జీవిత బీమా.. రాబడికి కాదు! | Special Article To Life insurance | Sakshi
Sakshi News home page

జీవిత బీమా.. రాబడికి కాదు!

Published Mon, Mar 13 2017 1:03 AM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM

జీవిత బీమా.. రాబడికి కాదు!

జీవిత బీమా.. రాబడికి కాదు!

దాన్ని రిస్క్‌ను తట్టుకునే సాధనంగానే చూడాలి
దానిపై రాబడులొస్తాయని ఇన్వెస్ట్‌ చేయొద్దు
►మామూలు పాలసీలకన్నా టర్మ్‌ పాలసీనే ఉత్తమం
►అతితక్కువ ప్రీమియానికే అత్యధిక కవరేజీ
►మిగిలిన డబ్బు ఇతర ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలకు మళ్లించొచ్చు


జీవిత బీమా అంటే పెట్టుబడి సాధనమా? దాన్ని మన జీవితానికి కవరేజీగా భావించాలా... లేక దానిపై కూడా ఆదాయం వచ్చేలా చూసుకోవాలా? నిజానికి మనలో చాలామందికి ఈ డైలమా ఉంటుంది. దీన్ని ఆసరాగా తీసుకుని కంపెనీలో బోలెడన్ని పాలసీలను మార్కెట్లోకి తెస్తున్నాయి. వాటికి ఏజెంట్లు చాలా అందమైన మాటల్ని ముసుగుగా వేస్తారు. ఫలితం... మనం పడిపోతాం!!. ఇలాంటి పాలసీలు తీసుకునేముందు మిమ్మల్ని మీరు వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే!. మీరు పాలసీ తీసుకుంటున్నది జీవితానికి జరగరానిది జరిగితే తగిన రక్షణ కోసమా? లేక పెట్టుబడికా? పెట్టుబడికైతే మార్కెట్లో బోలెడన్ని సాధనాలున్నపుడు దీన్లో ఎందుకు పెట్టాలి?

రాబడుల్లో బీమా స్థానం చివరే!!
‘‘నెలకు రూ.25,000 ప్రీమియం చొప్పున 20 ఏళ్లు కడితే చాలు... 21వ ఏట నుంచి 16 ఏళ్ల పాటు ప్రతీ నెలా రూ.64,000 చొప్పున చేతికొస్తాయి. ఏటా కొంత మొత్తం పెరుగుతుంది కూడా. పైగా దీనిపై పన్నుండదు. 80 లక్షల బీమా కవరేజీ కూడా లభిస్తుంది’’ ఇవి ఓ బీమా ఏజెంటు వెంకట్‌తో అన్న మాటలు. నెలకు రూ.60 వేలకు పైనే సంపాదించే వెంకట్‌ మనసును ఇవి భలే ఆకర్షించాయి. ఓకే చెప్పేశాడు. జీవితానికి మంచి కవరేజీ, కాల వ్యవధి తర్వాత 16 ఏళ్ల పాటు పన్నులేని చక్కని ఆదాయం పెన్షన్‌లా ఉపయోగపడుతుందని అనుకున్నాడు. పైపెచ్చు ఈ తరహా పాలసీలకు చెల్లించే ప్రీమియంపై ఏటా రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. జీవిత బీమా కవరేజీతో పాటు మెచ్యూరిటీ తర్వాత చేతికొచ్చే ఆదాయంపైనా పన్ను ఉండదు.

 ఈ ఉద్దేశంతోనే ఎక్కువ మంది ఇలాంటి పాలసీలను తీసుకుంటున్నారు. కానీ, సంప్రదాయ బీమా ప్లస్‌ పెట్టుబడి కలిసిన పాలసీల రాబడి సగటున ఏడాదికి 4.8 శాతమే ఉంటుందనే వాస్తవాన్ని గ్రహించాలి. 20 ఏళ్ల కాల వ్యవధిగల పాలసీలపై రాబడులు 4.5–5 శాతం స్థాయిలోనే ఉంటాయి. 25 ఏళ్ల కంటే ఎక్కువ కాల వ్యవధితో కూడిన పాలసీలపై మాత్రం కాస్త మెరుగ్గా 6 శాతం స్థాయిలో ఉంటాయి. కానీ, ఇతర పెట్టుబడి సాధనాలతో పోల్చి చూస్తే ఇంత తక్కువ రాబడులనిచ్చేవి బీమా పాలసీలే అన్నది వాస్తవం. అయితే, బీమా రక్షణ కూడా వస్తోందిగా..? అని వాదించొచ్చు. అంత సుదీర్ఘకాలానికి బీమా రక్షణ, జీవించి ఉంటే రాబడులకు హామీనిచ్చే సాధనం మరొకటి లేదన్నది నిజమే. అయితే, అదే సమయంలో బీమా కవరేజీ కోసం రాబడులను ఎందుకు కోల్పోవాలి? ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయిగా!!.

బీమా రక్షణ తక్కువే
భారీ ప్రీమియం... కవరేజీ మాత్రం స్వల్పం. సంప్రదాయ బీమా పాలసీల తీరు ఇదే. ఉదాహరణకు ఏటా రూ.5 లక్షల ఆదాయం పొందుతున్న ఓ వ్యక్తికి జీవిత బీమా కవరేజీ కనీసం రూ.కోటి అయినా ఉండాలి. ఇందుకు ప్రీమియం 25 ఏళ్ల వయసున్న వ్యక్తికి ఎంత తక్కువగా చూసుకున్నా సంప్రదాయ పాలసీల్లో రూ.5 లక్షల వరకు ఉంటుంది. అదే టర్మ్‌ పాలసీ అయితే రూ.10 వేలలోపు వార్షిక ప్రీమియానికే రూ.కోటి కవరేజీ లభిస్తుంది.

పన్ను ప్రయోజనం పరిమితమే
సంప్రదాయ జీవిత బీమా పాలసీలను తీసుకునే వారిలో చాలా మంది... జీవిత బీమా రక్షణ కంటే కూడా సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపులు పొందేందుకే. నిజానికి సంప్రదాయ బీమా పాలసీలతో వచ్చే పన్ను ప్రయోజం ఇతర సాధనాలతో పోలిస్తే అంత మెరుగ్గా ఏమీ లేదు. ఉదాహరణకు 30 శాతం వార్షిక పన్ను రేటు పరిధిలో ఉన్నవారు బ్యాంకు ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టారనుకుందాం. వడ్డీ ఆదాయంపై పన్ను చెల్లించగా నికరంగా వారికి వచ్చే రాబడి 4.9 శాతం. జాతీయ పొదుపు పత్రాల్లో పెట్టుబడి పెడితే పన్ను అనంతర రాబడి 5.6 శాతం. ఇక ప్రజాభవిష్యనిధి (పీపీఎఫ్‌) అయితే, పన్నులేని 8 శాతం రాబడులను ఇస్తోంది. పదేళ్లలోపు కుమార్తె ఉన్న వారు... సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను రహిత 8.5 శాతం రాబడిని అందుకోవచ్చు. ఇక ఎన్‌పీఎస్, ఈఎల్‌ఎస్‌ఎస్‌ వంటి సాధనాల ద్వారా దీర్ఘకాలంలో ఇంకా అధికంగా రాబడులను అందుకునేందుకూ అవకాశం ఉంది. కాకపోతే ఈ రాబడులకు హామీ మాత్రం ఉండదు. సంప్రదాయ పాలసీకి బదులు బీమా రక్షణ కోసం తక్కువ ప్రీమియంతో ఆఫర్‌ చేసే టర్మ్‌ పాలసీని తీసుకుని, మిగిలిన మొత్తాన్ని పీపీఎఫ్‌ లేదా ఈఎల్‌ఎస్‌ఎస్‌ వంటి సాధనాల్లో మదుపు చేయడం దీర్ఘకాలంలో గరిష్ట రాబడులు అందుకోవచ్చన్నది నిపుణుల అభిప్రాయం.

సంప్రదాయ పాలసీలకే ఆదరణ
వాస్తవాలు ఇలా ఉంటే ఇప్పటికీ జీవిత బీమా కంపెనీలు విక్రయిస్తున్న పాలసీల్లో సింహ భాగం సంప్రదాయ ఎండోమెంట్‌ పాలసీలే ఉంటున్నాయి. బీమా కంపెనీలకు వస్తున్న ప్రీమియం ఆదాయంలో 70 శాతం ఈ పాలసీల నుంచేనని ఓ అంచనా. ఎందుకూ అంటే బీమా కంపెనీలు, ఏజెంట్లు సంప్రదాయ పాలసీల గురించే ఎక్కువగా ప్రమోట్‌ చేయడం. 25 – 30 ఏళ్ల తర్వాత భారీగా వస్తున్న ఆదాయ అంకెలు వారిని ఆకర్షించడం.

ఓ ప్రయోజనం కూడా ఉంది
అయితే, సంప్రదాయ జీవిత బీమా పాలసీలతో ఓ ప్రయోజనం కూడా ఉంది. నిర్బంధ పొదుపు అలవడుతుంది. సంప్రదాయ పాలసీలో చేరిన తర్వాత ప్రీమియం కట్టడం ఆపేస్తే పాలసీ ల్యాప్స్‌ అయిపోతుంది. దాంతో వెనక్కి వచ్చేది నామమాత్రమే. నష్టపోవడం ఎందుకన్న ఉద్దేశంతో ఎక్కువ మంది ప్రీమియం కడుతుంటారు. పైగా ఎక్కువ మంది తక్కువ బీమా రక్షణతో పాలసీలు తీసుకుంటుంటారు. కనుక ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది. అదే మ్యూచువల్‌ ఫండ్స్‌ విషయానికొస్తే చిన్న ఇన్వెస్టర్లు రెండేళ్లలోపే పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసేసుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వైదొలిగే అవకాశం ఉంది గనుక. కానీ, సంప్రదాయ జీవిత బీమా పాలసీల్లో ఇలా వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉండదు కాబట్టి వాటిని కొనసాగిస్తారు. కనుక ఆ మేరకు పొదుపు చేసినట్టే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement