ఒక పున్నమి రాత్రిలో తిక్కలోడు ఒకడు దారి వెంబడి నడుస్తూ పోతున్నాడు. కాసేపయ్యాక సేదతీరడం కోసం ఓ చెట్టు కింద నుంచున్నాడు. ఆ చెట్టుకు దగ్గరలో ఓ పెద్ద బావి కనిపిస్తే ఆ బావిలోకి తొంగి చూశాడు. ఆ బావి నీళ్లలో జాబిల్లి ప్రతిబింబం కనిపించింది. జాబిల్లి బావిలో పడిపోయింది అని అనుకున్నాడు. అయ్యో ఇప్పుడు నేనేం చెయ్యగలను? ఎలా ఈ జాబిల్లిని కాపాడగలను? ఇక్కడెవరూ లేరే, ఇప్పుడు ఈ జాబిల్లిని నేను కాపాడకపోతే అది చచ్చిపోతుంది కదా అని అనుకున్నాడు.
అంతటితో ఊరుకోలేదు. అక్కడా ఇక్కడా వెతికి ఓ తాడును తీసుకుని దాన్ని బావిలోకి విసిరేశాడు జాబిల్లిని ఆ తాడుతో కట్టి బయటకు తియ్యచ్చని అనుకుని. ఆ బావిలో ఏదో ఓ రాయికి ఆ తాడు చిక్కుకుపోయింది. ఆ వ్యక్తి చాలబలంగా ఆ తాడును లాగాడు. కానీ రాయికి చిక్కుకుపోయిన తాడు రాలేదు. జాబిల్లి చాల బరువుగా ఉందే, పైగా నేనిక్కడ ఒంటరిగా ఉన్నానే, నేనెలా జాబిల్లిని బయటకు తియ్యగలను? ఈ జాబిల్లి ఎప్పటి నుండి ఈ బావిలో ఉందో తెలియడం లేదు, జాబిల్లి అసలు బతికి ఉందా, చచ్చిపోయిందా కూడా తెలియడం లేదు అని అనుకుంటూ ఆ వ్యక్తి తాడును బలంగా లాగుతున్నాడు.
అలా లాగుతూ ఉండగా ఆ తాడు తెగిపోయి అతడు వెల్లకిలా నేలపై పడిపోయాడు. పడిపోవడంవల్ల అతడి కళ్లు మూసుకుపోయాయి. తలకు దెబ్బ తగిలింది. కొద్దిసేపు తరువాత అతడు కళ్లు తెరిచినప్పుడు జాబిల్లి ఆకాశంలో కనిపించింది. దాన్ని చూసి తను జాబిల్లిని కాపాడేశాడనీ, తనకు మాత్రమే కొంచెం దెబ్బ తగిలిందనీ అయినా పరవాలేదనీ తనవల్ల జాబిల్లి కాపాడబడిందనీ తనకు తాను చెప్పుకున్నాడు. ఆ వ్యక్తిని చూసి మనం నవ్వుకుంటాం. ఒక సందర్భంలో ఓషో చెప్పిన కథ ఇది.
కథలోని వ్యక్తి ఎక్కడ తప్పు చేశాడు? అతడు తన తత్త్వంతో ఏదో అనుకున్నాడు. ఆ అనుకున్నది సరికాదు. మనం కూడా ఇలాగే ఏదో, ఏవో అనుకుంటూ ఉంటాం. చాలసందర్భాల్లో మనం అనుకునేవి సరైనవి కావు. ఈ తీరు మన సమస్యల్లో ప్రధానమైంది.
అనుకోవడానికి అతీతంగా మనం బతకగలం అన్న చింతన కూడా మనలో చాలమందికి లేదు. ఎప్పడూ ఏదో ఒకటి అనుకుంటూ ఉండాల్సిందే అన్న స్థితిలో మనం కొట్టుమిట్టాడుతున్నాం. తిక్కవ్యక్తి, జాబిల్లి బావిలో పడిపోయిన ఈ కథలాగానే మానవజాతి మొత్తం ఇలాంటి సమస్యలో ఇరుక్కుపోయి ఉంది. ఈ ప్రపంచమంతా ఈ సమస్య ఉంది అని అంటారు ఓషో.
దేన్నో అనుకుంటూ ఉండడమూ, దేన్ని పడితే దాన్ని అనుకుంటూ ఉండడమూ మనలోని సమస్యలు మాత్రమే కాదు మనం దిద్దుకోవాల్సిన తప్పులు. అభిప్రాయపడడంలాగా అనుకోవడం కూడా మనుషుల రుగ్మతే; కాకపోతే బలమైన బలహీనత.
ఏదో, ఏవో అనుకుంటూ ఉండడంవల్ల మనుషులకు నష్టం, కష్టం, హాని కలుగుతూ ఉంటాయి. ఏదో, ఏవో అనుకుంటూ ఉండడం కాదు పరిస్థితులు, సంఘటనలపై సమగ్రమైన, సరైన అవగాహనను పొందేందుకు పూనుకోవాలి. అలాంటి అవగాహన మాత్రమే మనకు కావాల్సిన మేలు చేస్తుంది.
అనుకోవడం అనేది ప్రతి వ్యక్తికీ ఉండే లక్షణమే. అనుకోవడం అన్న లక్షణం లేని మనుషులు ఉండరు. అయితే మనలో పలువురికి ఏం అనుకుంటున్నాం, ఎందుకు అనుకుంటున్నాం, అనుకునేది సరైందేనా? వంటివాటిపై ఉండాల్సిన పరిణతి, కచ్చితత్వం ఉండవు. ఈ తీరు పలు సమస్యలకు మూలం అవుతోంది.
– రోచిష్మాన్
Comments
Please login to add a commentAdd a comment