం లేకుండా పోకూడదు. అందుకు స్తబ్దత కాదు చలనం కావాలి; చలనం ఉండాలి. సేద తీరచ్చు కానీ స్తబ్దతలో ఉండిపోకూడదు. అలిసిపోవడం సహజమైందే కానీ బిగుసుకుపోవడం అసహజమైంది. స్తబ్దతకు మలిదశ బిగుసుకుపోవడం. స్తబ్దత, బిగుసుకుపోవడం మనుగడలో ఉన్న మనిషి లక్షణాలు కావు, కాకూడదు. మరణించిన వ్యక్తి లక్షణాలు స్తబ్దత, బిగుసుకుపోవడం. మరణించాక తప్పనిసరిగా వచ్చేవి అవి. కాబట్టి మరణం రానంత వరకూ అవి మన దగ్గరకు రాకూడదు. మనుగడ ఉన్నంతవరకూ మనం వాటిని రానివ్వకూడదు. స్తబ్దత కారణంగా మనుగడలో ఉన్న మనం మరణించిన వ్యక్తులంలాగా మారిపోకూడదు. మరణించాక కూడా జీవించి ఉండేందుకు మనం చలనాన్ని ఒంటపట్టించుకోవాలి. మెరుపు మెరుపయింది చలనం వల్లే. గాలికి చలనం లేకపోతే మన పరిస్థితి ఏమిటి? మేఘాలకు, భూమికి చలనం అన్నది లేకపోతే మనకు ఉండేది ఏమిటి? మనకు మనగడే ఉండదు. చలనం అన్నది లేకపోతే మనం ప్రపంచానికి ఉండం; మనకు ప్రపంచం ఉండదు. చలనం లేకపోతే గమనం ఉంటుందా? ఉండదు. జీవనం అంటేనే గమనం. గమనానికి ఆరంభం చలనం. గమనానికి మాత్రమే కాదు ఏ గమ్యానికైనా తొలిచుక్క చలనమే. జీవితానికి జీవనం ఉన్నప్పుడు జీవనానికి చలనం ఉండాలి. స్తబ్దతలో మనల్ని మనం మోసుకుంటూ ఉండిపోవడం జీవనం కాదు; స్తబ్దతతో మనం మనకే బరువైపోవడం జీవితం కాదు. చలనం ఇంధనం కాగా జీవితం పండాలి. జీవితానికి జ్వలనం కావాలంటే జీవనానికి చలనం కావాలి. నది నది అయ్యేది చలనం వల్లే. చలనమే లేకపోతే నది అన్నదే లేదు; నది లేకపోతే జరగాల్సిన మేలు జరగదు. చలనం వల్ల ఏం మేలు జరుగుతుందో, ఎంత మేలు జరుగుతుందో నది మనకు తెలియజెబుతునే ఉంది. నదిని మనం స్ఫుర్తిగానూ, ఆదర్శంగానూ తీసుకోవాలి. మనం చలనంతో నదిలాగా బతకాలి; బతుకే గెలుపై మనం మునుముందుకు నడుస్తూ ఉండాలి. జీవనం అంటేనే గమనం. గమనానికి ఆరంభం చలనం. గమనానికి మాత్రమే కాదు ఏ గమ్యానికైనా తొలిచుక్క చలనమే. – రోచిష్మాన్ -
మంచి మాట: ఏదో.. ఏవో అనుకుంటూ...
ఒక పున్నమి రాత్రిలో తిక్కలోడు ఒకడు దారి వెంబడి నడుస్తూ పోతున్నాడు. కాసేపయ్యాక సేదతీరడం కోసం ఓ చెట్టు కింద నుంచున్నాడు. ఆ చెట్టుకు దగ్గరలో ఓ పెద్ద బావి కనిపిస్తే ఆ బావిలోకి తొంగి చూశాడు. ఆ బావి నీళ్లలో జాబిల్లి ప్రతిబింబం కనిపించింది. జాబిల్లి బావిలో పడిపోయింది అని అనుకున్నాడు. అయ్యో ఇప్పుడు నేనేం చెయ్యగలను? ఎలా ఈ జాబిల్లిని కాపాడగలను? ఇక్కడెవరూ లేరే, ఇప్పుడు ఈ జాబిల్లిని నేను కాపాడకపోతే అది చచ్చిపోతుంది కదా అని అనుకున్నాడు. అంతటితో ఊరుకోలేదు. అక్కడా ఇక్కడా వెతికి ఓ తాడును తీసుకుని దాన్ని బావిలోకి విసిరేశాడు జాబిల్లిని ఆ తాడుతో కట్టి బయటకు తియ్యచ్చని అనుకుని. ఆ బావిలో ఏదో ఓ రాయికి ఆ తాడు చిక్కుకుపోయింది. ఆ వ్యక్తి చాలబలంగా ఆ తాడును లాగాడు. కానీ రాయికి చిక్కుకుపోయిన తాడు రాలేదు. జాబిల్లి చాల బరువుగా ఉందే, పైగా నేనిక్కడ ఒంటరిగా ఉన్నానే, నేనెలా జాబిల్లిని బయటకు తియ్యగలను? ఈ జాబిల్లి ఎప్పటి నుండి ఈ బావిలో ఉందో తెలియడం లేదు, జాబిల్లి అసలు బతికి ఉందా, చచ్చిపోయిందా కూడా తెలియడం లేదు అని అనుకుంటూ ఆ వ్యక్తి తాడును బలంగా లాగుతున్నాడు. అలా లాగుతూ ఉండగా ఆ తాడు తెగిపోయి అతడు వెల్లకిలా నేలపై పడిపోయాడు. పడిపోవడంవల్ల అతడి కళ్లు మూసుకుపోయాయి. తలకు దెబ్బ తగిలింది. కొద్దిసేపు తరువాత అతడు కళ్లు తెరిచినప్పుడు జాబిల్లి ఆకాశంలో కనిపించింది. దాన్ని చూసి తను జాబిల్లిని కాపాడేశాడనీ, తనకు మాత్రమే కొంచెం దెబ్బ తగిలిందనీ అయినా పరవాలేదనీ తనవల్ల జాబిల్లి కాపాడబడిందనీ తనకు తాను చెప్పుకున్నాడు. ఆ వ్యక్తిని చూసి మనం నవ్వుకుంటాం. ఒక సందర్భంలో ఓషో చెప్పిన కథ ఇది. కథలోని వ్యక్తి ఎక్కడ తప్పు చేశాడు? అతడు తన తత్త్వంతో ఏదో అనుకున్నాడు. ఆ అనుకున్నది సరికాదు. మనం కూడా ఇలాగే ఏదో, ఏవో అనుకుంటూ ఉంటాం. చాలసందర్భాల్లో మనం అనుకునేవి సరైనవి కావు. ఈ తీరు మన సమస్యల్లో ప్రధానమైంది. అనుకోవడానికి అతీతంగా మనం బతకగలం అన్న చింతన కూడా మనలో చాలమందికి లేదు. ఎప్పడూ ఏదో ఒకటి అనుకుంటూ ఉండాల్సిందే అన్న స్థితిలో మనం కొట్టుమిట్టాడుతున్నాం. తిక్కవ్యక్తి, జాబిల్లి బావిలో పడిపోయిన ఈ కథలాగానే మానవజాతి మొత్తం ఇలాంటి సమస్యలో ఇరుక్కుపోయి ఉంది. ఈ ప్రపంచమంతా ఈ సమస్య ఉంది అని అంటారు ఓషో. దేన్నో అనుకుంటూ ఉండడమూ, దేన్ని పడితే దాన్ని అనుకుంటూ ఉండడమూ మనలోని సమస్యలు మాత్రమే కాదు మనం దిద్దుకోవాల్సిన తప్పులు. అభిప్రాయపడడంలాగా అనుకోవడం కూడా మనుషుల రుగ్మతే; కాకపోతే బలమైన బలహీనత. ఏదో, ఏవో అనుకుంటూ ఉండడంవల్ల మనుషులకు నష్టం, కష్టం, హాని కలుగుతూ ఉంటాయి. ఏదో, ఏవో అనుకుంటూ ఉండడం కాదు పరిస్థితులు, సంఘటనలపై సమగ్రమైన, సరైన అవగాహనను పొందేందుకు పూనుకోవాలి. అలాంటి అవగాహన మాత్రమే మనకు కావాల్సిన మేలు చేస్తుంది. అనుకోవడం అనేది ప్రతి వ్యక్తికీ ఉండే లక్షణమే. అనుకోవడం అన్న లక్షణం లేని మనుషులు ఉండరు. అయితే మనలో పలువురికి ఏం అనుకుంటున్నాం, ఎందుకు అనుకుంటున్నాం, అనుకునేది సరైందేనా? వంటివాటిపై ఉండాల్సిన పరిణతి, కచ్చితత్వం ఉండవు. ఈ తీరు పలు సమస్యలకు మూలం అవుతోంది. – రోచిష్మాన్ -
మంచి మాట: దాటవలసిన మనోభావాలు
సత్యాలు వేరు; మనోభావాలు వేరు. ఎవరి మనోభావాలు వాళ్లవి. మనోభావాలు వ్యక్తులకు సంబంధించినవి; మనోభావాలు లేకుండా ఎవరూ ఉండరు. మనిషి అన్నాక మనోభావాలు తప్పకుండా ఉంటాయి. మనోభావాలు అనేవి వ్యక్తిగతమైనవి మాత్రమే. సత్యాలు సార్వజనీనమైనవి. మనోభావాల మత్తులో సత్యాల్ని కాదనుకోవడం, అందుకోలేకపోవడం, వదిలేసుకోవడం అనర్థదాయకం, అపాయకరం. మనోభావాలు కాదు సత్యాలు మాత్రమే అవసరమైనవి ఆపై ప్రయోజనకరమైనవి. మనోభావాలు దెబ్బతింటాయి లేదా దెబ్బతింటున్నాయి అనే మాటను మనం వింటూ ఉంటాం. మనోభావాలు దెబ్బతినడం అంటూ ఉండదు. వ్యక్తులలో ఉండే మనోభావాలు ఉన్నంత కాలం ఉంటాయి. కాలక్రమంలో పోతూ ఉంటాయి. మనోభావాలు అనేవి ప్రతి వ్యక్తికి వయసుతోపాటు మారిపోతూ ఉంటాయి. ఏ వ్యక్తికైనా ఐదేళ్లప్పుడు ఉన్న మనోభావాలు పదేళ్లప్పుడు ఉండవు. పదేళ్లప్పటివి ఇరవై యేళ్లప్పుడు ఉండవు. వ్యక్తుల మానసిక స్థితిని బట్టి, తెలివిని బట్టి, తెలివిడిని బట్టి మనోభావాలు అన్నవి వేరువేరుగా ఉంటాయి. విద్య, సామాజిక, రాజకీయ, వైజ్ఞానిక, శాస్త్రీయ విషయాల్లోనూ, కళల్లోనూ, సార్వత్రికమైన విషయాల్లోనూ మనోభావాలు అనేవి అవసరం అయినవి కావు. సంఘ, ప్రపంచ ప్రయోజనాలపరంగా మనోభావాలు అనేవి ఎంత మాత్రమూ పనికిరావు. మానవ ప్రయోజనాలపరంగా సత్యాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. మనోభావాలు చర్చనీయమూ, పరిగణనీయమూ అవవు. ఒక వ్యక్తి మనోభావాలు మరో వ్యక్తికి, సమాజానికి అక్కర్లేనివి. మనోభావాలు, మనోభావాలు అని అంటూ ఉండడమూ, తమ మనోభావాలు ముఖ్యమైనవి లేదా విలువైనవి అని అనుకుంటూ ఉండడం మధ్యతరగతి జాడ్యం. మనోభావాలు ప్రాతిపదికగా వ్యవహారాలు, సంఘం, ప్రపంచం నడవవు. ఈ విజ్ఞత ప్రతివ్యక్తికి తప్పనిసరిగా ఉండాలి. మనం మన మనోభావాలవల్ల మనకు, సంఘానికి సమస్యలం కాకూడదు. మన మనోభావాలు మనల్నే అడ్డగించే గోడలుకాకూడదు. మన మనోభావాలకు మనమే గుద్దుకోకూడదు. మనోభావాలు మనుగడ మునుసాగడాన్ని ఆపెయ్యకూడదు. మనిషి జీవితంలో ఒక మేరకు వరకే మనోభావాలకు స్థానాన్ని, ప్రాముఖ్యతను ఇవ్వాలి. మనోభావాలకు అతీతంగా మనుగడను ముందుకు తీసుకువెళ్లడం మనిషి నేర్చుకోవాలి. మనోభావాలకు కట్టుబడి ఉండడం ఒక మనిషి జీవనంలో జరుగుతున్న తప్పుల్లో ప్రధానమైంది. స్వేచ్ఛగా సత్యాల్లోకి వెళ్లడం, వాటివల్ల స్వేచ్ఛను పొందడం ప్రతిమనిషికి ఎంతో ముఖ్యం. సత్యాలవల్ల వచ్చే స్వేచ్ఛ దాన్ని అనుభవిస్తున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. తమ మనోభావాల్ని అధిగమించినవాళ్లే సత్యాలలోకి వెళ్లగలరు. సత్యాలను ఆకళింపు చేసుకోగలిగితే మనోభావాలు, మనోభావాలవల్ల కలిగే కష్ట, నష్టాలు చెరిగిపోతాయి. మతం, కులం, ప్రాంతీయత, ఉగ్రవాదం వంటివాటివల్ల జరుగుతున్న హానికి, అల్లకల్లోలానికి మనోభావాలే కారణం. మనిషికి సత్యాలపై తెలివిడి వచ్చేస్తే ఈ తరహా దుస్థితి, దుర్గతి ఉండవు. హిట్లర్ మనోభావాల కారణంగా ప్రపంచయుద్ధమే వచ్చి ప్రపంచానికి పెనుచేటు జరిగింది. మనోభావాలకు అతీతంగా సత్యాలపై ఆలోచన, అవగాహన హిట్లర్‌కు, మరికొంతమందికి ఉండి ఉంటే రెండో ప్రపంచయుద్ధం జరిగేదే కాదు. మనోభావాలవల్ల కుటుంబాల్లోనూ, సమాజంలోనూ, దేశంలోనూ, ప్రపంచంలోనూ ఎన్నో దారుణాలు, ఘోరాలు, నేరాలు జరిగాయి, జరుగుతున్నాయి. చరిత్రను, సమాజాన్ని, మనపక్కన ఉన్న కుటుంబాల్ని పరిశీలిస్తే ఈ సంగతి తెలియవస్తుంది. మన మనోభావాలను మనవరకే మనం పరిమితం చేసుకోవాలి. మన మనోభావాలకు తగ్గట్టు విషయాల్ని, ఇతరుల్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని పరిగణనలోకి తీసుకోకూడదు. మన మనోభావాల ప్రాధాన్యతకు ఉన్న హద్దుల్ని మనం సరిగ్గా తెలుసుకోవాలి. మనోభావాలను దాటి సత్యాల ఆవశ్యకతను తెలుసుకుందాం; సత్యాలను ఆకళింపు చేసుకుందాం; సత్యాలవల్ల సత్ఫలితాలను పొందుదాం. సత్యాల సత్వంతో సరైన, సఫలమైన జీవనం చేస్తూ ఉందాం. – రోచిష్మాన్ -
Sri Shobhakruth Nama Ugadi 2023: శోభాయమానం
ఉగాది మన తొలిపండుగ. ఈసారి ఉగాదికి పేరు శోభకృత్. శోభ అంటే కాంతి. మన జీవితాలకు అవసరమైన...భాగ్యాల, సౌభాగ్యాల కాంతిని ఈ ఉగాది ఇస్తుందనిఆశిద్దాం. ఈసారి వసంత విషువత్ జరిగిన మరుసటి రోజున ఉగాది వచ్చింది. అంటే వసంత విషువత్ మొదలు అయిన మరుసటి రోజున చైత్రమాసంమొదలు అయింది. ఇది ఒక విశేషం. ఇలా జరగడం అరుదు. ఈ అరుదైన సంఘటన మనకు, దేశానికి, ప్రపంచానికి అత్యంత మేలు చెయ్యాలని అపేక్షిద్దాం. ఉగాదితో చాంద్ర–సౌర (లూని సోలర్) సంవత్సరం మొదలు అవుతుంది. పౌర్ణమి చంద్రుడు చిత్త లేదా చిత్ర నక్షత్రంతో ఉండడం చైత్రమాసం. చైత్రమాసం తొలిరోజు అంటే చైత్రశుక్ల పా డ్యమి రోజు ఉగాది అవుతుంది. చంద్రుడు ఒక నక్షత్రంతో మొదలుపెట్టి, భూమి చుట్టూ తిరిగి మళ్లీ ఆ నక్షత్రం దగ్గరకు రావడానికి పట్టే కాలం నాక్షత్రమాసం అవుతుంది. సూర్యుడు భూమధ్యరేఖను ఉత్తరంవైపుగా దాటడం వసంత విషువత్ అవుతుంది. వసంత విషువత్ మార్చ్ 21న జరుగుతుంది. ఆ రోజు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. సూర్య, చంద్ర గమనాలుప్రాతిపదిక కాబట్టి చాంద్ర–సౌర సంవత్సరం అవుతుంది. వ్యావహారిక శకానికి పూర్వం తొలిదశలో సప్త ఋషులు నాక్షత్ర సంవత్సరాన్ని, చాంద్ర–సౌర సంవత్సరాన్ని కలిపి పంచాంగాన్ని అమలులోకి తెచ్చారు. మూడు, ఐదు సంవత్సరాలలో వచ్చే అధికమాసాలను కలుపుకుని ఐదు సంవత్సరాలతో ఒక యుగం అని పంచాంగం పరంగా అమలు చేశారు. అప్పట్లో ఆ యుగం ఆరంభం శరత్ విషువత్, శరత్ ఋతువులో ఉండేది. ఈ ఐదు సంవత్సరాల యుగంలో మొదటి సంవత్సరంలో మొదటి రోజు యుగాది అని అయింది; అదే ఉగాది అయింది. ఈ యుగం జ్యోతిష శాస్త్రానికి ఆనుగుణ్యంగానూ రూపొందింది. ‘జ్యోతి’ అంటే నక్షత్రం అనీ ‘షం’ అంటే సంబంధించిన అనీ అర్థాలు. జ్యోతిషం అంటే నక్షత్రానికి సంబంధించినది అని అర్థం. నాక్షత్ర చాంద్ర– సౌర గమనాల ప్రా తిపదికన మన పంచాంగం నిర్మితమైంది. పంచాంగం ప్రకారం మనకు ఉగాది నిర్ణీతమైంది. సప్త ఋషుల తరువాత విశ్వామిత్ర మహర్షి పంచాంగంలోనూ, కాలగణనంలోనూ కొన్ని ప్రతిపా దనలను, మార్పులను తీసుకువచ్చాడు. ఆ తరువాత కాలక్రమంలో జరుగుతూ వచ్చిన ఖగోళమార్పులకు తగ్గట్లు గర్గ మహర్షి సంవత్సరాదిని వసంత విషువత్ కు మార్చాడు. ఆర్యభట్టు, వరాహమిహిరుడు దాన్నే కొనసాగించారు. అదే ఇప్పటికీ వస్తోంది. వసంత విషువత్‌తో వసంతం మొదలు అవుతుంది; సాంప్రదాయిక సంవత్సరాన్ని లేదా ఆచార వ్యవహారాల కోసం సంవత్సరాన్ని చైత్రమాసంతో మొదలుపెట్టారు. వసంతాన్ని కుసుమాకరం అనీ, కుసుమాగమం అనీ అంటారు. కుసుమానికి పుష్పం, పండు, ఫలం అని అర్థాలు ఉన్నాయి. ఈ మూడూ మనకు ఎంతో అవసరం అయినవి. తప్పకుండా మనం వీటిని ΄÷ందాలి. మన జీవితాలు కూడా నిండుగా పుష్పించాలి, పండాలి, ఫలవంతం అవ్వాలి. వసంతాన్ని ప్రకృతి ఇస్తున్న సందేశంగా మనం గ్రహించాలి. వసంతం ఒక సందేశం దాన్ని మనం అందుకోవాలి, అందుకుందాం. ఆరు ఋతువులకు ఆదిగా వచ్చేది ఈ పండుగ. సంవత్సరంలోని ఆరు ఋతువులకు ప్రతీకలుగా తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపుల్ని తీసుకుని ఆ రుచుల కోసం వేపపువ్వు, బెల్లం, మిరియాలపొడి, చింతపండు, ఉప్పు, మామిడి ముక్కల్ని కలిపి ఉగాది పచ్చడిని మనం తీసుకుంటున్నాం. నింబకుసుమ భక్షణం అని పేరు. ఇది ఉగాది పండుగలో ముఖ్యాంశం. మరో ముఖ్యాంశం పంచాంగ శ్రవణం. ఆదిలోనే ఎవరి రాశి ప్రకారం వారికి సంవత్సరంలో జరగడానికి అవకాశం ఉన్న మేలు, కీడులను వ్యక్తులకు సూచన్రపా యంగా పంచాంగం చెబుతుంది. పంచాంగ శ్రవణానికి ముందుగా మనం అభ్యంగన స్నానం చేసి, మామిడి తోరణాలతో, పుష్పాలతో ఇళ్లను అలంకరించుకుని దైవపూజ చెయ్యాలి; చేద్దాం.ప్రకృతి ఇచ్చిన సందేశాలుగా అందివచ్చిన ఉగాదిని, వసంతాన్ని ఆకళింపు చేసుకుని, ఆదర్శంగా తీసుకుని, మనం మనకు, ఇతరులకు ఈ ఏడాదిలోని అన్ని ఋతువుల్లోనూ హితకరం అవ్వాలి, అవుదాం. మంచికి తొలి అడుగుగా, ఒక పండుగగా, తొలి పండుగగా ఉగాది మనకు అందివచ్చింది. ఇతర పండుగలా కాకుండా ఉగాది కాలానికి, ప్రకృతికి సంబంధించిన పండుగ. మనిషి కాలానికి, ప్రకృతికి అనుసంధానం అవ్వాలని తెలియజెప్పే ఒక విశిష్టమైన పండుగ ఉగాది. వసంత ఋతువు రావడాన్ని వసంతావతారం అని కూడా అంటారు. వసంతావతారం సంవత్సరానికి ఉన్న అవతారాలలో గొప్పది. ఆపై శోభాయామానమైంది. సంవత్సరానికి శోభ వసంతం. వసంతం మనకు వచ్చే ఋతువుల్లో ప్రధానమైంది లేదా కేంద్రభాగం. చెట్లకు కొత్త చివుళ్లు, కోయిలల గానాలు, పచ్చదనం, పువ్వుల కళకళలు. వీటిని వసంతం తెస్తుంది, ఇస్తుంది. వసంతంలో ఎక్కువ వేడి, చలి ఉండవు. వాతావరణం ఉల్లాసకరంగా ఉంటుంది. వసంతం శ్రేష్ఠమైంది కాబట్టే ‘అహమృతూనాం కుసుమాకరః‘ అంటూ కృష్ణుడు భగవద్గీతలో తాను ఋతువుల్లో వసంతాన్ని అని చెప్పాడు. సంవత్సరంలో ఉండే మంచితనం వసంతం. వసంతం ప్రకృతి నుంచి మనకు అందివచ్చే మంచితనం. ‘... సంతో వసంతవల్లోకహితం చరంతః ...’ అని వివేకచూడామణిలో ఆదిశంకరాచార్య అన్నారు. అంటే మంచివాళ్లు వసంతంలాగా లోకహితాన్ని ఆచరిస్తారు అని అర్థం. వసంతం వంటి హితం, హితం వంటివసంతం మనకు, సంఘానికి, దేశానికి, ప్రపంచానికి ఎంతో అవసరం. – రోచిష్మాన్ -
ప్రతికూలమూ అనుకూలమే!
ఎదురుదెబ్బలు తగిలితే మనం బెదిరి పోకూడదు; పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే మనం చెదిరి పోకూడదు. ఏ పరిణామానికీ మనం బెదిరి పోకూడదు; ఏ పర్యవసానానికీ మనం చెదిరి పోకూడదు. బెదిరి పోయి భయపడుతూ ఉండడం జీవనం కాకూడదు; చెదిరి పోయి చతికిలపడి పోవడం జీవితం కాకూడదు. జీవనగతి ప్రగతిని, జీవితస్థితి అభ్యున్నతిని ΄పొందాలి. ‘ఇప్పుడు ఇది అంతం కాదు; ఇది అంతానికి ఆరంభం కూడా కాదు; కానీ ఇది ఆరంభానికి అంతం కావచ్చు’ అని విన్స్ టన్ చర్చిల్ చెప్పిన మాటల్ని ఆలోచనలోకి తీసుకుని ఎదురుదెబ్బలు తగిలినప్పడూ, పరిస్థితులు ప్రతికూలించినప్పుడూ మనం ప్రతిస్పందించాలి. ఎదురుదెబ్బలు తగిలినప్పుడూ, ప్రతికూలమైన పరిస్థితులప్పడూ మన గతి అంతమై పోయిందనో, మనం ఇక ఇంతే అనో కాకుండా కొత్త ఆరంభానికి ఇది అంతం అయి ఉండచ్చు అన్న ఆశాభరితమైన ఆలోచనతో మనం భవిష్యత్తును చేపట్టేందుకు ఉద్యుక్తులం అవ్వాలి. ఎదిగినవాళ్లందరూ ఎదురుదెబ్బలు తిన్నవాళ్లే. ప్రయోజకులు అయిన వాళ్లందరూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నవాళ్లే. ఏ తరుణంలో అయినా మన తీరే మనకు మేలు చేస్తుంది, మనల్ని మేలైనవాళ్లను చేస్తుంది. ‘వర్తమాన క్షణాలలో ఉన్న దాన్ని అంగీకరించు నువ్వే దాన్ని ఎంపిక చేసుకున్నట్లుగా’ అని జర్మన్ తాత్త్వికుడు ఎక్‌హార్ట్ టోల్ సరైన సూచన చేశారు. తగిలిన ఎదురుదెబ్బల్ని , ప్రతికూల పరిస్థితుల్ని మనం అంగీకరించాలి. నిజానికి అవి మనం ఎంపిక చేసుకున్నవి కాక పోయినా జరిగాయి కాబట్టి వాటిని మనం అంగీకరించాలి. అంగీకరించకుండా మనల్ని మనం మభ్యపెట్టుకోవడంవల్ల, వాటి దెబ్బకు కుంగి పోవడం వల్ల మనం వాటిని అధిగమించలేం. వాటిని మనం అధిగమించి తీరాలి. ఎదురు దెబ్బల్ని, ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించిన జీవితమే విజయవంతమైన జీవితం అవుతుంది. జీవితం అంటూ ఉన్నాక అది విజయవంతం అవ్వాలి. అబ్రహం లింకన్ 1831లో వ్యాపారంలో విఫలం అయ్యాడు. 1832లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయాడు. 1833లో వ్యా΄ారంలో మరోసారి విఫలమయ్యాడు. 1835 లో తీవ్రమైన నరాల జబ్బుతో బాధపడ్డాడు. 1838 లో స్పీకర్ పదవికి పోటీ చేసి ఓడి పోయాడు. 1840లో ఎలక్టర్ పదవికి పోటీ చేసి ఓడి పోయాడు. 1843, 48లలో కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి పోటీ చేసి ఓడి పోయాడు. 1855 లో సెనెట్‌కు పోటీ చేసి ఓడి పోయాడు. 1856లో ఉపాధ్యక్షుడి పదవికి పోటీ చేసి ఓడి పోయాడు. 1858 లో సెనెట్‌కు పోటీ చేసి ఓడి పోయాడు. 1860లో అమెరికా అధ్యక్షుడయ్యాడు. అబ్రహం లింకన్ ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు; ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. వాటిని అధిగమించినందుకు పొందిన విజయంగా ఆయన అమెరికా అధ్యక్షుడయ్యాడు. ఎదురుదెబ్బల్ని, ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించగలిగితే ఏం సాధించవచ్చో అబ్రహం లింకన్ జీవితం తెలియజేస్తోంది. ప్రపంచచరిత్రలో ఇటువంటి ఉదంతాలు చాల ఉన్నాయి. ఎదురుదెబ్బలు, ప్రతికూల పరిస్థితులు ఎవరికైనా తప్పవు. అవి ఉంటూనే ఉంటాయి. మనకు ఎదురు దెబ్బల్ని, ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించాలన్న సంకల్పం, ప్రయత్నం బలంగా ఉండాలి. ఆశ, ఆకాంక్ష, ఆసక్తి ఈ మూడూ మనిషి ప్రగతికి, అభ్యున్నతికి ఎంతో ముఖ్యం. వీటికి తోడుగా లేదా ఊతంగా నమ్మకం అనేది ఉండాలి. ‘ఓ నమ్మకమా! మాకు నమ్మకాన్నివ్వు, భయం నుంచి విముక్తి నివ్వు, అంతులేని సంపదలకు మమల్ని అధిపతుల్ని చెయ్యి...’ అంటూ సాగుతూ వేదంలో ఒక ప్రార్థన ఉంది. మనకు నమ్మకం కావాలి; మనం నమ్మకాన్ని నమ్ముకోవాలి. మన సంకల్పాన్ని, ప్రయత్నాన్ని నమ్ముకుని ఎదురుదెబ్బల్ని, ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి మనం రాణించాలి, రాజిల్లాలి. – రోచిష్మాన్ -
కదిలించే కావ్యం మహిళ
సృష్టిలో ఒక గొప్ప సృష్టి మహిళ. మహిళ గొప్పతనం గురించి గొప్పవాళ్లు ఎందరో ఎంతో గొప్పగా చెప్పారు. ఆ చెప్పినది అంతా మహిళ గొప్పతనానికి ఎంతమాత్రమూ న్యాయం చెయ్యలేదు, సరితూగలేదు. మహిళ గొప్పతనం గురించి ఎవ్వరూ గొప్పగా కాదుకదా తగినట్లుగా కూడా చెప్పలేదేమో? చెప్పలేరేమో?! అమ్మ అయింది, తోబుట్టువు ఆయింది, ఆలి అయింది; అడుగడుగునా మనతోడై నిలిచింది మహిళ. అనురాగం ఆప్యాయతల కలబోత అయిన మహిళ ఆనందానికి ఆలయం తానై వెలిసింది. మన ఉనికికి మూలం, మనుగడకు ఆలవాలం మహిళ. మూగిన జీవనచీకటిలో కాంతి మహిళ. మానవ బంధాలను, సంబంధాలను కలుపుతూ కదిలే కావ్యం మహిళ. మనల్ని కదిలించే కావ్యం మహిళ. మానవ జీవితకథకు ఇతివృత్తం మహిళ; మానవ జీవనకథనానికి గమనం మహిళ. మానవచరిత్రకు ఆత్మ మహిళ. అత్యుదాత్తతకు ఆకృతి మహిళ. తత్త్వంపరంగానూ, వ్యక్తిత్వంపరంగానూ, ప్రవర్తనపరంగానూ మహిళ ఎంతో విశిష్టమైంది. ‘మహిళ ఒకదాన్ని స్వీకరిస్తుంది ఆపై దాంతో సృజన చేస్తుంది; ఆ సృజన సూత్రం విశ్వంలోనే అత్యంత అద్భుతమైంది’ అని చైనీస్ తత్త్వవేత్త, కవి జుషి వందలయేళ్ల క్రితమే చెప్పా రు. ‘సారంలేని ఈ లోకంలో సారాన్ని ఇచ్చేది మహిళ అని తెలుసుకునే కాబోలు శివుడు తన అర్ధశరీరాన్ని మహిళకు ఇచ్చాడు’ అని ఒక పూర్వ సంస్కృతశ్లోకం మనకు చెబుతోంది. మనవాళ్లు మహిళకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు; మహిళకు ప్రశస్తమైన స్థానాన్ని ఇచ్చారు. వేదంలో ఒక వధువు, వరుడితో ‘‘నేను ఋక్ (సాహిత్యం), నువ్వు సామం (గానం)’’ అని అంటుంది. గానానికి సాహిత్యంలాగా మగవాడికి మహిళ ముఖ్యం. మహిళను సాహిత్యం అనడమే ఆమె గొప్పతనాన్ని చాటుతోంది. సాహిత్యం మనసుల్నీ, మస్తిష్కాల్నీ కదిలిస్తుంది. మహిళ కూడా అంతే. మన భారతదేశంలోని ఋషులలో రోమశ, లోపా ముద్ర, గార్గి, మైత్రేయి, అదితి, విశ్వనార, స్వస్తి, శశ్వతి, సూర్య, ఇంద్రాణి, శుచి, ఆపరి, ఉశన, గౌరివీతి, చైలకి, జయ, ్రపా దురాక్షి, మేధ, రమ్యాక్షి, లౌగాక్షి, వారుని, విదర్భి, విశ్వనార, వృష , సర్పరాజ్ఞి, సునీతి, హైమ ఇంకా కొందరు మహిళలు ఉండేవారు. కొన్ని మంత్రాలకు ఋషులైన మహిళలు ద్రష్టలు. వేదంలో ఒక మహిళ ‘‘నేను శిరస్సును, నేను జెండాను, నేను నిప్పుల మాటలు పలుకుతాను. నా భర్త నన్ను అనుసరించనీ’’ అంటుంది. ఈ మాటల్నిబట్టి వేదకాలంలో మహిళకు స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం నిండుగా ఉండేవని, మహిళకు విశేషమైన, ప్రత్యేకమైన స్థానాలు ఉండేవని తెలియవస్తోంది. ‘సమాజానికి, కుటుంబానికి మహిళ రక్షకురాలిగా వ్యవహరించాలి’ అనీ, ‘మహిళలు యుద్ధంలో పా ల్గొనాలి’ అనీ చెప్పిన వేదం ‘భర్తకు సంపా దించే మార్గాలు నేర్పించు’ అనీ మహిళకు చెబుతూ ఆమె ఆవశ్యకతను మనకు తెలియజేస్తోంది. ‘అదిశక్తి అంటూ శక్తి అంటే మహిళే అని మనకు తెలియ చెప్పడం జరిగింది. ‘శివుడు శక్తితో కలిస్తేనే జగత్తును సృష్టించే శక్తి కలవాడు అవుతాడు’ అని ఆదిశంకరులు సౌందర్యలహరిలో తెలియజెప్పా రు. మహిళ లేకపోతే శక్తే లేదు. మహిపై దేవుడి మహిమ వెల్లివిరిసింది, అది మహిళ అయింది. వ్యాఖ్యానించబడలేని ఔన్నత్యం ఒక మూర్తిమత్వాన్ని పొందింది; అదే మహిళ. మహిళను సరిగ్గా అర్థం చేసుకోవడం, సరిగ్గా గౌరవించడం మనం నేర్చుకోవాలి. సరైన మహిళకు సాటి సరైన మహిళతత్త్వమే. సరైన మహిళ లేదా సరైన మహిళతత్త్వం ప్రేరణ, స్ఫూర్తి కాగా మనం సరైన మనుగడ చెయ్యాలి. – రోచిష్మాన్ -
మార్పు ఒక సాంత్వన
మార్పును పొందడం, మారడం బతుకుతున్న మనిషికి ఎంతో అవసరం. మనిషి రాయి కాదు మార్పును పొందకుండా మారకుండా పడి ఉండడానికి. బతుకుతున్న మనిషి మార్పును పొందుతూ ఉండాలి, మారుతూ ఉండాలి. బతకడానికి సిద్ధంగా ఉన్న మనిషి మారడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఒక మనిషి మారకపోవడం అతడు సరిగ్గా బతకలేక పోవడమూ, బతకకపోవడమూ అవుతుంది. ‘నువ్వు ఇక్కడ ఉంది బతకడానికి; నువ్వు ఇక్కడ ఉంది ఆడడానికి; నువ్వు ఇక్కడ ఉంది బతుకును అనుభవించడానికి‘ అని ఓషో చెప్పా రు. మార్పు లేకుండా, మారకుండా రాయిలా బతికితే ఎలా? బతుకుతూ ఉండడానికి, బతుకును అనుభవిస్తూ ఉండడానికి మనిషిలో ఎప్పటికప్పుడు మార్పు వస్తూ ఉండాలి; మనిషి తనను తాను మార్చుకుంటూ, తనకు తాను మార్పులు చేసుకుంటూ బతుకును ఆస్వాదిస్తూ ఉండాలి. ర్పుల్ని స్వీకరించని మనిషికి, మారని మనిషికి, ఊరట ఉండదు, సాంత్వన ఉండదు. ‘ఎవరికి ఏది తెలియదో అది వాళ్లకు ఉండదు’ అని తాత్త్వికకృతి త్రిపురారహస్యం మాట. మారడం తెలియనివాళ్లకు మార్పు అనేది ఉండదు. మార్పు లేనివాళ్లకు బతుకు సరిగ్గా ఉండదు. అంతేకాదు బతకడమే భారమైపోతుంది. మనిషిలో మార్పులు రాకపోడానికి ముఖ్యమైన కారణాలు అభిప్రాయాలు. అభిప్రాయాల వలలో చిక్కుకుపోయినవాళ్లు మారడం చాతకాకుండా మానసికంగా బాధపడుతూనే ఉంటారు; తమవాళ్లను అదేపనిగా బాధపెడుతూనే ఉంటారు. అభిప్రాయాలకు అతీతమైన అవగాహన మనిషికి అవసరమైన మార్పుల్ని తీసుకొస్తూ ఉంటుంది. వయసువల్ల మనిషికి శారీరికమైన మార్పులు రావడం సహజం. ఆ విధంగానే ప్రతి మనిషికీ ఆలోచనపరంగా, దృక్పథంపరంగా, ప్రవర్తనపరంగా, మనస్తత్వంపరంగా మార్పులు రావాలి. మన దైనందిన జీవితంలో భాగం అయిపోయిన కంప్యూటర్లను మనం రిఫ్రెష్ చేస్తూ ఉంటాం. ఆ విధంగా మనల్ని కూడా మనం మాటిమాటికీ రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటూ ఉండడంవల్ల జడత్వం లేదా స్తబ్దత తొలగిపోతుంది. జడత్వం, స్తబ్దతలు తొలగిపోతున్న కొద్దీ మనలో మార్పు వస్తూ ఉంటుంది. మన జీవితాన్ని మన మస్తిష్కం నిర్ణయిస్తుంది. మస్తిష్కంలో మార్పులు రాకపోతే జీవితంలో మార్పులు రావు. మారని మస్తిష్కం మొద్దులాంటిది. మస్తిష్కం మొద్దుగా ఉంటే జీవితం మొద్దుబారిపోతుంది. మన చుట్టూ ఉన్నవాళ్లలో ఇలా మొద్దుబారిన జీవితాలతో చాలమంది కనిపిస్తూ ఉంటారు. మార్పులకు మాలిమి అవని వాళ్లు మానసికరోగులుగా కూడా అయిపోతారు. కొంతమంది ఉన్మాదులుగా అయిపోవడానికి కారణం వాళ్లలో మార్పు అనేది రాకపోవడమే; వాళ్లకు మార్పు అవసరం అని వాళ్లు గ్రహించకపోవడమే. ప్రపంచానికి ఎంతో కీడు చేస్తున్న మతోన్మాదం,ప్రాం తీయవాదం, ముఠాతత్త్వం వంటివాటికి మూలం మారని, మారలేని మనుషుల మనస్తత్వమే. మనుషులు పసితనం నుంచి మారుతూ వచ్చాక ఒక వయసు తరువాత మారడాన్ని ఆపేసుకుంటారు. తమ అభిప్రాయాలు, నమ్మకాలు, ఆలోచనలు, అభిరుచులు, ఉద్దేశాలు, ప్రవర్తన సరైనవే అని తీర్మానించుకుని తమలో తాము కూరుకుపోతూ ఉంటారు. మారకపోవడం తమ గొప్పతనం అని నిర్ణయించుకుంటారు. అటుపైన వాళ్లు మూర్ఖులుగానో, చాదస్తులుగానో, తిక్కవ్యక్తులుగానో, పనికిరానివాళ్లుగానో, అసూయాపరులుగానో, దొంగలుగానో, ఇంగితం లేనివాళ్లుగానో, వంచకులుగానో, చెడ్డవాళ్లుగానో, హంతకులుగానో రూపొందుతూ ఉంటారు. సంఘానికి, ప్రపంచానికి మారని పలువురివల్ల ఎంతో హాని జరిగింది, జరుగుతోంది. మారకపోవడంవల్ల మనుషులు మనుషులకు అపాయకరమైపోతూ ఉన్నారు. మార్పును పొందడం, మారడం మనుషులకు ఉండి తీరాల్సిన లక్షణం. ఊరట, సాంత్వన కావాలంటే, రావాలంటే, ఉండాలంటే మనుషులు మారడం నేర్చుకోవాలి. మారడం నేర్చుకుని మనుషులు శాంతంగా బతకాలి. – రోచిష్మాన్ -
మంచి మాట: నాణ్యతతో మాన్యత
నాణ్యత లేని మనిషి నాసిరకం మనిషి అవుతాడు. నాసిరకం మనిషి గడ్డిపోచకన్నా హీనం అవుతాడు. నాసిరకం మనిషి విలువలేని మనిషి, అనవసరం అయిన మనిషి అయిపోతాడు ఆపై అనర్థదాయకమైన మనిషిగానూ అయిపోతాడు. విద్య , సమాజం, సాహిత్యం, సంగీతం, కళలు, వృత్తులు, విధి నిర్వహణ... ఇలా అన్నింటా నాసిరకం మనుషులు కాదు నాణ్యమైనవాళ్లే కావాలి. నాణ్యత ఎంత కరువు అయితే అంత కీడు జరుగుతుంది. నాణ్యత ఎంత ఉంటే అంత మంచి జరుగుతుంది. నాణ్యత అన్నది సంస్కారం; మనిషికి ఉండాల్సిన సంస్కారం. నాణ్యత లోపిస్తే మనిషికి సంస్కారం లోపించినట్లే. నాణ్యత గురించి మనిషికి ఆలోచన ఉండాలి. మనిషికి నాణ్యమైన ఆలోచనలు ఉండాలి. నాసిరకం ఆహారం, నీరు తీసుకోవడంవల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది అని మనకు తెలిసిందే. నాసిరకం ఆలోచనాసరళివల్ల మన జీవితం చెడిపోతుంది అని అవగతం చేసుకోవాలి. నాణ్యమైన అభిరుచి, ప్రవర్తన, పనితీరు సాటివాళ్లలో మనకు గొప్పస్థాయిని ఇస్తాయి. చదువు నాణ్యమైంది అయితే అది వర్తమానంలోనివారికి, భావితరాలవారికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. చదవు నాసిరకంది అయితే పెనునష్టం జరుగుతుంది. గత ఆరు దశాబ్దులుగా నాసిరకం వ్యక్తులు ఎం.ఎ., ఎం.ఫిల్., పిహెచ్.డి. పట్టభద్రులు అవడంవల్ల, నాసిరకం వ్యక్తులు సాహితీవిమర్శకులు, కవులు, అధ్యాపకులు అవడం వల్ల, నాసిరకం రచనలకు పురస్కారాలు వస్తూ ఉండడంవల్ల తెలుగుసాహిత్యం, కవిత్వం పతనం అవుతూ నిరాదరణకూ, ప్రజల ఏవగింపుకు గురి అయిపోవడం క్షేత్రవాస్తవంగా తెలియవస్తోంది; అంతేకాదు వీళ్లవల్ల తెలుగుభాష కూడా వికలం అయిపోతూ ఉంది. ఏది ప్రక్రియ అవుతుందో కూడా తెలియని నాసిరకం వ్యక్తులవల్ల మరేభాషలోనూ లేని ప్రక్రియల పైత్యం తెలుగుకవితలో ముదిరిపోయింది. నాసిరకం వ్యక్తులవల్ల మత, కుల, ప్రాంతీయత, వాదాల ఉన్మాదం తెలుగుసాహిత్యాన్ని, కవిత్వాన్ని, భాషను ధ్వంసం చేస్తోంది. ఒక నాసిరకం వైద్యుడివల్ల రోగులకు సరైన వైద్యం జరగకుండా కీడు జరుగుతుంది. నాసిరకం కట్టడాలు కూలిపోతే ప్రజలకు జరిగే నష్టం భర్తీ చెయ్యలేనిది. నాసిరకం భావజాలాలవల్ల పలువురి బతుకులు బలి అవుతూ ఉండడమే కాదు పలువురు దుష్టులై సంఘానికి హానికరం అయ్యారు, అవుతున్నారు. నాసిరకం మనస్తత్వం వల్లే అసమానతలు, నేరప్రవృత్తి వంటివి సమాజాన్ని నిత్యమూ బాధిస్తున్నాయి. నాసిరకం చదువుల వల్ల, పనితీరువల్ల, ఆలోచనలవల్ల, ప్రవర్తనలవల్ల, మనిషికీ, సమాజానికీ, ప్రపంచానికీ విపత్తులు కలుగుతూ ఉన్నాయి, ఉంటాయి. కొందరి నాసిరకం చింతనవల్ల, దృక్పథంవల్ల, పోకడవల్ల మామూలు మనుషులుగా కూడా పనికిరానివాళ్లు, సంప్రదాయానికి చెందని వాళ్లు దైవాలుగా అయిపోయి అహేతుకంగా, అశాస్త్రీయంగా ఆలయాలు, అర్చనలు, హారతులతో పూజింపబడుతూ ఉన్న దుస్థితి మనలో తాండవిస్తోంది. ఈ పరిణామం నైతికత, సంస్కృతి, ధార్మికతలకు ముప్పు అవుతోంది. ఇలాంటివి కాలక్రమంలో ప్రజల్లో చిచ్చుపెడతాయి. నాసి వాసికెక్కకూడదు; నాణ్యత మాన్యత చెరిగిపోదు. నాణ్యత ప్రతిమనిషికీ ఎంతో అవసరం. మనిషి నాణ్యతకు అలవాటుపడాలి. నాణ్యత తప్పకుండా కావాల్సింది, ప్రయోజనకరమైంది ఆపై ప్రగతికరమైంది. నాణ్యతను వద్దనుకోకూడదు, వదులుకోకూడదు. నాణ్యతను మనం అనుగమించాలి, అనుసంధానం చేసుకోవాలి. నాణ్యతతో మనం క్షేమంగానూ, శ్రేష్ఠంగానూ బతకాలి. నాణ్యమైన వృత్తికారులవల్ల వృత్తి పరిఢవిల్లుతుంది. నాణ్యమైన కళాకారులవల్ల కళ పరిఢవిల్లుతుంది. నాణ్యమైన క్రీడాకారులవల్ల క్రీడ పరిఢవిల్లుతుంది. నాణ్యమైన మనుషులవల్ల సంఘం పరిఢవిల్లుతుంది. నాణ్యతవల్ల నాణ్యత నెలకొంటుంది; నాణ్యతవల్ల భవ్యత వ్యాపిస్తుంది. మనుషులమై పుట్టిన మనం మళ్లీ మనుషులమై పుడతామో లేదో? కనుక ఈ జన్మలో నాణ్యతనే కోరుకుందాం; నాణ్యతనే అందుకుందాం. – రోచిష్మాన్ -
మంచి మాట: విజయం ఓటమి తర్వాత వేకువ
ఓటమి ద్వారా వచ్చే విజయం ఉంది! అది ఓటమి నేర్పే పాఠం!! ఓటమి నేర్పే పాఠం ఎంతో ముఖ్యమైంది ఆపై విలువైంది; అది మరేవిధంగానూ రాదు. ఓటమి దెబ్బ బలంగా తగిలినా మనిషి పడిపోకుండా నిలబడి ఆ పాఠాన్ని చదవాలి. ఓటమి నేర్పిన పాఠాన్ని సరిగ్గా చదవగలిగిన మనిషికి భవిష్యత్తులో విజయం అందుతుంది; విజయవంతమైన భవిష్యత్తు అందుతుంది. ఓడిపోయాక శోకిస్తూ ఉండడం సరికాకపోవడమే కాదు హానికరమైంది కూడా. ఓడిపోయాకైనా గెలవాలి అన్న పట్టుదల కలగాలి. ఆ పట్టుదల ఓటమి తరువాతి జీవనంపై పట్టును ఇవ్వాలి. ఓడిపోవడం నేరం కాదు. ఓడిపోయాక తలదించుకోవాల్సిన అగత్యంలేదు. ఓడిపోతే కుంగిపోకూడదు ఓటమికి లొంగిపోకూడదు. ఓడిపోతే వాడిపోకూడదు, వాడిమిని కోల్పోకూడదు. ఓడిపోయాక మనిషి ఎడారిలో ఒంటరివాణ్ణి అయిపోయానని కృశించిపోతూ ఉండిపోకూడదు; ఎందుకూ కొరగాని వాణ్ణి అయిపోయానని నిస్తేజంగా ఉండిపోకూడదు. ఓడిపోతే నిస్ప్పహా ప్రభావానికి మ్రాన్పడి చిల్తై పోకూడదు. ఓడిపోయాక, నిస్పృహ ఆవరించాక నిద్రలోంచి లేచినట్లుగా లేవాలి. ఆపై మెలకువను పొందినట్లుగా సత్స్పృహను పొందాలి. ఓడిపోతే కష్టాలొస్తాయి; ఆ కష్టాలలోనే సత్యాలు తెలుస్తాయి. ఆ సత్యాలు ఎంతో ముఖ్యమైనవి. జీవితం అన్నాక, జీవనం ఉన్నాక ఆశాభంగం తప్పదు. భంగం అయినంత మాత్రాన భాగ్యం భగ్నమైపోదు. ఓడిపోయిన తరువాత నిలదొక్కుకోగలిగిన మనిషి ముందుకు సాగగలడు. కలిగిన ఓటమికి దెబ్బతిన్నాక గెలవడంపై మనిషికి చైతన్యం రావాలి. ఓటమి గురించి చింత, చింతనలను అధిగమించాలంటే మనిషికి గెలవాలి అన్న చైతన్యం కావాలి, రావాలి. ఆ చైతన్యంతో గెలుపును సుసాధ్యం చేసుకోవాలి. ఓటమి కలిగాక దాన్ని అర్థం చేసుకుని అంగీకరించాలి. కలిగిన ఓటమికి మనం సాక్ష్యం మాత్రమే అవ్వాలి. అంతకుమించి మనం ఓటమిలో కూరుకుపోకూడదు. భవిష్యత్తులో విజయంలో విలీనం అవ్వాలంటే కలిగిన ఓటమి నుంచి మనల్ని మనం విడిపించుకోవాలి. విజయం సాధించడం ఎలాంటిదో ఓటమి నుంచి విడివడడం కూడా అలాంటిదే. ప్రపంచంలో విజేతలైనవాళ్లలో ఎక్కువ శాతంమంది ఓటమి నుంచి తమను తాము విడిపించుకున్నవాళ్లే. సూర్యోదయాన్ని పొందుతూ ఉండడం భూమి రోజూ సాధిస్తున్న విజయం. పొంగుతూ, సాగుతూ పారడం నది సాధిస్తున్న విజయం. వీస్తూ ఉండడం గాలికి విజయం. విజయం అనేది ఒక లక్ష్యమా? కాదు. విజయం అనేది లక్షణం. అవును విజయం అనేది మనిషికి లక్ష్యంగా కాదు లక్షణం గా ఉండాలి. ఓటమి చీకటిలా మూగినప్పుడు కాస్తంత ఓపికపడితే విజయం వేకువై వచ్చేస్తుంది. ‘‘వేసవికాలం వెంబడించని చలికాలం లేదు’’ అన్నారు వివేకానంద. ఓటమి అనే చలికి పట్టుబడి గడ్డకట్టుకుపోకుండా ఉండగలగాలి. చలికాలం తరువాత వేసవి వచ్చేస్తుంది. ఓటమి శోకాన్ని కలిగించినా విజయాన్ని సాధించేందుకు కాలం ఉందని, ఉంటుందని తెలుసుకోవాలి. విజయం కోసం ఆశపడితే, ఆకాంక్షిస్తే తప్పకుండా మనిషికి అవకాశాలు ఆసన్నం అవుతాయి. వాటిని సఫలం చేసుకుంటే విజయం వస్తుంది. ఆ విజయానికి చిహ్నంగా మనిషి జీవితం వసంతం అవుతుంది. – రోచిష్మాన్ -
మంచి మాట: మెలకువలోనే మేలిమి
మనిషి మెలకువలో ఉండాలి; మనిషి మేలుకుని మసలాలి. మెలకువలో ఉండేందుకు, మేలుకుని మసలేందుకు మనిషి బతకాలి; మనిషి మేలుగా బతకాలి. నిద్రపొకూడదనీ, నిద్రవద్దనీ కాదు నిద్రపొతున్నప్పడు మాత్రమే మనిషికి నిద్ర ఉండాలి. నిద్ర అనేది మనిషికి కొంచెంసేపు వేసుకునే వస్త్రంగా మాత్రమే ఉండాలి. నిద్ర మనిషి పూర్తిగా కప్పుకునే దుప్పటి కాకూడదు; మనిషి తనను తాను నిద్రతో కప్పేసుకోకూడదు. మెలకువతో, మెలకువలో మనిషి తనను తాను చాటుకుంటూ ఉండాలి. ‘మెలకువలో కల నిజం కాదు; కలలో మెలకువ లేదు‘ అని ఆదిశంకరాచార్య చెప్పొరు. ఈ మాటల్ని మనసులోకీ, మెదడులోకీ ఎక్కించుకోవాలి. కలలు కనడానికి నిద్రపొతూ ఉండడంలోనూ, నిద్రలో కలలు కంటూ ఉండడంలోనూ కాలాన్ని వ్యర్థం చేసుకోకూడదు. కలలోనూ, నిద్రలోనూ మెలకువ ఉండదు. మనకు మెలకువ కావాలి ఎందుకంటే మెలకువలో కల నిజం కాదు. మనిషి కల కాకూడదు; మనిషి నిజం కావాలి. భద్రంగా ఉండాలని మనం నిద్రలోనే ఉండిపొకూడదు. నిద్రలో అటూ, ఇటూ ΄పొర్లుతూ ఉండడం జీవితవిధానం కాదు, ఎప్పటికీ కాకూడదు. నిద్రలో కలవరిస్తూ ఉండడంలోనూ, ఆ కలవరింతల్లో జరిగిపొయిన వాటిని వర్ణించుకుంటూ ఉండడంలోనూ మునిగిపొయిన మనిషి బతుకును పొడు చేసుకోవడం అనే నేరం చేస్తున్న నేరస్థుడు. ఎన్నో కలలు వస్తూ ఉంటాయి నిద్రలో. ఆ కలలు అన్నిటిలోనూ కల్లల్ని చూసుకుంటూ ఉండిపొవడం వయసును చిదుముకోవడమే అవుతుంది. కొందరు నిద్రపొతున్నప్ప్డుడు మాత్రమే కాదు మేలుకుని ఉన్నప్పుడు కూడా కలలకంటూ ఉంటారు; కొందరు మెలకువను కూడా కలల్లో గడిపేస్తూ ఉంటారు, కలల్లో కలిపేస్తూ ఉంటారు. ఇది అవాంఛనీయమైన స్థితి; ఇది బాధాకరమైన స్థితి. మెలకువను కూడా కలల్లో గడిపేస్తూ, కలిపేస్తూ ఉండేవాళ్లు కల్లలు అయిపొతారు. మనిషి కల్ల అయిపొకూడదు. అందుకే మనిషి వీలైనంత మెలకువలో ఉండాలి; అందుకే మనిషి వీలైనంత మేలుకుని ఉండాలి. పుట్టిన వ్యక్తికి తప్పకుండా మరణం ఉంటుంది. పుట్టుక, మరణం మధ్యలో ఉండే నిడివి జీవితం అవుతుంది. జీవితంలో మెలకువతో ఉండడమే జీవనం అవుతుంది. జీవి జీవితానికి మెలకువ జవ. ఆ జవ ఉన్న జీవనంలోనే చవి ఉంటుంది. జవ, చవి లేని మనిషి జీవితం చెక్కకో, చెత్తకో సమానం అవడం కాదు చెక్కకన్నా, చెత్తకన్నా హీనం ఆపై హేయం అవుతుంది. మనిషి చెక్కో, చెత్తో అవడం దుస్థితి, దుర్గతి. ‘యా మతిస్సా గతిర్భవేత్‘ అని అష్టావక్రగీతలో చెప్పడం జరిగింది. అంటే మతి ఎటువంటిదో గతి అటువంటిది అని అర్థం. మనిషి మతికి మెలకువ ఉంటే గతికి మెలకువ ఉంటుంది. మతికి, గతికి మెలకువ ఉంటే మనిషి చెక్కో, చెత్తో అయిపొయే దుస్థితి ఉండదు, రాదు. ప్రకృతి మెలకువలోనే ఉంటుంది. ప్రకృతి నిద్రపొతే ఏం అవుతుందో మనం ఒకసారి ఆలోచిద్దాం. ప్రకృతి నిద్రపొతే మన ఆలోచనలకు కూడా అందని పరిణామాలు సంభవిస్తాయి. గాలి మెలకువలో ఉండడం వల్లే మనం ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాం. రాత్రుల్లో మొక్కలు మెలకువతో ఉండబట్టే పువ్వులు పూస్తూ ఉన్నాయి. నదులు మెలకువతోపొతూ ఉన్నాయి కాబట్టే మన అవసరాలు తీరుతూ ఉన్నాయి. ‘గచ్ఛ తీతి జగత్‘ అంటారు;పొతూనే ఉంది కాబట్టే జగత్ అయింది అని దానికి అర్థం. జగత్తు మొత్తం మెలకువతో ఉంది; మేలుకుని ఉంది. భూమి మెలకువతో ఉంది కాబట్టే సూర్యోదయం జరుగుతోంది; మనిషి మెలకువ తో ఉంటేనే జీవనోదయం జరుగుతుంది. ‘కంపనాత్‘ అని అంటూ ’కదలడంవల్ల అది బ్రహ్మం’ అని ఒక బ్రహ్మసూత్రం మనకు ఎరుకను ఇస్తోంది. ప్రకతి మాత్రమే కాదు బ్రహ్మం కూడా కదలిక ఉన్నదే. ప్రకృతి, బ్రహ్మం రెండూ మెలకువలో ఉండేవే; మేలుకుని ఉండేవే. ఎంత మెలకువ ఉంటే అంత మేలును ΄పొందుతాం. ఎంత మేలుకుని ఉంటే అంత మేలిమిని ΄పొందుతాం. మెలకువలో బతుకుతూ మనం మేలును ΄పొందుతూ ఉందాం; మేలుకుని బతుకుతూ మనం మేలిమికి మాలిమి అవుదాం. – రోచిష్మాన్ -
మంచి మాట: ఉన్నంతవరకూ ఉన్నతంగానే...
కష్టానికి కష్టం వస్తేనూ, నష్టం నష్టపోతేనూ బావుణ్ణు; మనిషి కష్టం లేకుండానూ, నష్టపోకుండానూ బావుంటాడు’ ఇలా అనుకోవడం బావుంటుంది. కానీ వాస్తవంలో ప్రతిమనిషికీ జీవితంలో, జీవనంలో కష్టాలు, నష్టాలు కలుగుతూనే ఉన్నాయి, కలుగుతూనే ఉంటాయి. మనిషినే కాదు ప్రపంచాన్ని కూడా కష్టాలు, నష్టాలు కుదిపేస్తూనే ఉన్నాయి, కుదిపేస్తూనే ఉంటాయి. జీవనంలో కలుగుతూ ఉండే కష్టాలు, నష్టాలవల్ల నిస్తేజమూ, కలవరమూ, గందరగోళమూ ఎవరికైనా తప్పవు. జీవితం అన్నాక కష్టం, నష్టం ఒకటి తరువాత ఒకటిగా, ఒకదానిపై ఒకటిగా వస్తూనే ఉంటాయి. వచ్చిన కష్టం ఏదైనప్పటికీ, కలిగిన నష్టం ఎంతదైనప్పటికీ మనిషి వాటిని తట్టుకోగలగాలి. కష్టాలకు, నష్టాలకు లొంగిపోకూడదు, కుంగిపోకూడదు. మనిషి లొంగిపోయాడు, కుంగిపోయాడు కదా అని కష్టాలు,నష్టాలు మనిషిని వదిలెయ్యవు. లొంగిపోయిన, కుంగిపోయిన మనిషి కష్టాలు, నష్టాలు ఉద్ధృతం అవుతాయి. మనిషి తన మనసుతో, మెదడుతో కష్టాలను, నష్టాలను నిలువరించి అధిగమించాలి. చచ్చినట్టు బతకడం నుంచి నచ్చినట్టు బతకడంలోకి వెళ్లేందుకు మనిషి ప్రయత్నించాలి. అందువల్ల కష్టాలు, నష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మనిషి తనను తాను తయారుచేసుకోగలుగుతాడు. తాను చచ్చేలోపు ఉచ్ఛ స్థితికి చేరుకోవాలన్న ఆలోచన చెయ్యాలి. ఆ స్థితిని సుసాధ్యం చేసుకోవడం మనిషి నేర్చుకోవాలి. అందువల్ల కష్టాలు, నష్టాలు తనను నిస్తేజంలోకి నెట్టెయ్యకుండా మనిషి నిలదొక్కుకోగలడు. మనుషులమై పుట్టామని గుర్తుంచుకుందాం; ఏ కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా చేవను ఊతంగా చేసుకుందాం. జరిగిపోయిన వాటి గురించీ, కలిగిన కష్టాలు, నష్టాల గురించీ చింతిస్తూ ఉండిపోవడం పిరికితనం. మనం పిరికితనానికి బలి కాకూడదు. పిరికితనం నుంచి మనం ధైర్యంతో బయటపడాలి. కష్టం, నష్టం నుంచి విముక్తం అవడానికి మనకు ధైర్యం కావాలి. మనం ధైర్యంతో కదలాలి. ‘ఉన్నంతవరకూ ఉన్నతంగానే ఉందాం, అనే చింతన వస్తే ఏ కష్టం లోనైనా, ఎంత నష్టంలోనైనా మనకు చైతన్యం వస్తుంది. ఆ చైతన్యమే కష్టాలు, నష్టాల నుంచి మనల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టం కలిగినప్పుడూ, నష్టం కలిగినప్పుడూ మనిషికి నిస్పృహ వచ్చేస్తుంది. ఇక్కడే మనిషి జాగ్రత్తగా ఉండాలి. నిస్పృహ అనే మత్తుకు మనిషి అలవాటు పడకూడదు. ఆవరించిన నిరాశను అంతం చేసుకోవాలి. అటుపైన మతిలో సదాశ పుట్టాలి. మనిషి ఆశపడాలి. కష్టాలు, నష్టాలు కలిగాక వాటికి అతీతం అవ్వాలనే ఆశ కావాలి. సుఖపడాలని మనిషి ఆశపడాలి. బాగా బతకడానికి అవకాశాలు ఎప్పటికీ బతికే ఉంటాయి. ఆ విషయాన్ని మనం సరిగ్గా పసికట్టాలి. దెబ్బతిన్న తరువాత బాగు పడాలనుకోవడం దోషం కాదు. దెబ్బతిన్న తరువాతైనా, దెబ్బ తిన్నందుకైనా మనిషి బాగుపడి తీరాలి. మళ్లీ పుడతామో లేదో మనకు తెలియదు; మరణించాక మనకు పని ఉండదు; బాగా బతకాలని గట్టిపట్టుపడదాం. కష్టం, నష్టంవల్ల మనల్ని మనం కోల్పోకూడదు. జీవనం జారిపోతే జీవితం పండదు. మనిషికి ఆశ కావాలి. మనిషి తన బతుకును తాను ఆస్వాదించడం నేర్చుకోవాలి. బతుకును ఆస్వాదించడం తెలిస్తే కష్టాలనూ, నష్టాలనూ ఓడించడం తెలుస్తుంది. కష్టనష్టాలపై గెలుపు మనిషికి పొలుపు. మనకు గతాన్నీ, వర్తమానాన్నీ ఇచ్చిన కాలం భవిష్యత్తునూ ఇస్తుంది. కష్టానికీ, నష్టానికీ మనం పతనం అయిపోవడం కాదు, కలిగిన కష్టాన్నీ, నష్టాన్నీ పతనం చెయ్యడానికి మనం ఉపక్రమించాలి. ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ ఊపిరిలోకి తీసుకుని ఉద్యుక్తులమై మనం ఉన్నతమైన ప్రగతిని సాధించాలి. ఏ చీకటైనా తొలగిపోవాల్సిందే. ఎంతటి తుఫానైనా ఆగిపోవాల్సిందే. చీకటి మూగినప్పుడు సంయమనంతో ఉంటే ఉదయాన్ని చూడగలం. తుఫాను ముంచుకొచ్చినప్పుడు అప్రమత్తంగా ఉంటే ప్రశాంత వాతావరణంలోకి వెళ్లగలం. భూకంపం వచ్చాక కూడా అభివృద్ధి జరుగుతుందని, జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. కష్టాలు, నష్టాలు దెబ్బలలా, దెబ్బలమీద దెబ్బలలా తగులుతున్నప్పుడు జీవితం పగిలిపోలేదని గ్రహించాలి. మనం ఉన్నందుకు, మనకు ఉనికి ఉన్నందుకు మనకు పటుత్వం ఉండాలి. కష్టాలు, నష్టాలు కలిగినా నేడు అనే వేదికపైన మనం నిలదొక్కుకుని ఉండగలిగితే రేపు వస్తుంది. ఆ రేపు మనల్ని కష్టాలు, నష్టాలు వీడిపోయిన ఎల్లుండిలోకి తీసుకెళుతుంది. – రోచిష్మాన్ -
మంచి మాట: శత్రుత్వంతో శత్రుత్వం పెట్టుకుందాం
ఏ ఒకవ్యక్తిని మాత్రమో... ఏ కొంతమందిని మాత్రమో కాదు, కుటుంబాలకు కుటుంబాలను, ఊళ్లకు ఊళ్లను, రాష్ట్రాలకు రాష్ట్రాలను, దేశాలకు దేశాలను, మొత్తం ప్రపంచాన్ని వేధించేది శత్రుత్వం. ప్రతిమనిషికీ, ప్రపంచానికీ శత్రుత్వం తీరని గాయాల్ని కలిగిస్తూనే ఉంది. జీవితాలకు జీవితాలే శత్రుత్వానికి కాలి బూడిద అయిపోయాయి. శత్రుత్వం అగ్ని అయి అందరికీ అంటుకుంది, అంటుకుంటోంది... ఉన్నంతవరకూ నిప్పు కాలుస్తూనే ఉంటుంది. అదేవిధంగా శత్రుత్వం మనిషి కడతేరిపోయేంతవరకూ రగులుతూనే ఉంటుంది. అంతేకాదు వ్యక్తులుపోయాక కూడా వాళ్ల వారసులకూ అంటుకుని శత్రుత్వం వ్యాపిస్తూనే ఉంటుంది, వ్యాపిస్తూనే ఉంది. శ్వాస తీసుకుంటున్నట్లుగా మనిషి శత్రుత్వాన్ని కూడా తీసుకుంటున్నాడేమో అని అనిపిస్తోంది. పుట్టీపుట్టడంతోనే శత్రువును, వ్యాధిని ఎవరైతే పోగొట్టుకోడో అతడు ఎంతటి బలవంతుడైనా నశించిపోతాడని భోజ చరిత్రం చెబుతోంది. అంటే వ్యాధిని, శత్రువును లేదా శత్రుత్వాన్ని ముదరనివ్వకూడదు. సాధ్యమైనంత వేగంగా వాటిని తీర్చేసుకోవాలి. శత్రుత్వం వ్యాధిలాంటిది అని అనడం, అనుకోవడం కాదు శత్రుత్వం వ్యాధికన్నా వినాశకరమైంది అనే సత్యాన్ని మనం తప్పకుండా అవగతం చేసుకోవాలి. కొన్ని దేశాల మధ్యనున్న శత్రుత్వం మరికొన్ని దేశాలనూ బాధించింది, బాధిస్తోంది... కొన్ని దేశాల మధ్యనున్న శత్రుత్వం వల్ల జరిగిన యుద్ధాల్లో కలిగిన ప్రాణ నష్టాన్ని, సంపద నష్టాన్ని చరిత్ర మనకు తెలియజెబుతూనే ఉంది. శత్రుత్వం కారణంగా దేశ దేశాల ప్రజలు విలవిలలాడిపోయారు, విలవిలలాడిపోతున్నారు...ఇటీవలి కరోనా విలయానికి కూడా కొన్ని దేశాల శత్రుత్వమే కారణం అని కొన్ని పరిశీలనలు, విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. సంస్కృతి పరంగానూ, సంపదపరంగానూ, విద్యపరంగానూ, అభివృద్ధి పరంగానూ ఏర్పడిన శత్రుత్వం ప్రధాన కారణం కాగా మనదేశంలోకి విదేశీ దురాక్రమణదారులు చొరబడి దేశాన్ని కొల్లగొట్టడమూ, ఆక్రమించుకోవడమూ, సామాజిక పరిస్థితిని అల్లకల్లోలం చెయ్యడమూ అందువల్ల మనదేశానికి పెద్ద ఎత్తున నష్టం, కష్టం కలగడమూ చారిత్రికసత్యంగా మనకు తెలిసిందే. కొన్ని శతాబ్దులకాలం మనదేశం పరపాలనపీడనలో దురవస్థలపాలవడానికి శత్రుత్వం ప్రధానమైన కారణం అయింది. ఒక్క మనదేశంలోనే కాదు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా శత్రుత్వం కారణంగా ఇలాంటి ఉదంతాలు ఉన్నాయి. ప్రపంచంలోని ఎన్నో దురంతాలకు శత్రుత్వం ఒక్కటే ప్రాతిపదిక అయింది. శత్రుత్వం ఉంటే దురంతమే ఉంటుంది. శత్రుత్వం ప్రేరణకాగా ప్రపంచంలో ఎన్నో ఘోరమైన పరిణామాలు జరిగాయి. శత్రుత్వంవల్ల మనం ఎంత మాత్రమూ క్షేమంగా లేం. శత్రుత్వంవల్ల చాలకాలం క్రితమే మనిషితో మనిషికి ఉండాల్సిన సంబంధం లేకుండాపోయింది. శత్రుత్వం మనిషిని ఆవహించింది అందువల్ల మనం ఎంత మాత్రమూ భద్రంగా లేం. ఈ క్షేత్రవాస్తవాన్ని మనం బుద్ధిలోకి తీసుకోవాలి. మనిషి ప్రగతి, ప్రశాంతతలను, ప్రపంచ ప్రగతి, ప్రశాంతతలను ధ్వంసం చేస్తున్న శత్రుత్వాన్ని తక్షణమే త్యజించాలి. క్షయకరమైన శత్రుత్వం మనిషి లక్షణం కాకూడదు. శత్రుత్వం మనిషి జీవనంలో భాగం కాకూడదు. ‘ఇది నాలుగురోజుల జీవితం ఎందుకు ఎవరితోనైనా శత్రుత్వం? నీకు శత్రుత్వమే కావాలనుకుంటే చెయ్యి శత్రుత్వంతోనే శత్రుత్వం’ ఈ భావంతో తెలుగు కవి–గాయకుడు పి.బి. శ్రీనివాస్ ఒక ఉర్దూగజల్ షేర్ రాసి, పలికారు. ఆలోచిద్దాం... మన బతుకుల వర్తమానాన్నీ, భవిష్యత్తునూ ఛిద్రం చేసే శత్రుత్వం మనకు ఎందుకు? ఆలోచిద్దాం... మనం జీవించడానికి శత్రుత్వం అవసరం ఉందా? మనం శత్రుత్వాన్ని సంపూర్ణంగా వదిలేసుకుందాం. అది సాధ్యం కాకపోతే శత్రుత్వంతోనే శత్రుత్వం చేద్దాం. సాటి మనిషికీ, సమాజానికీ కాదు మనిషి శత్రుత్వానికి శత్రువైపోవాలి. మనిషికి శత్రుత్వంలో ఉన్న నిజాయితి, అభినివేశం స్నేహంలో లేకుండా పోయాయి. ఇది విధ్వంసకరమైన స్థితి. ఈ స్థితి మనకు వద్దు. మనిషి తీరు మారాలి. శత్రుత్వం ఇలలో లేకుండా పోవాలి. ఇప్పటికే మనమందరమూ శత్రుత్వం వల్ల ఆవేదన చెందుతున్నాం. ఇకనైనా సంసిద్ధులమై శత్రుత్వంతో శత్రుత్వమూ, స్నేహంతో స్నేహమూ చేస్తూ బతుకుదాం. నిజమైన మనుషులమై మనం మనకూ, ప్రపంచానికీ వీలైనంత మంచి, మేలు చేసుకుందాం. ‘ఇది నాలుగురోజుల జీవితం, ఎందుకు ఎవరితోనైనా శత్రుత్వం? / నీకు శత్రుత్వమే కావాలనుకుంటే చెయ్యి శత్రుత్వంతోనే శత్రుత్వం‘ – రోచిష్మాన్ -
సత్యం ఉన్నది ఉన్నట్లుగానే
ఉన్నది ఉన్నట్టుగా తెలియకపోతే ఉన్న మనకు లేనిపోని నష్టం జరుగుతుంది. మనకు కష్టం కలుగుతుంది. సత్యం లేదా నిజం తెలియకపోవడం వల్లా, లేకపోవడం వల్లా, మనకు ఎంతో హాని జరుగుతుంది, జరుగుతోంది, జరుగుతూ ఉంటుంది... ప్రతి ఒక్కరికీ సత్యం అవసరం ఉంది. ప్రతి ఒక్కరికీ సత్యమే అవసరం అవుతుంది. ఏదో అనుకోవడం, ఏదో అభిప్రాయపడడం ఈ రెండిటినీ వీలైనంత తొందరగా మనం వదిలేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో మన ఇష్ట, అయిష్టాల్లో సత్యం లేకపోవచ్చు; మనకు నచ్చిన, నచ్చని వాటిల్లో సత్యం లేకపోవచ్చు. కాబట్టి మనం మనల్ని దాటుకుని లేదా మనల్ని మనం మార్చుకుని సత్యంలోకి వెళ్లవలసి ఉంటుంది. ఆ పని ఎంత తొందరగా జరిగితే మనకు అంత మేలు జరుగుతుంది. క్షేత్ర వాస్తవాన్ని తెలుసుకోగలగడం, ఆపై సత్యాన్ని అవగతం చేసుకోగలగడం మనిషి జీవితంలో తప్పకుండా నేర్చుకోవలసినవి. మనకు ముందు వచ్చిన వాళ్లు చెప్పారు కాబట్టి, మనకు ముందే కొందరు నమ్మారు కాబట్టి, కొందరు చెబుతున్నారు కాబట్టి, కొందరు అనుకుంటున్నారు కాబట్టి, ప్రచారంలో ఉన్నాయి కాబట్టి, వాడుకలో ఉన్నాయి కాబట్టి ఉన్నవి సరైనవే అని స్వీకరించే ధోరణి వాంఛనీయం కాదు. అది నాసిరకం పోకడ. అది ఆదర్శనీయమైనది కాదు. ఏదో అనుకోవడం, దేన్నో ఊహించుకోవడం సరైనవి కాకపోవడమే కాదు, అత్యంత హానికరమైనవి కూడా. ఒక రోగి తనకు రోగం ఉంది అన్న వాస్తవాన్ని తెలుసుకుంటే దానికి తగిన వైద్యం చేసుకుని లాభపడడం జరుగుతుంది. ఏ విషయంలో అయినా ఎంత తెలుసుకుంటే అంత లాభం ఉంటుంది. తెలివిడిలోకి వెళ్లేందుకు అభిప్రాయాలవల్ల ఏర్పడ్డ నమ్మకం అడ్డంకిగా ఉంటూనే ఉంటుంది. మనం ఆ అడ్డంకిని వీలైనంత వేగంగా తొలగించుకోవాలి. చలామణిలో ఉన్నవాటిని నమ్మడం మనిషి బలహీనతల్లో బలమైంది. ఆ బలమైన బలహీనత మనిషిని ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద దెబ్బలు కొడుతూనే ఉంటుంది. మనిషి ఆ దెబ్బల నొప్పిని అనుభవిస్తూనే ఉన్నాడు. ‘నమ్మడంపై నాకు నమ్మకం లేదు, తెలుసుకోవడమే నా విధానం’ అని ఓషో ఒక సందర్భం లో అన్నారు. తెలుసుకునే విధానానికి మనం అలవాటుపడాలి.‘ఏది సత్యం?’ ఈ ప్రశ్నకు ‘దేని ప్రభావం మంచి చేస్తుందో అది సత్యం’ అని మనుస్మృతిలోని మాటల్ని ఉటంకిస్తూ బుద్ధుడు తెలియజెప్పాడు. అమెరికా దేశపు తత్త్వవేత్త విలియమ్ జేమ్స్ కూడా ఈ మాటల్ని చెప్పారు. ఒక ప్రయత్నానికి వచ్చిన ప్రభావంవల్ల జరిగిన మంచి సత్యం. మనకు మంచి కావాలి కనుక మనకు సత్యం కావాలి. నమ్మడం, అభిప్రాయపడడం ఇవి అర్థంలేనివి. ఆపై అనర్థదాయకమైనవి. అధ్యయనం చేస్తే కానీ అవగాహన రాదు. ఏది ఉందో, ఏది లేదో, ఏది అవునో, ఏది కాదో మనం తెలుసుకోవాలి. ఇకనైనా, ఇపుడైనా నిజానిజాలను తేల్చుకుందాం. కళ్లు తెరిస్తే కానీ దృశ్యం కనిపించదు. నిద్రలేస్తే కానీ నడక మొదలవదు. మనం నిద్రలేచి నడక మొదలుపెడదాం. ‘నా భావన’, ‘నేనేం అంటానంటే’ అన్న మధ్యతరగతి మాంద్యాన్ని వదిలించుకుందాం; ఉన్న మిథ్యలను విదిలించుకుని ముందుకెళదాం. ప్రయత్నించి సత్యాన్ని సాధిద్దాం; సత్యంతో మనుగడను సాగిద్దాం. ‘సత్యాన్ని అమృతంలా సేవించు’ అని అష్టావక్రగీత చెబుతోంది. సత్యాన్ని సేవించడానికి అలవాటు పడదాం. సత్యం రుచిగా ఉంటుంది. ఆ రుచిని తెలుసుకుందాం. ఆ తరువాత సత్యం రుచికి మాలిమి అయిపోయి జీవితాన్ని మనం రుచికరం చేసుకుందాం. సత్యం జ్ఞానాన్ని ఇస్తుంది. ‘జ్ఞానం స్వేచ్ఛకు ఆధారం’ అని తెలియజెప్పారు ఆదిశంకరాచార్య. సత్యం ద్వారా జ్ఞానాన్ని, జ్ఞానం ద్వారా స్వేచ్ఛను పొంది మనం సరిగ్గా, ఉన్నతంగా జీవిద్దాం; జీవితాన్ని విలువైందిగా చేసుకుందాం. అభిప్రాయాలు, అనుకోవడాలు, నమ్మకాలు వీటిని మనలో పేర్చుకుని మనల్ని మనం మోసుకోవడం జీవనం కాదు; వాటివల్ల మనలో మనం కూరుకు పోవడం జీవితం కాకూడదు. ఎరుకను అనుసరిద్దాం; ఎదుగుతూ ఉందాం. – రోచిష్మాన్ -
ప్రవర్తన... పర్యవసానం
ప్రవర్తన, దాని పర్యవసానం మనిషి ప్రగతి, పతనాలకు కారణాలవుతాయి. మనిషి ప్రవర్తన తనకో, తన పక్కనున్న వ్యక్తికో, సమాజానికో పతనకారణం కాకూడదు. ప్రవర్తన కారణంగా మనిషంటే మనిషికి భయంగా ఉంటోంది, మనిషి వల్ల మనిషికి హాని జరుగుతోంది. ఇంతకీ ప్రవర్తన పర్యవసానాలేమిటి? ’నేను సరిగానే ప్రవర్తిస్తున్నానా?’ అని ప్రతి మనిషీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూ ఉండాలి. ఈ అర్థాన్నిస్తూ ‘ప్రత్యహం ప్రత్యవేక్షేత నర శ్చరిత మాత్మనః / కింసు మే పశుభిస్తుల్యం కింసు సత్పురుషై రివ‘ అని కొన్ని శతాబ్దుల క్రితం కాళిదాసు (తన కావ్యం రఘువంశంలో) చెప్పాడు. కాళిదాసు చెప్పినట్టు ప్రతి మనిషికీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూండే అభ్యాసమో, అలవాటో ఆ కాలం నుంచే ఉండుంటే బావుండేది. మన సమాజంలో నేరాలు, ఘోరాలూ, శత్రుత్వం వంటివి లేకుండా పోయేవి. లోకంలో అమానుషత్వం ఇంతలా వ్యాపించి ఉండేది కాదు. మనిషికి మనిషి వల్ల కష్టాలు, నష్టాలు కలుగుతూండకపోయేవి. మన జీవనాలు ప్రశాంతంగా సాగుతూండేవి. ఏ మనిషీ కూడా తాను ’పశువులాగా ప్రవర్తిస్తున్నాడా? లేక సత్పురుషుడిలాగా ప్రవర్తిస్తున్నాడా’ అని నిజాయితీతో పరిశీలించుకోవడం లేదు. చైనా కవి, తాత్త్వికులు లావొచు ఒక సందర్భంలో ఇలా అన్నారు: ‘నేను మూడు విషయాల్ని మాత్రమే బోధిస్తాను... సరళత, ఓర్పు, కనికరం. ఈ మూడూ నీ మహానిధులు. సరళత పనుల్లోనూ, ఆలోచనల్లోనూ ఉంటే నువ్వు నీ ఉనికికి ఆధారమైనదానికి మరలుతావు. ఓర్పుగా మిత్రులతోనూ, శత్రువులతోనూ ఉంటే, నువ్వు విషయాల వాస్తవికతతో కలుస్తావు. కనికరాన్ని నీపైనే చూపించుకుంటే, నువ్వు ప్రపంచంలోని అన్ని ప్రాణులతోనూ పునరైక్యమౌతావు‘. లావొచు చెప్పిన సరళత, ఓర్పు, కనికరం ఈ మూడూ మనిషి ప్రవర్తనలో నిండి ఉండాలి. అప్పుడే మనిషి పశువులాగా ప్రవర్తిస్తున్నాడా? అన్న పరిశీలనకు ‘కాదు‘ అని సత్పురుషుడిలాగా ప్రవర్తిస్తున్నాడా? అన్న పరిశీలనకు ‘అవును‘ అని జవాబులు వస్తాయి. సత్పురుషులు వసంత ఋతువు వంటి వాళ్లనీ, వాళ్లు లోకహితాన్ని చేస్తారనీ, వాళ్లు శాంతం కలవాళ్లనీ, వాళ్లు గొప్పవాళ్లనీ ఆదిశంకరాచార్య ‘శాంతా మహాంతో నివసంతి సంతో వసంతవల్లోక హితం చరంతః‘ అంటూ చెప్పారు. వసంత ఋతువులాగా హితకరంగా ఉండాలంటే ప్రతి మనిషికీ ప్రవర్తన పునాది. ‘నీ నమ్మకాలు నిన్ను మేలైన వ్యక్తిని చెయ్యవు నీ ప్రవర్తన చేస్తుంది‘ అని అంటూ గౌతమ బుద్ధుడు మనిషికి సరైన దిశానిర్దేశం చేశాడు. ప్రతిమనిషీ తన నమ్మకాలకు అతీతంగా ప్రవర్తనను పరిశీలించుకుంటూ ఆ ప్రవర్తనను చక్కగా చెక్కుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ’నేను పశువులాగా ప్రవర్తిస్తున్నానా? లేక సత్పురుషుడిలాగా ప్రవర్తిస్తున్నానా’ అని ప్రతి మనిషీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూ ఉండాలి. ఆ పరిశీలన మనిషిని సత్పురుషుణ్ణి చెయ్యగలిగితే అప్పుడది సమాజానికి హితం ఔతుంది. ఆ పరిశీలనతో మనిషి సత్పురుషత్వాన్ని పొందగలిగితే గొప్ప. అలా కాని పక్షంలో పశుత్వాన్నైనా తనంతతాను వదిలించుకోవాలి. అంతటా అందరూ సుఖులై ఉండాలి, అందరూ రోగాలు లేనివాళ్లై ఉండాలి, అందరూ భద్రంగా ఉండాలి, ఏ ఒక్కరూ దుఃఖాన్ని పొందకుండా ఉండాలి అన్న ఆకాంక్ష ఒక పూర్వ శ్లోకం ‘సర్వత్ర సుఖిన స్సంతు సర్వే సంతు నిరామయాః / సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చి ద్దుఃఖభాగ్భవేత్‘ ద్వారా మనలో చాల కాలంగా ఉంది. ఈ ఆకాంక్ష సాకారమవాలంటే ప్రతి మనిషీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూండాలి. రండి, ఒక అభ్యాసంగా, ఒక అలవాటుగా మనం మన ప్రవర్తనను పరిశీలించుకుంటూ ప్రశాంతతను సాధించుకుందాం. జీవితంలో నీవు ఎవరిని కలవాలన్నదికాలం నిర్ణయిస్తుంది. నీకెవరు కావాలన్నది హృదయం నిర్ణయిస్తుంది. కానీ నీ దగ్గర ఎవరుండాలనేది నిర్ణయించేది నీ ప్రవర్తన మాత్రమే. తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తే పిల్లలూ అలాగే ప్రవర్తిస్తారు. తల్లిదండ్రుల ప్రవర్తన బాగుండాలంటే తల్లిదండ్రులు తమ ప్రవర్తన గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. – రోచిష్మాన్ -
మంచి మాట: మాటల పాఠాలు
ఉన్నాయి కదా అని మనం మాటల్ని వాడేస్తూండకూడదు. వినిపించాయి కదా అని మనం మాటల్ని మాత్రమే పట్టించుకుని బతుకును పాడు చేసుకోకూడదు. మాటలతో, మాటలలో మనల్ని మనం వృథా చేసుకోకూడదు. మాటలకు పరిమితులు ఉంటాయి, ఉన్నాయి. అనేటప్పుడూ, వినేటప్పుడూ మాటల్ని ఒకస్థాయి వరకే పరిగణించాలి. మాటలు అని దెబ్బతిన్న సందర్భాలూ, మాటలు విని దెబ్బతిన్న సందర్భాలూ అందరికీ ఉంటాయి. వాటిని పాఠాలుగా తీసుకోవాలి. అవసరం అయినంత వరకే మాటల్ని అనాలి, వినాలి. మాటలు ఎక్కడ అనవసరమో తెలుసుకోవాలి. మాటలు ఎక్కడ అనర్థమో గ్రహించగలగాలి. మాటను కంచె అని అన్నారు చైనా తాత్త్వికులు, కవి లావొచు (లావోట్జ్). లావొచు అంటే ‘సిద్ధ గురువు’ అని అర్థం. వీరి రచనలు తావొ – త – చింగ్ అధారంగా తావొ మతం రూపొందింది. కవిత్వం నుంచి మతం పుట్టిన సందర్భం ప్రపంచంలో ఇదొక్కటే. లావొచు రోజూ ఉదయం పూట ఒక స్నేహితుడితో కలిసి నడకకు వెళ్లే వారు. ఆ సమయంలో వారు ఏ మాటా మాట్లాడేవారు కాదు, తపస్సు చేస్తున్నట్టుగా మౌనంగా ఉండేవారు. ఒకరోజు ఉదయం నడుస్తూండగా లావొచు స్నేహితుడి స్నేహితుడు దారిలో ఎదురుపడి వాళ్లతో కలిసి నడవసాగాడు. వాళ్ల నడక కొనసాగుతున్నప్పుడు ఉదయాన్ని చూస్తూ ‘ఈ ఉదయం ఎంతో అందంగా ఉంది’ అని అన్నాడు లావొచు స్నేహితుడి స్నేహితుడు. ఆ మాట వినగానే లావొచు ఉన్నపళాన నడక మానేసి ఇంటికి తిరిగి వచ్చేశారు. అది జరిగాక లావొచు స్నేహితుడు లావొచును ‘ఏమైంది, చిన్నమాటే కదా అతడన్నది ఆ మాత్రం దానికి మీరు నడక మానేసి తిరిగి వచ్చేయాలా?’ అని అడిగాడు. బదులుగా లావొచు ఇలా అన్నారు: ‘ఉదయ సౌందర్యమంతా ఆ మాటతో చెదిరిపోయింది. అది శబ్దం లేని సౌందర్యం. దాన్ని మౌనంగా అనుభవించాలి. మాట పుట్టి ఆ సౌందర్యాన్ని వేరు చేసింది. మాట పుట్టడానికి ముందున్న సౌందర్యానుభవం బృహదాత్మకం. – రోచిష్మాన్ మాట పుట్టగానే ఆ బృహత్తుకు కంచె వేసినట్టు అవుతుంది.‘ఒకరోజు లావొచు అనుయాయులు ‘తెలుసుకున్నవాళ్లు మాట్లాడరు, మాట్లాడుతున్న వాళ్లు తెలుసుకున్నవాళ్లు కారు’ అని లావొచు చెప్పిన మాటల గురించి చర్చ చేస్తూ వాళ్ల గురువును ఆ మాటలకు అర్థవివరణను ఇమ్మని అడిగారు. గురువు ‘మీలో ఎవరికి గులాబీ పువ్వు పరిమళం తెలుసు?’ అని వాళ్లను ప్రశ్నించారు. అందరూ తమకు తెలుసని చెప్పారు. ‘మీకు తెలిసిన ఆ విషయాన్ని మాటల్లోకి తీసుకురండి’ అని అన్నాడు గురువు. ఆ పని చెయ్యడం చాతకాక శిష్యులు మౌనంగా ఉండిపోయారు. మాట సత్యానుభవాన్ని సరిగ్గా సమర్పించలేదు. అనుభవానికి పరిధులు ఉండవు. అది ఆకాశంలా అనంతం. మాట సంకుచితమైంది. మాటలలో కూరుకుపోతూంటే మనం అనుభవాన్ని ఆస్వాదించలేం. మనం మాటల్ని పట్టుకుని కూర్చోకూడదు. ఒకదశ తరువాత మనం మాటల్ని దాటుకుని ముందుకు సాగాలి. ఎందుకంటే మౌనంలోనే సౌందర్యం అనుభవంలోకి వస్తుంది. సౌందర్యానుభవం మాటల్లో చెదిరిపోతుంది. అనుభవాన్ని మాటలు అనువదించలేవు. మాటలతో సౌందర్యానుభవాన్ని పోగొట్టుకోకూడదు. మాటను కంచె అని లావొచు అనడాన్ని సరిగ్గానూ, సమగ్రంగానూ అవగతం చేసుకోవాలి. మాట కంచె అయి మన చుట్టూ ఉండకూడదు. మాట మనల్ని కట్టిపడెయ్యకూడదు. మాటకు అందని స్థితిలో ఉండే రుచిని ఆస్వాదించ గలగాలి. మాటకు అతీతంగా ఉండే అత్యుదాత్తతను మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. -
కవిత్వమే మతం అయిన సందర్భం
మతం నుంచి కవిత్వం రావడం,మతం కోసం కవితా రచన జరగడం ఉన్నదే. కానీ కవిత్వం మతంగా పరిణమించడం ఒక్క లావ్ ట్సూ ద్వారానే జరిగింది. ఒక్క టాఔ ఇజం విషయంలోనే జరిగింది. కవిత్వం, తత్వం అయి మతం అయింది చైనా కవి లావ్ ట్సూ (LAO&TZU ) కర్తృత్వంలో. ఆయన రాసిన 81 కవితలు టాఔ ఇజం అన్న మతానికి ప్రాతిపదిక అయినాయి. ప్రపంచంలో ఇలాంటి ఘటన ఇదే! మతం నుంచి కవిత్వం రావడం, మతం కోసం కవితా రచన జరగడం ఉన్నదే. కానీ కవిత్వం మతంగా పరిణమించడం ఒక్క లావ్ ట్సూ ద్వారానే జరిగింది. ఒక్క టాఔ ఇజం విషయంలోనే జరిగింది. ఆశ్చర్యకరమైన పరిణామం ఇది! ప్రపంచంలోని మహోన్నతమైన కవులలో చైనా దేశపు కవి లావ్ ట్సూ ఒకరు. లావ్ ట్సూ జననం, జీవితం, మరణంలపై సరైన వివరాలు లేవు. ఆయన క్రీ.పూ. 6వ శతాబ్ది వారని విశ్వసిస్తున్నారు. అందులోనూ సందిగ్ధతే. క్రీ.పూ. 604–517 కాలం వారనీ, క్రీ.పూ. 551–479 కాలం వారనీ వేరు వేరు వాదనలు ఉన్నాయి. చైనాలో చౌ అనే ప్రదేశంలో ఒక రాజాస్థానంలో పురాతన దస్తావేజుల సంరక్షకులుగా ఆయన పనిచేసేవారనీ, ఒక దశలో అక్కడి పరిస్థితులు నచ్చక ఊరు వదిలి వెళ్లిపోతూండగా ఊరి పొలిమేరలో కాపలాదారులు పట్టుకున్నారనీ, ఆ పట్టుకున్న కాపలాదారులలో ఒకతనికి ఆయన తన జ్ఞానాన్ని కొన్ని కవితలలో చెప్పారనీ, అందుకు బదులుగా ఆ కాపలాదారు ఆయన్ను వదిలేశాడనీ, ఆయన ఎద్దునెక్కి ఎటో వెళ్లిపోయారనీ కథనం. లావ్ ట్సూ ఎద్దుపై కూర్చుని ఉన్న చిత్రం ప్రచారంలో ఉంది. ఆయన పొలిమేర దాటుతూండగా పట్టుకున్న కాపలాదారులలో ఒకతను ఆయన స్నేహితుడనీ, అతని పేరు యిన్–హ్సి అనీ, ఆ 81 కవితలూ అతని కోసం రాసిచ్చారనీ మరో కథనం. లావ్ ట్సూ రాసిచ్చిన 81 కవితలు ‘టాఔ– టీ – చింగ్’ అయినాయి. అదే ‘టాఔ ఇజం’ అన్న మతానికి అధారం అయింది. ఆ 81 కవితలలోని భాషా సంక్షిప్తత, కవిత్వం తరువాతి కాలంలో ప్రపంచ సాహిత్యంలో ఒక సంచలనాన్ని సృష్టించాయి. టాఔ– టీ – చింగ్ ను ‘డాఔ–డీ జింగ్’ అని కూడా అంటారు. ఈ టాఔ– టీ – చింగ్‌కు చెప్పబడిన అర్థాలలో కూడా తేడాలు కనిపిస్తున్నాయి. ‘మార్గం దాని శక్తి’ అనే అర్థం కొంత కాలం వాడుకలో ఉండేది. కానీ ‘తత్త్వం దాని ఆచరణపై గ్రంథం’ అనే అర్థం తరువాతి కాలంలో వ్యాప్తిలోకి వచ్చింది. అసలు లావ్ ట్సూ అంటే ‘సిద్ధ గురువు’ (old master) అని అర్థమట. ఆ పేరుగల వ్యక్తే లేడన్న వాదన కూడా ఉంది. టాఔ– టీ – చింగ్ కు రకరకాలైన అర్థాలు, భాష్యాలు పుట్టుకొచ్చాయి. వాటిల్లో వంగ్ పి, హొ షంగ్ కుంగ్, హన్ షన్–టీ–చింగ్ ప్రభృతుల భాష్యాలు ముఖ్యమైనవి. ఆ 81 కవితల టాఔ– టీ – చింగ్ ఒక పవిత్ర గ్రంథంగా పరిణమించింది. ఇది 2 పుస్తకాలుగా ఉంది. పుస్తకం 1, పుస్తకం 2 అని. ఆ 81 కవితలనూ 81 అధ్యాయాలుగా చూపించారు. వాటిని ఇంగ్లిష్‌లో కొందరు వచనంగా, కొందరు కవితలుగా అనువదించారు. తత్త్వాన్ని (టాఔ) ప్రకటించే విధానం శాశ్వతమైనది కాదు దానికి ఇవ్వబడిన పేరూ శాశ్వతమైనది కాదు కోరికల నుంచి స్వేచ్ఛను పొందు, మర్మం విడిపోతుంది కోరికలలో చిక్కుకుపోతే వ్యక్తీకరణ మాత్రమే కనిపిస్తుంది లావ్ ట్సూ ‘టాఔ’ అంటూ చెబుతున్నది మనం ‘సర్వాంతర్యామి’ అనే పదానికి పర్యాయపదంగా కనిపిస్తోంది. ఓ కవితలో – ‘టాఔ అనంతం, శాశ్వతం ఎందుకది శాశ్వతం? అది పుట్టలేదు కనుక అది మరణించదు– అది ఎందుకు అనంతం? దానికి కోరికలు లేవు అది అందరి కోసమూ ఉన్నది’ – అని చెబుతారు లావ్ ట్సూ. ఉపమాలంకారాన్ని చాలా చక్కగా వాడతారు లావ్ ట్సూ. ఓ కవితలో మంచితనాన్ని నీటితో పోలుస్తారు. ‘ఇతరులతో నిన్ను పోల్చుకోకు, ఇతరులతో పోటీ పడకు, అందరూ నిన్ను గౌరవిస్తారు’ అని సగటు మనిషికి సందేశమిస్తారు. భగవద్గీతలో కనిపించే నిష్కామ కర్మ ప్రస్తావన టాఔ– టీ – చింగ్ లోనూ కనిపిస్తోంది. ‘ఎదురు చూపుతో సంబంధం లేకుండా పని చెయ్యడం మహోన్నతమైనది’ అనీ, ‘నీ పని చెయ్యి, ఆపై వదిలెయ్యి’ అనీ చెబుతారు లావ్ ట్సూ. ఒక భావాన్ని ఎంత గొప్పగా చెప్పొచ్చో, ఎలా కవిత్వంగా మలచొచ్చో ఈ పంక్తుల ద్వారా తెలుసుకోవచ్చు. ‘బంకమట్టితో మనం కుండను చేస్తాం దాని లోపల ఖాళీగానే ఉంటుంది ఆ ఖాళీనే మనకు కావలసిన నీళ్లను మోస్తుంది’ ఓ కవితలో ‘ఓటమి ఎంత అపాయకరమైనదో– విజయమూ అంత అపాయకరమైనదే’ అంటారు లావ్ ట్సూ. ‘భగవంతుడు(టాఔ) గొప్పవాడు విశ్వం గొప్పది భూమి గొప్పది మనిషి గొప్పవాడు’– అంటారు మరో కవితలో. ‘నిజమైన పూర్ణత్వం ఏమీ లేనట్లుగానే ఉంటుంది అయినా అందులో సంపూర్ణమైన ఉనికి ఉంటుంది’– అన్న లావ్ ట్సూ వాక్యాలు ‘పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణామాదాయ పూర్ణమేవావశిష్యతే’ శ్లోకాన్ని గుర్తుచేస్తాయి. ‘నీ తలుపు తెరవకుండా నీ హృదయాన్ని ప్రపంచం కోసం తెరవగలవు నీ కిటికీ వైపు చూడకుండా బ్రహ్మ తత్వాన్ని నువ్వు చూడగలవు’ అని ఒక కవితలో అంటారు. ‘నీ స్వీయ కాంతిని ఉపయోగించు ఆపై కాంతి యొక్క మూలాన్ని చేరుకో’ అంటారు మరోచోట. ఇక్కడ ‘స్వీయ కాంతి’ అనడం ఆది శంకరాచార్యులు ‘స్వస్య యుక్త్యాః’ అంటే ‘నీ యుక్తి చేత’ అనడాన్ని తలపిస్తోంది. వేమన పద్యాల్లాగా వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేవి కొన్ని లావ్ ట్సూ కవితల్లో ఉన్నాయి. ‘చిన్న చిన్న చర్యలతో గొప్ప పనులను పూర్తిచెయ్యి’, ‘ఓటమి ఓ అవకాశం’, ‘కష్టాలతో తలపడు’, ‘నువ్వు ప్రజల్ని పాలించాలంటే నువ్వు వాళ్లకన్నా కింద ఉండాలి, నువ్వు ప్రజలకు నాయకత్వం వహించాలంటే నువ్వు వాళ్లను అనుసరించడం నేర్చుకోవాలి’– వంటివి. వ్యక్తిత్వ వికాసానికి లావ్ ట్సూ కవితలు తోడ్పడతాయి అనే కోణంలో కూడా ఆయన కవితలకు భాష్యం చెబుతూ ఇంగ్లిష్‌లో పుస్తకాలొచ్చాయి. మతం గురించి లావ్ట్సూ– ‘నేను మతాన్ని వెళ్లిపోనిస్తాను ఆపై ప్రజలు నిర్మలమౌతారు’ అంటారు. ఒక చోట ‘నిజమైన మాటలు విపరీతార్థాలుగా అనిపిస్తాయి. నిజమైన మాటలు వాగ్ధా్దటితో ఉండవు. వాగ్ధాటితో ఉండేవి నిజమైన మాటలు కావు’ అంటారు. రోచిష్మాన్ 09444012279 -
తెలుగు హైకు: ఒక అవలోకనం
అభిప్రాయం హైకు అనే కవితా ప్రక్రియ జపాన్ దేశంలో రూపొంది ఇంగ్లిష్తో పాటు పలు ఇతర భాషల్లోకీ, మన తెలుగులోకీ వచ్చింది. ఇంగ్లిష్తో సహా ఐరోపా భాషల కవితలు వ్యర్థ పదాలతోనూ, పెద్దవిగా సాగిపోయే తీరులోనూ ఉండటానికి భిన్నంగా క్లుప్తతను గుణంగా కలిగి రూపొందిన కవితా ప్రక్రియ హైకు. నొగుచి అనే జపాన్ కవి అంటారు: ‘‘గంపల కొద్దీ రాసి అచ్చెయ్యాలి అన్న ఒకే ఉత్సుకతతో ఎప్పుడూ తపించే వాడు కవి అవడు’’. ‘‘క్లుప్తంగా చెప్పి బోధ పరచడం హైకు వైశిష్ట్యం’’ అంటూ నొగుచి ఒక ఉదంతాన్ని ఉటంకిస్తారు. హŸకషి అనే కవి తన గురువుకు సొంత ఇల్లు కాలిపోయిన సంగతిని ఓ హైకుగా రాసి తెలియజేస్తారు ఇలా: ‘నిప్పు రాజుకుంది– రాలే పువ్వు ప్రశాంతత ఎంతో!’ ‘ఇల్లు తగలబడింది కానీ తన మనసు ప్రశాంతతను కోల్పోలేదు’ అని హŸకషి తన హైకుతో తెలియ జేశారు. ఇంకా నొగుచి ఇలా అంటారు: ‘‘ఆకాశ నక్షత్రం, ఏకాంతం, మౌనం, పువ్వుల భాష వీటితో కలిసిపోయి బ్రతికేవాడే కవి’’. నొగుచి మోడర్న్ రివ్యూ అనే కలకత్తా పత్రికలో రాసిన వ్యాసాన్ని తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి 1916లో తమిళంలోకి అనువదించారు. హైకు ప్రాముఖ్యతను గురించి రవీంద్రనాథ్ టాగూర్ ఓ మంచి వ్యాసం రాశారు. దాన్ని గాలి నాసరరెడ్డి తెలుగులో అనువదించి 8–12–2008న ‘సాక్షి’లో ప్రకటించారు. హైకు, విశ్వ కవితా రూపాలలో ఓ విప్లవం. జపాన్ భాషలో హైకుకు ఆదికవి బషో (1644–94). హైకు కవిగా ఆయన స్థానం అద్వితీయం. ‘పాత కొలను, కప్ప లోపలికి దూకింది – నీళ్ల చప్పుడు.’ ఇది బషో రాసిన ఓ హైకు. బషో తరువాత బుసోన్, చిఝె, హŸకషి, హిస, ఇస్స, కికకు, షికి ప్రభృతులు జపనీస్ హైకును పరిపుష్టం చేశారు. జపాన్ మతాలు బౌద్ధం, టాఔ ఇజం, ఎనిమిజం జపాన్ హైకులలో మిళితం అయినాయి. తంక అనే ఓ కవితా ప్రక్రియ నుండి విడివడి హŸకుగా కొంతకాలం ఉండి చివరికి హైకుగా స్థిరపడింది. తంకలోని మొదటి భాగం హైకు. జపనీస్‌లో అజ్జాత కవుల హైకులు కూడా బాగా ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో ఒకటి: ‘కొత్త తండ్రి, జోల పాడాడు– అపశ్రుతిలో’. హైకు అన్న పదంలో ‘హై’ అంటే వినోదకర అనీ, ‘కు’ అంటే కవిత అనీ అర్థాలు. ఇక్కడ కు– హ్రస్వమే. ఈ హై, ఈ కు– రెండూ చైనీస్ –బై–కియు– నుంచి వచ్చాయి. తెలుగులో మనం హైకులు అనొచ్చు. హైకు జపనీస్‌లో 5, 7, 5 జిఒన్(jion)లతో రాయబడుతుంది. హైకు 20వ శతాబ్దపు తొలినాళ్లలో ఇంగ్లిష్‌లోకి వెళ్లింది. ఇమేజిజం అనే ఎజ్రాపౌండ్ ఉద్యమం ద్వారా హైకు ఇంగ్లిష్‌లోకి వ్యాపించింది. ఎజ్రాపౌండ్తో పాటు ఎమిలో వెన్, ఫ్లింట్, జాన్ ఫ్లెచర్ వంటి కవులు హైకును ఇంగ్లిష్ లోకి తెచ్చారు. రాబర్ట్ ఫ్రాస్ట్, డబ్ల్యూ బి. ఈట్స్, వాలెస్ స్టీవెన్స్ వంటి కవులపై హైకు ప్రభావం పడింది. హెరాల్డ్ జి.హెన్డర్సన్ హైకుపై ఇంగ్లిష్‌లో పుస్తకం రాశారు. ప్రక్రియ పరంగా జపనీస్ జిఒన్లను ఇంగ్లిష్‌లో 5,7,5 సిలబల్స్గా తీసుకున్నారు. అది తప్పు. జపనీస్ హైకు ఒకే పాదంలో ఉంటుంది. ఇంగ్లిష్‌లో హైకును మూడు పాదాలుగా రాస్తారు. అదీ తప్పే. ఇంగ్లిష్‌లో హైకు అన్న పదం బహువచనాన్నీ సూచిస్తుంది. ఇంగ్లిష్ ద్వారా వ్యాపించడం వల్ల హైకు తన రూపాన్నీ, ఆత్మనూ కోల్పోయింది. ఈ నిజాన్ని ఇంగ్లిష్ పరిశీలకులే గ్రహించి ప్రకటించారు. తెలుగులో 1923లో దువ్వూరి రామిరెడ్డి మర్మ కవిత్వం అన్న తమ వ్యాసంలో బషో హైకులను హŸక్కులు అన్న శీర్షికతో తెలుగులోకి అనువదించి హైకులను తెలుగుకు పరిచయం చేశారు. ఆయన పద్యాలలో అనువదించారు. తరువాత కట్టమంచి రామలింగారెడ్డి 1931లో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ‘గాథా సప్తశతి’ అనువాదానికి రాసిన పీఠికలో కొన్ని జపనీస్ హైకులను తేటగీతి ఛందస్సులో రెండు పాదాలుగా అనువదించారు. ఆ తరువాత 1950లో సంజీవదేవ్ కొన్ని హైకులను వచన కవితలుగా అనువదించారు. తొలి తెలుగు హైకు రాసినది గాలి నాసర రెడ్డి. 1990లో ఆంధ్రభూమి దినపత్రికలో ఆయన రాసిన 5 హైకులు అచ్చయినాయి. తొలి తెలుగు హైకు: నదిలో ఈత/ చంద్రుడి శకలాలు/ గుచ్చుకున్నాయి. మూడు పాదాల్లో 5, 7, 5 అక్షరాలతో ఆ 5 హైకులు ఉన్నాయి. 1991లో పెన్నా శివరామకృష్ణ రహస్య ద్వారం పేరుతో తొలి తెలుగు హైకుల సంకలనాన్ని వెలువరించారు. ఇస్మాయిల్, బి.వి.వి.ప్రసాద్, లలితానంద ప్రసాద్, డా. శిరీష, మాకినీడి సూర్యభాస్కర్, అద్దేపల్లి రామమోహన రావు ప్రభృతులు తమ హైకులను, హైకులపై రచనలను వెలువరించారు. తొలి తెలుగు హైకు కవయిత్రి రత్నమాల. తెలుగులో హైకు పేరుతో ఎక్కువ రచనలు చేసినవారు పృథ్వీరాజ్. ఇంకా కొంతమంది కవులు, కవయిత్రులు హైకులు రాశారు. హైకు పత్రికలు కూడా వచ్చాయి. మొదట్లో తెలుగు హైకులు 5,7,5 అక్షరాలతో మూడు పాదాలలో రాయబడినా రానురాను ఆ నియమం సడలిపోయింది. 1950లోనే సంజీవ దేవ్ జపనీస్ జిఒన్లకు మన భాషలోని మాత్రలు ప్రత్యామ్నాయం అని సూచించారు. 2003లో ఉప్పలధడియం వెంకటేశ్వర తొలిసారి 5,7,5 మాత్రలతో మూడు పాదాలలో హైకు రాశారు. అది: ‘విత్తనం, నేల త్రోవను–చిరయాత్ర’. పెన్నా శివరామకృష్ణ ‘దేశదేశాల హైకు’ పేరుతో కొన్ని విదేశీ హైకులను తెలుగులోకి అనువదించారు. గాలి నాసరరెడ్డి కొన్ని విదేశీ హైకులని తెలుగులోకి అనువదించి ప్రకటించారు. ముండకోపనిషత్(3–1–1) లోనే హైకు శిల్పం ఉందని చెబుతూ నాసర రెడ్డి ఓ శ్లోకాన్ని సూచించారు. అది: ‘‘ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే తయోరణ్యః పిప్ఫలం స్వాద్వత్త్వ నశ్నన్నన్న్యో అభిచాక శీతి’’ ఒక దానితో ఒకటి కలిసి ఉన్న రెండు పక్షులు చెట్టుపై– ఒకటి చెట్టు ఫలాలను ఆస్వాదిస్తూ తింటోంది; మరొకటి తినకుండా చూస్తోంది. హైకు అన్నది శిల్పాత్మకమైన ఓ ప్రక్రియ. హైకు శిల్పంలో ఋతువుల్ని సూచించే పదాలు, చిత్రణలు, ఘటనలు, రెండు చిత్రణల కలయిక, రెండు ఘటనల కలయిక, చిత్రణ, ఘటన కలయిక అన్నవి ముఖ్యం. హైకు అన్నది నిర్వచనంలా ఉండదు. వివరణలా ఉండదు. హైకులో ఉపమ, రూపకం లాంటి అలంకారాలు ఉండవు. హైకుపై సరైన అవగాహన కావాలంటే జపనీస్ హైకులనే చదవాలి. హైకు 5,7,5 మాత్రలతో ఒకే పాదంలో ఉండటం శాస్త్రీయమైన పద్ధతి. ఆ పద్ధతిలో సిసలైన హైకు శిల్పంతో హైకు, హైకుగా తెలుగులో పునర్భవం పొందాల్సిన అవసరం ఉంది. రోచిష్మాన్ 09444012279 -
గాయత్రీ మంత్రం 24 అక్షరాలే!
విమర్శ ఓం భూర్భువః స్వః తత్ సవితుర్వరేణ్యమ్ భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్ ఇది మనకు తెలిసిన గాయత్రీ మంత్రం. ఈ గాయత్రీ మంత్రాన్ని మనం చాలా సార్లు చదివే ఉంటాం. చాలా సార్లు వినే ఉంటాం. కొన్ని సార్లయినా అనే ఉంటాం. చాలా కాలంగా గాయత్రీ మంత్రం ఈ రూపంలో మనలో చలామణిలో ఉంది. కాలక్రమంలో కొన్ని విషయాలలో కొన్ని తప్పులు దొర్లడం మనం చూసిందే. అలా గాయత్రీ మంత్రం విషయంలోనూ ఒక పొరపాటు జరిగింది. గాయత్రీ ఛందస్సు ఇరవై నాలుగు అక్షరాలు కలది. అంటే గాయత్రీ మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలే ఉండాలి. ఇది శాస్త్రం. నిజానికి గాయత్రీ మంత్రం ఇరవై నాలుగు అక్షరాలదే. ప్రస్తుతం చలామణిలో ఉన్న గాయత్రీ మంత్రంలో మాత్రం మనకు ఇరవై ఎనిమిది అక్షరాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడో ఎక్కడో ఈ మంత్రం ఆకృతి మారింది. భూః , భువః ,స్వః, అన్నవి వ్యాహృతులు. ముందు ఈ వ్యాహృతులను పలికాక నిజమైన మంత్రాన్ని పలికే పద్ధతి ఉండేది. ‘మంత్రాణామ్ ప్రణవశ్శిరః’ కదా? ఓం కారంతో గాయత్రీ మంత్రం – ఓం తత్ సవితుర్వరేణ్యమ్ – ఎనిమిది అక్షరాలు భర్గో దేవస్య ధీ మహి – ఎనిమిది అక్షరాలు ధియో యోనః ప్రచోదయాత్ – ఎనిమిది అక్షరాలు వెరసి ఇరవై నాలుగు అక్షరాలు. ఓం కారాన్ని వ్యాహృతులైన భూః, భువః, స్వః లకు ముందు చేర్చి మంత్రోచ్చారణ చెయ్యడం పొరపాటున ఎప్పుడో ఎక్కడో మొదలయి ఉంటుంది. అందువల్ల గాయత్రీ మంత్రంలో ప్రస్తుతం మనకు ఇరవై ఎనిమిది అక్షరాలు కనిపిస్తున్నాయి. ఋషి ప్రోక్త గాయత్రీ మంత్రం: ‘‘ఓం తత్ సవితుర్వరేణ్యమ్ భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్.’’ నాకు దొరికిన ఈ పురాతన భాస్కర యంత్రంలో కూడా ఈ ఇరవై నాలుగు అక్షరాల గాయత్రీ మంత్రమే కనిపిస్తోంది. ఇదే సరైన గాయత్రీ మంత్రం. మరో విషయం, ఇవాళ మనకు పలు దేవతల గాయత్రీలు కనిపిస్తున్నాయి. అవి ఇరవై అక్షరాల ఆకృతిలో లేవు. అంటే వాటికి శాస్త్రీయ ప్రాతిపదిక లేదనేది నిర్వివాదాంశం. ఇప్పటికైన మనం సరైన అవగాహనతో ఋషి ప్రోక్త గాయత్రీ మంత్రాన్ని అనుసంధానం చేసుకుందాం. వ్యాసకర్త : రోచిష్మాన్ 094440 12279 -
తెలుగు గజల్‌కు 50 ఏళ్లు
వలపునై నీ హృదయ సీమల 'నిలువవలెనని ఉన్నది' ఇది తెలుగు గజల్‌కు స్వర్ణోత్సవ సంవత్సరం. 1966లో తొలి తెలుగు గజల్ రాసిన కవి దాశరథి. తొలి తెలుగు గజల్ వాగ్గేయకారుడు పి.బి.శ్రీనివాస్. తెలుగు గజల్‌ను చలామణీలోకి తెచ్చిన కవి సినారె. తెలుగు గజల్‌ను విశ్వవిఖ్యాతం చేసిన గాయకుడు కేశిరాజు శ్రీనివాస్. ఈ ఏడాది తెలుగు గజల్‌కు స్వర్ణోత్సవం. గజల్ ప్రక్రియ అరబ్బీలో పుట్టింది. ఫార్సీలో పెరిగింది. ఫార్సీ భాష మూలంగా మన దేశంలోకొచ్చింది. గజల్ ఇస్లాంకు ముందే ఉన్న కవితా ప్రక్రియ. అరబీ భాషలో గజల్ పదానికి పూర్వరూపమైన ‘గజ్జాల్ అనే పదానికి లేడి, జింక అని అర్థమట. ఇరాన్ దేశపు రాగాలలో ఒక రకానికి ఆ పేరు ఉండేది. గజల్ ‘కసీదా’ నుంచి విడివడి ఒక ప్రత్యేకమైన కవితా ప్రక్రియ అయింది. పదమూడవ శతాబ్దంలో ఫార్సీ కవి హజ్రత్ అమీర్ ఖుస్రో గజల్‌కు మన దేశంలో ప్రాణప్రతిష్ట చేశాడు. టర్కీ భాషా పదమైన ఉర్దూ అన్న పేరుతో మన దేశంలో ఒక భాష పుట్టి పెరిగాక వలీ దక్కనీ అనే దక్షిణ భారతదేశపు కవి ఉర్దూ భాషలో గజళ్లు రాసి ఉర్దూ గజళ్లకు వ్యాప్తిని తీసుకొచ్చాడు. ఇబ్రాహిమ్ ఆదిల్షాహ్, మొహమ్మద్ కులీ కుతుబ్‌షాహ్, సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్‌షాహ్, అబ్దుల్ హసన్ తానాషాహ్ వంటి రాజ కవులూ, మీర్ తకీ మీర్, గాలిబ్, జౌక్, మొమిన్, దాగ్, ఫైయ్జ్, హాలీ వంటి కవులూ గజల్‌ను చాలా గొప్పగా నడిపించారు. చివరి మొగల్ రాజైన సిరాజుద్దీన్ షాహ్ బహాదుర్ షాహ్ జఫర్ రాజ్యాన్ని కోల్పోయి చెరసాలలో గజళ్లు రాసుకుంటూ జీవితాన్ని వెళ్లబుచ్చాడు. పాకిస్తాన్ ఏర్పడ్డాక ఉర్దూ భాష పాకిస్తాన్ అధికార భాష అయింది. కానీ ఉర్దూ భాష, గజల్ ప్రక్రియ మన దేశంలోనే సుసంపన్నంగా ఉన్నాయి. దేశ విభజనకు ముందే గజళ్లు 78 ఆర్.పి.ఎమ్. రికార్డులపై విడుదలై జనరంజకమైనాయి. పందొమ్మిది వందల పదికే గజల్ రికార్డ్‌పై వచ్చింది. బేగం అఖ్తర్, సైగల్ వంటి గాయకుల గజళ్ల గానం చాలా మందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా తలత్ మెహమూద్ పందొమ్మిది వందల నలబై ఒకటవ సంవత్సరం తరువాత రికార్డుల కోసం పాడిన కొన్ని గజళ్లు విపరీతమైన జనాదరణ పొందాయి. గజల్ తనాన్ని ‘గజలియత్’ అంటారు. ఈ గజలియత్, ఇతర రచనా విధానాల నుంచి శైలి పరంగా గజల్‌ను ప్రత్యేకంగా చూపిస్తుంది. గజల్ వ్యక్తీకరణా విధానంలోని ప్రత్యేకతే గజలియత్. తెలుగు గజల్ పందొమ్మిది వందల అరవై ఆరులో వచ్చింది. దాశరథి వెలువరించిన ‘కవితాపుష్పకం’ కవితా సంకలనంలో ‘కామన’ శీర్షికతో తొలి తెలుగు గజల్ మనకు అందింది. ఆ గజల్లోని మొదటి షేర్: ‘వలపునై నీ హృదయ సీమల నిలువవలెనని ఉన్నది పిలుపునై నీ అధర వీధుల పలుకవలెనని ఉన్నది’ తెలుగు గజల్‌ను మొట్ట మొదటిసారి స్వరపరిచి, పాడి, ప్రసారం చేసి వినిపించింది పి.బి.శ్రీనివాస్. పందొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో ఆకాశవాణి కడప కేంద్రం నుంచి తొలి తెలుగు గజల్ ప్రసారం అయింది. పి.బి.శ్రీనివాస్ రాసి, స్వరపరిచి పాడిన గజల్ అది. ఆ గజల్ మొదటి షేర్: ‘కల్పనలు సన్నాయి ఊదే వేళ చింతలు దేనికి? కవితలు అర్పించు కానుక లోక కల్యాణానికి’ ఉర్దూ గజళ్లలో మనకు కనిపించే హుస్న్–ఎ–మత్‌లాలు మొదట తెలుగులో రాసింది కూడా వారే. తెలుగులో గజల్‌ను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన కవి సి.నారాయణరెడ్డి. వారు రాసిన ఒక గజల్లోని మొదటి షేర్: ‘ఎదురుగ క్షీర సముద్రాలున్నా హృదయానికి దాహం కరిగే తొలకరి మేఘాలున్నా గగనానికి దాహం’ దాశరథి, పి.బి.శ్రీనివాస్, సి.నారాయణరెడ్డి తెలుగు గజల్‌కు ముమ్మూర్తులు. తెలుగులో గజల్ ప్రక్రియకు సంబంధించిన వారందరికీ పూజ్యులు. ఆ తరువాత చెప్పుకోవలసిన గజల్ కవులు అమన్ హిందూస్థానీ, పెన్నా శివరామకృష్ణ, రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు, తటవర్తి రాజగోప బాలం ప్రభృతులు. తెలుగు వారందరూ గర్వించ తగ్గ విషయం ఏమిటంటే, పి.బి.శ్రీనివాస్ తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం, హిందీ, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ మొత్తం ఎనిమిది భాషలలో గజళ్లను రాశారు. ప్రపంచంలోనే ఎనిమిది భాషలలో గజళ్లను రాసిన ఏకైన కవి మన తెలుగు వారైన పి.బి.శ్రీనివాస్! పందొమ్మిది వందల ఎనబై ఒకటి, ఎనబై నాలుగు సంవత్సరాలలో పి.బి.శ్రీనివాస్ ‘సంగీతా రికార్డ్స్ ద్వారా రెండు ఉర్దూ గజళ్ల ఆల్బంలను విడుదల చేశారు. ఒక కన్నడ గజళ్ల రికార్డును విడుదల చేశారు. పందొమ్మిది వందల తొంబై ఆరవ సంవత్సరంలో ‘గాయకుడి గేయాలు’ అన్న సంకలనంలో వారు కొన్ని గజళ్లను పొందుపరిచారు. పందొమ్మిది వందల తొంబై ఏడవ సంవత్సరంలో విడుదలైన ‘ప్రణవం’ అన్న తమ అష్ట భాషా కవితా సంకలనంలో వివిధ భాషల గజళ్లను పొందుపరిచారు. తమిళ, కన్నడం, మలయాళం, సంస్కృతం భాషలలో వారే తొలి గజల్ రాసినట్లు తెలుస్తోంది. వారు ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో ఉర్దూ గజళ్లను ఆలపించారు. పందొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన ఎన్.టి.రామారావు చిత్రం ‘అక్బర్ సలీం అనార్కలి’ తెలుగు చిత్రంలో సి.నారాయణరెడ్డి రాసిన ఒక గజల్ మనకు మొహమ్మద్ రఫి గొంతులో వినిపిస్తుంది. సి.రామచంద్ర సంగీతం సమకూర్చిన ‘తానే మేలి ముసుగు తీసి ఒక జవ్వని పువ్వులాగా నవ్వుతుంటే ఏం చేయను’ అన్న ఆ గజల్ సంగీత, సాహిత్యపరంగా ఒక చక్కటి గజల్! కొన్ని చలన చిత్రాలకు సంగీతం సమకూర్చిన తెలుగు వారు బి.శంకర్ ఉర్దూ గజళ్లు పాడేవారు. తెలుగు వారైన విఠల్ రావు గొప్ప ఉర్దూ గజల్ గాయకులు. ప్రముఖ వైణిక విద్వాంసులు ఈమని శంకర శాస్త్రి కుమారై విష్ణుభొట్ల దేవి తెలుగు వారై ఎనబైయవ దశకం తొలిదశలో ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో ఉర్దూ గజల్ గాయనిగా తమ ప్రస్థానాన్ని మొదలు పెట్టి ఆ తరువాత హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలోనూ, బయటా తమ గజల్ గానాన్ని సాగిస్తున్నారు. రెండు వేల రెండో సంవత్సరంలో వెబ్ ప్రపంచం.కామ్ అనే అంతర్జాల పత్రికలో రోచిష్మాన్ రాసిన ఓ గజల్ అంతర్జాలంలో వచ్చిన తొలి తెలుగు గజల్గా నమోదయింది. తొలిసారి తెలుగులో శాస్త్రీయమైన బహర్‌లో గజల్ రాసింది కూడా రోచిష్మాన్. ఎమ్.బి.డి. శ్యామల తొలి తెలుగు గజల్ కవయిత్రి. తొలి తెలుగు గజల్ గాయని శొంఠి పద్మజ. పి.బి.శ్రీనివాస్, మొహమ్మద్ రఫి, ఎమ్.చిత్తరంజన్, సి.నారాయణరెడ్డి ప్రభృతుల తర్వాత తెలుగు గజల్ గానాన్ని చేపట్టింది కేశిరాజు శ్రీనివాస్. గజల్ శ్రీనివాస్‌గా మనమందరమూ ఎరిగిన వీరు మన హరికథా విధానాన్ని తోడు తీసుకుని తమ గానంతో గజల్‌ను విశ్వరంజకం చేశారు. గజల్ పరిశోధకులుగా సామల సదాశివ, గుంటూరు శేషేంద్ర శర్మ, కోవెల సంపత్ కుమారాచార్య, నోముల సత్యనారాయణ, పెన్నా శివరామకృష్ణ, రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గజళ్ల గురించి విలువైన రచనలు చేశారు. తెలుగు వారైన అమన్ హిందూస్థానీ పందొమ్మిది వందల యాబై ఎనిమిదో సంవత్సరంలోనే ఉర్దూ గజళ్లను రాశారు. పి.బి.శ్రీనివాస్, అమన్ హిందూస్థానీ, రోచిష్మాన్లు ఆంగ్లంలో కూడా గజళ్లను రాశారు. తెలుగు గజల్ స్వర్ణోత్సవం సందర్భంగా ‘గజల్ లోగిలి’ అనే పేరుతో ఒక ఫేస్బుక్ సమూహం తెలుగు గజళ్ల కోసం మొదలై సాగుతోంది. అయితే, గజల్ తెలుగులోకి మూడు దోషాలతో వచ్చింది. ఒకటి కాఫియా అంటే అంత్యాను ప్రాస విషయంలో జరిగింది. రెండవది బహర్ అంటే ఛందస్సు లేకుండా రావడం. మూడవది గజలియత్ అంటే గజల్‌తనం లేకపోవడం. గజల్ రాస్తున్నందుకు తెలుగునూ, తెలుగులో రాస్తున్నందుకు గజల్నూ భ్రష్టుపట్టిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. తెలుగులో గజల్ ప్రక్రియ బాగా పుంజుకుని సరైన దారిలో రాణించాల్సిన అవసరం ఉంది. రోచిష్మాన్ 09444012279