మీ ‘పాలసీ’ ఏంటి..? | Many precautions in taking insurance policy | Sakshi
Sakshi News home page

మీ ‘పాలసీ’ ఏంటి..?

Published Mon, Feb 25 2019 12:38 AM | Last Updated on Mon, Feb 25 2019 5:22 AM

Many precautions in taking insurance policy - Sakshi

ఓ వ్యక్తి జీవితానికి, అతనిపై ఆధారపడిన కుటుంబానికి ఆర్థికపరమైన రక్షణ, భరోసాను కల్పించేది బీమా పాలసీ. ఆర్జనా పరులు, మరొకరికి ఆధారమైన వారు ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకోవడం తప్పనిసరి బాధ్యతలో ఒక్కటి. అయితే, జీవిత బీమా పాలసీ ఎంపికలో చాలా కచ్చితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. సరైన పాలసీ తీసుకోవడం, దీనికి ముందు దృష్టి పెట్టాల్సిన అంశాల గురించి తెలియజేసే కథనమే ఇది.  

టర్మ్‌ – హోల్‌లైఫ్‌ 
నిర్ణీత కాలానికి  (టర్మ్‌) పాలసీ తీసుకోవాలా లేక జీవితాంతం రక్షణనిచ్చే పాలసీ తీసుకోవాలా? అన్నది ముందుగా ఆలోచించుకోవాలి. మరణం సంభవిస్తే కుటుంబానికి బీమా మొత్తాన్ని చెల్లించే టర్మ్‌ పాలసీల ప్రీమియం తక్కువగా ఉంటుంది. తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీ టర్మ్‌ పాలసీల్లో లభిస్తుంది. పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు జీవించినప్పుడు ఆ తర్వాత ఎటువంటి మెచ్యూరిటీ టర్మ్‌ ప్లాన్లలో ఉండదు. కేవలం రక్షణకే ఇవి పరిమితం. దీనికి బదులు పాలసీ కాల వ్యవధి ముగిసిన తర్వాత కూడా జీవితాంతం (80–100 సంవత్సరాల వరకు) రక్షణను హోల్‌లైఫ్‌ పాలసీలు ఇస్తుంటాయి. కానీ, హోల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల్లో ప్రీమియం అధికంగా ఉంటుంది. ఈ పాలసీల్లో పాలసీదారుడు ఎప్పుడు మరణించినా కానీ, పరిహారం లభించే సౌకర్యం ఉంటుంది.  

పెట్టుబడి సాధనం కాదు... 
జీవిత బీమా పాలసీలను సంప్రదాయ పెట్టుబడి సాధనాలుగా చూడకూడదు. ఎండోమెంట్, యులిప్‌ ప్లాన్లు, టర్మ్‌ ప్లాన్లు ఈ మూడు రకాల్లోనూ జీవితానికి రక్షణ ఉంటుంది. అయితే, యులిప్‌ ప్లాన్లు ఈక్విటీ ఆధారిత పెట్టుబడి, బీమా కలగలిపిన సాధనం. ఈక్విటీ మార్కెట్‌ పరిస్థితులపై ఆధారపడి రాబడులు ఉంటాయి. కానీ, జీవిత బీమా అన్నది పెట్టుబడి సాధనం కాదు. అలా చూడడం కూడా సరికాదు. రాబడులే కావాలనుకుంటే అందుకోసం ఇతర పెట్టుబడి సాధనాలను ఎంచుకోవాలి. బీమా రక్షణ కోసం టర్మ్‌ ప్లాన్లను తీసుకోవాలి.  

ప్రీమియం పెంచినా సరే... 
టర్మ్‌ ప్లాన్లు తీసుకునేవారు ప్రీమియం చెల్లించిన తర్వాత వైద్య పరీక్షలకు వెళ్లాలని బీమా సంస్థ కోరుతుంది. వైద్య పరీక్షల అనంతరం ఫలితాల ఆధారంగా రిస్క్‌ ఉందనుకుంటే ప్రీమియాన్ని పెంచుతాయి. అయితే, పెంచిన మేర ప్రీమియం చెల్లించేందుకు ఇష్ట పడక కొందరు వేరే బీమా కంపెనీని ఆశ్రయిస్తుంటారు. కానీ, పెంచిన మేర ప్రీమి యం చెల్లించడం వల్ల వైద్య పరమైన సమస్యలకు సంబంధించిన రిస్క్‌ విషయంలో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఆ మేరకు రిస్క్‌ను బీమా కంపెనీ ప్రీమియం పెంచడం ద్వారా ఆమోదించినట్టు అవుతుంది. భవిష్యత్తులో వైద్య పరమైన సమస్యలతో మరణం సంభవిస్తే... క్లెయిమ్‌ విషయంలో బీమా సంస్థ కొర్రీలు వేయకుండా ఉంటుంది.  

మైనర్‌ పేరిట వద్దు 
కొంత మంది తమ పిల్లల పేరిట బీమా పాలసీలు తీసుకుంటుంటారు. పిల్లలకు ఎటువంటి ఆర్జనా శక్తి ఉండదు కనుక వారి పేరిట బీమా పాలసీ తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. పిల్లలకు బదులు సంపాదనా శక్తి కలిగిన వారి పేరుతో బీమా పాలసీ తీసుకోవాలి. 

పాలసీ డాక్యుమెంట్‌ పరిశీలన 
పాలసీ తీసుకున్నాక చూడాల్సిన అంశాలూ ఉన్నాయి. అందులో పాలసీ డాక్యుమెంట్‌ మీకు చేరిన తర్వాత దాన్ని ఓ సారి పూర్తిగా చదవడం మరవొద్దు. డాక్యుమెంట్‌లోని ప్రతీ కాలమ్‌ను పరిశీలించాలి. అందు లోని వివరాలు మీరు అనుకున్న విధంగానే ఉన్నాయా? అప్పటి వరకు మీకు తెలియని నచ్చని అంశాలు ఏవైనా ఉన్నాయేమో చూడాలి. సమ్‌ అష్యూర్డ్, పాలసీ కాల వ్యవధి, చెల్లించాల్సిన ప్రీమియం, ఎంత కాలానికోసారి ప్రీమియం చెల్లించాలి... ఈ వివరాలన్నీ సరిగానే ఉన్నా యా, లేదా అని చెక్‌ చేసుకోవాలి. ఒకవేళ ఏవైనా తప్పులుంటే వెంటనే వాటి గురించి బీమా సంస్థకు తెలియజేయాల్సి ఉంటుంది. మీ పాలసీ పత్రంలో అన్ని వివరాలు సరిగ్గానే ఉంటే, క్లెయిమ్‌ సమయంలో నామినీకి ఇబ్బందులు ఎదురుకావు. అయితే, పాలసీ పత్రంలో మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు, కాంటాక్ట్‌ సమాచారం, నామినీ పేరు వివరాలు సరిగ్గా ఉండేలా చూసుకోవా ల్సిన బాధ్యత పాలసీదారులపై ఉంటుంది. వివరాల్లో తప్పులు ఉంటే సులభంగానే కరెక్షన్‌ చేసుకోవచ్చు. కాకపోతే వెంటనే ఈ పని చేయాలి. బీమా సంస్థ కస్టమర్‌ పోర్టల్‌లో లాగిన్‌ అయి, మార్పులకు సంబంధించిన రిక్వెస్ట్‌ పెట్టుకోవ చ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా కస్టమర్‌కేర్‌ మెయిల్‌ ఐడీకి మెయిల్‌ చేయవచ్చు. లిఖిత పూర్వకంగానూ తెలియజేయవచ్చు.  

సకాలంలో ప్రీమియం 
ప్రీమియం చెల్లింపు క్రమం కూడా ముఖ్యమే. చాలా మంది వార్షిక ప్రీమియానికి మొగ్గు చూపితే. కొందరు నెలవారీ చెల్లింపు ఎంచుకుంటారు. కొందరు త్రైమాసికం, అర్ధ సంవత్సరం ఆప్షన్‌ ఎంచుకుంటుంటారు. ఎంత కాలానికి ప్రీమియం ఎంత మేర చెల్లింపు సౌకర్యంగా ఉంటుందో చూసి ఎంచుకోవాలి. ఇక, ఆ గడువు నాటికి సకాలంలో ప్రీమియం చెల్లించాలి. దీనికంటే కూడా ఈసీఎస్‌ విధానంలో నేరుగా గడువు నాటికి బ్యాం కు ఖాతా నుంచి ప్రీమియం చెల్లింపు జరిగేలా చూసు కుంటే మరింత సౌలభ్యంగా ఉంటుంది. ఇలా చేయనప్పుడు మర్చిపోయి సకాలంలో ప్రీమియం చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్‌ అవుతుంది. ఆ సమయంలో ప్రాణ ప్రమాదం ఎదురైతే నామినీలకు సమస్యలు తప్పవు. ఇక పాలసీ తీసుకున్నాం పనైపోయిందనుకోవద్దు. ఉద్యోగంలో చేరిన కొత్తలో పాలసీ తీసుకున్న వారు... వివాహం, పిల్లలు పుట్టాక తమ జీవన అవసరాలు, తీసుకున్న రుణాలు, పెరిగిన బాధ్యతలకు అనుగుణంగా బీమా కవరేజీని పెంచుకోవాల్సి ఉంటుంది. అందుకని ఐదేళ్ల కోసారి అయినా సమీక్షించుకుని పాలసీ కవరేజీని పెంచుకోవడం అవసరం.

పాలసీ నచ్చకపోతే తిప్పి పంపొచ్చు 
పాలసీ డాక్యుమెంట్‌ను ఆసాంతం పరిశీలించిన తర్వాత అందులోని నియమ నిబంధనలు అనుకూలంగా లేవని భావిస్తే సంబంధిత పాలసీని తిరిగి వాపసు చేయవచ్చు. ఇందుకు 15–30 రోజుల గడువు ఉంటుంది. ఆన్‌లైన్‌ పాలసీల్లో 30 రోజుల గడువు ఉంటుంది. దీన్నే ఫ్రీ లుక్‌ పీరియడ్‌ అంటారు. ఈ లోపు తగిన కారణాలను పేర్కొంటూ పాలసీని వాపస్‌ చేస్తే బీమా కంపెనీకి చెల్లించిన ప్రీమియంను తిరిగి పొందొచ్చు. వైద్య పరీక్షల వంటివి చేసి ఉంటే, అందుకు అయిన ఖర్చులు, పాలనా ఖర్చులను మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తాయి.

నామినీకి సమాచారం 
నామినీలు సహజంగా జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేదా తల్లిదండ్రులు అయి ఉంటారు. బీమా పాలసీ తీసుకుని, అందులో ఒకరిని నామినీగా పేర్కొన్న వెంటనే, ఆ వివరాలను వారికి తెలియజేయాలి. ఫలానా సంస్థ నుంచి  పాలసీ తీసుకున్నట్టు, అందులో నామినీగా వారి పేరును రిజిస్టర్‌ చేసినట్టు చెప్పాలి. కొన్ని టర్మ్‌ ప్లాన్లు మరణ పరిహారాన్ని ఏక మొత్తంలో చెల్లించడానికి అదనంగా, ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని పదేళ్ల వరకు చెల్లించే రైడర్లతో వస్తున్నాయి. ఈ బెనిఫిట్స్‌ ఏవి ఉన్నా, నామినికీ పూర్తి వివరాలు తెలపడం ఎందుకైనా మంచిది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement