Sri Shobhakruth Nama Ugadi 2023: శోభాయమానం | Ugadi is our first festival. | Sakshi
Sakshi News home page

Sri Shobhakruth Nama Ugadi 2023: శోభాయమానం

Published Wed, Mar 22 2023 4:50 AM | Last Updated on Wed, Mar 22 2023 4:01 PM

Ugadi is our first festival. - Sakshi

ఉగాది మన తొలిపండుగ. ఈసారి ఉగాదికి పేరు శోభకృత్‌. శోభ అంటే కాంతి. మన జీవితాలకు అవసరమైన...భాగ్యాల, సౌభాగ్యాల కాంతిని ఈ ఉగాది ఇస్తుందనిఆశిద్దాం. ఈసారి వసంత విషువత్‌ జరిగిన మరుసటి రోజున ఉగాది వచ్చింది. అంటే వసంత విషువత్‌ మొదలు అయిన మరుసటి రోజున చైత్రమాసంమొదలు అయింది. ఇది ఒక విశేషం. ఇలా జరగడం అరుదు. ఈ అరుదైన సంఘటన మనకు, దేశానికి, ప్రపంచానికి అత్యంత మేలు చెయ్యాలని అపేక్షిద్దాం. 

ఉగాదితో చాంద్ర–సౌర (లూని సోలర్‌) సంవత్సరం మొదలు అవుతుంది. పౌర్ణమి చంద్రుడు చిత్త లేదా చిత్ర నక్షత్రంతో ఉండడం చైత్రమాసం. చైత్రమాసం తొలిరోజు అంటే చైత్రశుక్ల పా డ్యమి రోజు ఉగాది అవుతుంది. చంద్రుడు ఒక నక్షత్రంతో మొదలుపెట్టి, భూమి చుట్టూ తిరిగి మళ్లీ ఆ నక్షత్రం దగ్గరకు రావడానికి పట్టే కాలం నాక్షత్రమాసం అవుతుంది. సూర్యుడు భూమధ్యరేఖను ఉత్తరంవైపుగా దాటడం వసంత విషువత్‌  అవుతుంది.

వసంత విషువత్‌ మార్చ్‌ 21న జరుగుతుంది. ఆ రోజు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. సూర్య, చంద్ర గమనాలుప్రాతిపదిక కాబట్టి చాంద్ర–సౌర సంవత్సరం అవుతుంది. వ్యావహారిక శకానికి పూర్వం తొలిదశలో సప్త ఋషులు నాక్షత్ర సంవత్సరాన్ని, చాంద్ర–సౌర సంవత్సరాన్ని కలిపి పంచాంగాన్ని అమలులోకి తెచ్చారు. మూడు, ఐదు సంవత్సరాలలో వచ్చే అధికమాసాలను కలుపుకుని ఐదు సంవత్సరాలతో ఒక యుగం అని పంచాంగం పరంగా అమలు చేశారు.

అప్పట్లో ఆ యుగం ఆరంభం శరత్‌ విషువత్, శరత్‌ ఋతువులో ఉండేది. ఈ ఐదు సంవత్సరాల యుగంలో మొదటి సంవత్సరంలో మొదటి రోజు యుగాది అని అయింది; అదే ఉగాది అయింది. ఈ యుగం జ్యోతిష శాస్త్రానికి ఆనుగుణ్యంగానూ రూపొందింది. ‘జ్యోతి’ అంటే నక్షత్రం అనీ ‘షం’ అంటే సంబంధించిన అనీ అర్థాలు. జ్యోతిషం అంటే నక్షత్రానికి సంబంధించినది అని అర్థం. 

నాక్షత్ర చాంద్ర– సౌర గమనాల ప్రా తిపదికన మన పంచాంగం నిర్మితమైంది. పంచాంగం ప్రకారం మనకు ఉగాది నిర్ణీతమైంది. సప్త ఋషుల తరువాత విశ్వామిత్ర మహర్షి పంచాంగంలోనూ, కాలగణనంలోనూ కొన్ని ప్రతిపా దనలను, మార్పులను తీసుకువచ్చాడు. ఆ తరువాత కాలక్రమంలో  జరుగుతూ వచ్చిన ఖగోళమార్పులకు తగ్గట్లు గర్గ మహర్షి సంవత్సరాదిని వసంత విషువత్‌ కు మార్చాడు. ఆర్యభట్టు, వరాహమిహిరుడు దాన్నే కొనసాగించారు. అదే ఇప్పటికీ వస్తోంది. వసంత విషువత్‌తో వసంతం మొదలు అవుతుంది; సాంప్రదాయిక సంవత్సరాన్ని లేదా ఆచార వ్యవహారాల కోసం సంవత్సరాన్ని చైత్రమాసంతో మొదలుపెట్టారు. 

వసంతాన్ని కుసుమాకరం అనీ, కుసుమాగమం అనీ అంటారు. కుసుమానికి పుష్పం, పండు, ఫలం అని అర్థాలు ఉన్నాయి. ఈ మూడూ మనకు ఎంతో అవసరం అయినవి. తప్పకుండా మనం వీటిని ΄÷ందాలి. మన జీవితాలు కూడా నిండుగా పుష్పించాలి, పండాలి, ఫలవంతం అవ్వాలి. వసంతాన్ని ప్రకృతి ఇస్తున్న సందేశంగా మనం గ్రహించాలి. వసంతం ఒక సందేశం దాన్ని మనం అందుకోవాలి, అందుకుందాం. 

ఆరు ఋతువులకు ఆదిగా వచ్చేది ఈ పండుగ. సంవత్సరంలోని ఆరు ఋతువులకు ప్రతీకలుగా  తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపుల్ని తీసుకుని ఆ రుచుల కోసం వేపపువ్వు, బెల్లం, మిరియాలపొడి, చింతపండు, ఉప్పు, మామిడి ముక్కల్ని కలిపి ఉగాది పచ్చడిని మనం తీసుకుంటున్నాం. నింబకుసుమ భక్షణం అని పేరు. ఇది ఉగాది పండుగలో ముఖ్యాంశం. మరో ముఖ్యాంశం పంచాంగ శ్రవణం. ఆదిలోనే ఎవరి రాశి ప్రకారం వారికి సంవత్సరంలో జరగడానికి అవకాశం ఉన్న మేలు, కీడులను వ్యక్తులకు సూచన్రపా యంగా పంచాంగం చెబుతుంది.

పంచాంగ శ్రవణానికి ముందుగా మనం అభ్యంగన స్నానం చేసి, మామిడి తోరణాలతో, పుష్పాలతో ఇళ్లను అలంకరించుకుని దైవపూజ చెయ్యాలి; చేద్దాం.ప్రకృతి ఇచ్చిన సందేశాలుగా అందివచ్చిన ఉగాదిని, వసంతాన్ని ఆకళింపు చేసుకుని, ఆదర్శంగా తీసుకుని, మనం మనకు, ఇతరులకు ఈ ఏడాదిలోని అన్ని ఋతువుల్లోనూ హితకరం అవ్వాలి, అవుదాం.

మంచికి తొలి అడుగుగా, ఒక పండుగగా, తొలి పండుగగా ఉగాది మనకు అందివచ్చింది. ఇతర పండుగలా కాకుండా ఉగాది కాలానికి, ప్రకృతికి సంబంధించిన పండుగ. మనిషి కాలానికి, ప్రకృతికి అనుసంధానం అవ్వాలని తెలియజెప్పే ఒక విశిష్టమైన పండుగ ఉగాది.

వసంత ఋతువు రావడాన్ని వసంతావతారం అని కూడా అంటారు. వసంతావతారం సంవత్సరానికి ఉన్న అవతారాలలో గొప్పది. ఆపై శోభాయామానమైంది. సంవత్సరానికి శోభ వసంతం. వసంతం మనకు వచ్చే ఋతువుల్లో ప్రధానమైంది లేదా కేంద్రభాగం. చెట్లకు కొత్త చివుళ్లు, కోయిలల గానాలు, పచ్చదనం, పువ్వుల కళకళలు. వీటిని వసంతం తెస్తుంది, ఇస్తుంది. వసంతంలో ఎక్కువ వేడి, చలి ఉండవు. వాతావరణం ఉల్లాసకరంగా ఉంటుంది. వసంతం శ్రేష్ఠమైంది కాబట్టే ‘అహమృతూనాం కుసుమాకరః‘ అంటూ కృష్ణుడు భగవద్గీతలో తాను ఋతువుల్లో వసంతాన్ని అని చెప్పాడు.

సంవత్సరంలో ఉండే మంచితనం వసంతం. వసంతం ప్రకృతి నుంచి మనకు అందివచ్చే మంచితనం.  ‘... సంతో వసంతవల్లోకహితం చరంతః ...’ అని వివేకచూడామణిలో ఆదిశంకరాచార్య అన్నారు. అంటే మంచివాళ్లు వసంతంలాగా లోకహితాన్ని ఆచరిస్తారు అని అర్థం. వసంతం వంటి హితం, హితం వంటివసంతం మనకు, సంఘానికి, దేశానికి, ప్రపంచానికి ఎంతో అవసరం.
– రోచిష్మాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement