ఓటమి ద్వారా వచ్చే విజయం ఉంది! అది ఓటమి నేర్పే పాఠం!! ఓటమి నేర్పే పాఠం ఎంతో ముఖ్యమైంది ఆపై విలువైంది; అది మరేవిధంగానూ రాదు. ఓటమి దెబ్బ బలంగా తగిలినా మనిషి పడిపోకుండా నిలబడి ఆ పాఠాన్ని చదవాలి. ఓటమి నేర్పిన పాఠాన్ని సరిగ్గా చదవగలిగిన మనిషికి భవిష్యత్తులో విజయం అందుతుంది; విజయవంతమైన భవిష్యత్తు అందుతుంది.
ఓడిపోయాక శోకిస్తూ ఉండడం సరికాకపోవడమే కాదు హానికరమైంది కూడా. ఓడిపోయాకైనా గెలవాలి అన్న పట్టుదల కలగాలి. ఆ పట్టుదల ఓటమి తరువాతి జీవనంపై పట్టును ఇవ్వాలి. ఓడిపోవడం నేరం కాదు. ఓడిపోయాక తలదించుకోవాల్సిన అగత్యంలేదు. ఓడిపోతే కుంగిపోకూడదు ఓటమికి లొంగిపోకూడదు. ఓడిపోతే వాడిపోకూడదు, వాడిమిని కోల్పోకూడదు. ఓడిపోయాక మనిషి ఎడారిలో ఒంటరివాణ్ణి అయిపోయానని కృశించిపోతూ ఉండిపోకూడదు; ఎందుకూ కొరగాని వాణ్ణి అయిపోయానని నిస్తేజంగా ఉండిపోకూడదు. ఓడిపోతే నిస్ప్పహా ప్రభావానికి మ్రాన్పడి చిల్తై పోకూడదు. ఓడిపోయాక, నిస్పృహ ఆవరించాక నిద్రలోంచి లేచినట్లుగా లేవాలి. ఆపై మెలకువను పొందినట్లుగా సత్‌స్పృహను పొందాలి.
ఓడిపోతే కష్టాలొస్తాయి; ఆ కష్టాలలోనే సత్యాలు తెలుస్తాయి. ఆ సత్యాలు ఎంతో ముఖ్యమైనవి.
జీవితం అన్నాక, జీవనం ఉన్నాక ఆశాభంగం తప్పదు. భంగం అయినంత మాత్రాన భాగ్యం భగ్నమైపోదు. ఓడిపోయిన తరువాత నిలదొక్కుకోగలిగిన మనిషి ముందుకు సాగగలడు.
కలిగిన ఓటమికి దెబ్బతిన్నాక గెలవడంపై మనిషికి చైతన్యం రావాలి. ఓటమి గురించి చింత, చింతనలను అధిగమించాలంటే మనిషికి గెలవాలి అన్న చైతన్యం కావాలి, రావాలి. ఆ చైతన్యంతో గెలుపును సుసాధ్యం చేసుకోవాలి.
ఓటమి కలిగాక దాన్ని అర్థం చేసుకుని అంగీకరించాలి. కలిగిన ఓటమికి మనం సాక్ష్యం మాత్రమే అవ్వాలి. అంతకుమించి మనం ఓటమిలో కూరుకుపోకూడదు. భవిష్యత్తులో విజయంలో విలీనం అవ్వాలంటే కలిగిన ఓటమి నుంచి మనల్ని మనం విడిపించుకోవాలి. విజయం సాధించడం ఎలాంటిదో ఓటమి నుంచి విడివడడం కూడా అలాంటిదే. ప్రపంచంలో విజేతలైనవాళ్లలో ఎక్కువ శాతంమంది ఓటమి నుంచి తమను తాము విడిపించుకున్నవాళ్లే.
సూర్యోదయాన్ని పొందుతూ ఉండడం భూమి రోజూ సాధిస్తున్న విజయం. పొంగుతూ, సాగుతూ పారడం నది సాధిస్తున్న విజయం. వీస్తూ ఉండడం గాలికి విజయం. విజయం అనేది ఒక లక్ష్యమా? కాదు. విజయం అనేది లక్షణం. అవును విజయం అనేది మనిషికి లక్ష్యంగా కాదు లక్షణం గా ఉండాలి. ఓటమి చీకటిలా మూగినప్పుడు కాస్తంత ఓపికపడితే విజయం వేకువై వచ్చేస్తుంది. ‘‘వేసవికాలం వెంబడించని చలికాలం లేదు’’ అన్నారు వివేకానంద. ఓటమి అనే చలికి పట్టుబడి గడ్డకట్టుకుపోకుండా ఉండగలగాలి. చలికాలం తరువాత వేసవి వచ్చేస్తుంది. ఓటమి శోకాన్ని కలిగించినా విజయాన్ని సాధించేందుకు కాలం ఉందని, ఉంటుందని తెలుసుకోవాలి.
విజయం కోసం ఆశపడితే, ఆకాంక్షిస్తే తప్పకుండా మనిషికి అవకాశాలు ఆసన్నం అవుతాయి. వాటిని సఫలం చేసుకుంటే విజయం వస్తుంది. ఆ విజయానికి చిహ్నంగా మనిషి జీవితం వసంతం అవుతుంది.
– రోచిష్మాన్
మంచి మాట: విజయం ఓటమి తర్వాత వేకువ
Published Mon, Jan 30 2023 12:41 AM | Last Updated on Mon, Jan 30 2023 9:21 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment