maturity
-
లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నారా? మెచ్యూరిటీ సొమ్ముపై పన్ను తప్పదు!
న్యూఢిల్లీ: జీవిత బీమా పాలసీల వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకు మించి ఉంటే, వాటి మెచ్యూరిటీ తర్వాత అందుకునే మొత్తంపై పన్నును ఏ విధంగా లెక్కించాలన్నది ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి సవరించిన నిబంధనలను నోటిఫై చేసింది. ఏడాదికి చెల్లించే ప్రీమియం రూ.5 లక్షలకు మించితే పాలసీ గడువు తర్వాత అందుకునే మొత్తాన్ని వార్షిక ఆదాయానికి కలిపి చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. 2023 ఏప్రిల్ 1 తర్వాత నుంచి రూ.5 లక్షలకు మించి ప్రీమియం ఉండే పాలసీల మెచ్యూరిటీపై పన్ను అమల్లోకి వచ్చిన విషయం గమనార్హం. అంతకుముందు వరకు పాలసీల ప్రీమియం ఎంతన్న దానితో సంబంధం లేకుండా మెచ్యూరిటీ మొత్తంపై సెక్షన్ 10(10డీ) కింద పన్ను మినహాయింపు అమల్లో ఉంది. -
మంచి మాట: ఏదో.. ఏవో అనుకుంటూ...
ఒక పున్నమి రాత్రిలో తిక్కలోడు ఒకడు దారి వెంబడి నడుస్తూ పోతున్నాడు. కాసేపయ్యాక సేదతీరడం కోసం ఓ చెట్టు కింద నుంచున్నాడు. ఆ చెట్టుకు దగ్గరలో ఓ పెద్ద బావి కనిపిస్తే ఆ బావిలోకి తొంగి చూశాడు. ఆ బావి నీళ్లలో జాబిల్లి ప్రతిబింబం కనిపించింది. జాబిల్లి బావిలో పడిపోయింది అని అనుకున్నాడు. అయ్యో ఇప్పుడు నేనేం చెయ్యగలను? ఎలా ఈ జాబిల్లిని కాపాడగలను? ఇక్కడెవరూ లేరే, ఇప్పుడు ఈ జాబిల్లిని నేను కాపాడకపోతే అది చచ్చిపోతుంది కదా అని అనుకున్నాడు. అంతటితో ఊరుకోలేదు. అక్కడా ఇక్కడా వెతికి ఓ తాడును తీసుకుని దాన్ని బావిలోకి విసిరేశాడు జాబిల్లిని ఆ తాడుతో కట్టి బయటకు తియ్యచ్చని అనుకుని. ఆ బావిలో ఏదో ఓ రాయికి ఆ తాడు చిక్కుకుపోయింది. ఆ వ్యక్తి చాలబలంగా ఆ తాడును లాగాడు. కానీ రాయికి చిక్కుకుపోయిన తాడు రాలేదు. జాబిల్లి చాల బరువుగా ఉందే, పైగా నేనిక్కడ ఒంటరిగా ఉన్నానే, నేనెలా జాబిల్లిని బయటకు తియ్యగలను? ఈ జాబిల్లి ఎప్పటి నుండి ఈ బావిలో ఉందో తెలియడం లేదు, జాబిల్లి అసలు బతికి ఉందా, చచ్చిపోయిందా కూడా తెలియడం లేదు అని అనుకుంటూ ఆ వ్యక్తి తాడును బలంగా లాగుతున్నాడు. అలా లాగుతూ ఉండగా ఆ తాడు తెగిపోయి అతడు వెల్లకిలా నేలపై పడిపోయాడు. పడిపోవడంవల్ల అతడి కళ్లు మూసుకుపోయాయి. తలకు దెబ్బ తగిలింది. కొద్దిసేపు తరువాత అతడు కళ్లు తెరిచినప్పుడు జాబిల్లి ఆకాశంలో కనిపించింది. దాన్ని చూసి తను జాబిల్లిని కాపాడేశాడనీ, తనకు మాత్రమే కొంచెం దెబ్బ తగిలిందనీ అయినా పరవాలేదనీ తనవల్ల జాబిల్లి కాపాడబడిందనీ తనకు తాను చెప్పుకున్నాడు. ఆ వ్యక్తిని చూసి మనం నవ్వుకుంటాం. ఒక సందర్భంలో ఓషో చెప్పిన కథ ఇది. కథలోని వ్యక్తి ఎక్కడ తప్పు చేశాడు? అతడు తన తత్త్వంతో ఏదో అనుకున్నాడు. ఆ అనుకున్నది సరికాదు. మనం కూడా ఇలాగే ఏదో, ఏవో అనుకుంటూ ఉంటాం. చాలసందర్భాల్లో మనం అనుకునేవి సరైనవి కావు. ఈ తీరు మన సమస్యల్లో ప్రధానమైంది. అనుకోవడానికి అతీతంగా మనం బతకగలం అన్న చింతన కూడా మనలో చాలమందికి లేదు. ఎప్పడూ ఏదో ఒకటి అనుకుంటూ ఉండాల్సిందే అన్న స్థితిలో మనం కొట్టుమిట్టాడుతున్నాం. తిక్కవ్యక్తి, జాబిల్లి బావిలో పడిపోయిన ఈ కథలాగానే మానవజాతి మొత్తం ఇలాంటి సమస్యలో ఇరుక్కుపోయి ఉంది. ఈ ప్రపంచమంతా ఈ సమస్య ఉంది అని అంటారు ఓషో. దేన్నో అనుకుంటూ ఉండడమూ, దేన్ని పడితే దాన్ని అనుకుంటూ ఉండడమూ మనలోని సమస్యలు మాత్రమే కాదు మనం దిద్దుకోవాల్సిన తప్పులు. అభిప్రాయపడడంలాగా అనుకోవడం కూడా మనుషుల రుగ్మతే; కాకపోతే బలమైన బలహీనత. ఏదో, ఏవో అనుకుంటూ ఉండడంవల్ల మనుషులకు నష్టం, కష్టం, హాని కలుగుతూ ఉంటాయి. ఏదో, ఏవో అనుకుంటూ ఉండడం కాదు పరిస్థితులు, సంఘటనలపై సమగ్రమైన, సరైన అవగాహనను పొందేందుకు పూనుకోవాలి. అలాంటి అవగాహన మాత్రమే మనకు కావాల్సిన మేలు చేస్తుంది. అనుకోవడం అనేది ప్రతి వ్యక్తికీ ఉండే లక్షణమే. అనుకోవడం అన్న లక్షణం లేని మనుషులు ఉండరు. అయితే మనలో పలువురికి ఏం అనుకుంటున్నాం, ఎందుకు అనుకుంటున్నాం, అనుకునేది సరైందేనా? వంటివాటిపై ఉండాల్సిన పరిణతి, కచ్చితత్వం ఉండవు. ఈ తీరు పలు సమస్యలకు మూలం అవుతోంది. – రోచిష్మాన్ -
పరిణతి... జీవన సాఫల్యం
బాల్యదశ తరువాత మనలో శారీరకంగా వచ్చే మార్పు, ఎదుగుదలే పరిణతి. ఇది భౌతికమైనదే కాదు, మానసికమైనదీ కూడ. మన ఆలోచనలలో, ఆలోచనా రీతిలో వచ్చిన, వస్తున్న తేడాను చూపుతుంది. అంటే మన మనోవికాసాన్ని, దాని స్థాయిని సూచిస్తుంది. మనం వయసు రీత్యా ఎదిగే క్రమంలో మన భాషలో, అభివ్యక్తిలో, ఎదుటివారిని అర్ధం చేసుకునే తీరులో, మన స్పందనలో వెరసి మన ప్రవర్తనలో వచ్చే క్రమానుగతమైన మార్పే పరిణతి. కొంతమందిలో వారి శారీరక వయసు కన్నా పరిణతి వయసు ఎక్కువ. మరికొందరిలో దీనికి భిన్నమూ కావచ్చు. వయసులో పెద్దవారైనా తగిన పరిణతి లేకపోవచ్చు. అలాగే వయసులో చాలా చిన్నవారైనా కొంతమందిలో ఎంతో మానసిక పరిణతి కనిపిస్తుంటుంది. కాబట్టి మన వయసు మన మానసిక ఎదుగుదలకు దర్పణం కావచ్చు. కాకపోవచ్చు. అందువల్లనే పరిణతికి వయసు లేదని, వయసు రీత్యా నిర్ధారించలేమని విజ్ఞులు చెపుతారు. పరిణతికి ఛాయార్థాలు చాలా ఉన్నా పరిపక్వత అన్న అర్థంలో ఎక్కువగా వాడతారు. ప్రవర్తన గురించి చెప్పటానికి తరచూ వాడే మాట. పరిణతి అన్న నాలుగు అక్షరాలలో ఎంతో విశేషమైన, లోతైన, విస్తృతార్థముంది. పరిణతంటే సంక్షిప్తంగా చెప్పాలంటే భావోద్వేగాల మీద గట్టి పట్టు, నియంత్రణే పరిణతి. విచక్షణ, వివేచన, సంయమనం, సహనం, క్షమాగుణం, ఉచిత సంభాషాణ తీరు, దూరదృష్టి, విభేదాలు మరచి అందరిని కలుపుకుని ముందుకు సాగే వైఖరి. ఇక్కడ ఉదాహరించినవి కొన్నే అయినా ఈ పరిణతి ఇంకా ఎన్నో లక్షణాలను దానిలో పొదవుకుంది. మన పుట్టుకకు లక్ష్యం జీవితాన్ని మెరుగుపరుచుకోవటం. మనలోని దుర్గుణాలను తొలగించుకుంటూ, మంచిని పెంచుకుంటూ ఇతరులను కలుపుకుని మనలోని మానవీయ శక్తులను బలపరచుకుంటూ ముందుకుసాగాలి. అదే జీవిత సార్థకత. ఉత్తమమైన, ఉన్నతమైన పథంలో పయనించగలగాలి. అప్పుడే కదా మానవులు బుద్ధిజీవులన్న మాటకు మరింత ఊతాన్నిచ్చినట్టు! ఇది మనసు లో నిలుపుకుని మానవుడే మహనీయుడు అన్న మాటను సుసాధ్యం చేయాలనుకునే వారికి.. పరిణితి ఎందుకు సాధ్యం కాదు? అన్న ఆలోచన వస్తుంది. దీన్ని సాధించి తీరాలన్న పట్టుదల వస్తుంది. అటువంటి వారికి ఇంత గొప్ప పరిణితి సాధించటం అసాధ్యం కాదు. అంటే దీనర్థం పరిణతికున్న అర్ధ పార్శా్వలన్నిటిపై వారికి ఓ పట్టు వచ్చి వారి వ్యక్తిత్వంలో ఒక భాగమైపోతుంది. మన జీవనక్రమంలో అనేకమందితో కలసి ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ ప్రయాణం కొందరితో కొంతకాలం, మరికొందరితో జీవితాంతం సాగుతుంది. వీరందరితోనూ సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవలసిన ఆవశ్యకత ఉంది. దీనికి గొప్ప మానసిక పరిణతి కావాలి. ఇంతటి ఉన్నత పరిపక్వత సాధించే గలిగే వారు వేళ్ళమీద లెక్కించగల సంఖ్యలోనే ఉంటారు. వాళ్లు వయసులో పెద్దవారైనా చిన్నవారైనా గొప్పవారే, ఆదర్శనీయులే, నమస్కరించ తగినవారే. ఒక విషయాన్ని అర్థం చేసుకునే పద్ధతిలో మన దృష్టి ముఖ్యపాత్ర వహిస్తుంది. ఇక్కడ దృష్టి అంటే మన వైఖరి. సమగ్రమైన అవగావన రావాలంటే దానికి చుట్టుకొని ఉన్న అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకోవాలి. అపుడే దానిమీద సాధికారంగా మాట్లాడగలం. ఈ దృష్టి, విశ్లేషణా శక్తి, అవగాహనా తీరునే పరిణతి అంటాం. స్థాయిలో పరిణితి సాధ్యమా? అన్న ప్రశ్న చాలామందిలో ఉదయిస్తుంది. గట్టి ప్రయత్నం చేయగలిగితే కనక ఇది సాధ్యమే.. ఇది మన దృఢ నిశ్చయం మీద ఆధారపడి ఉంటుంది. అందరూ ప్రయత్నించినా ఇది ఏ కొందరికో మాత్రమే పట్టుబడే శక్తి. ఈ పరిణితికి ఆవృతమైన అనేక లక్షణాలలో కొందరికి కొన్ని బాగా అలవడచ్చు. అందుకే దీనికి స్థాయీభేదం ఉంటుంది. ప్రతి ఒక్కరి వయసు పెరుగుతూ ఉంటుంది. ఇది భౌతికమైనది. దీనికి అదే నిష్పత్తిలో మానసిక ఎదుగుదల ఉందా? మనలో ఎంతమంది వయసుకు తగిన విధంగా సమయోచితంగా ప్రవర్తిస్తున్నాం!? ఈ రెండిటి మధ్య ఒక సమతౌల్యత పరిణతే కదా! మనం కొన్ని విషయాల్లో కొందరితో విభేదిస్తాం. అంతమాత్రాన బద్ధశత్రువులం కానవసరంలేదు. ఓ భావపరమైన, సిద్ధాంతపరమైన విషయాల వరకు మాత్రమే దానిని పరిమితి చేయాలి. అలాగే చంపదగ్గ శత్రువు మన చేత చిక్కినా వాడిని చంపకుండా తగిన మేలు చేసి విడిచిపెట్టాలని వేమన చెప్పిన దానిలోనూ, మనకు అపకారం చేసిన వారికి కూడ వారి తప్పులను ఎంచకుండా ఉపకారం చేయాలని బద్దెన చెప్పిన దానిలో గోచరించేది పరిణతే. పరిణతి ఓ ధైర్యం. నిశ్చలత, స్థిత ప్రజ్ఞత. చక్కని శ్రుతి లయలతో, ఆరోహణ అవరోహణలతో, భావయుక్తంగా అటు శాస్త్రీయత ఇటు మాధుర్యం రెండిటి సమాన నిష్పత్తిలో అద్భుతంగా సంగీతకచేరి చేస్తున్నాడో యువ సంగీత కళాకారుడు. ఆ రాగ జగత్తులో, ఆ భావనాజగత్తులో విహరిస్తూ తాదాత్మ్యతతో పాడుతున్న అతడి గానం పండిత, పామర రంజితంగా సాగింది. తన సంగీత ప్రవాహంలో ఊయలలూగించిన ఆ కళాకారుడు అంధుడు. కచేరి అనంతరం అతణ్ణి ఆ ఊళ్ళో అతనికి చిన్నప్పుడు సరళీ స్వరాలు నేర్పుతూ అసలు ఈ గుడ్డివాడికి ఆ విద్య అలవడనే అలవడదని తరిమేసిన అతని గురువు దగ్గరకు తీసుకు వెళ్లారు నిర్వాహకులు. ఆ శిష్యుడు ఆయనకు పాదాభివందనం చేసి‘ఇదంతా మీరు పెట్టిన భిక్షే’ అని వినయంగా ఆయన పక్కన నిలబడ్డాడు. అంతే! ఆ గురువుకు తను చేసిన చర్య మనసులో కదిలి, సిగ్గుపడ్డాడు. అటు సంగీతంలోనే కాకుండా ప్రవర్తనలోనూ ఎంతో పరిణతి సాధించిన శిష్యుణ్ణి చూస్తూ ఆనందాశ్రువులు రాలుస్తూ మనసారా అతణ్ణి ఆశీర్వదించాడు. శారీరక వయసు కన్నా పరిణతి వయస్సు ఎక్కువని చెప్పటానికి ఇది చక్కని ఉదాహరణ. పరిణతి పొందటానికి అత్యంత అవసరమైనది అవేశాన్ని వీడటం. దానికి ఎంత దూరమైతే మానసిక పరిపక్వతకు అంత దగ్గరవుతాం. ఆవేశంలో ఆలోచనా శక్తిని కోల్పోతాం. వివేకం నశిస్తుంది. ఆ స్థితిలో మన మనసు తుఫానులో చిక్కుకున్న కల్లోలిత సంద్రమే. ఈ ఆవేశహంకారాలే విశ్వామిత్రుణ్ణి రాజర్షి స్థాయి నుండి మహర్షి, బ్రహ్మర్షి స్థాయికి చేర్చటానికి అభేద్యమైన అవరోధమైంది. ఆయన జీవితంలో సింహభాగాన్ని ధార పోసేటట్టు చేసింది. – లలితా వాసంతి -
ఆ అమ్మాయి ఈడేర లేదు..!
ఆడపిల్ల ఉంటే ఇంట్లోని వారు ఇరుగు పొరుగు వారు ఆ పిల్ల ఈడేరే విషయమై ఎదురు చూస్తూ ఉంటారు. ‘మీ అమ్మాయి ఈడేరిందా?’ అని అడుగుతూ ఉంటారు. కాని అందరు అమ్మాయిలు ఈడేరాలని లేదు. ప్రతి ఐదువేల మంది ఆడపిల్లల్లో ఒకరు ఎప్పటికీ రజస్వల కాని లోపంతో ఉంటారు. ఈ లోపాన్ని ‘టర్నర్ సిండ్రోమ్’ అంటారు. వైద్యశాస్త్రం పెద్దగా ఏ సహాయం చేయలేని ఈ సమస్యను సానుభూతితో అర్థం చేసుకోవడం గురించి ఇటీవల తెలుగులో కథలు వస్తున్నాయి. ఆ కథలు ఏమంటున్నాయి? ‘తొమ్మిదో తరగతికి వచ్చిన చెల్లెలు ఏపుగా ఎదిగి పోతుంటే నేనేమో గిడసబారిన మొక్కలాగా నాలుగున్నర అడుగులు దాటలేదు. అసలే మెడ కురచ. భుజాలు కొంచెం దగ్గరకొచ్చి మరింత చిన్నగా కనిపించేదాన్ని. నాతో కాలేజీకి వచ్చే అమ్మాయిల్లో కొందరికి నేనంటే చాలా చులకన. ఎప్పుడూ ఏదో రకంగా నన్ను ఆట పట్టించడం, జోకులేసి నవ్వుకోవడం వాళ్లకి సరదా. కళ్లలో తడి కనిపిస్తే మరింత ఏడిపిస్తారు. నేను పుష్పవతిని కాలేదు. అంతమాత్రం చేత నన్నెందుకు చిన్నచూపు చూడాలి. అందుకు బాధ్యురాలిని నేను కాదు కదా’ – రచయిత్రి వల్లూరిపల్లి శాంతి ప్రబోధ రాసిన ‘టర్నర్ సిండ్రోమ్’ అనే కథ నుంచి ‘ఎనిమిదో తరగతి అయిపోయింతర్వాత యేసవి సెలవుల్లో మా క్లాసుల మిగిలిన ఆడగుంటలు కరణాలమ్మాయి రాజేస్వరి, తెలకలోళ్ల కమల పుష్పవతులైపోయినారు. మా లచ్చుమత్త వచ్చినప్పుడల్లా ‘ఎప్పుడు మూల కూకుంటావే, ఎప్పుడు తిరపతిగాడిని పెల్లి సేసుకుంటావే’ అని అడుగుతుండీది. కళ్లు మూసి కళ్లు తెరిసినప్పుడికి రోజులు గిర్రున తిరిగిపోతున్నాయిగాని నేను పెద్దమనిషి కాకుండా శీలవతిలాగ మిగిలిపోతానేమో అని మాయమ్మకు, నాయనకు బెంగ పట్టుకున్నాది. మా ఊరిలోన నా ఒయసు ఆడగుంటలు తొమ్మండుగురు. నేను తొమ్మిదో తరగతికొచ్చినప్పుడికి ఏడుగురు పెద్దమనుసులైపోయినారు. నేను, పెదరైతుగారింటి మంగ ఇంకా అవ్వలేదు. నాలాగే కూకోడానికి ఇంకొక మనిషి ఊర్ల ఉందని మాయమ్మకు, మా నాన్నకు కొంచెం దైర్యంగా ఉండేది. ఇదిగో ఇప్పుడు పెదరైతుగారి పిల్ల సంవర్తాడిందనగానే మాయమ్మ, మా నాయిన తడిసిపోయిన సొప్పకట్టల్లాగా అయిపోగానే మొదటిసారి నేను పెద్దపిల్లనవ్వనేమో అని నాకు బయ్యమేసింది’ – రచయిత కరుణ కుమార్ రాసిన ‘పుష్పలత నవ్వింది’ కథ నుంచి. ఆడపిల్ల ఈడేరకపోతే మన దగ్గర భూకంపాలు వస్తాయి. ఆడజన్మ అంటేనే మన దృష్టిలో అమ్మ అయ్యే జన్మ అని అర్థం. సెంటిమెంట్ బలం ఎక్కువ. ఆమె ప్రత్యుత్పత్తికి అనువుగా ఉంటేనే గౌరవం. మన్నన. ప్రత్యుత్పత్తికి యోగ్యంగా లేకపోతే ఆమె మీద, కుటుంబం మీద చాలా ఒత్తిడి పెడుతుంది సమాజం. వింతగా చూస్తుంది. గేలి చేస్తుంది. చులకనతో విడిగా ఉంచేస్తుంది. ఈడేరని అమ్మాయికి సమాజం దృష్టిలో ఏ భవిష్యత్తూ లేనట్టే. ఇది ఒక రకంగా మూస దృష్టి. ఇంత మూసలో అందరూ ఉండకపోవచ్చు. పై రూపం బాగున్నా లోపల స్వల్ప మార్పుల వల్ల భిన్నంగా ఉండొచ్చు. అంతమాత్రం చేత వారికి ఏ భవిష్యత్తూ లేదనట్టుగా చూసే తీరు తప్పు. అలాంటి స్త్రీలు తమకు నచ్చిన రీతిలో జీవితాన్ని నిర్మించుకోవచ్చు. సంతోషంగా జీవించవచ్చు. కుటుంబం, సమాజం చేయాల్సింది అందుకు సహకరించడమే... అని చెబుతూ తెలుగులో కథలు వస్తున్నాయి. అలాంటి రెండు కథలే ‘టర్నర్ సిండ్రోమ్’, ‘పుష్పలత నవ్వింది’. ఆడపిల్లలు ఎందుకు ఈడేరరు? వివిధ కారణాలు ఉండొచ్చు. కాని ప్రధాన కారణం ‘టర్నర్ సిండ్రోమ్’. మనుషుల్లో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. స్త్రీలలో ఈ 23 జతల క్రోమోజోముల్లో ఏదైనా ఒక జతలో ఒక ఎక్స్ క్రోమోజోము ఏర్పడకపోతే అటువంటి వారిలో మొత్తం 45 క్రోమోజోములు ఉంటాయి. ఇలా 45 క్రోమోజోములు ఉన్నవారిలో అండాశయాలు చాలా చిన్నగా ఉండాయి. నెలసరి రాదు. అంటే వీరు ఎప్పటికీ రజస్వల కాలేరు. అది వినా ఇతరత్రా సాధారణ జీవనం జీవించొచ్చు. వైవాహిక జీవితం కూడా పొందవచ్చు. హెన్రీ టర్నర్ అనే అమెరికన్ ఎండోక్రైనాలజిస్ట్ ఈ సంగతి కనిపెట్టాడు కనుక దీనిని టర్నర్ సిండ్రోమ్ అంటారు. ఈ సమస్య ఉన్న 70 శాతం గర్భస్థ శిశువులను ఆల్ట్రాసౌండ్ పరీక్షలలో కనిపెట్టి అబార్షన్ చేస్తున్నారు అమెరికాలో. మిగిలిన ముప్పై శాతం శిశువుల్లో ఈడేరే వయసు వచ్చే దాకా ఈ సమస్య ఉన్నట్టు తెలియదు. కథలు ఏమంటున్నాయి? కరుణ కుమార్ రాసిన ‘పుష్పలత నవ్వింది’, శాంతి ప్రబోధ రాసిన ‘టర్నర్ సిండ్రోమ్’ ఈడేరని ఆడపిల్లల వేదనను చెబుతాయి. ‘పుష్పలత నవ్వింది’లో తండ్రి దాదాపు విరక్తిలోకి వెళతాడు తన ఒక్కగానొక్క కూతురు పెద్దమనిషి కాలేదని. టర్నర్ సిండ్రోమ్‌లో కథానాయిక తల్లి, నానమ్మ ఎంతో ఒత్తిడికి గురవుతారు. కథానాయిక కూడా. అయితే ‘పుష్పలత నవ్వింది’లో తల్లి, కూతురు కలిసి తండ్రికి అబద్ధం చెబుతారు. అమ్మాయి ఈడేరిన నాటకం ఆడతారు. అదొక ఇంటి రహస్యంగా ఉంచుతారు. ‘మంచి మనసున్న కుర్రాడిని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత అతనే అర్థం చేసుకుంటాడు’ అనే ముగింపు ఇస్తే... ‘టర్నర్ సిండ్రోమ్’ లో మాత్రం కథానాయిక బాగా చదువుకుని మొదట తన కాళ్ల మీద తాను నిలబడాలనుకుంటుంది. కుటుంబం నుంచి దూరంగా వచ్చి తన సమస్య తెలిసి తనతో జీవితాన్ని పంచుకునే అబ్బాయిని జీవితంలోకి ఆహ్వానిస్తుంది. ఈ రెండు కథల్లోనూ కథానాయికలకు కుటుంబం నుంచి, సమాజం నుంచి సవాలే ఎదురయ్యింది. ఇంత సవాలు అక్కర్లేదు. మనుషులకు ఎన్నో శారీరక లోపాలు ఉంటాయి. కళ్లద్దాలు రావడం కూడా ఒక లోపమే కదా. అలాంటి సర్వసాధారణ లోపంగా భావించే దశకు ఇటువంటి ఆడపిల్లల విషయంలో సమాజం వెళ్లాలి. ఆ చైతన్యం కథలు ఇస్తున్నాయి. అలాంటి కథలను ఆహ్వానించాలి. మా సమీప బంధువు ఒకరు తన కూతురు పెద్దమనిషి కావటం లేదని చాలా సంవత్సరాలు బాధపడటం దగ్గరగా చూశాను. అలాగే వరుసకు నాకు మేనత్త అయ్యే ఒకామె చివరి వరకు పెళ్లి లేకుండా ఉండిపోవడం చూసాను. అప్పుడే ఈ సమస్య వెనుక ఉన్న సామాజిక కోణం అర్థమయ్యింది. అప్పుడు ఈ కథ రాయాలని అనిపించింది. – కరుణకుమార్, రచయిత, సినీ దర్శకుడు నాకు బాగా తెలిసిన ఓ పోస్ట్‌గ్రాడ్యుయేట్ యువతి ఒక సందర్భంలో తన సమస్య గురించి చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. మహిళలందరికీ నెలసరి అనే శరీర ధర్మం సహజం. కానీ కొందరిలో ఉండదు. అది నిజం. నాకు తెలిసిన గైనకాలజిస్ట్ దగ్గరకి ఆ అమ్మాయిని తీసుకెళ్ళాను. ఫలితం శూన్యం. అప్పటి నుంచి ఈ సమస్యపై రాయాలి అనుకునేదాన్ని. శరీర అంతర్గత అవయవాల్లో సమస్య ఉన్న ఆ అమ్మాయిలు ఎటువంటి మానసిక, సామాజిక, శారీరక సమస్యలు ఎదుర్కొంటారో అని నేను చేసిన ఆలోచనకు జవాబే ఈ కథ. – వల్లూరుపల్లి శాంతిప్రబోధ, రచయిత్రి ఇది కూడా చదవండి: Period Pain and Cramps: రోజుకో నువ్వుల ఉండ, ఇంకా... -
పాలసీ మెచ్యూరిటీపై పన్నులు ఎలా ఉంటాయి?
నేను 2006, జూన్‌లో పీఎన్బీ మెట్‌లైఫ్ ఫ్యామిలీ ఇన్‌కం ప్లాన్‌ను రూ.4 లక్షల బీమా కోసం తీసుకున్నాను. ఏడాదికి రూ.7,152 ప్రీమియమ్ చొప్పున పదేళ్ల పాటు ప్రీమియమ్ చెల్లించాను. ఈ పాలసీ ఇప్పుడు మెచ్యూర్ అయింది. ఇప్పుడు నేను ఏమైనా పన్నులు చెల్లించాలా? -సుందర్, విజయవాడ ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 10(10డి) ప్రకారం.., సాధారణ బీమా పాలసీల మెచ్యురిటీ మొత్తాలపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు పొందే మెచ్యూరిటీ మొత్తం, మీరు చెల్లించిన వార్షిక ప్రీమియమ్‌నకు ఐదు రెట్ల మొత్తం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పని లేదు. బీమా పాలసీలు మెచ్యూర్ అయినప్పుడు వచ్చే మొత్తాలపై పన్నులు ఏ ఏ సందర్భాల్లో ఉండవంటే.., 1. 2003, మార్చి 31 కంటే ముందు తీసుకున్న బీమా పాలసీలకు 2. 2003, ఏప్రిల్ 1 నుంచి 2012, మార్చి 31 మధ్య కాలంలో బీమా పాలసీలు తీసుకున్నట్లయితే, మీరు పొందే మెచ్యూరిటీ మొత్తం, మీరు చెల్లించిన వార్షిక ప్రీమియమ్‌నకు ఐదు రెట్ల మొత్తం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు- 3. 2012, ఏప్రిల్ 1 తర్వాత బీమా పాలసీలు తీసుకున్నట్లయితే, మీరు పొందే మెచ్యూరిటీ మొత్తం, మీరు చెల్లించిన వార్షిక ప్రీమియమ్‌నకు పది రెట్ల మొత్తం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు... ఈ సందర్బాల్లో మెచ్యురిటీ మొత్తాలపై ఎలాంటి పన్నులు ఉండవు. నేను ఆరేళ్ల నుంచి కోటక్ సూపర్ అడ్వాంటేజ్ యులిప్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫండ్ పనితీరు సంతృప్తికరంగా లేదు. మెచ్యూరిటీ వరకూ ఈ యూలిప్లో కొనసాగితే మంచి రాబడులు వస్తాయని, మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ చెప్పాడు. ఈ యులిప్ నెలవారీ వ్యయాలు 4 శాతంగా ఉన్నాయి. ఈ యులిప్‌లో కొనసాగమంటారా? వద్దా ? - సతీష్ కృష్ణ, బెంగళూరు(ఈ మెయిల్ ద్వారా) కోటక్ సూపర్ అడ్వాండేజ్ యులిప్.. ఇతర యులిప్‌లతో పోల్చితే కొంచెం భిన్నమైనది. ఈ యులిప్‌లో రెండో ఏడాది నుంచి ప్రీమియమ్ అలకేషన్ చార్జీలు ఉండవు. ఈ యులిప్‌లో తప్పనిసరిగా వచ్చే రాబడులు రెండు ఉన్నాయి. మొదటిది ఫిక్స్డ్ అడ్వాంటేజ్.. పాలసీ కాలపరిమితిని బట్టి మీరు తొలి ఏడాది చెల్లించిన ప్రీమియమ్‌లో కొంత శాతం లభిస్తుంది. మీ విషయానికొస్తే, మీ పాలసీ కాలవ్యవధి 20 ఏళ్లు కాబట్టి. మీరు చెల్లించిన తొలి ఏడాది ప్రీమియమ్‌కు 200% మొత్తం తప్పనిసరిగా లభిస్తుంది. రెండోది డైనమిక్ అడ్వాంటేజ్.. పాలసీకి సంబంధించి చివరి మూడేళ్ల ఫండ్ విలువ సగటులో 3 శాతం లభిస్తుంది. సాధారణంగా వచ్చే రాబడులకు ఈ రెండు రాబడులు అదనం. అయితే ఇవన్నీ కూడా కలుపుకున్నా కూడా 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేసే ఈ పాలసీ ద్వారా మీకు తగిన రాబడులు రావని చెప్పవచ్చు. మీరు చెల్లించే ప్రీమియమ్‌లో ప్రతి ఏటా మెర్టాలిటీ చార్జీ కింద కొంత కోత ఉంటుంది. యులిప్‌లో స్వల్పమొత్తానికే బీమా రక్షణ ఉంటుంది. మీపై ఆధారపడిన వారికి ఈ బీమా రక్షణ సరిపోదు. యులిప్‌లు మార్కెట్ అనుసంధానిత ఫండ్స్ అయినప్పటికీ, ఓపెన్ ఎండ్ మ్యూచువల్ ఫండ్స్‌లా వీటిల్లో పారదర్శకత ఉండదు. ఎన్ఏవీ, పోర్ట్‌ఫోలియోలు, ఫండ్ మేనేజర్ వ్యూహాలు.. తదితర విషయాల్లో ఎలాంటి పారదర్శకత ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఉపసంహరించుకుంటే ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. యులిప్ చార్జీలతో పోల్చితే ఇవి తక్కువగానే ఉంటాయి. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ యులిప్ నుంచి వైదొలగడం సరైన నిర్ణయమే. బీమాను, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎప్పుడు కలగలపకూడదు. జీవిత బీమా కోసం టర్మ్ బీమా పాలసీలు, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో కనీసం ఐదేళ్ల పాటు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. స్టాక్ మార్కెట్‌కు మీరు కొత్త అయితే, ముందుగా మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్డ్ ఫండ్‌ను ఎంచుకోండి. ఈ ఫండ్‌లో ప్రతి నెలా కొంత మొత్తం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్‌పై మీకు కొంత అవగాహన ఉంటే, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేయండి. నివాస భారతీయుడి హోదాలో గత ఏడాది నుంచి మ్యూచువల్ ఫండ్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ సిప్‌లు 2024 వరకూ ఉంటాయి. అయితే ఈ ఏడాది నుంచి నా హోదా నివాస భారతీయుడి నుంచి ప్రవాస భారతీయుడి(ఎన్నారై)గా మారింది. ఎన్నారైగా మారినప్పటికీ, ఈ సిప్ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించే వీలు ఉందా? లేకుంటే ఆపేయాలా? - నారాయణ, విశాఖ పట్టణం మీ నివాసిత హోదా మారినప్పటికీ, మీ మ్యూచువల్ ఫండ్ సిప్ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగింవచ్చు. అయితే మీరు మీ కేవైసీ(నో యువర్ కస్టమర్) వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సంబంధిత డాక్యుమెంట్లు మీ మ్యూచువల్ ఫండ్ సంస్థకు పంపించి మీ కేవైసీని అప్డేట్ చేయించండి. మ్యూచువల్ ఫండ్స్‌లో నిరభ్యంతరంగా మీ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించండి. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్(పీఓఎంఐఎస్) ప్రయోజనాలు సీనియర్ సిటిజన్లకు, ఇతర వయస్కులకు ఒకే విధంగా ఉంటాయా? సీనియర్ సిటిజన్లకు ఏమైనా అధిక ప్రయోజనాలు లభిస్తాయా? పీఓఎంఐఎస్కు ఏమైనా పన్ను ప్రయోజనాలుంటాయా? - అనుపమ, హైదరాబాద్ పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న గ్యారంటీడ్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్గా పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్(పీఓఎంఐఎస్)ను చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్‌లో కొంత మొత్తం డిపాజిట్ చేస్తే, డిపాజిట్ చేసిన తేది నుంచి నెల తర్వాత కొంత మొత్తం ప్రతి నెలా ఐదేళ్ల పాటు అందుకోవచ్చు. ఈ డిపాజిట్లపై ప్రస్తుతం వడ్డీరేటు 7.8 శాతంగా ఉంది. ఈ స్కీమ్ కింద ఒక వ్యక్తి గరిష్టంగా రూ.4.5 లక్షలు, జాయింట్‌గా రూ.9 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు రూ.4.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీరు ప్రతి నెలా రూ.2,925 చొప్పున ఐదు సంవత్సరాల పాటు ఆదాయాన్ని అందుకోవచ్చు. కాలపరిమితి పూర్తయిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం మళ్లీ మీకు లభిస్తుంది. ఇక వయస్సు విషయంలో ఎలాంటి ప్రయోజనాలు లేవు. సీనియర్ సిటిజన్లకు ఎలాంటి అధిక ప్రయోజనాలు ఉండవు. ఈ స్కీమ్ కింద వచ్చే ఆదాయానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
బల్క్ డిపాజిట్ రేట్లను తగ్గించిన ఐసీఐసీఐ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం- ఐసీఐసీఐ బ్యాంక్ కోటి రూపాయల పైబడిన కొన్ని మెచ్యూరిటీలపై బల్క్ డిపాజిట్ రేట్లను 0.10 నుంచి 0.55 శాతం వరకూ తగ్గించింది. 7 నుంచి 14 రోజుల మధ్య వ్యవధి ఉండే టర్మ్ డిపాజిట్ రేటు ఇకపై 6 శాతంగా ఉంటుంది. 40 నుంచి 60 రోజుల మధ్య కాలానికి స్థిర రేటు 6.50 శాతంగా ఉంటుంది. 390 నుంచి 15 నెలల లోపు, 18 నెలల నుంచి రెండేళ్ల లోపు కాలానికి డిపాజిట్ రేటు 7.6 శాతానికి తగ్గించింది. రెండేళ్ల నుంచి 10 ఏళ్ల మధ్య డిపాజిట్ రేటు 7.35 శాతంగా ఉంటుంది. ఇటీవల చిన్న పొదుపు మొత్తాలపై కేంద్రం భారీగా వడ్డీరేట్లు తగ్గిం చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగంలోని ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఇటీవలే కోటి రూపాయల లోపు పలు మెచ్యూరిటీలపై డిపాజిట్ రేటును తగ్గించింది. ఈ వరుసలోనే ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తగ్గించింది.