
కొటక్ జనరల్.. కొత్త ‘ప్రయాణం’
♦ ప్రయాణ బీమాలోకి విస్తరణ...
♦ ఏడాదిలో ప్రొడక్ట్, పబ్లిక్
♦ లయబులిటీ ఇన్సూరెన్స్ కూడా..
♦ 2017 క్యూ1లో రూ.36 కోట్ల వ్యాపారం
♦ దేశంలో రూ.84 కోట్ల వ్యాపారం; తెలంగాణ, ఏపీ వాటా 5 శాతం
♦ కొటక్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ,
♦ సీఈఓ మహేశ్ బాలసుబ్రమణియన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొటక్ మహీంద్రా బ్యాంక్‌కు చెందిన 100 శాతం అనుబంధ సంస్థ కొటక్ జనరల్ ఇన్సూరెన్స్ 2017–18 ఆర్ధిక సంవత్సరంలో ఇతర బీమా విభాగాల్లోకి విస్తరించనుంది. ముందుగా ప్రయాణ బీమా పాలసీలను ఆ తర్వాత ప్రొడక్ట్, పబ్లిక్ లయబులిటీ ఇన్సూరెన్స్, ఇంజనీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ బీమా పాలసీలను ప్రారంభిస్తామని కంపెనీ ఎండీ అండ్ సీఈఓ మహేశ్ బాలసుబ్రమణియన్ చెప్పారు. బుధవారమిక్కడ ‘సాక్షి బిజినెస్’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయనింకా ఏమన్నారంటే..
ఏపీ, తెలంగాణ వాటా 8 శాతం..: 2016–17 ఆర్ధిక సంవత్సరంలో రూ.84 కోట్ల ప్రీమియంలను సమీకరించాం. ఈ ఆర్ధిక సంవత్సరంలో మూడింతల వృద్ధితో రూ.200 కోట్ల ప్రీమియంలను లకి‡్ష్యంచాం. 2017 తొలి త్రైమాసికంలో రూ.36 కోట్ల వ్యాపారాన్ని చేరుకున్నాం. గత ఆర్ధిక సంవత్సరం క్యూ1లో రూ.10.50 కోట్ల వ్యాపారాన్ని చేశాం. మా మొత్తం వ్యాపారంలో మహారాష్ట్ర తర్వాత అతిపెద్ద మార్కెట్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే. ఇక్కడి నుంచి 8 శాతం వ్యాపారం జరుగుతోంది. గతేడాది దేశీయ సాధారణ బీమా పరిశ్రమ 32 శాతం వృద్ధి రేటుతో రూ.1.27 లక్షల కోట్లకు చేరింది.
ఏడాదిలో 10 సంస్థలతో ఒప్పందం..
ప్రస్తుతం వాహన, ఆరోగ్య, గృహ విభాగాల పాలసీలందిస్తున్నాం. దేశవ్యాప్తంగా 1.75 లక్షల పాలసీలుండగా.. రెండేళ్లలో మూడింతల వృద్ధితో 3 లక్షల పాలసీలను లకి‡్ష్యంచాం. ఆన్‌లైన్‌లో పాలసీల కొనుగోళ్ల వాటా 20 శాతం వరకూ వుంటుంది. కొటక్ బ్యాంక్ కస్టమర్లే కాకుండా డిస్ట్రిబ్యూటర్లు, ప్రైవేట్ సంస్థలు, ఇతర బ్యాంకుల నుంచి కూడా మాకు కస్టమర్లున్నారు. వీరి వాటా 35 శాతం వుంటుంది. చెన్నైకు చెందిన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ముంబైకి చెందిన సూర్యోదయ్ ఫైనాన్స్ బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నాం. ఏడాదిలో మరో 10 సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నాం. పలు ఎన్‌బీఎఫ్‌సీలు, గృహ రుణ సంస్థలతో చర్చలు జరుపుతున్నాం.
జీఎస్‌టీ ప్రయోజనం వేచి చూడాలి..
కొటక్ మహీంద్ర బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్, బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 2014లో లైఫ్ ఇన్సూరెన్స్ విభాగంలోకి అడుగుపెట్టాం. ఇప్పటివరకు కొటక్ మహీంద్రా నుంచి రూ.175 కోట్ల నిధులు సమీకరించాం. గతంలో బీమా రంగానికి 15 శాతంగా ఉన్న పన్నులను.. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)లో 18 శాతంలో శ్లాబును కేటాయించారు. దీంతో ప్రీమియం ధరలు కూడా 3 శాతం పెరిగాయి. అయితే పెరిగిన ప్రీమియంల కారణంగా కస్టమర్ల పాలసీ విషయంలో ఎలాంటి మార్పుల్లేవు. దీర్ఘకాలంగా ఎలాంటి ప్రయోజనాలుంటాయో వేచి చూడాలి.