ఆరోగ్య బీమా ఉంటే.. ఎన్ని ప్రయోజనాలో.. | Benefits and Types of Health Insurance | Sakshi
Sakshi News home page

ఆరోగ్య బీమా ఉంటే.. ఎన్ని ప్రయోజనాలో..

Published Mon, Dec 16 2024 1:09 PM | Last Updated on Mon, Dec 16 2024 1:22 PM

Benefits and Types of Health Insurance

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అయితే, ఆసుపత్రుల కార్పొరేటీకరణ కారణంగా దేశీయంగా ఆరోగ్య సంరక్షణ, వైద్య చికిత్స వ్యయాలు పెరిగిపోతున్నాయి. ఇటీవలి నివేదికల ప్రకారం ఆసియా మొత్తం మీద భారత్‌లో ఇందుకు సంబంధించిన ద్రవ్యోల్బణం అత్యధికంగా 14 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో పెరిగే వైద్య చికిత్స వ్యయాల భారాన్ని తట్టుకునేందుకు ఆరోగ్య బీమా అనేది ఎంతగానో ఉపయోగపడే సాధనంగా ఉంటోంది.  

ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం, ఆర్థికంగా ఆదా చేసుకోవడం రెండూ ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ పథకాలు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. పటిష్టమైన ఆరోగ్య బీమా పథకంలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా పాలసీదారులు ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందుకోవచ్చు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక ఆరోగ్య బీమా పథకాలు అనేక ప్రయోజనాలు అందిస్తున్నాయి. వాటిలో కొన్ని:  

నగదురహిత చికిత్స: పాలసీదారులు పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా కేవలం తమ పాలసీ నంబరును ఇచ్చి, వైద్య చకిత్సలు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. మెడికల్‌ ఎమర్జెన్సీల్లో పాలసీదారును ఇబ్బంది పెట్టకుండా బిల్లులను నేరుగా బీమా కంపెనీతో ఆసుపత్రి సెటిల్‌ చేసుకుంటుంది.  

నో క్లెయిమ్‌ బోనస్‌: క్లెయిమ్‌లేమీ చేయని పాలసీదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు చాలా కంపెనీలు నో–క్లెయిమ్‌ బోనస్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి. తదుపరి సంవత్సరంలో ప్రీమియంను తగ్గించడమో లేదా సమ్‌ అష్యూర్డ్‌ను పెంచడం రూపంలోనో ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవన విధానానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి.  

టాప్‌–అప్‌, సూపర్‌ టాప్‌–అప్‌ ప్లాన్లు: బేసిక్‌ సమ్‌ ఇన్సూర్డ్‌ పరిమితి అయిపోతే, అదనంగా కవరేజీని పొందేందుకు టాప్‌–అప్, సూపర్‌ టాప్‌–అప్‌ ఉపయోగపడతాయి. తక్కువ ఖర్చులో అదనంగా కవరేజీని పొందేందుకు ఇవి సహాయకరంగా ఉంటాయి.  

వెల్‌నెస్, ప్రివెంటివ్‌ కేర్‌: బీమా సంస్థలు వెల్‌నెస్, ప్రివెంటివ్‌ కేర్‌పై మరింతగా దృష్టి పెడుతున్నాయి. పాలసీదారులు తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్తపడేందుకు ఈ ప్రోగ్రాంల కింద ఉచితంగా హెల్త్‌ చెకప్‌లు, జిమ్‌ మెంబర్‌షిప్‌లు, డైట్‌ కౌన్సిలింగ్‌ మొదలైనవి అందిస్తున్నాయి. తద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించేలా బీమా సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి.  

అవసరాలకు అనుగుణంగా కవరేజీ: పాలసీదారులు తమ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా కవరేజీని తీసుకునే విధంగా ఆధునిక హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లు ఉంటున్నాయి. వీటికి అదనంగా రక్షణ కోసం రైడర్లను జోడించుకోవడం కావచ్చు లేదా నిర్దిష్ట కవరేజీ ఆప్షన్లను ఎంచుకోవడం కావచ్చు పాలసీదారులకు కొంత వెసులుబాటు ఉంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement