Insurance Policy
-
ఆరోగ్య బీమా ఉంటే.. ఎన్ని ప్రయోజనాలో..
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అయితే, ఆసుపత్రుల కార్పొరేటీకరణ కారణంగా దేశీయంగా ఆరోగ్య సంరక్షణ, వైద్య చికిత్స వ్యయాలు పెరిగిపోతున్నాయి. ఇటీవలి నివేదికల ప్రకారం ఆసియా మొత్తం మీద భారత్‌లో ఇందుకు సంబంధించిన ద్రవ్యోల్బణం అత్యధికంగా 14 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో పెరిగే వైద్య చికిత్స వ్యయాల భారాన్ని తట్టుకునేందుకు ఆరోగ్య బీమా అనేది ఎంతగానో ఉపయోగపడే సాధనంగా ఉంటోంది. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం, ఆర్థికంగా ఆదా చేసుకోవడం రెండూ ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ పథకాలు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. పటిష్టమైన ఆరోగ్య బీమా పథకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పాలసీదారులు ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందుకోవచ్చు.ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక ఆరోగ్య బీమా పథకాలు అనేక ప్రయోజనాలు అందిస్తున్నాయి. వాటిలో కొన్ని: నగదురహిత చికిత్స: పాలసీదారులు పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా కేవలం తమ పాలసీ నంబరును ఇచ్చి, వైద్య చకిత్సలు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. మెడికల్ ఎమర్జెన్సీల్లో పాలసీదారును ఇబ్బంది పెట్టకుండా బిల్లులను నేరుగా బీమా కంపెనీతో ఆసుపత్రి సెటిల్ చేసుకుంటుంది. నో క్లెయిమ్ బోనస్: క్లెయిమ్లేమీ చేయని పాలసీదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు చాలా కంపెనీలు నో–క్లెయిమ్ బోనస్‌ను ఆఫర్ చేస్తున్నాయి. తదుపరి సంవత్సరంలో ప్రీమియంను తగ్గించడమో లేదా సమ్ అష్యూర్డ్‌ను పెంచడం రూపంలోనో ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవన విధానానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. టాప్–అప్, సూపర్ టాప్–అప్ ప్లాన్లు: బేసిక్ సమ్ ఇన్సూర్డ్ పరిమితి అయిపోతే, అదనంగా కవరేజీని పొందేందుకు టాప్–అప్, సూపర్ టాప్–అప్ ఉపయోగపడతాయి. తక్కువ ఖర్చులో అదనంగా కవరేజీని పొందేందుకు ఇవి సహాయకరంగా ఉంటాయి. వెల్నెస్, ప్రివెంటివ్ కేర్: బీమా సంస్థలు వెల్నెస్, ప్రివెంటివ్ కేర్‌పై మరింతగా దృష్టి పెడుతున్నాయి. పాలసీదారులు తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్తపడేందుకు ఈ ప్రోగ్రాంల కింద ఉచితంగా హెల్త్ చెకప్‌లు, జిమ్ మెంబర్‌షిప్‌లు, డైట్ కౌన్సిలింగ్ మొదలైనవి అందిస్తున్నాయి. తద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించేలా బీమా సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. అవసరాలకు అనుగుణంగా కవరేజీ: పాలసీదారులు తమ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా కవరేజీని తీసుకునే విధంగా ఆధునిక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉంటున్నాయి. వీటికి అదనంగా రక్షణ కోసం రైడర్లను జోడించుకోవడం కావచ్చు లేదా నిర్దిష్ట కవరేజీ ఆప్షన్లను ఎంచుకోవడం కావచ్చు పాలసీదారులకు కొంత వెసులుబాటు ఉంటోంది. -
పిల్లల బీమా.. ఇవ్వదు ధీమా..!
తల్లిదండ్రులకు అత్యంత ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాల్లో పిల్లల విద్య ఒకటి. విద్యా వ్యయాలు ఏటేటా 10 శాతానికి మించి పెరుగుతున్నాయి. సాధారణ ద్రవ్యోల్బణం 5.5 శాతంతో పోల్చితే రెట్టింపు స్థాయి ద్రవ్యోల్బణం విద్యారంగంలో చూడొచ్చు. దీని కారణంగా నేడు ఒక కోర్స్‌కు రూ. 25 లక్షలు ఖర్చవుతుంటే.. 13 ఏళ్ల తర్వాత (ఉన్నత విద్యకు వచ్చే సరికి) రూ.1.09 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. ముందస్తు ప్రణాళికతోనే ఈ వ్యయాలను అధిగమించడం సులభమవుతుంది.పాఠశాల ప్రవేశం నాటి నుంచే పిల్లల విద్య కోసం పెట్టుబడులు ప్రారంభించాలి. భవిష్యత్‌లో ఎంత అవసరమో, ఆ మేరకు సమకూర్చుకునే విధంగా ప్రతి నెలా పొదుపు, మదుపు చేస్తూ వెళ్లాలి. ఇందుకు ఎంపిక చేసుకునే పెట్టుబడి సాధనాలు కీలకంగా మారతాయి. ఇక్కడ తప్పటడుగులు వేస్తే పిల్లల ఉన్నత విద్య కోసం రేపు అప్పు చేయాల్సి రావచ్చు. కేవలం చైల్ట్ ఇన్సూరెన్స్ పాలసీలతో విద్యా వ్యయాలను తట్టుకోవడం కష్టమే. ఈ దిశగా అవగాహన కల్పించే కథనమిది... తల్లిదండ్రుల్లో ఎంత మంది తమ పిల్లల భవిష్యత్ విద్యకు సన్నద్ధంగా ఉన్నారు? ఇదే తెలుసుకుందామని హెచ్ఎస్బీసీ సంస్థ ఓ సర్వే చేసింది. ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్ రిపోర్ట్ 2024’ పేరుతో నివేదిక విడుదల చేసింది. 53 శాతం తల్లిదండ్రులు తమ పిల్లల విద్య కోసం పెట్టుబడులు చేస్తున్నట్టు చెప్పారు. అవసరమైతే తమ పిల్లలే విద్యా రుణం తీసుకుంటారని 40 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. కొందరు ఆస్తులు అమ్మి చదివిస్తామని చెప్పగా, స్కాలర్íÙప్ మార్గాలు చూస్తామని కొంతమంది తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కానీ, పిల్లల పేరిట పెట్టుబడులు చేస్తున్న వారిలో ఎంత మంది మెరుగైన సాధనాలను ఎంపిక చేసుకున్నారన్నది ఈ సర్వే తేల్చలేదు. మొత్తానికి సగం మందికి ఆర్థిక ప్రణాళిక లేదని స్పష్టమవుతోంది. తల్లిదండ్రులకు ఏదైనా జరగరానిది జరిగితే... పిల్లల విద్యకు ఆరి్థక తోడ్పాటు అందించే చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు మార్కెట్లో క్రేజ్ ఉంది. బీమా ఏజెంట్లు వీటిని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటారు. నిజానికి వీటిలో చార్జీలు ఎక్కువ. దాంతో రాబడులు కొంత తక్కువ. పిల్లల పేరిట మార్కెటింగ్ చేసే ఉత్పత్తుల వలలో పడకుండా ఉంటేనే మంచిది. ముఖ్యంగా బీమా, పెట్టుబడులను కలపడం మంచి నిర్ణయం అనిపించుకోదు. ఈ రెండింటినీ వేర్వేరుగానే చూడాలి.చైల్డ్ ప్లాన్లలో ఏముంది?పిల్లల పేరిట రెండు రకాల ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉన్నాయి. యూనిట్ లింక్డ్ చి్రల్డన్ ఇన్సూరెన్స్ ప్లాన్లు (యులిప్‌లు) ఇందులో ఒక రకం. చెల్లించిన ప్రీమియంలో బీమా రిస్క్, నిర్వహణ, ఇతరత్రా వ్యయాలు పోను మిగిలిన మొత్తాన్ని మార్కెట్ లింక్డ్ (ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత) సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. పాలసీదారుల ఎంపిక మేరకు డెట్‌లోనూ పెట్టుబడులు పెడతాయి. వచ్చిన రాబడులను పాలసీదారులకు అందిస్తాయి. ఎండోమెంట్ చిల్డ్రన్ ఇన్సూరెన్స్ రెండో రకం. ఇందులోనూ బీమా రిస్క్, ఇతర వ్యయాలు పోను మిగిలిన ప్రీమియాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి.పాలసీదారులకు హామీ మేరకు రాబడులు అందిస్తాయి. కానీ, వీటిలో రాబడులు 5–6 శాతం మించవు. ఈక్విటీ ఆధారిత యులిప్ ప్లాన్లలో రాబడులు కాస్త అధికంగా ఉంటాయి. కాకపోతే గ్యారంటీడ్ కావు. మార్కెట్ పనితీరుపైనే రాబడులు ఆధారపడి ఉంటాయి. ఈ రెండు రకాల ప్లాన్లలోనూ, పాలసీ కాల వ్యవధి ముగియక ముందే పాలసీదారు (తల్లి లేదా తండ్రి) మరణించినా లేక కాల వ్యవధి ముగిసేవరకు జీవించి ఉన్నా ప్రయోజనం లభిస్తుంది. పాలసీ కాల వ్యవధి మధ్యలో పాలసీదారు మరణించినట్టయితే, అప్పుడు బీమా సంస్థే మిగిలి ఉన్న కాలానికి పెట్టుబడులను కొనసాగించి, యథాప్రకారం పాలసీ ప్రయోజనాలను అందిస్తుంది. దాంతో పిల్లల ఉన్నత విద్యకు ఆ నిధిని ఉపయోగించుకోవచ్చు. ‘‘దురదృష్టవశాత్తూ తల్లి లేదా తండ్రి మరణించినట్టయితే పరిహారం చెల్లించే ఈ పథకాలు పిల్లలకు ఉపయోగపడతాయి. ప్రీమియం వేవర్ ముఖ్యమైన సదుపాయం. పాలసీదారు మరణించినట్టయితే ఆ తర్వాత భవిష్యత్ ప్రీమియంలు చెల్లించక్కర్లేదు. పాలసీ యాక్టివ్‌గా కొనసాగుతుంది. పిల్లల విద్యా లక్ష్యాలకు కావాల్సినంత మేర సమకూరుతుంది’’ అని ఫ్యూచర్ జనరాలి లైఫ్ ఇన్సూరెన్స్ యాక్చువరీ ఆదిత్య మాల్ వివరించారు. పాలసీదారు మరణించినప్పటికీ గడువు తీరిన తర్వాత సమ్ అష్యూర్డ్, ఇతర ప్రయోజనాలు యథావిధిగా అందుతాయని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ మధుపం కృష్ట సైతం తెలిపారు. సమ్ అష్యూర్డ్ (బీమా) వెంటనే చెల్లించి, మిగిలిన ప్రయోజనాలను పాలసీ గడువు ముగిసిన తర్వాత చెల్లించేవి ఉన్నాయి.లాకిన్ పిరియడ్... ఎండోమెంట్, యులిప్ ప్లాన్లు లాకిన్ పీరియడ్‌తో వస్తాయి. సాధారణంగా ఐదేళ్ల లాకిన్ ఉంటుంది. అంటే మొదటి ఐదేళ్లు ఉపసంహరణకు అనుమతి ఉండదు. ఈ కాలంలో పాలసీని సరెండర్ చేసినా వచ్చేదేమీ ఉండదు. లాకిన్ పీరియడ్ తర్వాత పాక్షికంగా ఉపసహరించుకోవచ్చు. నిర్బంధంగా పెట్టుబడిని కొనసాగించే లక్ష్యంతోనే ఈ ప్లాన్లలో లాకిన్ ఉంటుంది. వీటిలో ఏజెంట్లకు కమీషన్ మెరుగ్గా ఉంటుంది. ఎంత అధిక ప్రీమియానికి పాలసీలో చేరి్పస్తే ఏజెంట్‌కు అంత అధికంగా కమిషన్ ముడుతుంది. ‘‘టర్మ్ ప్లాన్లు, మ్యూచువల్ ఫండ్స్ గురించి సరైన అవగాహన లేకపోవడమే పెద్ద సమస్య. టర్మ్ ప్లాన్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. కనుక వీటిని ఏజెంట్లు విక్రయించేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు’’అని కృష్ణ వివరించారు.ఆరి్థక ప్రణాళికలో చేసే తప్పుల్లో బీమా, పెట్టుబడి కలపడం ఒకటని ఆనంద్‌రాఠి వెల్త్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చిరాగ్ ముని తెలిపారు. ‘‘ఇన్సూరెన్స్, పెట్టుబడి పూర్తి భిన్నమైన ఆరి్థక ఉత్పత్తులు. ఇన్వెస్టర్లు వీటిని కలపకూడదు. ఊహించని నష్టం నుంచి రక్షణ కల్పించడమే బీమా ఉద్దేశం. పెట్టుబడి సాధనం ఉద్దేశం సంపద సమకూర్చుకోవడం’’ అని వివరించారు. ‘‘సంప్రదాయ ఎండోమెంట్ పాన్లలో రాబడులు 4–5 శాతం మేర ఉంటాయి. విద్యా ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే సంప్రదాయ బీమా ప్లాన్లలో పెట్టుబడితో మిగిలేదేమీ ఉండదు.చైల్డ్ యులిప్ ప్లాన్లలో 9–11 శాతం మేర రాబడులు వస్తాయి. కాకపోతే ఆరి్థక సైకిల్, మార్కెట్ సైకిల్‌పైనే ఈ రాబడులు ఆధారపడి ఉంటాయి’’ అని కృష్ట తెలిపారు. కనుక సంప్రదాయ ఎండోమెంట్ ఆధారిత చైల్డ్ ప్లాన్లు పిల్లల భవిష్యత్‌కు భరోసా ఇవ్వమని స్పష్టమవుతోంది. ఇక యులిప్ ప్లాన్ల కంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన ఎంపిక అవుతుంది. వీటిల్లో లిక్విడిటీ మెరుగ్గా ఉంటుంది. చార్జీలు చాలా తక్కువ. యులిప్ ప్లాన్లలో చార్జీల విషయమై పారదర్శకత తక్కువ. ప్రీమియం అలోకేషన్ చార్జీ, అడ్మిని్రస్టేటివ్ చార్జీ, మోర్టాలిటీ చార్జీ, సరెండర్ చార్జీ, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీ ఇన్నేసి చార్జీలు యులిప్‌లలో ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లోనూ పారదర్శకత ఎక్కువ.మెరుగైన ప్రత్యామ్నాయాలు..చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు మెరుగైన ప్రయోజనాన్ని ఇవ్వనప్పుడు వీటికి ప్రత్యామ్నాయాలను పరిశీలించొచ్చు. ఊహించనది జరిగితే వారసుల విద్య ఆగిపోకూడదు. కుటుంబ జీవనం ఇబ్బందుల పాలు కాకూడదు. అందుకని జీవిత బీమాతోపాటు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను ఎంపిక చేసుకోవడం మంచి మార్గం అవుతుంది. ‘‘టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తక్కువ ప్రీమియానికే అధిక కవరేజీని ఇస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల చైల్డ్ ప్లాన్ల కంటే మెరుగైన రాబడులు వస్తాయి.చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో కవరేజీ తగినంత ఉండదు. అప్పుడే కుటుంబ జీవనంలోకి అడుగుపెట్టిన వారికి, తాజాగా రుణం తీసుకున్న వారికి మరింత కవరేజీ అవసరం ఏర్పడుతుంది’’ అని కృష్ట తెలిపారు. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే తమ రిస్క్, రాబడుల ఆకాంక్షలకు సరిపోలే పథకాలను ఎంపిక చేసుకోవచ్చని ఫింజ్ స్కాలర్జ్ వెల్త్ మేనేజర్ ప్రిన్సిపల్ అడ్వైజర్ రేణు మహేశ్వరి సూచించారు. 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తికి రూ.కోటి టర్మ్ ఇన్సూరెన్స్ రూ.10–15 వేల ప్రీమియంకే వస్తుంది. కనుక చైల్డ్ ప్లాన్ల కోసం ఏటా భారీ మొత్తంలో ప్రీమియం చెల్లించడానికి బదులు.. టర్మ్ ప్లాన్ తీసుకుని, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసు కోవాలి.విభిన్న ఫండ్స్...టర్మ్ప్లాన్లోనూ మరణం లేదా అంగవైకల్యం పాలైనప్పుడు చెల్లింపులు చేసే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. సమ్ అష్యూర్డ్‌లో 50 శాతం మేర తక్షణమే చెల్లించి, మిగిలినది ప్రతి నెలా 10 ఏళ్ల పాటు చెల్లింపుల సదుపాయాలతో టర్మ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. చారిత్రకంగా చూస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రాబడులు ఏటా 12 శాతం, అంతకంటే ఎక్కువే ఉన్నాయి. పదేళ్ల కాలంలో అయితే సగటు వార్షిక రాబడి 20 శాతంగా ఉంది. ఈక్విటీల్లోనూ ఇండెక్స్ ఫండ్స్ (సెన్సెక్స్, నిఫ్టీ, స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్)ను ఎంపిక చేసుకోవాలి.ఇందులో చార్జీలు చాలా తక్కువ. సూచీల మాదిరే రాబడులు వీటిల్లో వస్తాయి. మరీ ముఖ్యంగా 7 ఏళ్లకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేస్తుంటే లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్స్ పెట్టుబడులు పెట్టే ఫ్లెక్సీక్యాప్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అలాగే, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్, రిస్క్ తక్కువ కోరుకునే వారు మల్టీ అస్సెట్ ఫండ్స్, రిస్క్ ఇంకా తక్కువగా ఉండాలని కోరుకునే వారు ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చని నిపుణుల సూచన. పన్ను ప్రయోజనంచైల్డ్ యులిప్ ప్లాన్లలో రాబడులపై పన్ను భారం లేకపోవడాన్ని సానుకూల అంశంగా చెప్పుకోవాలి. దీనికి బదులు టర్మ్‌ప్లాన్ విడిగా తీసుకుని, ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. ఈక్విటీ లాభాలపై స్వల్పకాల, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను కదపకుండా, ఒక పథకం నుంచి మరో పథకానికి మార్చకుండా.. స్థిరంగా ఒకే పథకంలో కొనసాగించడం వల్ల అనవసర పన్ను భారాన్ని తప్పించుకోవచ్చు. అయినా సరే ఈక్విటీ పెట్టుబడిని ఉపసంహరించుకున్నప్పుడు అది ఏడాది మించిన కాలం అయితే మొదటి రూ.లక్షకు మించిన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి.ఏడాదిలోపు పెట్టుబడులపై వచ్చే లాభం నుంచి 20 శాతం మేర పన్ను కింద చెల్లించాలి. నిపుణుల పెట్టుబడి ప్రణాళికను అనుసరించినట్టయితే అప్పుడు మెరుగైన జీవిత బీమా రక్షణ, ఈక్విటీలపై అద్భుత రాబడులు అందుకోవడానికి అవకాశాలుంటాయి. పన్ను చెల్లింపులు పోను నికర రాబడులు చైల్డ్ ప్లాన్లతో పోల్చితే.. అధికంగానే ఉంటాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ పన్ను ప్రయోజనం కోసమని యులిప్ పాలసీకే మొగ్గు చూపేట్టు అయితే విడిగా టర్మ్‌ప్లాన్ తీసుకోవడం మర్చిపోవద్దు. –సాక్షి, బిజినెస్ డెస్క్ -
పాలసీను సరెండర్ చేస్తే ఎంత వస్తుందంటే..?
జీవిత బీమా పాలసీని వెనక్కిచ్చేసినప్పుడు (సరెండర్) పొందే ప్రయోజనాలపై నూతన నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం గతంలో కంపెనీలిచ్చే సరెండర్ వాల్యూ పెరగనుంది. ప్రస్తుతం కంపెనీలు అమలు చేస్తున్న నియమాలు ఎలా ఉన్నాయో, కొత్త విధానం అమలులోకి వస్తున్న నేపథ్యంలో ఎంతమేరకు సరెండర్ వాల్యూ వస్తుందో తెలుసుకుందాం.జీవిత బీమా పాలసీల గడువు ముగిసే వరకు వేచి చూడకుండా, ముందస్తుగానే వైదొలగాలని భావించే వారికి మెరుగైన రాబడులు అందించడమే కొత్త నిబంధనల ఉద్దేశం. జీవిత బీమా పాలసీని తీసుకున్న తర్వాత నుంచి ఎన్నేళ్ల పాటు ప్రీమియం చెల్లించారు, అప్పటి వరకు ఎంత బోనస్‌లు జమయ్యాయన్న తదితర అంశాల ఆధారంగా సరెండర్ వ్యాల్యూని బీమా సంస్థలు నిర్ణయిస్తుంటాయి. ఇలా సరెండర్ చేసే పాలసీలపై బీమా సంస్థలు గతంలో తక్కువ ప్రయోజనాలనే పాలసీదారులకు చెల్లించేవి. ఉదాహరణకు ఎల్ఐసీలో వినయ్(35) వనే వ్యక్తి జీవన్ ఆనంద్ పాలసీను ఎంచుకున్నాడనుకుందాం. పాలసీ కాలం ముప్పై ఏళ్లు. పాలసీ మొత్తం రూ.10 లక్షలుగా భావిస్తే, వినయ్ నెలవారీ దాదాపు రూ.3,175 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఏటా రూ.38,100 చెల్లించాలి. ఐదేళ్లు పాలసీ ప్రీమియం చెల్లించాలరనుకుందాం. రూ.38,100*5 మొత్తం రూ.1,90,500. ఐదేళ్ల తర్వాత వినయ్ తన పాలసీను సరెండర్ చేస్తే తనకు 30-35 శాతం సరెండర్, ఇతర ఛార్జీలు విధించి రూ.1,27,863 మాత్రమే కంపెనీ చెల్లిస్తుంది. మిగతా రూ.62,637 నష్టపోవాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: వాటర్ బాటిల్ ధర తగ్గనుందా..?కొత్త నిబంధనల ప్రకారం సరెండర్ చేసే పాలసీపై సరెండర్ ఛార్జీలు, ఇతర ఛార్జీలను తగ్గించనున్నారు. దాంతో పాలసీదారుడికి గతంలో కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు సమకూరుతుంది. ఇదిలాఉండగా, కేవలం డబ్బు కోసమే పాలసీను సరెండర్ చేయాలనుకునేవారికి మరో అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పైన తెలిపిన ఉదాహరణలో వినయ్ చెల్లించిన ఐదేళ్ల పాలసీ ప్రీమియంను ఉపయోగించి లోన్ తీసుకునే వెసులుబాటు ఉంది. పాలసీను సరెండర్ చేస్తే రూ.1,27,863 వస్తుంది కదా. అదే తన పాలసీపై లోన్‌కు వెళితే సుమారు రూ.89,500 వరకు పొందే అవకాశం ఉంది. దాంతో పాలసీ కొనసాగించేలా జాగ్రత్త పడవచ్చని సూచిస్తున్నారు. -
బీమా పాలసీ.. అత్యవసర నిధి!
ఉన్నట్టుండి నిధుల అవసరం ఏర్పడిందా..? వ్యక్తిగత రుణానికి తక్కువ క్రెడిట్ స్కోర్ అడ్డు పడుతోందా? లేదంటే వ్యక్తిగత రుణంపై అధిక వడ్డీ రేటు చూసి వెనుకాడుతున్నారా..? ఇలాంటి సందర్భాల్లో బీమా పాలసీయే మిమ్మల్ని ఆదుకుంటుంది. అదెలా అంటారా? ఎండోమెంట్ బీమా ప్లాన్లపై బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. పైగా పర్సనల్ లోన్‌తో పోలిస్తే వడ్డీ రేటు తక్కువే.డబ్బులు అవసరం పడితే బీమా పాలసీని సరెండ్ చేసే వారూ ఉన్నారు. ఇలా ఇన్సూరెన్స్ పాలసీని సరెండర్ చేయడానికి బదులు, దానిపై రుణం తీసుకుని అవసరం గట్టెక్కడమే మంచి మార్గం అవుతుంది. దీనివల్ల బీమా రక్షణను ఎప్పటి మాదిరే కొనసాగించుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందన్నది తెలియజేసే కథనమే ఇది. రుణ సదుపాయం అన్ని రకాల బీమా పాలసీలపై వస్తుందనుకుంటే పొరపాటు. కేవలం కొన్ని రకాల పాలసీలకే ఇది పరిమితం. ‘‘పొదుపుతో కూడిన సంప్రదాయ బీమా పాలసీ (ఎండోమెంట్, మనీ బ్యాక్ ప్లాన్లు) కలిగి ఉన్నవారు వాటిపై పలు రకాల ఆర్థిక అవసరాల కోసం రుణాన్ని పొందొచ్చు’’అని ఏజెస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విఘ్నేష్ సహానే తెలిపారు. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కేవలం మరణ పరిహారాన్నే అందిస్తాయని, ఎలాంటి రాబడి హామీ ఉండదు కనుక వాటిపై రుణం పొందలేరని స్పష్టం చేశారు. యూనిట్ లింక్డ్ ప్లాన్ల (యులిప్)లోనూ రాబడులు మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి కనుక వాటిపైనా రుణ సదుపాయం ఉండదని తెలిపారు. ఎక్కడ తీసుకోవచ్చు? పాలసీ మంజూరు చేసిన జీవిత బీమా కంపెనీ నుంచే రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. నేడు చాలా బీమా సంస్థలు పాలసీలపై రుణాలను కూడా ఇస్తున్నాయి. అలాగే, బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు ఈ తరహా రుణాలను ఆఫర్ చేస్తుంటాయి. అయితే, బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల కంటే పాలసీ మంజూరు చేసిన బీమా సంస్థను సంప్రదించడమే మెరుగైన మార్గమని నిపుణులు అంటున్నారు. ‘‘ఇన్సూరెన్స్ కంపెనీతో పోలిస్తే బ్యాంక్‌లు బీమా ప్లాన్లపై తక్కువ రుణ మొత్తాన్ని ఆఫర్ చేస్తాయి. అదే మాదిరి బీమా సంస్థలతో పోలిస్తే బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు రుణాలపై కొంచెం అధిక రేటును వసూలు చేస్తుంటాయి’’అని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ‘ప్లాన్ ఆర్’ వ్యవస్థాపకుడు అజయ్ ప్రుతి తెలిపారు. బ్యాంక్‌లు సాధారణంగా బీమా పాలసీపై రుణాన్ని నేరుగా కాకుండా.. కరెంట్ అకౌంట్‌పై ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కింద అందిస్తుంటాయి. ‘‘తరచుగా నిధుల అవసరం ఏర్పడేవారు ఇలా కరెంట్ అకౌంట్‌పై (సెక్యూరిటీ కింద బీమా పాలసీ జమ చేసి) ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం తీసుకోవడాన్ని పరిశీలించొచ్చని పైసా బజార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సహిల్ అరోరా సూచించారు. చౌక రుణం ‘‘బీమా పాలసీలపై రుణ రేటు చాలా తక్కువగా ఉండడాన్ని గమనించొచ్చు. సాధారణంగా వీటిపై 9–9.5 శాతం వార్షిక వడ్డీ రేటును వసూలు చేస్తుంటారు. అదే వ్యక్తిగత రుణాలు (పర్సనల్ లోన్) అయితే 12 శాతం అంతకంటే ఎక్కువే ఉంటుంది’’అని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజేష్ కృష్ణన్ తెలిపారు. ఇక బీమా పాలసీలపై రుణం ఎంతొస్తుందంటే.. రుణం తీసుకునే నాటికి ఉన్న స్వా«దీనపు విలువ (సరెండర్ వ్యాల్యూ)లో 90 శాతం వరకు. బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణం మంజూరునకు సాధారణంగా నాలుగు నుంచి ఏడు రోజులు పడుతుంది. అదే బీమా సంస్థల నుంచి రుణం మూడు రోజుల్లోనే పొందొచ్చు. కొన్ని బీమా సంస్థలు ఇంతకంటే వేగంగా ఆన్లైన్లోనే పాలసీలపై రుణాలను మంజూరు చేస్తున్నాయి. ‘‘జీవిత బీమా పాలసీలపై రుణం దరఖాస్తు మదింపు, రుణం మంజూరు చాలా వేగంగా ఉంటుంది. బీమా సంస్థ నుంచే రుణం తీసుకునేట్టు అయితే ఎలాంటి అదనపు తనిఖీలు, పరిశీలనలు అవసరం పడవు’’అని రాజేష్ కృష్ణన్ వివరించారు.బీమా పాలసీపై రుణం తీసుకోవడం ఎంతో సౌకర్యమైనదిగా పాలసీఎక్స్ సీఈవో నావల్ గోయల్ సైతం అంగీకరించారు. ‘‘దరఖాస్తు చేసుకోవడం ఎంతో సులభం. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వారు సైతం పాలసీపై రుణానికి అర్హులే. ఎందుకంటే పాలసీపై రుణం జారీకి క్రెడిట్ స్కోర్ తనిఖీలు అవసరం పడవు’’అని కృష్ణన్ తెలిపారు. ఈ రుణం తిరిగి చెల్లింపు నిబంధనలు కూడా సులభమే. ‘‘రుణం చెల్లించడం వీలు కానప్పుడు కేవలం రుణంపై వడ్డీ వరకే చెల్లించొచ్చు. అసలు రుణాన్ని ఎప్పుడైనా తిరిగి తీర్చివేయవచ్చు’’అని ప్రుతి వివరించారు. ఎంత వీలైతే అంత అసలు రుణంలో చెల్లించుకుంటూ వెళ్లడం కూడా మంచి ఆలోచనే. దీనివల్ల ప్రతి నెలా చెల్లించే వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. అత్యవసర నిధి బీమా పాలసీ అత్యవసర నిధిగానూ అక్కరకొస్తుంది. ప్రతి కుటుంబానికి విధిగా అత్యవసర నిధి ఉండాలి. అనుకోని పరిణామాలతో నెలవారీ వచ్చే ఆదాయం ఆగిపోతే? చేస్తున్న ఉద్యోగం ఊడిపోతే..? అక్కడి నుంచి తిరిగి ఉపాధి లభించేంత వరకు కుటుంబ అవసరాలను తీర్చేందుకు అత్యవసర నిధి ఉపయోగపడుతుంది. కనీసం ఆరు నెలల నుంచి ఏడాది అవసరాలను తీర్చేంత అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. అయితే, ప్రతి ఒక్కరికీ ఇంత మొత్తం అత్యవసర నిధి కింద ఏర్పాటుకు వెసులుబాటు ఉండకపోవచ్చు. ఇలాంటి వారు ఎండోమెంట్ లేదా మనీబ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను అత్యవసర నిధి కింద ఉపయోగించుకోవచ్చు. తిరిగి ఉపాధి ఏర్పడి, ఆదాయం చేతికి అందేంత వరకు పాలసీపై రుణంతో అవసరాలను గట్టెక్కొచ్చు. ఆ తర్వాత క్రమంగా ఆరు నెలల్లోపు పాలసీపై రుణాన్ని తీర్చివేయడం మంచి ఆలోచన అవుతుంది. పాలసీ సరెండర్ అంటే? ఎండోమెంట్ లేదా మనీ బ్యాక్ బీమా ప్లాన్ వద్దనుకునే వారు దాన్ని సరెండర్ చేసుకోవచ్చు. అంటే గడువు ముగియకుండానే పాలసీని వెనక్కిచ్చేయడం. పాలసీ తీసుకున్న తర్వాత ఎంత కాలానికి సరెండర్ చేస్తున్నారనే దాని ఆధారంగా దానిపై ఎంతొస్తుందన్నది ఆధారపడి ఉంటుంది. ఈ సరెండర్ వ్యాల్యూ (స్వా«దీనపు విలువ) విషయంలో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) 2024 ఏప్రిల్ 1 నుంచి నూతన నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ప్రకారం బీమా పాలసీ తీసుకున్న మూడేళ్లలోపు సరెండర్ చేస్తే చేతికి చాలా తక్కువే వస్తుంది. అంటే అప్పటికి కట్టిన ప్రీమియంలో సగం కూడా రాదు. అదే పాలసీ తీసుకున్న తర్వాత నాలుగేళ్ల నుంచి ఏడేళ్లలోపు సరెండర్ చేస్తే అధిక విలువ పాలసీదారుకు దక్కుతుంది. నిజానికి ఎండోమెంట్, మనీబ్యాక్ పాలసీల్లో 20–30 ఏళ్లపాటు కొనసాగినప్పుడే ప్రతిఫలం కనిపిస్తుంది. ఇంతకంటే తక్కువ కాలవ్యవధిపై వచ్చే ప్రయోజనం అంతగా ఉండదు. అందుకని నిధుల అవసరం ఏర్పడితే బీమా ప్లాన్‌ను సరెండర్ చేయడానికి బదులు.. దానిపై రుణం పొందడమే మెరుగైనది అవుతుంది. మళ్లీ నిధుల వెసులుబాటు వచ్చిన వెంటనే తీసుకున్న రుణాన్ని తీర్చివేయాలి. ఆరంభంలో తక్కువే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న కొత్తలో దీనిపై వచ్చే రుణం చాలా స్వల్పం. ఇందులో ఉన్న ప్రతికూలత ఇదే. క్యాష్ వ్యాల్యూ లేదా సరెండర్ వ్యాల్యూ గణనీయంగా పెరిగేందుకు కొన్నేళ్లు పడుతుంది. అప్పుడే చెప్పుకోతగ్గ మేర రుణం దీనిపై వస్తుంది. ఇక ఎండోమెంట్ లేదా మనీ బ్యాంక్ పాలసీలపై దీర్ఘకాలంలో వచ్చే రాబడి 5–6 శాతం మేర ఉంటుంది. దీనిపై రుణం తీసుకుంటే, నికరంగా అందుకునే రాబడి ప్రయోజనం మరింత తగ్గిపోతుందని గుర్తు పెట్టుకోవాలి. తిరిగి చెల్లించలేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై ఉన్న మరో అనుకూలత ఏమిటంటే.. రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనా అది క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయబోదని కృష్ణన్ తెలిపారు. రుణంలో అసలు, వడ్డీ, చార్జీలు అన్నింటినీ పాలసీ సరెండర్ వ్యాల్యూ నుంచి బీమా సంస్థలు సర్దుబాటు చేసుకుంటాయని సహిల్ అరోరా తెలిపారు. రుణం చెల్లించకుండా పాలసీదారు మరణించిన సందర్భాల్లో.. పరిహారం నుంచి రుణం, వడ్డీ, చార్జీలను మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని బీమా సంస్థ నామినీ లేదా పాలసీదారు వారసులకు చెల్లిస్తుంది. రుణం తీర్చకుండానే పాలసీ గడువు ముగిసిపోయిందనుకుంటే.. అప్పుడు నికరంగా చెల్లించే మొత్తం నుంచి రుణాన్ని బీమా సంస్థ వసూలు చేసుకుంటుంది. ఒకవేళ రుణంపై వడ్డీ కూడా బకాయి పడితే.. అసలు, వడ్డీ మొత్తం సరెండర్ వ్యాల్యూని దాటిపోతుంటే అప్పుడు పాలసీని బీమా సంస్థ రద్దు చేస్తుంది. పాలసీపై రుణం తీసుకునే సమయంలోనే దానిపై బీమా సంస్థకు హక్కులు బదలాయిస్తున్నట్టు అంగీకారాన్ని తీసుకుంటాయి. రుణం సమంజసమేనా..? అసలు జీవిత బీమా ఎందుకు? ఆర్జించే వ్యక్తికి దురదృష్టవశాత్తూ ఏదైనా వాటిల్లితే అప్పుడు అతనిపై ఆధారపడిన కుటుంబం ఆర్థికంగా కష్టాలు పడకూడదనే. తాను లేకపోయినా, తన కుటుంబ అవసరాలను తీర్చే లక్ష్యంతోనే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీని తీసుకుంటుంటారు. మరి అలాంటి సాధనంపై రుణం తీసుకుంటే, అసలు ప్రయోజనానికే భంగం కలగొచ్చని నిపుణుల భావన. అదెలా అంటే పాలసీపై రుణం తీసుకున్న తర్వాత సదరు పాలసీదారు అనుకోకుండా మరణం పాలైతే.. కుటుంబానికి దక్కే బీమా పరిహారం పెద్దగా ఉండకపోవచ్చు. దాంతో బీమా ఉద్దేశ్యం నెరవేరకుండా పోతుంది. అందుకని బంగారం, మ్యూచువల్ ఫండ్స్, ప్రాపర్టీ తదితర ఇతర సాధనాలపై రుణం తీసుకోవడాన్ని పరిశీలించొచ్చని చెబుతుంటారు. కానీ, ఇక్కడ వాస్తవ అంశం ఏమిటంటే.. బంగారంపై రుణం తీసుకున్న తర్వాత సదరు వ్యక్తి మరణించినా కానీ, ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత కుటుంబంపైనే పడుతుంది. అందుకని ఏ సాధనంపై రుణం తీసుకున్నా పరిణామం ఒక్కటిగానే ఉంటుంది. అందుకుని దీనికి పరిష్కారం ఒకటి ఉంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఏదైనా అవసరం కోసం రుణం తీసుకుంటుంటే, వెంటనే అంత విలువకు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీని పెంచుకోవడం లేదంటే అదనపు కవరేజీతో టర్మ్ ప్లాన్ కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల అనుకోనిది జరిగినా వచ్చే పరిహారంతో రుణాలను గట్టెక్కొచ్చు. ఇక దీర్ఘకాల అవసరాలకు కాకుండా స్వల్పకాల అవసరాలకే బీమాపై రుణానికి పరిమితం కావాలి. మూడు నుంచి ఆరు నెలలు మించకూడదు. ఎందుకంటే ఇంత తక్కువ కాలానికి చెల్లించాల్సిన వడ్డీ భారం కూడా చాలా తక్కువే ఉంటుంది. కనుక ఒకవేళ పాలసీదారు మరణించినా కుటుంబం పెద్దగా నష్టపోయేది ఉండదు. బీమా సంస్థ తనకు రావాల్సినంత మేర మినహాయించుకుని, మిగిలినది చెల్లించేస్తుంది. ఎండోమెంట్ ప్లాన్ ఉన్న వారు విధిగా మెరుగైన కవరేజీతో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పకుండా తీసుకోవాలి. అప్పుడు కుటుంబానికి మెరుగైన ఆర్థిక రక్షణ ఉంటుంది. -
అత్యంత కస్టమైజ్డ్ పాలసీలకు ఆదరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా మహమ్మారితో జీవిత బీమాపై అభిప్రాయం మారిందని, ఏదో పెట్టుబడి సాధనంగా కాకుండా కీలకమైన రిస్క్ కవరేజీ సాధనంగా చూసే ధోరణి పెరిగిందని బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ (బీఏఎల్‌ఐసీ) చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్ (సీఏవో) సమీర్ జోషి తెలిపారు. ప్రజలు టర్మ్ ప్లాన్ల వైపు మొగ్గు చూపడం పెరిగిందని చెప్పారు. అలాగే, చెల్లింపుల్లో వెసులుబాటు, ఆన్లైన్ లావాదేవీలు, అదనపు కవరేజీ, వినూత్న ఉత్పత్తులు మొదలైన అత్యంత కస్టమైజ్డ్ ఆప్షన్లను కోరుకుంటున్నారని ఆయన వివరించారు. కంపెనీలు కూడా దానికి అనుగుణంగా సత్వరం తమ సర్వీసులు, ఉత్పత్తుల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నాయని జోషి చెప్పారు. తాము ప్రవేశపెట్టిన ఏస్, డయాబెటిక్ టర్మ్ ప్లాన్ మొదలైనవి ఈ కోవకి చెందినవేనని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. దక్షిణాదిపై మరింత దృష్టి .. ఇతరత్రా రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మొదలైనవి .. అలాగే గోవా, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో బీమా విస్తృతి ఎక్కువగా ఉందని ఇన్సూరెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సర్వేలో వెల్లడైంది. ఈ ప్రాంతాల్లో బీమా విస్తృతిని మరింత పెంచడంపై దృష్టి పెడుతున్నాం. కీలక ఆర్థిక సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నాం. ప్రవాస భారతీయ కస్టమర్లలో చాలా మంది ఈ ప్రాంతాలకు చెందినవారే కావడంతో వారి అవసరాలకు అనుగుణంగా ప్లాన్లు, సర్వీసులను తీర్చిదిద్దుతున్నాం. లక్ష కోట్లు దాటిన ఏయూఎం.. బజాజ్ అలయంజ్ లైఫ్ అతి తక్కువ కాలంలోనే దిగ్గజ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. 2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 56,085 కోట్లుగా ఉన్న మా ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్) ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 1 లక్ష కోట్ల మార్కును దాటింది. మాపై కస్టమర్ల నమ్మకానికి ఇది నిదర్శనం. సరళమైన, వినూత్నమైన, కస్టమర్ ఆధారిత సాధనాలు, సమర్ధమంతమైన పంపిణీ వ్యవస్థ మొదలైనవి ఇందుకు తోడ్పడ్డాయి. పాలసీల వృద్ధిపరంగా పరిశ్రమ కన్నా అధికంగా 23 శాతం వృద్ధి సాధిస్తున్నాం. మాకు 1.40 లక్షల మంది ఏజెంట్లు, 60 పైచిలుకు ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం, 505 శాఖల పటిష్టమైన నెట్వర్క్ ఉంది. మొత్తం మీద సహాయకరమైన నియంత్రణ వ్యవస్థ, ప్రభావవంతమైన మార్పులతో 2023 మా సంస్థతో పాటు ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ రంగానికి సానుకూలంగా గడిచింది. వృద్ధి లక్ష్యాలు.. వినూత్న ఉత్పత్తులు, సమగ్ర సేవలతో కొత్త ఏడాదిలో మరింత మంది కస్టమర్లకు చేరువై జీవిత బీమా రంగంలో మా స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని నిర్దేశించుకున్నాం. కొత్త పాలసీల విషయంలో పరిశ్రమకు రెట్టింపు స్థాయి వృద్ధి సాధించడం, వేగంగా ఎదుగుతున్న టాప్ సంస్థల్లో ఒకటిగా కొనసాగడాన్ని లక్ష్యాలుగా పెట్టుకున్నాం. మా నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెడతాం. పరిశ్రమపరంగా చూస్తే 2032 నాటికి భారత ఇన్సూరెన్స్ మార్కెట్ ప్రపంచంలోనే ఆరో పెద్ద మార్కెట్‌గా ఎదుగుతుందని స్విస్ రీ సంస్థ ఒక నివేదికలో అంచనా వేసింది. పరిశ్రమ వృద్ధి గతిని తీర్చిదిద్దడంలో నియంత్రణ వ్యవస్థ కీలక పాత్ర పోషించనుంది. బీమా సుగమ్, బీమా వాహక్, బీమా విస్తార్ వంటివి దేశవ్యాప్తంగా కోట్ల మందికి బీమాను అందుబాటులోకి తేవడం ద్వారా ‘2047 నాటికి అందరికీ బీమా కల్పించడం’ అనే ఐఆర్డీఏఐ లక్ష్య సాధనలో తోడ్పడగలవు. అలాగే పాలసీలను క్రమబద్ధీకరించడం, ప్రక్రియలను .. సర్వీసులను మెరుగుపర్చడం వంటి చర్యల ద్వారా బీమాను సరళతరం చేయడంపై పరిశ్రమ మరింతగా దృష్టి పెట్టనుంది. -
మెరైన్ బీమాపై శ్రీరామ్ జనరల్ ఫోకస్
చెన్నై: బీమా సంస్థ శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ వాహనయేతర బీమా విభాగాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా మెరైన్, అగ్ని ప్రమాదాలు మొదలైన వాటికి సంబంధించిన బీమా పాలసీలను ప్రవేశపెడుతోంది. కంపెనీ చీఫ్ అండర్‌రైటింగ్ ఆఫీసర్ శశికాంత్ దహూజా ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం తమ వ్యాపారంలో మోటార్ ఇన్సూరెన్స్ వాటా సుమారు 92 శాతంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. డైవర్సిఫికేషన్ ప్రణాళికల్లో భాగంగా ఫైర్, మెరైన్, ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో కొత్త బీమా పాలసీలను ప్రవేశపెట్టనున్నట్లు శశికాంత్ చెప్పారు. వచ్చే రెండు మూడేళ్లలో వాహనయేతర వ్యాపారాన్ని 15 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇది 7–8 శాతంగా ఉంది. కేవలం ఒక విభాగంపై ఎక్కువగా ఆధారపడకూడదనే వ్యాపార వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ నికర లాభం 37% పెరిగి రూ.98 కోట్లకు చేరింది. ఈ ఏడాది వ్యాపారం 30% మేర వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నట్లు శశికాంత్ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల బీమా పాలసీల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయని, గత ఆర్థిక సంవత్సరంలో రూ.82 కోట్ల విలువైన పాలసీలను విక్రయించామన్నారు. ఈ ఏడాది వీటి విక్రయాలు రూ.200 కోట్ల వరకు ఉండొచ్చని చెప్పారు. ప్రస్తుతం సంస్థలో 3,780 మంది ఉద్యోగులు ఉన్నారని, ఈ ఆర్థిక సంవత్సరం కొత్తగా 700 మందిని నియమించుకోనున్నామని శశికాంత్ తెలిపారు. -
ఎల్ఐసి సేవలు ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా.. ఇలా ప్రారంభించండి!
LIC WhatsApp Service: ఆధునిక కాలంలో చాలా మందికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీలు ఉంటాయి. అయితే మనకు ఇందులో ఏదైనా సందేహం వచ్చినా, సమస్య వచ్చిన నేరుగా సంబంధిత కార్యాలయానికి వెళ్లి పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అయితే సంస్థ ఇప్పుడు తమ పాలసీదారుల కోసం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సర్వీసుని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ సర్వీసుల గురించి తెలుసుకోవచ్చు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎల్ఐసి కంపెనీ ప్రవేశపెట్టిన వాట్సాప్ సర్వీసు ద్వారా లోన్ ఎలిజిబిలిటీ, రీపేమెంట్ ఎస్టిమేట్, ప్రీమియం డ్యూ డేట్స్ వంటి వాటితో పాటు బోనస్ ఇన్ఫర్మషన్, లోన్ ఎలిజిబిలిటీ కొటేషన్, ఎల్ఐసి సర్వీస్ లింక్స్, పాలసీ స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు. ఇది చాలా సులభమైన ప్రక్రియ. (ఇదీ చదవండి: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో నాలుగు బైకులు - ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?) ఎల్ఐసి వాట్సాప్ సర్వీస్ ఉపయోగించుకోవడమెలా? మీ స్మార్ట్‌ఫోన్‌లో 8976862090 అనే నెంబర్‌కి 'హాయ్' అని మెసేజ్ చేయాలి. తరువాత మీకు 11 ఆప్షన్ కనిపిస్తాయి. అందులో మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దానిని సెలక్ట్ చేసుకోవాలి. మీరు ఎంచుకునే ఆప్షన్ని బట్టి రిప్లై వస్తుంది. వాట్సాప్ చాట్‌లోనే మీకు అవసరమైన వివరాలను ఎల్ఐసి షేర్ చేస్తుంది -
జీవిత బీమా.. రాబడి చూడొద్దు
జీవిత బీమా అనగానే.. ప్రీమియం ఎంత.. రాబడి ఎంత..? అన్న ప్రశ్న వస్తుంది. ఇప్పటికీ జీవిత బీమా విషయంలో ఎక్కువ మంది ఎంపిక సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలే. ఇందుకోసం భారీగా ప్రీమియం చెల్లిస్తుంటారు. ఒకవైపు బీమా కవరేజీ. మరోవైపు రాబడి. ఇదే ఎక్కువ మందిని ఆకర్షించే అంశం. బ్యాంక్ డిపాజిట్లో మాదిరిగా, లేదంటే అంతకంటే ఎక్కువ రాబడి బీమా పాలసీలో వస్తుందని నమ్ముతుంటారు. దీనికి అదనంగా బీమా రక్షణ ఉంటుందన్న కారణంతో దీనివైపే మొగ్గు చూపిస్తుంటారు. రాబడి ఇవ్వని టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అర్థం చేసుకుని తీసుకునే వారు మొత్తం మీద తక్కువ. కానీ, సంప్రదాయ బీమా పాలసీల్లో రాబడి విషయమై ఎక్కువ మందిలో ఉండే అంచనా తప్పు. రాబడి రేటు చాలా తక్కువ. సగటు ద్రవ్యోల్బణం కంటే కూడా తక్కువేనని గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తుంది. మార్కెటింగ్‌లో భాగంగా సంప్రదాయ బీమా పాలసీలను ఆకర్షణీయంగా చూపించే ప్రయత్నాన్ని బీమా సంస్థలు, ఏజెంట్లు చేస్తుంటారు. కానీ, ఇక్కడ స్పష్టంగా తేల్చుకోవాల్సింది ఏమిటంటే.. కావాల్సింది బీమా రక్షణా? లేక రాబడా? ఈ అంశాలను వివరించే కథనం ఇది... సంప్రదాయ బీమా పాలసీలు రెండు రకాల ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంటాయి. మరణించినప్పుడు పరిహారాన్ని చెల్లిస్తాయి. పాలసీ కాలం పూర్తయ్యే వరకు జీవించి ఉన్నా ప్రయోజనం లభిస్తుంది. పాలసీదారు ఏదైనా కారణంతో దురదృష్టవశాత్తూ పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే నామినీ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. పాలసీదారు జీవించి ఉంటే చివర్లో అన్ని ప్రయోజనాలనూ కలిపి బీమా సంస్థ చెల్లిస్తుంది. బీమా ప్లాన్ బ్రోచర్లో ఈ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు ఎల్ఐసీ బీమా జ్యోతి ప్లాన్ పరిశీలిస్తే.. ఇది పొదుపు, బీమాతో కూడిన ప్లాన్. 15–20 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి అంతటా ప్రీమియం చెల్లించక్కర్లేదు. 5 ఏళ్లు తగ్గించి మిగిలిన కాలానికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 20 ఏళ్ల టర్మ్ ప్లాన్ తీసుకుంటే 15 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాలి. ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలానికి బీమా జ్యోతి పాలసీని రూ.15 లక్షల సమ్ అష్యూరెన్స్పై (బీమా రక్షణ/కవరేజీ) తీసుకుంటే అప్పుడు ఏటా చెల్లించాల్సిన ప్రీమియం సుమారు రూ.80వేలు. ఇలా 15 ఏళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది. జీవించి ఉంటే రెండు రూపాల్లో ఈ ప్లాన్ ప్రయోజనాలను చెల్లిస్తుంది. 55 ఏళ్ల వరకు జీవించి ఉంటే అప్పుడు రూ.10 లక్షల సమ్ అష్యూరెన్స్తోపాటు గ్యారంటీడ్ అడిషన్స్ పొందొచ్చు. గ్యారంటీడ్ అడిషన్ అనేది ప్రతి రూ.1,000పై రూ.50 చొప్పున వస్తుంది. అంటే మొత్తం మీద 20 ఏళ్ల కాలంలో ప్రీమియం రూపేణా రూ.12 లక్షలు చెల్లిస్తారు. అంటే రూ.10 లక్షల కవరేజీ కోసం అంతకంటే ఎక్కువ చెల్లిస్తున్నారు. జీవించి ఉంటే 20 ఏళ్ల తర్వాత వచ్చే మొత్తం రూ.20 లక్షలు. అంటే రాబడి రూ.8 లక్షలే. అది కూడా 20 ఏళ్ల కాలానికి. ఇందులో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (రాబడి రేటు) 4 శాతమే. ఇదనే కాదు. జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లు అన్నింటిలోనూ దాదాపు ఇదే స్థాయిలో రాబడి ఉంటుంది. ఒకవేళ 30–40 ఏళ్ల కాలానికి తీసుకుంటే ఈ రాబడి రేటు 4.5–5 శాతం మధ్య ఉంటుంది. కానీ, మన దేశంలో సగటు వార్షిక ద్రవ్యోల్బణం 6 శాతం స్థాయిలో ఉండడాన్ని గమనించొచ్చు. ద్రవ్యోల్బణం రేటు, అంతకంటే తక్కువ రాబడి రేటు ఏదైనా.. నికరంగా అది మనకు రాబడిని ఇచ్చినట్టు కాదని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ప్లాన్ కాల వ్యవధిలో పాలసీదారు మరణించినట్టయితే, సమ్ అష్యూరెన్స్తోపాటు అప్పటి వరకు సమకూరిన గ్యారంటీడ్ అడిషన్స్ చెల్లిస్తారు. బేసిక్ సమ్ అష్యూరెన్స్పై 125 శాతం, వార్షికంగా చెల్లించే ప్రీమియానికి ఏడు రెట్లు, లేదంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంకు 105 శాతం.. వీటిల్లో ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తారు. ఉదాహరణకు 35 ఏళ్ల వయసులో తీసుకుని 50 ఏళ్ల సమయంలో మరణం సంభవించినట్టయితే రూ.20 లక్షలు పరిహారంగా ముడుతుంది. ప్రత్యామ్నాయం... బీమా, పెట్టుబడి ఈ రెండింటినీ కలిపి చూడొద్దని నిపుణులు తరచూ చెబుతుంటారు. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల అటు సరైనా బీమా రక్షణ, ఇటు సరైన రాబడి పొందలేని పరిస్థితికి సంప్రదాయ బీమా పాలసీలు అచ్చమైన ఉదాహరణ. అలా కాకుండా అచ్చమైన జీవిత బీమా రక్షణను ఆఫర్ చేసే టర్మ్ ప్లాన్ తీసుకుని, మరోవైపు మెరుగైన రాబడినిచ్చే సాధనంలో పెట్టుబడి పెట్టుకోవడమే మంచి నిర్ణయం అవుతుంది. పై ఉదాహరణ ఆధారంగా బీమా, పెట్టుబడిని వేరు చేస్తే వచ్చే ప్రయోజనం ఏ మేరకు ఉంటుందో చూద్దాం. 35 ఏళ్ల వయసున్న వ్యక్తి 25 ఏళ్ల కాలానికి అంటే 60 ఏళ్లు వచ్చే వరకు (రిటైర్మెంట్ వయసు/బాధ్యతలు ముగిసే సగటు వయసు) రూ.50 లక్షల సమ్ అష్యూరెన్స్‌తో టర్మ్ ప్లాన్ తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియం రూ.10వేల లోపే. ఎక్కువ కంపెనీల్లో ప్రీమియం రూ.7,400 నుంచి 9,800 మధ్య ఉంది. పొగతాగడం, మద్యపానం, అనారోగ్య సమస్యలు లేని వారికి ఈ ప్రీమియం అని అర్థం చేసుకోవాలి. బీమా జ్యోతి ప్లాన్‌లో ఏటా చెల్లించే ప్రీమియం రూ.80వేలు. కానీ బీమా రక్షణ రూ.10 లక్షలే. ఈ ప్రీమియంలో కేవలం 12 శాతం చెల్లించడం ద్వారా టర్మ్ ప్లాన్‌లో రూ.50 లక్షల బీమా కవరేజీని, అది కూడా 25 ఏళ్ల కాలానికి పొందొచ్చు. కేవలం 12 శాతం ప్రీమియానికే ఐదు రెట్లు అధిక బీమా రక్షణ తీసుకోవడం మెరుగైన నిర్ణయం అనిపించుకుంటుంది. అప్పుడు మిగిలిన రూ.70వేలను 15 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బీమా జ్యోతితో ప్రీమియం చెల్లింపు 15 ఏళ్లే కనుక దాన్నే పరిగణనలోకి తీసుకుని చూద్దాం. 12 శాతం రాబడి ఇచ్చే మ్యూచువల్ ఫండ్ పథకంలో ఏడాదికోసారి రూ.70వేల చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళితే 15 ఏళ్ల చివరికి రూ.29.22 లక్షలు సమకూరుతుంది. ఇందులో అసలు రూ.10.5 లక్షలు అయితే, రాబడి రూ.18.72 లక్షలు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో దీర్ఘకాలానికి వార్షిక రాబడి 12 శాతం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ 10 శాతం రాబడి ఆధారంగా అంచనా వేసుకున్నా.. 15 ఏళ్లలో రూ.24.46 లక్షలు సమకూరుతుంది. విడిగా బీమా ప్లాన్, పెట్టుబడి ప్లాన్ ఎంపిక చేసుకోవడం వల్ల మెరుగైన కవరేజీకితోడు, మెరుగైన సంపద సృష్టి సాధ్యపడుతుందని ఈ ఉదాహరణ తెలియజేస్తోంది. కాంపౌండింగ్ ఉండదు.. విడిగా ఇన్వెస్ట్ చేసుకుంటే కాంపౌండింగ్ ఉంటుంది. అంటే రాబడిపై రాబడి తోడవుతుంది. కానీ, సంప్రదాయ బీమా ప్లాన్లలో చెల్లించే గ్యారంటీడ్ అడిషన్స్, రివర్షనరీ బోనస్, సింపుల్ అడిషన్స్ మొత్తంపై కాంపౌండింగ్ ఉండదు. అదే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లేదా బాండ్లను తీసుకుంటే, మొదటి ఏడాది రాబడిపై తర్వాతి కాలంలో రాబడి జమ అవుతుంది. ఇలా కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది. పైకి కనిపించదు కానీ, సంపద సృష్టిలో కాంపౌండింగ్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. సంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో రాబడి రేటు ముందే చెబుతారు. అదే, సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి రేటు ముందు చెప్పరు. సమ్ అష్యూరెన్స్తోపాటు ఇతర ప్రయోజనాలు చెల్లించే విధంగా ప్లాన్ ఉంటుంది. ఇందులో నికర రాబడి ఏ మేరకు అన్నది అర్థం చేసుకోవడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. సమ్ అష్యూరెన్స్కే హామీ ఉంటుంది. ఇతర చెల్లింపులకు హామీ ఉండదు. బీమా సంస్థ పనితీరు (అది చేసే పెట్టుబడులపై రాబడులు)పైనే ఆధారపడి ఉంటాయని అర్థం చేసుకోవాలి. అందుకే అన్నింటికంటే కుటుంబానికి మెరుగైన జీవిత బీమా రక్షణ కల్పించుకోవడం ముందుగా చేయాలి. రాబడి కోసం దీర్ఘకాలంలో ఈక్విటీలే మెరుగైన సాధనమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత, ఇంకా ఆర్థిక వెసులుబాటు ఉంటే అప్పుడు మీకు నచ్చిన ప్లాన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. గ్యారంటీడ్/ పార్టిసిపేటింగ్ బీమా సంస్థలు సంప్రదాయ పాలసీలను ఆకర్షణీయంగా చూపించేందుకు బోనస్‌లను ప్రకటిస్తుంటాయి. బీమా సంస్థ పనితీరుపైనే ఇది ఆధారపడి ఉంటుంది. సంప్రదాయ బీమా ప్లాన్లు సింపుల్ రివర్షనరీ బోనస్, ఫైనల్ మెచ్యూరిటీ బోనస్, లాయల్టీ అడిషన్ను ఆఫర్ చేస్తుంటాయి. ఇవన్నీ బీమా సంస్థ వద్ద మిగులు నిల్వలపైనే ఆధారపడి ఉంటాయనే షరతు విధిస్తారు. మిగులు ఉంటే అప్పుడు సింపుల్ రివర్షనరీ బోనస్ ను చెల్లిస్తారు. కొన్ని ప్లాన్లలో సింపుల్ రివర్షనరీ బోనస్ అని కాకుండా, పాలసీ కాల వ్యవధి ముగింపు సమయంలో లాయల్టీ అడిషన్స్ పేరుతో చెల్లిస్తారు. ఇదే తరహా సంప్రదాయ ప్లాన్లు కొన్ని చివర్లో అడిషనల్ బోనస్ చెల్లింపునకు హామీ ఇస్తాయి. పార్టిసిపేటింగ్ బీమా ప్లాన్ తీసుకుంటున్నట్టు అయితే, కాల వ్యవధి ముగిసే వరకు జీవించి ఉన్న సందర్భంలో సమ్ అష్యూరెన్స్‌కు అదనంగా ఏదో ఒక రూపంలో చెల్లింపు ఉంటుంది. అదే నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ తీసుకుంటుంటే జీవించి ఉంటే చివర్లో ఏమీ రాదు. టర్మ్ ఇన్సూరెన్స్‌ను నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్‌గా పేర్కొంటారు. ఇప్పుడు ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్లు కూడా వస్తున్నాయి. కనుక ఇక్కడ పొరపాటు పడొద్దు. ప్రీమియం వెనక్కి రాని టర్మ్ ప్లాన్ ప్రీమి యంతో పోలిస్తే, చివర్లో ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్ ప్రీమియం చాలా అధికంగా ఉంటుంది. -
విద్యుత్ వాహనాల బీమాకు జాగ్రత్తలు
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతోంది. 2022 ఆగస్టు నాటి గణాంకాల ప్రకారం మన రహదారులపై 13 లక్షల పైచిలుకు ఈవీలు ఉన్నాయి. మూడేళ్లుగా వీటి అమ్మకా ల వృద్ధి వార్షికంగా 130 శాతంగా ఉంటోంది. వీటిల్లో అత్యధికంగా త్రిచక్ర రవాణా వాహనాలు, తర్వాత స్థానంలో ద్విచక్ర వాహనాలు, కార్లు ఉన్నా యి. అయితే మిగతా వాటి తరహాలోనే విద్యుత్ వాహనాలకు కొన్ని సవాళ్లు ఉన్నాయి. అవి.. ► ఒక్క సారి చార్జి చేస్తే వాహనం ఎన్ని కిలోమీటర్లు నడుస్తుందనేది ఒక సవాలు. ► ఈవీలు విజయవంతం కావాలంటే చార్జింగ్‌పరమైన మౌలిక సదుపాయాలు భారీగా అవసరం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇంకా పురోగమన దశలోనే ఉన్నాయి. ► ఈవీ బ్యాటరీ ఖరీదు.. వాహనం రేటులో దాదాపు సగం దాకా ఉంటోంది. కాబట్టి, బ్యాటరీ దీర్ఘాయుష్షు, వారంటీ, రీసేల్ విలువ గురించి చాలా సందేహాలే ఉన్నాయి. ► ఓవర్ చార్జింగ్ వల్ల వాహనంలో మంటలు చెలరే గితే పరిస్థితి ఏమిటనే భయాలూ ఉన్నాయి. అగ్నిప్రమాదాలకు దారి తీస్తే థర్డ్ పార్టీకి వాటిల్లే ఆస్తి, ప్రాణ నష్టానికి లయబిలిటీపైనా సందేహాలు ఉన్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రామాణిక మోటరు బీమా పాలసీ దశాబ్దాల కిందట రూపొందింది. అప్పుడు ఈవీలు, హైబ్రీడ్ వాహనాల ఉనికి లేదు. అయితే, మారే మార్కెట్ అవసరాలు, సమయానికి తగినట్లు కొత్త పథకాలను ప్రవేశపెట్టేలా ఇన్సూరెన్స్ కంపెనీలకు బీమా రంగ నియంత్రణ సంస్థ స్వేచ్ఛనిస్తోంది. తదనుగుణంగానే బీమా సంస్థలు కూడా పైన పేర్కొన్న పలు సవాళ్లను పరిష్కరించగల యాడ్–ఆన్‌లను అందజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీల కోసం బీమా తీసుకునేటప్పుడు కొనుగోలుదారు ప్రధానంగా పరిశీలించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ► బ్యాటరీకి విడిగా కవరేజి ఉందా? ఒకవేళ చార్జింగ్ చేసేటప్పుడు వరద లేదా అగ్ని ప్రమాదాల్లాంటివి సంభవించినట్లయితే బ్యాటరీ పూర్తి నష్టానికి పాలసీలో కవరేజీ ఉండాలి. ► ప్లాస్టిక్, లోహాలు, గాజు లేదా ఫైబర్ ఏవైనా భాగాలు అన్నింటికీ జీరో డిప్రిసియేషన్ కవరేజీ ఉందా అన్నది చూసుకోవాలి. ► ఈవీ వల్ల థర్డ్ పార్టీ ప్రాపర్టీ ధ్వంసమైనా, వారికి గాయాలైనా ఈవీ యజమానిపై దావా వేస్తే పరిహారంపరమైన సమస్యలు ఎదురవకుండా విడి గా లయబిలిటీ కవరేజీ ఉండేలా చూసుకోవాలి. ► గోడలో బిగించిన చార్జర్‌కు, చార్జింగ్ చేసే కేబుల్‌కు విడిగా కవరేజి ఉందా లేదా. ఈ భాగాలన్నీ వాహనంలో బిగించి ఉండవు కాబట్టి, వాటి గురించి నిర్దిష్టంగా తెలియపరుస్తూ కవరేజీ కల్పించడం ముఖ్యం. ► ఓఈఎం (వాహనం తయారీ సంస్థ) చేసే ప్రామాణికమైన ఫిట్టింగ్స్కు అదనంగా కారులో బిగించిన ఇన్ఫోటెయిన్మెంట్ గ్యాడ్జెట్లు, మ్యూ జిక్ సిస్టమ్‌లు, ఇతరత్రా ఏవైనా గ్యాడ్జెట్లు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నింటికీ కవరేజీ ఉందో లేదో చూసుకోవాలి. -
అన్‌రిజిస్టర్డ్ వ్యక్తులకూ ఇక జీఎస్టీ రిఫండ్స్!
న్యూఢిల్లీ: రద్దయిన కాంట్రాక్టులు లేదా బీమా పాలసీలకు సంబంధించి నమోదుకాని (అన్‌రిజిస్టర్డ్) వ్యక్తులు కూడా ఇకపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వాపసులను క్లెయిమ్ చేసుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇందుకు తన పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)తో జీఎస్టీ పోర్టల్‌లో తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ను పొందాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఒక ప్రకటనలో సూచించింది. బ్యాంక్ అకౌంట్ నెంబర్‌తోపాటు, రిఫండ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. కాంట్రాక్ట్ రద్దయిన సందర్భంలో తాము అప్పటికే భరించిన పన్ను మొత్తాన్ని వాపసు కోసం క్లెయిమ్ చేయడానికి ఒక సదుపాయాన్ని (ఫెసిలిటీ) కల్పించాలని రిజిస్టర్ కాని కొనుగోలుదారులు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని వెలువరిస్తున్నట్లు తెలిపింది. రెండేళ్ల కాల వ్యవధి... తాజా నిర్ణయంతో ఫ్లాట్, భవనం నిర్మాణం లేదా దీర్ఘకాలిక బీమా పాలసీ రద్దుకు సంబంధించి అప్పటికే చెల్లించిన జీఎస్టీని ఇకపై అన్ రిజిస్టర్డ్ వ్యక్తులూ తిరిగి పొందే (రిఫండ్) వెసలుబాటు కలిగింది. నమోదవ్వని పన్ను చెల్లింపుదారు సంబంధిత తేదీ నుండి రెండు సంవత్సరాలలోపు వాపసుల కోసం ఫైల్ చేయవచ్చని సీబీఐసీ వివరించింది. వస్తువులు, సేవలను స్వీకరించిన తేదీ లేదా ఒప్పందం రద్దయిన తేదీ నుంచి ఇది ఈ రెండేళ్ల కాల వ్యవధి వర్తిస్తుందని వివరించింది. డిసెంబర్ 17న జరిగిన జీఎస్టీ అత్యున్నత స్థాయి 48వ సమావేశం నిర్ణయాలకు అనుగుణంగా తాజాగా సీబీఐసీ ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ‘‘రిజిస్టర్ చేయని కొనుగోలుదారులు సరఫరా జరగని చోట జీఎస్టీ వాపసు పొందడానికి తాజా నిర్ణయం అనుమతిస్తుంది. వారిపై ఇప్పటి వరకూ ఉన్న అనవసరమైన వ్యయ భారాన్ని నివారించడంలో సహాయపడుతుంది’’ అని అని భారత్‌లో కేపీఎంసీ ప్రతినిధి (పరోక్ష పన్ను) అభిషేక్ జైన్ వ్యాఖ్యానించారు. -
పాలసీల విక్రయాల్లో అనైతిక పోకడ వద్దు
న్యూఢిల్లీ: కస్టమర్లతో ఏదో రకంగా బీమా పాలసీలను విక్రయించే విధానాలను బ్యాంక్‌లు అనుసరిస్తున్నాయనే విమర్శలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. బీమా ఉత్పత్తుల విక్రయాల కోసం అనైతిక విధానాలను అనుసరించొద్దని బ్యాంక్‌లను కోరింది. కస్టమర్లకు బీమా పాలసీల విక్రయాల్లో అనైతిక విధానాలు పాటించకుండా తగిన యంత్రాంగాన్ని అమల్లో పెట్టాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల అధినేతలను ఆదేశించింది. కస్టమర్లకు బీమా పాలసీలను విక్రయించే విషయంలో బ్యాంక్‌లు, బీమా సంస్థలు మోసపూరిత, అనైతిక విధానాలకు పాల్పడుతున్నాయంటూ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగానికి ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 75 ఏళ్లు దాటిన కస్టమర్లకు సైతం జీవిత బీమా పాలసీలను విక్రయించిన సందర్భాలను ప్రస్తావించింది. సాధారణంగా కస్టమర్లు రుణాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు, టర్మ్ డిపాజిట్ చేస్తున్నప్పుడు బ్యాంక్‌లు బీమా ఉత్పత్తులను వారితో కొనిపించే ప్రయత్నం చేస్తుంటాయి. ఏదో ఒక బీమా కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులను కస్టమర్లతో బలవంతంగా కొనిపించే చర్యలకు దూరంగా ఉండాలని తాజా ఆదేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. బీమా ఉత్పత్తుల విక్రయాలపై ప్రోత్సాహకాలు ఇవ్వడం క్షేత్ర స్థాయి సిబ్బందిపై ఒత్తిడికి దారితీయడమే కాకుండా, బ్యాంక్‌ల ప్రధాన వాణిజ్య కార్యకలపాలపై ప్రభావం పడుతుందని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సైతం ఆందోళన వ్యక్తం చేయడాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అనైతిక, అనుచిత విధానాలను అనుసరించకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని, తగిన యంత్రాంగాన్ని అమల్లో పెట్టాలని కోరింది. బీమా పాలసీల విక్రయాలకు సంబంధించి నూరు శాతం కేవైసీ నిబంధనలు అమల్లో పెట్టాలని కూడా ఆదేశించింది. -
పోస్టాఫీస్ పథకం: రూ.399కే రూ.10లక్షల యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్!
పోస్టల్ డిపార్ట్ మెంట్ కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. టాటా ఏఐజీత కలిసి ఖాతాదారుల కోసం గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పేరిట యాక్స్డెంట్ ఇన్స్యూరెన్స్ పాలసీని తీసుకువచ్చింది. ఈ పాలసీ హొల్డర్లు ఏడాదికి రూ.399 చెల్లించి రూ.10లక్షల యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ పాలసీ గురించి క్లుప్తంగా ►18 నుంచి 65ఏళ్ల వయసు కలిగిన వారు ఎవరైనా సరే పోస్టాఫీస్ నుంచి ఈ పాలసీని పొందవచ్చు. ►పాలసీ హోల్డర్లు ప్రమాదంలో మరణించినా, శాస్వత వైకల్యం ఏర్పడినా రూ.10లక్షలు చెల్లిస్తారు. ►ప్రమాదం జరిగి వైద్యం కోసం ఆస్పత్రిలో చేరితే రూ.60వేలు చెల్లిస్తారు. ►ఔట్ పేషంట్ రూ.30వేల వరకు క్లైమ్ చేసుకోవచ్చు. ►ఇక ఇదే పథకం కింద పాలసీ దారులు రూ.299 చెల్లించినా రూ.10లక్షల వరకు ఇన్స్యూరెన్స్ పొందవచ్చు. దీంతో పాటు ఇతర సౌకర్యాలు పొందవచ్చు. -
మెడిక్లెయిమ్ సెగ్మెంట్‌పై మళ్లీ ఎల్ఐసీ చూపు!
న్యూఢిల్లీ: భారత బీమా రంగ దిగ్గజ సంస్థ– జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తిరిగి మెడిక్లెయిమ్ బీమా పాలసీ సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి ఆసక్తిగా ఉంది. ఈ విషయంపై రెగ్యులేటర్– ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ పేర్కొన్నారు. మెడిక్లెయిమ్ పాలసీ అంటే... మెడిక్లెయిమ్ పాలసీలు అంటే... నష్టపరిహారం (ఇన్డెమ్నిటీ) ఆధారిత ఆరోగ్య పథకాలు. అయితే మార్కెట్ నుండి ఈ పథకాలను ఉపసంహరించుకోవాలని 2016లో ఐఆర్డీఏఐ జీవిత బీమా సంస్థలను కోరింది. మూడు నెలల నోటీస్ పిరియడ్‌తో అప్పట్లో వాటి ఉపసంహరణ కూడా జరిగింది. జీవిత బీమా సంస్థలు ఇలాంటి ఆరోగ్య సంబంధ పథకాలు ఇవ్వడానికి సాంకేతికంగా అడ్డంకులు ఉన్నాయని అప్పట్లో రెగ్యులేటర్ భావించింది. నష్టపరిహార ఆధారిత ఆరోగ్య బీమా పథకాల కింద బీమా చేసిన మొత్తం వరకు వైద్య చికిత్స కోసం ఖర్చు చేసిన డబ్బుకు బీమా సంస్థ రీయింబర్స్మెంట్ (చెల్లింపులు) చేస్తుంది. 2016లో ఉపసంహరణకు ముందు జీవిత బీమా సంస్థల ఆరోగ్య పోర్ట్‌ఫోలియోలో 90–95 శాతం నష్టపరిహార ఆధారిత ఆరోగ్య బీమా పథకాలు (ఇన్డెమ్నిటీ) ఉండేవి. దీని ప్రకారం పాలసీదారు వైద్యుడిని సందర్శించిన తర్వాత లేదా వైద్య ఖర్చులను భరించిన తర్వాత రీయింబర్స్‌మెంట్‌ను క్లెయిమ్ చేసే వీలుండేది. మళ్లీ మార్పు ఎందుకు? 2030 నాటికి ప్రతి పౌరుడు ఆరోగ్య బీమా పాలసీని కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలన్న ఆదేశాల నేపథ్యంలో జీవిత బీమా సంస్థలు ఆరోగ్య విభాగంలోకి తిరిగి ప్రవేశించే సమయం ఆసన్నమైందని ఇటీవలే కొత్త ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాశిష్ పాండా అన్నారు.అయితే జీవిత బీమా సంస్థలను ఆరోగ్య బీమా పాలసీలను విక్రయించడానికి అనుమతించడం వల్ల కలిగే లాభ నష్టాలను రెగ్యులేటర్ మదింపు చేస్తోందని, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మార్కెట్లలో జీవిత బీమా సంస్థలు ఆరోగ్య పాలసీలనూ విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 24.50 లక్షల మంది జీవిత బీమా ఏజెంట్లు ఉండగా, సాధారణ, ఆరోగ్య బీమా విభాగంలో కేవలం 3.60 లక్షల మంది ఏజెంట్లు మాత్రమే ఉన్నారు. జీవిత బీమా సంస్థలను ఆరోగ్య బీమా రంగంలోకి అనుమతించినట్లయితే, ఏజెంట్ల సంఖ్య 600 శాతం పెరుగుతుంది. దీనివల్ల దేశంలో ఆరోగ్య బీమా వ్యాప్తి గణనీయంగా పెరుగుతుందని అంచనా. -
అరుదైన ఘనత దక్కించుకున్న ఎల్ఐసీ!
Lic Stands Fortune 500 List: ఇటీవలే లిస్టయిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తొలిసారిగా ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో చోటు దక్కించుకుంది. 97.26 బిలియన్ డాలర్ల ఆదాయం, 553.8 మిలియన్ డాలర్ల లాభంతో 98వ స్థానంలో నిల్చింది. అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ 93.98 బిలియన్ డాలర్ల ఆదాయం, 8.15 బిలియన్ డాలర్ల లాభాలతో ఏకంగా 51 స్థానాలు ఎగబాకి 104వ ర్యాంకును దక్కించుకుంది. రిలయన్స్ గత 19 ఏళ్లుగా ఈ లిస్టులో కొనసాగుతోంది. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలపరంగా అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉన్న సంస్థలతో ఫార్చూన్ మ్యాగజైన్ ఈ జాబితా రూపొందించింది. భారత్ నుంచి తొమ్మిది కంపెనీలు (అయిదు ప్రభుత్వ రంగంలోనివి, నాలుగు ప్రైవేట్ రంగంలోనివి) చోటు దక్కించుకున్నాయి. దేశీ కార్పొరేట్లలో రిలయన్స్ కన్నా పైస్థాయిలో ఉన్నది ఎల్ఐసీ మాత్రమే. ఫార్చూన్ 500లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 28 స్థానాలు ఎగబాకి 142వ ర్యాంకు, ఓఎన్జీసీ 16 ర్యాంకులు దాటి 190వ స్థానంలో ఉన్నాయి. ఎస్బీఐ 17 స్థానాలు (236వ ర్యాంకునకు), బీపీసీఎల్ 19 ర్యాంకులు (295వ స్థానానికి) పెరిగాయి. టాటా మోటార్స్ 370, టాటా స్టీల్ 435, రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ 437 ర్యాంకుల్లో నిల్చాయి. (ఇది కూడా చదవండి: ఏడో రోజూ లాభాల రింగింగ్, ఐటీ జోరు) మరిన్ని విశేషాలు.. ► వరుసగా తొమ్మిదోసారి అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ నంబర్ వన్ స్థానంలో నిల్చింది. అమెజాన్, చైనాకు చెందిన స్టేట్ గ్రిడ్, చైనా నేషనల్ పెట్రోలియం, సైనోపెక్ వరుసగా ఆ తర్వాత ర్యాంకుల్లో ఉన్నాయి. ► జాబితాలోని కంపెనీల మొత్తం అమ్మకాలు 19 శాతం పెరిగి 37.8 ట్రిలియన్ డాలర్లకు చేరాయి. ► తొలిసారిగా గ్రేటర్ చైనా (తైవాన్‌తో కలిపి) సంస్థల ఆదాయాలు.. అమెరికన్ కంపెనీలను మించాయి. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: మహిళల్లో మార్పులు.. వచ్చింది కాదు నచ్చింది కావాలి! -
వాహనం నడిపినంతే బీమా!.. తగ్గనున్న బీమా ప్రీమియం
న్యూఢిల్లీ: కార్తీక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఒక కారు, ఒక బైక్ ఉన్నాయి. నిత్యం కార్యాలయానికి కారులో వెళుతుంటాడు. ఇతర పనులకు బైక్ ఉపయోగిస్తాడు. దీంతో అతడు రెండింటికీ వేర్వేరు మోటారు బీమా పాలసీలను తీసుకుని ఉంటాడు. ఇకపై ఒక్కటే ఫ్లోటర్ పాలసీ తీసుకోవచ్చు. పైగా ప్రీమియం కూడా తక్కువకే వస్తుంది. ఎందుకంటే అతడు బైక్ వాడేది చాలా తక్కువ. పైగా కార్యాలయం కూడా 8 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అలా చూసుకుంటే కారు వినియోగం కూడా తక్కువే. పైగా ఏకకాలంలో రెండు వాహనాలను వినియోగించడం అసాధ్యం. అందుకే అతడికి గతంతో పోలిస్తే ఇక మీదట ప్రీమియం చాలావరకు తగ్గనుంది. ఈ తరహా సంస్కరణలకు వీలు కల్పిస్తూ.. మోటారు ఇన్సూరెన్స్ పాలసీలకు అధునాతన ఫీచర్లతో కూడిన యాడాన్‌లను ప్రవేశపెట్టేందుకు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) అనుమతించింది. కొత్త యాడాన్లు..: మోటారు ఓన్ డ్యామేజ్ (ఓడీ) అన్నది బేసిక్ మోటారు బీమా ప్లాన్. ఇందులో వాహనానికి ఏదైనా కారణం వల్ల నష్టం ఏర్పడితే కవరేజీ ఉంటుంది. ఇప్పుడు దీనికి ‘పే యాజ్ యూ డ్రైవ్, పే హౌ యూ డ్రైవ్’ అనే కాన్సెప్ట్ తోడు కానుంది. వాహనాన్ని నడిపిన మేరకు, నడిపే తీరుకు అనుగుణంగా బీమా సంస్థ టెక్నాలజీ సాయంతో ప్రీమియాన్ని నిర్ణయిస్తుంది. ఉదాహరణకు తక్కువ దూరం నడిపేవారికి తక్కువ ప్రీమియం, ఎక్కువ దూరం నడిపేవారికి కొంచెం ఎక్కువ ప్రీమియం ఇలా అన్నమాట. లేదంటే తక్కువ దూరం, సురక్షిత డ్రైవింగ్ విధానాన్ని అనుసరించే వారికి తక్కువ ప్రీమియానికే మరింత కవరేజీ లభించొచ్చు. అలాగే, ఒకే వాహనదారుడికి ఒకటికి మించిన వాహనాలు ఉంటే అన్నింటికీ కలిపి ఫ్లోటర్ పాలసీ జారీ చేసేందుకు కూడా ఐఆర్డీఏఐ అనుమతించింది. -
ధీమాగా బీమా ఇలా..!
ఆరోగ్య బీమా అవసరాన్ని గతంతో పోలిస్తే నేడు ఎక్కువ మంది గుర్తిస్తున్నారు. డిజిటల్ వేదికలు విస్తృతం కావడం, స్మార్ట్ఫోన్ల వినియోగం ఊపందుకోవడం హెల్త్ ఇన్సూరెన్స్‌పై అవగాహన పెరగడానికి సాయపడుతున్నాయి. కరోనా మహమ్మారి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అవసరాన్ని తెలిసేలా చేసింది. కానీ, ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో చాలా మందికి రకరకాల సందేహాలున్నాయి. బీమా పాలసీని తీసుకునేందుకు ఇవి అడ్డుపడొచ్చు. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పనిచేసే విధానం, క్లెయిమ్‌కు సంబంధించి కూడా రకరకాల అపోహలు ఉన్నాయి. వీటిని తొలగించుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ తీసుకునేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తారు. ఇలాంటి కొన్ని అపోహలు, వాటికి సంబంధించి వాస్తవాలను నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ ప్రొడక్ట్స్, క్లెయిమ్స్ డైరెక్టర్ బబతోష్ మిశ్రా వెల్లడించారు. ఆస్పత్రిలో చేరి కనీసం 24 గంటల పాటు చికిత్స తీసుకుంటేనే బీమా క్లెయిమ్‌కు అర్హత లభిస్తుందన్నది అపోహే. కానీ వాస్తవం వేరు. ఆధునిక పరిశోధన ఆధారిత ఔషధాలు, అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి రావడంతో చాలా చికిత్సలకు నేడు 24 గంటల పాటు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఏర్పడడం లేదు. వీటిని డే కేర్ ట్రీట్మెంట్స్గా (రోజులో వచ్చి తీసుకుని వెళ్లే వీలున్నవి) చెబుతారు. కీమోథెరపీ, రేడియోథెరపీ, క్యాటరాక్ట్ ఆపరేషన్, కిడ్నీల్లో రాళ్లు తొలగించే సర్జరీ ఇలాంటివన్నీ డేకేర్ ట్రీట్మెంట్స్ కిందకు వస్తాయి. డేకేర్ ట్రీట్మెంట్స్లో చాలా వాటికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో కవరేజీ లభిస్తోంది. కేన్సర్‌కు సంబంధించి ఓరల్ కీమోథెరపీకి అన్ని రకాల ఇండెమ్నిటీ హెల్త్ ప్లాన్లలో కవరేజీ ఉంటోంది. క్లెయిమ్ మొత్తం వస్తుందనుకోవద్దు నియంత్రణ సంస్థ అనుమతి మేరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు వేటికి చెల్లింపులు చేయవో తెలియజేస్తూ ఒక జాబితా నిర్వహిస్తుంటాయి. పీపీఈ కిట్, మాస్క్, బ్యాండేజ్, నెబ్యులైజర్ తదితర ఇలా చెల్లింపులు చేయని వాటి జాబితాను బీమా సంస్థలు పాలసీ వర్డింగ్స్లో ప్రత్యేకంగా పేర్కొంటాయి. అందుకుని ఆస్పత్రిలో అయ్యే బిల్లు మొత్తాన్ని బీమా సంస్థలు చెల్లిస్తాయని అనుకోవద్దు. అయితే, వీటికి కూడా చెల్లింపులు చేసే రైడర్లను కొన్ని బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. రైడర్‌ను జోడించుకుని, కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా డిస్పోజబుల్స్‌కు సైతం క్లెయిమ్ తీసుకోవచ్చు. ఇక పాలసీల్లో మరికొన్ని ఇతర పరిమితులు కూడా ఉంటాయి. కోపేమెంట్, రూమ్‌రెంట్, డాక్టర్ కన్సల్టేషన్ చార్జీల పరంగా చెల్లింపుల పరిమితులు ఉంటాయి. అంటే వీటికి సంబంధించి బీమా సంస్థలు పాలసీ నియమ, నిబంధనల్లో పేర్కొన్న మేరకే చెల్లింపులు చేస్తుంటాయి. కనుక క్లెయిమ్ మొత్తం వస్తుందని అనుకోవద్దు. చెల్లింపుల్లో పరిమితులు ఉంటాయి. ఉదాహరణకు సింగిల్ రూమ్ అని పాలసీ డాక్యుమెంట్లో ఉంటే.. హాస్పిటల్లో సాధారణ సింగిల్ రూమ్‌లో చేరినప్పుడే చికిత్సకు అయ్యే వ్యయాలపై పూర్తి చెల్లింపులు పొందడానికి ఉంటుంది. డీలక్స్ రూమ్/సూట్లో చేరితే అది పరిమితికి మించినది అవుతుంది. దీంతో క్లెయిమ్‌లో కొంత మేర కోత పడుతుంది. దీన్నే రూమ్ రెంట్ క్యాప్ అని కూడా అంటారు. వీటిపై పాలసీదారులు ముందే తగిన అవగాహనతో ఉండాలి. అందుకని కచ్చితంగా పాలసీ డాక్యుమెంట్‌ను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. లేదంటే బీమా సంస్థ కస్టమర్ కేర్ లేదా ఏజెంట్‌ను సంప్రదించాలి. కూలింగ్ ఆఫ్ పీరియడ్ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అన్నది పేషెంట్ కోలుకున్న తర్వాత నిర్ణీత కాలం పాటు అతనికి బీమా సంస్థ కొత్త పాలసీని ఆఫర్ చేయకపోవడం. కానీ, దీన్ని బీమా సంస్థలు కచ్చితంగా ఎత్తివేయాలని పాలసీదారులు భావిస్తుంటారు. అంతేకాదు, బీమా సంస్థలు ఆరోగ్యవంతులు, ఆస్పత్రి అవసరం ఏర్పడని వారికే పాలసీని ఆఫర్ చేస్తాయని అనుకుంటారు. కానీ, ఇది నిజం కాదు. కూలింగ్ ఆఫ్ పీరియడ్ వెనుక ఉన్న తార్కికత ఏమిటంటే.. ఒక ఆరోగ్య సమస్యకు చికిత్స తీసుకున్న తర్వాత ఏవైనా కొత్త సమస్యలు ఏర్పడతాయేమో అంచనా వేసేందుకు కావాల్సిన సమయంగా అర్థం చేసుకోవాలి. కరోనా చికిత్స లేదా సర్జరీ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత పాలసీదారులు మరింత కవరేజీకి అర్హత సాధిస్తారు. వీటిని ముందస్తు నుంచి ఉన్న సమస్యలుగా బీమా సంస్థలు పరిగణించవు. అలాగే క్లెయిమ్ సమయంలో అస్పష్టతను కూడా తగ్గిస్తుంది. ఎక్కడైనా క్యాష్‌లెస్ బీమా క్లెయిమ్ ప్రక్రియను మరింత సులభతరం, పారదర్శకం, సౌకర్యంగా మార్చడంపై బీమా సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. క్లెయిమ్‌ను క్యాష్‌లెస్ (పాలసీదారు చెల్లించాల్సిన అవసరం లేకుండా) లేదా రీయింబర్స్మెంట్ విధానంలో దాఖలు చేసుకోవచ్చు. కానీ, నగదు రహిత చికిత్స సేవలు పొందాలంటే మీరు చేరే హాస్పిటల్.. బీమా సంస్థ క్యాష్‌లెస్ హాస్పిటల్ నెట్‌వర్క్‌లో భాగమై ఉండాలి. ఇలా కాకుండా పాలసీదారు చికిత్స తీసుకుని అందుకు సంబంధించిన మొత్తం వారే చెల్లించి తర్వాత బీమా సంస్థ వద్ద క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. ఇందుకోసం అన్ని రకాల పత్రాలను సమర్పించాలి. అప్పుడే బీమా సంస్థ క్లెయిమ్‌ను ప్రాసెస్ చేయగలదు. క్యాష్‌లెస్ అన్నది సౌకర్యమైనది. దీనివల్ల ఆస్పత్రిలో చేరాల్సి వస్తే చికిత్సకు అయ్యే వ్యయాలను పాలసీదారు సొంతంగా సమకూర్చుకునే ఇబ్బంది తప్పుతుంది. పైగా డిశ్చార్జ్ ప్రక్రియ క్యాష్‌లెస్ విధానంలో సులభంగా పూర్తవుతుంది. బీమా వ్యాపారం అన్నది ప్రజల నిధులతో కూడుకున్నదని అర్థం చేసుకోవాలి. ప్రజల డిపాజిట్లకు సంరక్షకుడిగా బీమా సంస్థ అన్ని రకాల నిజమైన క్లెయిమ్‌లను గౌరవించాల్సి ఉంటుంది. బీమా సంస్థలు పాలసీ డాక్యుమెంట్‌ను అర్థం చేసుకునేందుకు వీలుగా సులభ పరిభాషతో రూపొందిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కొనుగోలుకు ముందు శ్రద్ధగా వీటిని చదవడం వల్ల.. క్లెయిమ్‌ల సమయంలో అనవసర తలనొప్పులను రాకుండా ముందే జాగ్రత్త పడొచ్చు. అధిక కవరేజీ కోసం హెల్త్ చెకప్ పాలసీ జారీ చేసే ముందు అన్ని బీమా సంస్థలూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరడం లేదు. పెద్ద వయసులో ఉన్నారని లేదా అధిక కవరేజీ కోరుతున్నారని వైద్య పరీక్షలు కచ్చితంగా చేయించుకోవాలనేమీ లేదు. ఉదాహరణకు ప్రముఖ హెల్త్ ప్లాన్లు అన్నింటికీ ముందస్తు వైద్య పరీక్షలు అవసరం లేదు. కొన్ని ప్రత్యేక కేసుల్లోనే నిర్ధేశిత వైద్య పరీక్షలను బీమా సంస్థలు కోరుతుంటాయి. దరఖాస్తుదారులకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే లేదా గతంలో ఏవైనా ఎదుర్కోని ఉంటే ప్రస్తుత ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరతాయి. ఇందుకు అయ్యే వ్యయాలను బీమా సంస్థలు పూర్తిగా భరిస్తుంటాయి. -
ఎల్ఐసీ బంపరాఫర్, మరికొన్ని రోజులే..ఈ ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు!
పాలసీ దారులకు ఎల్ఐసీ బంపరాఫర్ ఇచ్చింది. కోవిడ్‌తో పాటు ఆర్ధిక కారణాల వల్ల కట్టలేని పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిచ్చింది. ఆలస్య రుసుము చెల్లించడం ద్వారా ఆగిపోయిన పాలసీలు మళ్లీ పునరుద్ధరించుకోవచ్చని ఇప్పటికే ఎల్ఐసీ అధికారిక ప్రకటన చేసింది. అయితే మరో వారం రోజుల్లో ఎల్ఐసీ ఇచ్చిన అవకాశం ముగియనుండడంతో.. పాలసీ దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎల్ఐసీ కోరింది. కోవిడ్-19 మహమ్మారి లైఫ్ ఇన్సూరెన్స్ అవసరాల్ని గుర్తు చేసింది. అందుకే సకాలంలో బీమా చెల్లించలేని కుటుంబాలకు ఆర్ధిక ప్రయోజనాల్ని కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నాం. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 25లోపు పాలసీదారులు ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్దరించుకునే అవకాశం కల్పిస్తున్నాం' అంటూ ఎల్ఐసీ ప్రకటనలో పేర్కొంది. అయితే ఇచ్చిన గడువు మరో వారం రోజుల్లో ముగుస్తుండగా, అందుకే పాలసీ దారులు పాలసీలను పునరుద్దరించుకోవాలని ఎల్ఐసీ అధికారిక వర్గాలు కోరుతున్నాయి. Press Release - Special Revival Campaign pic.twitter.com/uHIl8YF6OD — LIC India Forever (@LICIndiaForever) February 7, 2022 నిబంధనలకు మేరకు మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుండి ఐదేళ్లలోపు నిర్దిష్ట అర్హత గల ప్లాన్ల పాలసీలను పునరుద్ధరించవచ్చని స్పష్టం చేసింది. చెల్లించే మొత్తం ప్రీమియంలను బట్టి టర్మ్ అస్యూరెన్స్, హై-రిస్క్ ప్లాన్లు కాకుండా ఇతర ఆలస్య రుసుములలో రాయితీలు పొందవచ్చు. వైద్య అవసరాలపై ఎలాంటి రాయితీలు లేవు. అర్హత కలిగిన ఆరోగ్య, సూక్ష్మ-బీమా ప్లాన్లు కూడా ఆలస్య రుసుముతో రాయితీకి అర్హత పొందగలరని పేర్కొంది. రూ.లక్ష వరకు స్వీకరించదగిన మొత్తం ప్రీమియంతో సంప్రదాయ, ఆరోగ్య పాలసీలను ఎల్ఐసీ గరిష్ట పరిమితి రూ.2,000తో ఆలస్య రుసుముతో 20 శాతం రాయితీని అందిస్తోంది. అదేవిధంగా రూ.3 లక్షల కంటే ఎక్కువ ప్రీమియం మొత్తానికి, రూ.3,000 పరిమితితో 30 శాతం రాయితీ అందించబడుతుంది. మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్ల కోసం ఎల్ఐసీ ఆలస్య రుసుములలో పూర్తి రాయితీని అందిస్తోంది. చదవండి: మే 12వరకూ ఎల్ఐసీకి గడువు -
వ్యక్తిగతమా.. గ్రూప్ పాలసీనా...
కోవిడ్–19 రాకతో ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యత గురించి అవగాహన పెరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల అవసరాన్ని గుర్తించి, కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం రకరకాల హెల్త్ పాలసీలు ఉన్నాయి. వీటిలో వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేవి ఎక్కువగా ప్రాచుర్యంలో కనిపిస్తుంటాయి. వీటి గురించి వివరించేదే ఈ కథనం. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్.. సాధారణంగా ఒక గ్రూప్‌గా ఉండే వ్యక్తుల కోసం ఈ తరహా పాలసీలను కంపెనీలు రూపొందిస్తుంటాయి. ఉదాహరణకు ఒకే కంపెనీలో పనిచేసే వ్యక్తుల కోసం ఇలాంటి పాలసీలు ఉంటాయి. పాలసీదారు కుటుంబ సభ్యులకు కూడా చాలా సందర్భాల్లో పాలసీ ప్రయోజనాలను వర్తింపచేసినా .. ఒక్కో సభ్యుడికి ఒక్కో రకమైన కవరేజ్ అంటూ ఉండదు. ప్రాథమికంగా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది.. పాలసీదారులు ప్రమాదం కారణంగానైనా లేదా కోవిడ్–19 సహా ఇతరత్రా ఏదైనా అనారోగ్యంతోనైనా ఆస్పత్రిలో చేరితే కవరేజ్ ఇస్తుంది. ఇలాంటి పాలసీల కోసం బీమా కంపెనీలు మెడికల్ చెకప్ గురించి అడగవు. వ్యక్తిగత పాలసీలతో పోలిస్తే వీటి ప్రీమియంలు తక్కువగానే ఉంటాయి. గ్రూప్ అంగీకరించే కొటేషన్‌ను బట్టి ప్రతీ ఏడాది కవరేజీ మారవచ్చు. ఈ పాలసీల ప్రీమియాన్ని కంపెనీయే భరించవచ్చు లేదా సభ్యుడి నుంచి వసూలు చేయవచ్చు. గ్రూప్‌లో అందరికీ ఒకే రకమైన ప్రయోజనాలు ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్య బీమా.. ఈ పాలసీలను వ్యక్తులు నేరుగా కొనుగోలు చేస్తారు. వివిధ రకాల అస్వస్థతలు, ఆస్పత్రిలో చేరితే అయ్యే ఖర్చులు, ఇతరత్రా చికిత్సాపరమైన ఖర్చుల నుంచి రక్షణ పొందేందుకు .. పాలసీదారు తన అవసరాలకు అనుగుణంగా ఈ పాలసీల కవరేజీని ఎంచుకోవడానికి వీలు ఉంటుంది. జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, అత్త మామలు వంటి మీ మీద ఆధారపడిన వారికి కూడా కవరేజీ లభించేలా దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. పాలసీ తీసుకున్న వ్యక్తి నేరుగా ప్రీమియంను కట్టాల్సి ఉంటుంది. సకాలంలో పునరుద్ధరించుకోకపోతే పాలసీ గడువు ముగిసిపోతుంది. పాలసీ తీసుకునే వ్యక్తికి సంబంధించిన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటారు. అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కూడా బీమా కంపెనీ అడగవచ్చు. ఎవరికి ఏవి అనువైనవంటే.. ప్రీమియంలు చౌకగా ఉండటంతో పాటు యజమానే కడతారు కాబట్టి యుక్తవయస్కులకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అర్థవంతంగానే ఉంటుంది. కానీ కుటుంబ బాధ్యతలు ఉన్నవారు.. తగినంత కవరేజీతో కూడిన వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం. ఒకవేళ సంస్థ నుంచి గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజీ భారీగానే ఉన్నట్లయితే.. గ్రూప్ ఇన్సూరెన్స్ సమ్ ఇన్సూర్డ్‌తో సరిపోయే టాప్–అప్ కవర్ని తీసుకోవచ్చు. ఇది చౌకగానే రావడంతో పాటు మీకు తగినంత స్థాయిలో కవరేజీనీ అందిస్తుంది. కొన్ని కంపెనీలు భవిష్యత్తులో అవసరమైతే టాప్–అప్ను బేస్ కవర్‌గా మార్చుకునేందుకు కూడా అవకాశమిస్తున్నాయి. కాబట్టి హెల్త్ పాలసీని తీసుకునేటప్పుడు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవడం మంచిది. సుధా రెడ్డి, హెడ్ (హెల్త్ విభాగం) డిజిట్ ఇన్సూరెన్స్ -
హెల్త్ క్లెయిమ్ ఇలా కూడా కాదంటారు!
బీమా పాలసీ తీసుకునేదే కష్ట కాలంలో ఆదుకుంటుందన్న భరోసాతో. తీరా బీమా క్లెయిమ్ అవసరం ఏర్పడిన సందర్భంలో.. పరిహారానికి అర్హత లేదంటూ బీమా కంపెనీ మీ క్లెయిమ్‌ను తిరస్కరిస్తే పరిస్థితి ఏంటి..? అందుకే బీమా పాలసీ పత్రంలో అడిగిన ప్రతీ సమాచారం పట్ల పారదర్శకంగా, నిజాయితీగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. పాలసీ పత్రాలపై సంతకం పెట్టేయడం కాకుండా.. అందులోని షరతులు, మినహాయింపులు, నిబంధనలు, పరిమితుల జాబితాను సమగ్రంగా తెలుసుకోవాలి. ఒక్క చిన్న కారణం కనిపించినా.. బీమా సంస్థలు పరిహారానికి నో చెప్పొచ్చు. అందుకే సదా నిక్కచ్చిగా వ్యవహరించాలి ఒక పాలసీదారు బైక్‌ను నడుపుతూ ప్రమాదానికి గురై మరణించడంతో.. అతని కుటుంబం క్లెయిమ్ కోసం దాఖలు చేసుకుంది. సదరు ప్రైవేటు సాధారణ బీమా సంస్థ పరిహారం చెల్లించేందుకు తిరస్కరించింది. దీనికి చూపించిన కారణం.. 346సీసీ బైక్‌ను నడుపుతూ ప్రమాదానికి గురై మరణించడమే. 150సీసీ సామర్థ్యానికి మించి ఇంజన్‌తో కూడిన బైక్‌ను నడుపుతూ ప్రమాదానికి గురైతే పరిహారం బాధ్యత తమపై ఉండదన్న షరతును కూడా సదరు కంపెనీ తమ పాలసీ పత్రాల్లో పేర్కొంది. అయినప్పటికీ పాలసీదారు కుటుంబం చేసిన ప్రయత్నాలు ఫలించి బీమా పరిహారం లభించిందనుకోండి. అందుకే వివిధ బీమా సంస్థలు కొన్ని అరుదైన కారణాలతోనూ పరిహారం చెల్లింపులకు తిరస్కరిస్తున్నాయి. కొత్తగా పాలసీ తీసుకునే వారు, ఇప్పటికే పాలసీ తీసుకున్న వారు వీటిపై అవగాహన కలిగి ఉండడం ఎంతైనా అవసరం. వ్యక్తిగత ప్రమాద బీమా రైడర్‌ను కలిగిన ఒక పాలసీదారు మామిడి చెట్టెక్కి కాయలు కోస్తూ జారి కిందపడి వైకల్యం పాలయ్యాడు. చాలా ప్రమాదకరమైన విన్యాసంగా దీన్ని పేర్కొంటూ సదరు బీమా కంపెనీ తొలుత క్లెయిమ్‌ను తిరస్కరించింది. ప్రమాదకరమైన చర్య కనుక.. పాలసీదారుకు అందులో నైపుణ్యం ఉందా? లేదా అన్నది పరిగణనలోకి రాదని బీమా కంపెనీ పేర్కొంది. ఎందుకంటే శాశ్వత మినహాయింపుల జాబితాలో ఇది కూడా ఉన్నట్టు వివరణ ఇచ్చింది. హజార్డస్ స్పోర్ట్/యాక్టివిటీగా దీన్ని చూపించింది. కాకపోతే తదనంతర పరిణామాలతో బీమా కంపెనీ దిగొచ్చి, క్లెయిమ్‌ను చెల్లించింది. కనుక పాలసీ డాక్యుమెంట్లో పేర్కొన్న ప్రమాదకర విన్యాసాలు, క్రీడల క్లాజ్ గురించి తప్పకుండా పాలసీదారులు ఒకసారి తెలుసుకొని, వాటికి దూరంగా ఉండడం మంచిది. 150సీసీ కంటే అధిక సామర్థ్యంతో కూడిన బైక్‌ను నడపడం ప్రమాదానికి దారితీస్తుందని, అంతకంటే తక్కువ సామర్థ్యం కలిగిన వాహనంతో ప్రమాదం ఉండదని చెప్పగలమా? కానీ కొన్ని బీమా కంపెనీలు ఈ వైఖరినే అనుసరిస్తున్నాయి. 150సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం గల వాహనం నడుపుతున్న సమయంలో ప్రమాదం జరిగింది కనుక పరిహారం చెల్లించబోమంటూ ఒక కేసులో ప్రముఖ సాధారణ బీమా సంస్థ బదులివ్వడం గమనార్హం. ఈ విషయంలో పాలసీదారులు అవగాహన కలిగి ఉండాలి. ‘‘వాస్తవానికి ఏడాది క్రితం వరకు ఎక్కువ ప్లాన్లలో ఈ నిబంధన ఉండేది. కానీ, ఇందులో మార్పు వచ్చింది. అయినప్పటికీ ప్రమాద బీమా ప్లాన్‌ను తీసుకున్న వారు, తీసుకోవాలని అనుకునే వారు పాలసీ డాక్యుమెంట్‌ను ఆసాంతం ఒక్కసారి చదివి ఈ తరహా కొర్రీలేవైనా ఉన్నాయేమో పరిశీలించుకోవాలి. లేదంటే ఆర్థిక సలహాదారు సాయం తీసుకోవాలి’’ అని భేషక్ డాట్ ఓఆర్జీ వ్యవస్థాపకుడు మహావీర్ చోప్రా తెలిపారు. తిరస్కరిస్తే మార్గం ఏంటి? పరిహారం తిరస్కరణకు గురైందని ఆందోళన పడక్కర్లేదు. మీ క్లెయిమ్ నిజాయితీతో కూడినదేనని బీమా కంపెనీని ఒప్పించడం ద్వారా పరిహారం అందుకోవచ్చు. దీనికంటే ముందే బీమా సంస్థ క్లెయిమ్ ఎందుకు తిరస్కరించిందన్నది సరిగ్గా అర్థం చేసుకోవాలి. కారణాలను విశ్లేషించుకోవాలి. మీరు తీసుకున్న పాలసీకి సంబంధించి నియమ, నిబంధనలను, మినహాయింపుల గురించి మరోసారి సమీక్షించుకోవాలి. ఒక్కోసారి దరఖాస్తు, దానికి అనుబంధంగా అందజేసిన చికిత్సా సమాచారం అసంపూర్ణంగా ఉంటే.. అప్పుడు అదనపు పత్రాలను, సమాచారాన్ని ఇవ్వడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. క్లెయిమ్ తిరస్కరణ ముందే బీమా సంస్థ పూర్తి విచారణ చేస్తుంది. అన్ని పత్రాలను పరిశీలించి నిబంధనల మేరకు వ్యవహరిస్తుంది. కానీ, బీమా కంపెనీ పరిహారం చెల్లించకపోవడం వెనుక సహేతుక కారణం లేదని మీరు గుర్తిస్తే బీమా కంపెనీలోని ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని సంప్రదించాలి. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ డెనియల్ అప్పీల్లెటర్ ద్వారా తిరిగి క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. కంపెనీ నిర్ణయం సరైంది కాదంటూ అందుకు మద్దతుగా పత్రాలను సమర్పించాలి. ఒకవేళ టీపీఏ నుంచి తీసుకుంటే వారిని సంప్రదించి, పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. పరిష్కారం లభించకపోతే ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మెన్ కార్యాలయాన్ని ఆశ్రయించొచ్చు. అక్కడ కూడా న్యాయం లభించకపోతే అప్పుడు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార ఫోరమ్ సాయం కోరొచ్చు. చికిత్స కోసం కాకుండా.. ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతూ డాక్టర్ సూచన మేరకు ఆస్పత్రిలో చేరిన అనంతరం.. ఎన్నో రక్తపరీక్షలు, డెంగ్యూ, మలేరియా, కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి కూడా జ్వరానికి కారణాన్ని వైద్యుడు గుర్తించలేకపోయాడని అనుకుందాం. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తర్వాత కోలుకుని పరిహారం కోసం బీమా సంస్థకు క్లెయిమ్ దాఖలు చేసుకుంటే తిరస్కరణకు అవకాశం లేకపోలేదు. ‘యాక్టివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్’ కొనసాగలేదని బీమా సంస్థ ఎత్తిచూపొచ్చు. ఎటువంటి వ్యాధి నిర్ధారణ లేకుండా, వైద్య పరీక్షలు, చికిత్స చేస్తే అందుకు పరిహారాన్ని బీమా సంస్థలు చెల్లించకపోవచ్చు. అంతేకాదు సరైన విధంగా చికిత్స చేయకపోయినా (యాక్టివ్లైన్ ఆఫ్ ట్రీట్మెంట్) పరిహారం ఇవ్వబోవు. ‘‘జ్వరానికి ఔట్ పేషెంట్ కింద చికిత్స చేయవచ్చంటూ కొన్ని క్లెయిమ్‌లను బీమా కంపెనీలు ఆమోదించకపోవచ్చు. ఇది సహేతుకమే. కానీ, ఒక పేషెంట్‌గా వైద్యులు యాక్టివ్లైన్ ట్రీట్మెంట్ను అనుసరిస్తున్నారా? లేదా అన్నది తనకు ఎలా తెలుస్తుంది. ఈ లోపాన్ని పరిహరించాల్సి ఉంది’’ అని ష్యూర్క్లెయిమ్ సీఈవో అనుజ్ జిందాల్ పేర్కొన్నారు. పాక్షిక చెల్లింపులు కరోనా కారణంగా ఎదురైన క్లెయిమ్‌లలో బీమా కంపెనీలు పాక్షిక చెల్లింపులు చేసినవి చాలానే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు లేదా జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ నిర్ణయించిన ధరలకే తాము చెల్లింపులు చేస్తామన్నది బీమా కంపెనీల వాదన. ‘‘ఈ నిబంధన నిజంగా అడ్డంకే. ముఖ్యంగా నాన్ నెట్వర్క్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని రీయింబర్స్మెంట్ చేసుకునే వారికి ఇబ్బందికరం. సహేతుక చార్జీల గురించి పాలసీదారునకు ఎలా తెలుస్తుంది? బీమా సంస్థలే చికిత్సల సాధారణ చార్జీల గురించి పారదర్శకంగా వెల్లడించడం మంచిది’’ అన్నది జిందాల్ అభిప్రాయం. ముంబైకి చెందిన కార్యకర్త గౌరంగ్ దమానీ ఇదే విషయమై లోగడ బోంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడమే కాకుండా.. ఈ నిబంధన ఎత్తివేయాలంటూ ఐఆర్డీఏఐకూ లేఖ రాశారు. క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లు ఎక్కువగా ఫిక్స్డ్ బెనిఫిట్ ప్రయోజనంతో ఉంటాయి. సంబంధిత వ్యాధి నిర్ధారణ అయి నిర్ణీత రోజుల పాటు జీవించి ఉంటే పరిహారం మొత్తాన్ని బీమా సంస్థలు చెల్లిస్తాయి. ముఖ్యంగా కేన్సర్ వంటి చికిత్సల్లో బీమా సంస్థలు పాక్షిక చెల్లింపులే చేస్తున్నాయి. కేన్సర్లను ముందస్తు దశలో గుర్తిస్తే.. 25 శాతం బీమానే అందిస్తున్నాయి. కేన్సర్‌కు సంబంధించి ముఖ్యమైన చికిత్సలకు మాత్రం పూర్తి పరిహారం లభిస్తుంది. మినహాయింపులు పాలసీ పత్రంలో మినహాయింపులను స్పష్టంగా పేర్కొంటారు. ఆ జాబితాలోని వాటికి చికిత్స తీసుకుంటే పరిహారం రాదు. ముందస్తు వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్‌లో పరిహారం రాదు. పాలసీ తీసుకునే నాటికి ఉన్న ఆరోగ్య సమస్యలను వెల్లడిస్తే.. 3–4 ఏళ్ల వెయిటింగ్ తర్వాతే వాటికి కవరేజీ లభిస్తుంది. సకాలంలో ప్రీమియం చెల్లించకపోవడం వల్ల ల్యాప్స్ అయిన పాలసీలకు సంబంధించి కూడా క్లెయిమ్ కోరలేరు. నాన్ నెట్వర్క్ ఆస్పత్రిలో చేరి క్యాష్‌లెస్ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నా, రీయింబర్స్ మెంట్ రూపంలో రావాలని అడగొచ్చు. వాస్తవాలను చెప్పకపోవడం, దాచిపెట్టడం.. బీమా కంపెనీలు పరిహారం చెల్లింపులను తిరస్కరించడానికి చూపించే కారణాల్లో.. పాలసీదారు పూర్తి సమాచారం వెల్లడించకపోవడమే ఎక్కువగా ఉంటోంది. పాలసీ డాక్యుమెంట్‌ను పూర్తిగా చదివేవారు చాలా తక్కువ. ఇదే సమస్యకు కారణం అవుతోంది. ముఖ్యంగా తమ వృత్తి లేదా చేస్తున్న ఉద్యోగం గురించి చెప్పకపోవడం, ఆదాయం, అప్పటికే కలిగి ఉన్న బీమా పాలసీలు, ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలను తెలియజేయకపోవడం వంటివి భవిష్యత్తులో క్లెయిమ్‌లు తిరస్కరణకు దారితీయవచ్చు. ఎందుకంటే పాలసీదారు వెల్లడించే సమాచారం ఆధారంగానే బీమా సంస్థలు రిస్క్‌ను అర్థం చేసుకుంటాయి. ఆ సమాచారం ఆధారంగా భవిష్యత్తులో క్లెయిమ్‌లు ఏ మేరకు రావచ్చన్నది అంచనా వేస్తాయి. తదనుగుణంగా ప్రీమియంను నిర్ణయిస్తాయి. మరి పాలసీ దరఖాస్తులో చెప్పిన సమాచారానికి, పాలసీదారు వాస్తవ ఆరోగ్య పరిస్థితులకు పొంతన లేకపోతే అప్పుడు బీమా సంస్థ ఆ భారాన్ని మోయడానికి అంగీకరించదు. కనుక తప్పనిసరిగా పూర్తి వాస్తవిక సమాచారాన్ని వెల్లడించాలి. కావాలని కాకుండా, అవగాహన లేక వెల్లడించకపోయినా ఆ బాధ్యత బీమా కంపెనీపై ఉండదు. గతంలో ఏవైనా పాలసీల కోసం దరఖాస్తు చేసుకుని, బీమా కంపెనీ నుంచి తిరస్కరణకు గురైనా ఆ సమాచారం కూడా తెలియజేయాల్సి ఉంటుంది. సకాలంలో క్లెయిమ్ దరఖాస్తు అత్యవసరంగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే చేరిన 24 గంటల్లోగా క్లెయిమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎంపిక చేసుకున్న పాలసీ నిబంధనలు, ఎటువంటి చికిత్స కోసం చేరారన్న అంశాల ఆధారంగా ఈ సమయం పరిమితుల్లో మార్పులు ఉండొచ్చు. కానీ, సాధ్యమైనంతగా 24 గంటల్లోపే క్లెయిమ్ దాఖలు చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆలస్యంగా ఈ పనిచేస్తే క్యాష్‌లెస్ క్లెయిమ్ తిరస్కరణకు గురికావచ్చు. దీంతో ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు వెళ్లాల్సి వస్తుంది. ఇందుకోసం ఆస్పత్రిలో చేరకముందు, చేరిన తర్వాత చికిత్సకు సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లు, బిల్లులు జాగ్రత్త చేసుకోవాలి. డిశ్చార్జ్సమ్మరీ తీసుకోవాలి. వైద్య పరీక్షల పత్రాలను కూడా జత చేసి క్లెయిమ్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. పారదర్శకంగా వ్యవహరించాల్సిందే.. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పరిష్కారంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాలంటూ అన్ని బీమా కంపెనీలను బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఇప్పటికే కోరింది. అన్ని దశల్లోనూ పాలసీదారులతో పారద్శకమైన సంప్రదింపులు నిర్వహించాలని ఆదేశించింది. క్యాష్‌లెస్ క్లెయిమ్‌ల పరిష్కారం, పురోగతి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టంగా కోరింది. ఒకవేళ థర్డ్ పార్టీ ద్వారా ఈ సేవలు అందిస్తున్నా కానీ, అన్ని రకాల సంప్రదింపులు పద్ధతి ప్రకారం ఉండాల్సిందేనని ఆదేశించింది. అంతేకాదు, బీమా కంపెనీలు క్లెయిమ్‌లను తిరస్కరించిన సందర్భాల్లో కారణాలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది. -
కేవలం 35 పైసలతో 10 లక్షల ఇన్సూరెన్స్! వివరాలివే..
Indian Railway IRCTC Passengers 10 Lakh Insurance For 35 Paise: దూర ప్రయాణాలు చేసేవాళ్లకు రైల్ రిజర్వేషన్ ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ టికెట్ బుక్ చేసుకోవడం మొదలు.. నచ్చిన సీటును ఎంచుకోవడం, టైంకి తిండి, టైంకి జర్నీ, టాయిలెట్ సౌకర్యం.. ఇలా ఉంటాయి. అదే టైంలో మీ టికెట్ ఛార్జీలో కేవలం35 పైసలకే రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇస్తుందన్న సంగతి మీకు తెలుసా? ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఐటీఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో భారతీయ రైల్వే కేవలం 35 పైసలు.. అదీ జీరో ప్రీమియంతో రైలులో ప్రయాణించే వ్యక్తులకు రూ. 10 లక్షల వరకు బీమా రక్షణను అందిస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగిన పరిస్థితుల్లో ప్రయాణికుల కుటుంబానికి ఆసరాగా నిలబడేందుకు కారుచౌకగా ఈ బీమాను అందిస్తోంది రైల్వే శాఖ. క్లిక్ చేస్తే చాలు! IRCTC ద్వారా మీ రైలు టిక్కెట్‌ను బుక్ చేసేటప్పుడు మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే బీమా కవర్ ఇవ్వబడుతుంది. అదే సమయంలో PNR నంబర్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులందరికీ ఈ బీమా వర్తిస్తుంది. వేటికి వర్తింపు అంటే.. శాశ్వత పాక్షిక వైకల్యం, శాశ్వత వైకల్యం, రైలు ప్రమాదాల సమయంలో ఆసుపత్రి ఖర్చులు, ప్రయాణ సమయంలో మరణం, మృతదేహాల రవాణా కోసం.. వర్తిస్తుంది. ఉగ్రదాడులు, దోపిడీ-దాడులు, కాల్పుల ఘటనలు, ప్రమాదవశాత్తూ రైలు నుంచి కింద పడిపోవడం లాంటి ప్రమాదాలు ఒక కేటగిరీలో, రెండు రైళ్లు ఢీకొట్టినప్పుడు, రైలు ప్రయాణం మొదలైనప్పటి నుంచి గమ్యస్థానం చేరేలోపు రైలు ఎలాంటి ప్రమాదానికి గురైనా ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఎంత బీమా పొందే అవకాశం ఉంటుంది? ఆసుపత్రిలో చికిత్సలకు రూ.2 లక్షల కవరేజీ, శాశ్వత పాక్షిక వైకల్యానికి రూ.7.5 లక్షల కవరేజీ, మృత దేహాలను రవాణా చేసేందుకు రూ.10 వేల కవరేజీ, రైలు ప్రమాదం లేదా రైలు ప్రయాణంలో ఏదైనా అవాంఛనీయ సంఘటన కారణంగా మరణించినా.. శాశ్వతంగా వైకల్యం బారినపడ్డా కూడా రూ.10 లక్షల కవరేజీ వర్తిస్తుంది. ప్రమాదాలు ఎప్పుడు ఎటు నుంచి పొంచి ఉంటాయో ఊహించలేం. కాబట్టి, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా భవిష్యత్తులో కుటుంబాలకు అండగా నిలబడవచ్చు. -
Insurance Policy: ఈ పాలసీలు.. ఎంతో సులభం
బీమా పాలసీల్లోని సదుపాయాలను సులభంగా అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యపడేది కాదు. ఒక్కో కంపెనీ ప్లాన్ భిన్నమైన ప్రయోజనాలు, మినహాయింపులు, షరతులతో ఉంటుంది. కనుక పాలసీదారులు వీటిని అర్థం చేసుకోవడం కష్టమని తెలుసుకున్న బీమా రంగ నియంత్రణ , అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఒకే విధమైన ఫీచర్లతో అన్ని బీమా కంపెనీలు.. ఒకే పేరుతో ఒక ప్రామాణిక పాలసీని ప్రవేశపెట్టాలంటూ ఆదేశాలు తీసుకొచి్చంది. వీటినే స్టాండర్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లుగా పిలుస్తారు. ఆరోగ్య సంజీవని, సరళ్ జీవన్ బీమా, సరళ్ పెన్షన్, సరళ్ సురక్షా ఇలాంటివన్నీ కూడా ప్రామాణిక పాలసీలే. వీటి ప్రీమియంలు అందుబాటు ధరల్లోనే ఉంటాయి. కాకపోతే వీటిల్లో పరిమితులు కూడా ఉంటాయి కనుక అందరికీ కాకుండా.. కొందరికే అనుకూలం. బీమా పాలసీల విషయంలో ‘కరోనా’ఓ కనువిప్పుగానే చూడాలి. ఈ వైరస్ కారణంగా ఆస్పత్రుల పాలై ఆరి్థకంగా చితికిపోయిన వారు ఎందరో ఉన్నారు. అంతేకాదు బీమా రక్షణ లేని కారణంగా మరణించిన వారి కుటుంబాలూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫలితంగా చాలా మంది జీవిత బీమా, ఆరోగ్య బీమా, ప్రమాద మరణం/వైకల్య పరిహార బీమాల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు లేని వారు పాలసీలను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్టాండర్డ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో కవరేజీ, సదుపాయాలు, రైడర్లు బీమా సంస్థలు అన్నింటిలోనూ ఒకే మాదిరిగా ఉంటాయి. ఆరోగ్య సంజీవని పేరుతో హెల్త్ ప్లాన్, సరళ్ జీవన్ బీమా పేరుతో టర్మ్ ప్లాన్.. సరళ్ పెన్షన్ (యాన్యుటీ/పెన్షన్) ప్లాన్, సరళ్ సురక్షా బీమా (వ్యక్తిగత ప్రమాద కవరేజీ) ప్లాన్, కరోనా కవచ్, కరోనా రక్షక్ (కరోనా చికిత్సల ప్లాన్లు), భారత్ గృహ రక్ష (హోమ్ ఇన్సూరెన్స్) ఇవన్నీ స్టాండర్డ్ బీమా పథకాలే. వీటిని ఎంపిక చేసుకోవడానికి ముం దు.. నియమ, నిబంధనలు ఒక్కసారి తెలుసుకోవాలి. ఈ పాలసీలు ఏం ఆఫర్ చేస్తున్నాయి.. ప్రీమియం ఎంతన్నదీ చూడాలి. తమ వ్యక్తిగత, కుటుంబ అవసరాలను తీర్చేవేనా? అన్న పరిశీలన కూడా చేసుకోవాలి. అప్పుడే వీటిపై ఒక అవగాహనకు రావడానికి వీలవుతుంది. సరళ్ జీవన్ బీమా అచ్చమైన టర్మ్ పాలసీ ఇది. పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు జీవించి ఉంటే ఎటువంటి రాబడులను రానటువంటి పాలసీ. పాలసీదారు మరణించిన సందర్భాల్లోనే నామినీకి పరిహారం లభిస్తుంది. వార్షిక ప్రీమియానికి 10 రెట్లు లేదా మరణించే నాటికి చెల్లించిన ప్రీమియంతో కలిపి 105 శాతం, లేదా సమ్ అష్యూరెన్స్ (బీమా కవరేజీ) వీటిలో ఏది ఎక్కువగా ఉంటే ఆ మొత్తం నామినీకి కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ సింగిల్ ప్రీమియం పాలసీలు అయితే చెల్లించిన ప్రీమియానికి 125 శాతం లేదా బీమా కవరేజీ ఈ రెండింటిలో గరిష్ట మొత్తాన్ని చెల్లిస్తుంది. ఐఆర్డీఏఐ మార్గదర్శకాల మేరకు సరళ్ జీవన్ బీమా ప్లాన్‌తోపాటు రెండు రైడర్లను కూడా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ రైడర్, పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇతర టర్మ్ పాలసీలతో పోలిస్తే సరళ్ జీవన్ బీమా ప్లాన్‌లో 45 రోజుల వేచి ఉండే కాల వ్యవధి (పాలసీ జారీ చేసిన తేదీ నుంచి) అమలవుతుంది. కాకపోతే ఈ 45 రోజుల వ్యవధిలో ప్రమాదం కారణంగా మరణిస్తే పరిహారం లభిస్తుంది. ప్రమాదం కాకుండా ఇతర ఏ రూపంలో మరణం సంభవించినా బీమా పరిహారానికి అర్హత లభించదు. కేవలం చెల్లించిన ప్రీమియం వరకే నామినీకి లభిస్తుంది. టర్మ్ పాలసీలు ముక్కుసూటి పథకాలు. ఎటువంటి గందరగోళం లేకుండా జీవితానికి పూర్తి రక్షణ కల్పించేవి. వార్షిక ఆదాయానికి 10–15 రెట్ల వరకు అయినా బీమా పరిహారం కచ్చితంగా ఉండాలన్నది సాధారణంగా అనుసరించే విధానం. కానీ, సరళ్ జీవన్ బీమా ప్లాన్‌ను చాలా కంపెనీలు గరిష్టంగా రూ.25 లక్షలకే ఇస్తున్నాయి. కనుక తక్కువ ఆదాయం ఉన్న వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. మెరుగైన ఆదాయం ఉన్న వారు సాధారణ టర్మ్ ప్లాన్‌ను తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. సాధారణ టర్మ్ ప్లాన్ వ్యక్తి ఆదాయానికి తగినట్టు గరిష్ట కవరేజీతో వస్తుంది. ∙ ఉదాహరణకు.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ సరళ్ జీవన్ బీమా ప్లాన్‌ను 40 ఏళ్ల కాలానికి రూ.25లక్షల కవరేజీతో తీసుకోవాలంటే.. 30 ఏళ్ల వ్యక్తి వార్షికంగా చెల్లించాల్సిన ప్రీమియం సుమారు రూ.12,312 (జీఎస్టీ కాకుండా). అదే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఆఫర్ చేసే ఐప్రొటెక్ట్ స్మార్ట్ టర్మ్ ప్లాన్‌లో రూ.50 లక్షల కవరేజీకి జీఎస్టీ కాకుండా వార్షికంగా చెల్లించాల్సిన ప్రీమియం రూ.9,987. ఈ విధంగా చూసుకుంటే సరళ్తో పోలిస్తే సాధారణ టర్మ్ ప్లాన్‌లో తక్కువ ప్రీమియానికి అధిక కవరేజీ లభిస్తున్నట్టు అర్థం అవుతోంది. ప్రమాదం కారణంగా పాలసీదారు శాశ్వత వైకల్యానికి గురైతే ఆ తర్వాత నుంచి ప్రీమియం చెల్లించకుండా ఉండే ప్రీమియం వైవర్ ఐప్రొటెక్ట్ సస్మార్ట్ ప్లాన్‌లో ఉంది. టర్మ్ ప్లాన్ తీసుకోవాలంటే ఆదాయానికి సంబంధించి రుజువులు కచి్చతంగా ఉండాల్సిందే. కొన్ని రకాల ఉద్యోగాల్లోని వారికి టర్మ్ ప్లాన్‌ను కంపెనీలు ఆఫర్ చేయడం లేదు. కనుక ఇటువంటి వారు సరళ్ జీవన్ బీమాను పరిగణనలోకి తీసుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే పెరుగుతున్న ఆదాయానికి అనుగుణంగా బీమా కవరేజీని కూడా ఎప్పటికప్పుడు పెంచుకోవడం అవసరం. అవసరమైతే ఈ రంగంలో నిపుణుల సలహా తీసుకోవాలి. ఆరోగ్య సంజీవని అన్ని సాధారణ, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ప్లాన్‌ను బేసిక్ పాలసీ కింద ఆఫర్ చేస్తున్నాయి. ఆస్పత్రిలో చేరడం వల్ల ఎదురయ్యే ఖర్చులను ఈ పాలసీ చెల్లిస్తుంది. డేకేర్ ట్రీట్మెంట్లకు (ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేని చికిత్సలు) ఈ పాలసీలో కవరేజీ ఉంటుంది. పాలసీ తీసుకున్న 30 రోజుల వరకు వేచి ఉండే కాలం అమలవుతుంది. అలాగే, కొన్ని వ్యాధులకు పాలసీ అమల్లోకి వచి్చన రెండేళ్ల తర్వాతే కవరేజీ లభిస్తుంది. ఒక పాలసీ సంవత్సరంలో క్లెయిమ్‌లు లేనట్టయితే బోనస్ కూడా ఇందులో అందుకోవచ్చు. అయితే, ఆరోగ్య సంజీవని హెల్త్ ప్లాన్‌లో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. సబ్ లిమిట్స్ ముఖ్యమైనది. ఆస్పత్రిలో గది అద్దె, ఐసీయూ చార్జీలకు ఇందులో పరిమితులు అమలవుతాయి. బీమా సంస్థ నిర్దేశించిన పరిమితులకు మించి గది అద్దె, ఐసీయూ చార్జీలు ఉంటే కనుక అప్పుడు పాలసీదారు మొత్తం బిల్లులో కొంత మొత్తాన్ని తన చేతి నుంచి చెల్లించుకోవాల్సి వస్తుంది. రూ.10 లక్షల కవరేజీతో ఆరోగ్య సంజీవని ప్లాన్ తీసుకున్నా సరే సబ్ లిమిట్స్ కారణంగా పాలసీదారు తనవంతుగా ఎంతో కొంత చెల్లించుకోక తప్పదు. మరో ముఖ్యమైన ప్రతికూల అంశం.. 5 శాతం కోపే నిబంధన ఇందులో ఉంటుంది. అంటే ప్రతీ క్లెయిమ్‌కు 5 శాతాన్ని పాలసీదారు స్వయంగా భరించాల్సి ఉంటుంది. ముందు చెప్పుకున్న సబ్ లిమిట్స్ కారణంగా పాలసీదారు కొంత మొత్తాన్ని సొంతంగా చెల్లించుకోవాల్సిన దానికి ఇది అదనం. సాధారణ హెల్త్ప్లాన్లు నేడు చాలా వరకు సబ్ లిమిట్స్, కోపే లేకుండానే వస్తున్నాయి. ముఖ్యంగా రూమ్‌రెంట్, ఐసీయూ చార్జీల విషయంలో పరిమితుల్లేకుండా ప్లాన్లను బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సంజీవని ప్లాన్‌లో రీస్టోరేషన్ సదుపాయం లేదు. ఆస్పత్రిలో చేరడం వల్ల బీమా కవరేజీ మొత్తం ఒకే విడత ఖర్చయిపోయిందనుకోండి.. అప్పుడు బీమా సంస్థలు అంతే మొత్తం కవరేజీని అదే సంవత్సరానికి రీస్టోరేషన్ కింద పునరుద్ధరిస్తాయి. దీంతో అదే వ్యక్తి మళ్లీ అదే పాలసీ సంవత్సరంలో ఆస్పత్రిలో చేరాల్సి వస్తే (మరో సమస్య వల్ల), లేదా కుటుంబ సభ్యుల్లో వేరొకరు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఎదురైతే రీస్టోరేషన్ అక్కరకు వస్తుంది. వార్షిక ప్రీమియం, సబ్ లిమిట్స్, నో క్లెయిమ్ బోనస్, కోపే, ఏటా ఉచితంగా హెల్త్ చెకప్‌లు, ఓపీడీ చికిత్సలకు కవరేజీ సదుపాయాలను సాధారణ హెల్త్ ప్లాన్లలో చూడొచ్చు. మీ అవసరాలు, ప్రీమియం చెల్లింపుల సామర్థ్యం ఆధారంగా ఆరోగ్య సంజీవని లేదా సాధారణ హెల్త్ ప్లాన్లలో ఏదన్నది నిర్ణయించుకోవాలి. చాలా కంపెనీలు ఆరోగ్య సంజీవని ప్లాన్ ప్రీమియం స్థాయిల్లోనే మరింత మెరుగైన ఫీచర్లతో సాధారణ హెల్త్ ప్లాన్లను (నామమాత్రపు పరిమితులు లేదా పరిమితుల్లేకుండా) ఆఫర్ చేస్తున్నాయి. సరళ్ సురక్షా బీమా ఇది వ్యక్తిగత ప్రమాద బీమా ప్లాన్. అన్ని సాధారణ, హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ప్లాన్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ప్రమాదంలో మరణించినా లేక పూర్తి, పాక్షిక అంగవైకల్యం (శాశ్వతంగా) పాలైన సందర్భంలో ఈ ప్లాన్ కింద నామినీకి పరిహారం లభిస్తుంది. ప్రమాదానికి గురైన తర్వాత 12 నెలల్లోపు మరణించినా కానీ పరిహారానికి అర్హత లభిస్తుంది. ప్రమాదం వల్ల వైకల్యానికి లోనయితే పాలసీ నియమ, నిబంధనలకు అనుగుణంగా పరిహారం చెల్లింపు ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు శాశ్వత అంగవైకల్యం పాలైతే 100 శాతం బీమా పరిహారంగా అందుకోవచ్చు. ప్రమాదం నమోదైన తేదీ నుంచి 12 నెలల్లోపు అంగవైకల్యానికి గురైనా పరిహారం లభిస్తుంది. ఈ ప్లాన్ కింద మూడు రైడర్లను బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. 1. పాక్షిక అంగవైకల్యం కలిగినట్టయితే బీమా కవరేజీ మొత్తంలో 0.2 శాతాన్ని ప్రతీ వారం చొప్పున కంపెనీ చెల్లిస్తుంది. పాలసీదారు తిరిగి పని చేసుకునే స్థితిలోకి వచ్చే వరకు ఈ చెల్లింపులు కొనసాగుతాయి. 2. ప్రమాదం వల్ల ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సల కోసం బీమాలో 10 శాతాన్ని కంపెనీ చెల్లిస్తుంది. 3. పాలసీదారు పిల్లలకు విద్యాసాయం కింద బీమాలో 10 శాతాన్ని (ఒక్కొక్కరికి) ఒకే విడతగా కంపెనీ చెల్లిస్తుంది. కాకపోతే పిల్లల వయసు 25 ఏళ్లు దాటి ఉండకూడదు. రూ.2.5 లక్షల నుంచి రూ.కోటి వరకు బీమాను తీసుకోవచ్చు. సాధారణంగా టర్మ్ ప్లాన్, హెల్త్ ప్లాన్లకు రైడర్లుగా వ్యక్తిగత ప్రమాద బీమా రైడర్లు లభిస్తున్నాయి. కనుక ఎవరైనా కానీ తమ టర్మ్ ప్లాన్ లేదా హెల్త్ ప్లాన్‌తో పాటు వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని ఎంపిక చేసుకుని ఉంటే.. అటువంటి వారు విడిగా సరళ్ సురక్షా బీమాను తీసుకోవాల్సిన అవసరం లేదు. విడిగా ప్రమాద బీమా ప్లాన్ల ప్రీమియం, సదుపాయాలను.. సరళ్ సురక్షా బీమా ప్రీమియం, సదుపాయాలతో పోల్చి చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. వాస్తవానికి సరళ్ సురక్షా బీమా ప్లాన్, స్టాండలోన్ వ్యక్తిగత ప్రమాద బీమా ప్లాన్ ప్రీమియంలు ఇంచుమించు ఒకే స్థాయిలో ఉంటున్నాయి. కనుక సదుపాయాలపై దృష్టి సారించడం అవసరం. ఇప్పటికే సరైన టర్మ్ ప్లాన్‌ను ఒకవేళ మీరు తీసుకుని ఉండి, ఆ ప్లాన్‌కు యాక్సిడెంటల్ డెత్/డిస్‌మెంబర్‌మెంట్ రైడర్ లేనట్టయితే.. అప్పుడు సరళ్ సురక్షా బీమా తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. -
ఇన్సూరెన్స్, అమ్మో..క్లెయిమ్ చేయని మొత్తం ఇన్నివేల కోట్లు ఉందా
2020 డిసెంబర్ 31 వరకూ అందుతున్న సమాచారం ప్రకారం బ్యాంకులు, బీమా కంపెనీల వద్ద క్లెయిమ్ చేయని మొత్తం దాదాపు రూ.49,000 కోట్లని ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ రాజ్యసభకు తెలిపారు. బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని సొమ్ము రూ.24,356 కోట్లని వివరించారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్– ఐఆర్డీఏఐ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు బీమా సంస్థల వద్ద ఉన్న ఈ మొత్తాలు రూ.24,586 కోట్లని (2020 డిసెంబర్ నాటికి) వెల్లడించారు. ఎవ్వరూ క్లెయిమ్ చేయని నిధుల వినియోగానికి 2014లో ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్‌ను ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు వారిలో అవగాహన పెంచడం ఈ ఫండ్ లక్ష్యమన్నారు. ఇక బీమా కంపెనీలు తమ వద్ద గత పదేళ్లుగా క్లెయిమ్ చేయని నిధులను సీనియర్ సిటిజన్ సంక్షేమ నిధికి (ఎస్‌సీడబ్లూఎఫ్) ప్రతి యేడాదీ బదలాయిస్తాయని తెలిపారు. సీనియర్ సిటిజన్ల ప్రయోజనాల పరిరక్షణకు ఈ నిధులను ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. చదవండి : వేల కంపెనీలు మూతపడ్డాయ్, ఏ రాష్ట్రంలో ఎక్కువంటే -
ఎస్బీఐలైఫ్ ఇన్సూరెన్స్, కోవిడ్–19 క్లెయిములు భారీగా పెరిగాయ్
ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నికర లాభం 43 శాతం క్షీణించి రూ. 220 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 390 కోట్లు ఆర్జించింది. కోవిడ్–19 క్లెయిములకు చెల్లింపులు పెరగడం లాభాలను దెబ్బతీసినట్లు కంపెనీ పేర్కొంది. క్యూ1లో 8,956 క్లెయిములు నమోదైనట్లు వెల్లడించింది. ఇవి 2020–21 పూర్తి ఏడాదితో పోలిస్తే దాదాపు 1.3 రెట్లు అధికమని తెలియజేసింది. దీంతో నికర రీఇన్సూరెన్స్ రూ. 570 కోట్లుగా నమోదైంది. ప్రీమియంల తీరు క్యూ1లో ఎస్బీఐ లైఫ్ స్థూల రిటెన్ ప్రీమియం 10 శాతం పుంజుకుని రూ. 8,380 కోట్లను తాకింది. కొత్త బిజినెస్ ప్రీమియం 9 శాతం వృద్ధితో రూ. 3,350 కోట్లకు చేరగా.. వ్యక్తిగత విభాగంలో 37 శాతం అధికంగా రూ. 1,840 కోట్లను తాకింది. కొత్త బిజినెస్ విలువ(వీవోఎన్‌బీ) 52 శాతం జంప్‌చేసి రూ. 390 కోట్లయ్యింది. రూ. 1,390 కోట్ల వ్యక్తిగత రేటెడ్ ప్రీమియంతో కంపెనీ ప్రయివేట్ మార్కెట్లో 18.9 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచినట్లు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వివరించింది. నిర్వహణలోని ఆస్తులు 32 శాతం బలపడి రూ. 2.3 లక్షల కోట్లను తాకగా.. కోవిడ్ సంబంధ క్లెయిముల కోసం రూ. 440 కోట్ల అదనపు రిజర్వులను ఏర్పాటు చేసింది. చదవండి: అదిరిపోయే ఫీచర్లు, మాస్కులోనే మైక్, స్పీకర్లు ఇంకా -
బీమా పాలసీకి బోనస్‌గా బొగ్గు గని షేర్లంటూ రూ.కోటి స్వాహా!
సాక్షి, సిటీబ్యూరో: బీమా పాలసీకి బోనస్‌గా బొగ్గు గనికి సంబంధించిన షేర్లు ఇస్తామంటూ హైదరాబాద్‌వాసికి ఎర వేసిన సైబర్ నేరగాళ్లు రూ.కోటి కొట్టేశారు. ఆరేళ్ల పాటు సాగిన ఈ దోపిడీపై ఎట్టకేలకు బాధితుడు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరంలోని ఆగాపూరకు చెందిన వ్యక్తి కొన్నేళ్లు అసోంలోని గౌహతిలో ఉన్నాడు. 2015లో ఇతడికి చేసి ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు పాలసీ పేరు చెప్పారు. తమ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే రూ.80 లక్షల విలువైన కోల్‌మైన్ షేర్లు ఇస్తామంటూ ఎర వేశారు. అతి తక్కువ కాలంలోనే వాటి విలువ రూ.కోట్లకు చేరుతుందని నమ్మబలికారు. తొలుత ఇన్సూరెన్స్ పాలసీతో పాటు వివిధ పేర్లు చెప్పి రూ.20 లక్షలు కాజేశారు. ఆపై షేర్స్ కేటాయింపు కోసమంటూ కొన్ని పత్రాలు ఆయనకు పంపారు. వీటిని తిరిగి పొందిన తర్వాత ఓసారి ఫోన్ చేసి షేర్ విలువ భారీగా పెరిగిందని చెప్పారు. ఆ డబ్బును ఎన్‌క్యాష్ చేసుకోవడానికి కొన్ని పన్నులు చెల్లించాలంటూ చెప్పి భారీ మొత్తం స్వాహా చేశారు. ఆరేళ్ల కాలంలో మొత్తం రూ.కోటి స్వాహా చేశారు. మరికొన్ని పన్నుల పేరుతో ఇంకా డబ్బు చెల్లించాలని చెప్తుండటంతో అనుమానం వచ్చిన బాధితులు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఏసీపీ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేస్తోంది. -
బీమా పాలసీదారులకు శుభవార్త!
బీమా పాలసీదారులకు శుభవార్త. ఇస్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డిఎఐ), జీవిత బీమా కంపెనీల ముందు కొత్త ముసాయిదా మార్గదర్శకాలను ఉంచింది. ఐఆర్డిఎఐ జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం.. ముందస్తుగా ప్రీమియంలు చెల్లించే వారికి రాయితీలు లేదా వడ్డీ చెల్లిచాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై బీమా సంస్థలతో చర్చించింది. అనేక మంది వివిధ రకాల కారణాలతో ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంను గడువులోగా చెల్లించడంలో ఇబ్బందులు పడుతుంటారు. దీని వల్ల కొన్నిసార్లు మధ్యలోనే పాలసీ రద్దు చేసుకునే అవకాశం ఉంది. అందుకోసమే పాలసీదారులు గడువు కన్నా ముందుగానే ప్రీమియంలు చెల్లించేలా ప్రోత్సహించాలని ఇన్సూరెన్స్ కంపెనీలకు తెలిపింది. దానిలో భాగంగానే సకాలంలో చెల్లించిన వారికీ రాయితీలు ఇవ్వాలని ఐఆర్డిఎఐ పేర్కొంది. దీనివల్ల ఇరువురికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని తెలిపింది. త్వరలోనే ఈ అంశంపై ముసాయిదా సర్క్యులర్ విడుదల కానుంది. చదవండి: పోస్టాఫీస్ జీవిత బీమా పథకాలపై బోనస్ ఇంధన ధరలు తగ్గేది అప్పుడే: ధర్మేంద్ర ప్రధాన్