పాలసీ మెచ్యూరిటీపై పన్నులు ఎలా ఉంటాయి? | How are taxes on the maturity of the policy? | Sakshi
Sakshi News home page

పాలసీ మెచ్యూరిటీపై పన్నులు ఎలా ఉంటాయి?

Published Mon, Aug 22 2016 12:43 AM | Last Updated on Thu, Sep 27 2018 4:22 PM

పాలసీ మెచ్యూరిటీపై పన్నులు ఎలా ఉంటాయి? - Sakshi

పాలసీ మెచ్యూరిటీపై పన్నులు ఎలా ఉంటాయి?

నేను 2006, జూన్‌లో పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఫ్యామిలీ ఇన్‌కం ప్లాన్‌ను రూ.4 లక్షల బీమా కోసం  తీసుకున్నాను. ఏడాదికి రూ.7,152 ప్రీమియమ్ చొప్పున పదేళ్ల పాటు ప్రీమియమ్ చెల్లించాను. ఈ పాలసీ ఇప్పుడు మెచ్యూర్ అయింది. ఇప్పుడు నేను ఏమైనా పన్నులు చెల్లించాలా?  -సుందర్, విజయవాడ
ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 10(10డి) ప్రకారం.., సాధారణ బీమా పాలసీల మెచ్యురిటీ మొత్తాలపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు పొందే మెచ్యూరిటీ మొత్తం,  మీరు చెల్లించిన వార్షిక ప్రీమియమ్‌నకు  ఐదు రెట్ల మొత్తం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పని లేదు. బీమా పాలసీలు మెచ్యూర్ అయినప్పుడు వచ్చే మొత్తాలపై పన్నులు ఏ ఏ సందర్భాల్లో ఉండవంటే..,

 
1. 2003, మార్చి 31 కంటే ముందు తీసుకున్న బీమా పాలసీలకు
2. 2003, ఏప్రిల్ 1 నుంచి 2012, మార్చి 31 మధ్య కాలంలో బీమా పాలసీలు తీసుకున్నట్లయితే, మీరు పొందే మెచ్యూరిటీ మొత్తం,  మీరు చెల్లించిన వార్షిక ప్రీమియమ్‌నకు  ఐదు రెట్ల మొత్తం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు-
3. 2012, ఏప్రిల్ 1 తర్వాత బీమా పాలసీలు తీసుకున్నట్లయితే, మీరు పొందే మెచ్యూరిటీ మొత్తం,  మీరు చెల్లించిన వార్షిక ప్రీమియమ్‌నకు  పది రెట్ల మొత్తం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు... ఈ సందర్బాల్లో మెచ్యురిటీ మొత్తాలపై ఎలాంటి పన్నులు ఉండవు. నేను ఆరేళ్ల నుంచి కోటక్ సూపర్ అడ్వాంటేజ్ యులిప్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫండ్ పనితీరు సంతృప్తికరంగా లేదు. మెచ్యూరిటీ వరకూ ఈ యూలిప్‌లో కొనసాగితే మంచి రాబడులు వస్తాయని, మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ చెప్పాడు. ఈ యులిప్ నెలవారీ వ్యయాలు 4 శాతంగా ఉన్నాయి. ఈ యులిప్‌లో కొనసాగమంటారా? వద్దా ? - సతీష్ కృష్ణ, బెంగళూరు(ఈ మెయిల్ ద్వారా)

 
కోటక్ సూపర్ అడ్వాండేజ్ యులిప్.. ఇతర యులిప్‌లతో పోల్చితే కొంచెం భిన్నమైనది. ఈ యులిప్‌లో రెండో ఏడాది నుంచి ప్రీమియమ్ అలకేషన్ చార్జీలు ఉండవు. ఈ యులిప్‌లో తప్పనిసరిగా వచ్చే రాబడులు రెండు ఉన్నాయి. మొదటిది ఫిక్స్‌డ్ అడ్వాంటేజ్.. పాలసీ కాలపరిమితిని బట్టి మీరు తొలి ఏడాది చెల్లించిన ప్రీమియమ్‌లో కొంత శాతం లభిస్తుంది. మీ విషయానికొస్తే, మీ పాలసీ కాలవ్యవధి 20 ఏళ్లు కాబట్టి. మీరు చెల్లించిన తొలి ఏడాది ప్రీమియమ్‌కు 200% మొత్తం తప్పనిసరిగా లభిస్తుంది. రెండోది డైనమిక్ అడ్వాంటేజ్.. పాలసీకి సంబంధించి చివరి మూడేళ్ల ఫండ్ విలువ సగటులో 3 శాతం లభిస్తుంది. సాధారణంగా వచ్చే రాబడులకు ఈ రెండు రాబడులు అదనం. అయితే ఇవన్నీ కూడా కలుపుకున్నా కూడా 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేసే ఈ పాలసీ ద్వారా మీకు తగిన రాబడులు రావని చెప్పవచ్చు. మీరు చెల్లించే ప్రీమియమ్‌లో ప్రతి ఏటా మెర్టాలిటీ చార్జీ కింద కొంత కోత ఉంటుంది. యులిప్‌లో స్వల్పమొత్తానికే బీమా రక్షణ ఉంటుంది. మీపై ఆధారపడిన వారికి ఈ బీమా రక్షణ సరిపోదు.

యులిప్‌లు మార్కెట్ అనుసంధానిత ఫండ్స్ అయినప్పటికీ, ఓపెన్ ఎండ్ మ్యూచువల్ ఫండ్స్‌లా వీటిల్లో పారదర్శకత ఉండదు. ఎన్‌ఏవీ, పోర్ట్‌ఫోలియోలు, ఫండ్ మేనేజర్ వ్యూహాలు.. తదితర విషయాల్లో ఎలాంటి పారదర్శకత ఉండదు. మ్యూచువల్ ఫండ్స్  నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ ఉపసంహరించుకుంటే ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. యులిప్ చార్జీలతో పోల్చితే ఇవి తక్కువగానే ఉంటాయి. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే  ఈ యులిప్ నుంచి వైదొలగడం సరైన నిర్ణయమే. బీమాను, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎప్పుడు కలగలపకూడదు. జీవిత బీమా కోసం టర్మ్ బీమా పాలసీలు, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో కనీసం ఐదేళ్ల పాటు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. స్టాక్ మార్కెట్‌కు మీరు కొత్త అయితే, ముందుగా మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్‌డ్ ఫండ్‌ను ఎంచుకోండి. ఈ ఫండ్‌లో  ప్రతి నెలా కొంత మొత్తం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్‌పై మీకు కొంత అవగాహన ఉంటే, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేయండి.

 
నివాస భారతీయుడి హోదాలో గత ఏడాది నుంచి మ్యూచువల్ ఫండ్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ సిప్‌లు 2024 వరకూ ఉంటాయి. అయితే ఈ ఏడాది నుంచి నా హోదా నివాస భారతీయుడి నుంచి ప్రవాస భారతీయుడి(ఎన్నారై)గా మారింది. ఎన్నారైగా మారినప్పటికీ, ఈ సిప్ ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగించే వీలు ఉందా? లేకుంటే ఆపేయాలా?  - నారాయణ, విశాఖ పట్టణం

మీ నివాసిత హోదా మారినప్పటికీ, మీ మ్యూచువల్ ఫండ్ సిప్ ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగింవచ్చు. అయితే మీరు మీ కేవైసీ(నో యువర్ కస్టమర్) వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. సంబంధిత డాక్యుమెంట్లు మీ మ్యూచువల్ ఫండ్ సంస్థకు పంపించి మీ కేవైసీని అప్‌డేట్ చేయించండి. మ్యూచువల్ ఫండ్స్‌లో నిరభ్యంతరంగా మీ ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగించండి.


పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్(పీఓఎంఐఎస్) ప్రయోజనాలు సీనియర్ సిటిజన్‌లకు, ఇతర వయస్కులకు ఒకే విధంగా ఉంటాయా? సీనియర్ సిటిజన్‌లకు ఏమైనా అధిక  ప్రయోజనాలు లభిస్తాయా? పీఓఎంఐఎస్‌కు ఏమైనా పన్ను ప్రయోజనాలుంటాయా? - అనుపమ, హైదరాబాద్
పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న గ్యారంటీడ్ రిటర్న్ ఇన్వెస్ట్‌మెంట్‌గా పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్(పీఓఎంఐఎస్)ను చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్‌లో కొంత మొత్తం డిపాజిట్ చేస్తే, డిపాజిట్ చేసిన తేది నుంచి నెల తర్వాత కొంత మొత్తం ప్రతి నెలా ఐదేళ్ల పాటు అందుకోవచ్చు. ఈ డిపాజిట్లపై ప్రస్తుతం వడ్డీరేటు 7.8 శాతంగా ఉంది.  ఈ స్కీమ్ కింద ఒక వ్యక్తి గరిష్టంగా రూ.4.5 లక్షలు, జాయింట్‌గా రూ.9 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు రూ.4.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీరు ప్రతి నెలా రూ.2,925 చొప్పున ఐదు సంవత్సరాల పాటు ఆదాయాన్ని అందుకోవచ్చు. కాలపరిమితి పూర్తయిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం మళ్లీ మీకు లభిస్తుంది. ఇక వయస్సు విషయంలో ఎలాంటి ప్రయోజనాలు లేవు. సీనియర్ సిటిజన్‌లకు ఎలాంటి అధిక ప్రయోజనాలు ఉండవు. ఈ స్కీమ్ కింద వచ్చే ఆదాయానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

 

ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement