ఫండ్స్‌లో పెట్టుబడులు.. ఈ అంశాలు తప్పనిసరి
నేను ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నాను. నా భార్య సాధారణ గృహిణి, నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. వాయిదాల పద్ధతిలో ఒక బైక్ తీసుకున్నాను. రిటైరైన తర్వాత ప్రశాంత జీవితం కోసం పెన్షన్–బీమా ప్లానుల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా ?
–నరేంద్ర, విశాఖపట్టణం
ఇన్వెస్ట్‌మెంట్ కోసం బీమా పాలసీలను తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. బీమా, ఇన్వెస్ట్‌మెంట్ అవసరాలను విడివిడిగా చూడాలి. బీమా, ఇన్వెస్ట్‌మెంట్ కలగలసిన ప్లాన్‌లు రెంటికి చెడ్డ రేవడి చందంగా ఉంటాయి. ఇవి తగినంత బీమా కవరేజ్‌ను ఇవ్వలేవు. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను కూడా ఇవ్వలేవు. జీవిత బీమా అవసరాల కోసం ఒక టర్మ్ పాలసీ తీసుకోవాలి. రిటైరైన తర్వాత ప్రశాంత జీవనం కోసం ఒక నిధిని ఇప్పటినుంచే ఏర్పాటు చేసుకోవాలనుకోవడం మంచి ఆలోచన. దీని కోసం మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలి. రిటైర్మెంట్, సొంత ఇల్లు సమకూర్చుకోవడం, పిల్లల ఉన్నత చదువు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఒకటి లేదా రెండు డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకొని వాటిల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందగలరు. మీరు ఎంచుకోవడానికి కొన్ని ఫండ్స్‌ను సూచిస్తున్నాం. బిర్లా సన్‌లైఫ్ ఈక్విటీ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా హై గ్రోత్ కంపెనీస్ ఫండ్, ఐసీఐసీఐ ప్రు వేల్యూ డిస్కవరీ ఫండ్, మిరా అసెట్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, ఎస్‌బీఐ బ్లూ చిప్ ఫండ్, ఎస్‌బీఐ మ్యాగ్నమ్ మిడ్‌క్యాప్ ఫండ్, కోటక్ ఆపర్చునిటీస్ రెగ్యులర్ ఫండ్, డీఎస్‌పీ బ్లాక్‌రాక్ ఫోకస్ 25 ఫండ్.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. తొలిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
–ఇస్మాయిల్, వరంగల్
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం మంచి నిర్ణయమే. సంపద సృష్టికి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఒక మంచి మార్గం. సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైరైన తర్వాత ప్రశాంత జీవనం గడపడం కోసం తగిన రిటైర్మెంట్ నిధిని ఏర్పాటు చేసుకోవడం, పిల్లల ఉన్నత చదువులు.. తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులే పొందవచ్చు. ఇక తొలిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మూడు ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. మొదటిది పన్ను ఆదా చేసే ఫండ్స్(ఈ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్ మూడేళ్ల పాటు లాక్–ఇన్ అయి ఉంటాయి) లేదా బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. రెండోది ఎప్పుడూ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకూడదు. సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు వస్తాయి. ఇక మూడోది కనీసం మూడు నుంచి ఐదేళ్ల పాటు తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయాలి. ఈ మూడు విషయాలను మీరు అనుసరించకపోతే, కొత్త ఇన్వెస్టర్లకు నష్టాలు వచ్చే అవకాశాలే అధికంగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను అధిక ధరల్లో కొనుగోలు చేసి, తక్కువ ధరల్లో విక్రయించాల్సి రావచ్చు.
నేను సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాను. నా భార్య గృహిణి, వడ్డీరేట్లు దిగివచ్చినందున పెద్ద మొత్తంలో గృహ రుణం తీసుకోవాలనుకుంటున్నాను. ఒక మిత్రుడు 8.6 శాతం వడ్డీకే ఒక సంస్థ నుంచి గృహ రుణం ఇప్పిస్తానని అంటున్నాడు.ఈఎంఐ నా ఆదాయంలో 60 శాతం వరకూ ఉండొచ్చు. తగిన సలహా ఇవ్వండి.
–రవీందర్, హైదరాబాద్
గృహరుణాలపై వడ్డీరేట్లు తగ్గినందున గృహ రుణం తీసుకోవాలనుకోవడం మంచి నిర్ణయమే. 8.6 శాతం వడ్డీకి గృహరుణం తీసుకోవడం.. ఖరీదైన అప్పు కాదని చెప్పవచ్చు. అయితే మీ మొత్తం ఆదాయంలో 60 శాతం వరకూ ఈఎంఐ (సమాన నెలసరి వాయిదా) కింద చెల్లించడం సరైనది కాదు. మీ ఉద్యోగానికి సంబంధించి ఏమైన అనిశ్చితి తలెత్తిన పరిస్థితుల్లో పరిస్థితులన్నీ తల్లకిందులవుతాయి. అందుకని రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. మీ మొత్తం ఆదాయంలో మీరు చెల్లించాల్సిన ఈఎంఐ మూడోవంతుకు మించకుండా ఉండేలా చూసుకోవడం ఉత్తమం. ఇలా ఉంటే అన్ని విషయాలూ మీ నియంత్రణలోనే ఉంటాయి.
నేను ఇటీవలే రిటైరయ్యాను. వడ్డీరేట్లు పడిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాదికి 9–10 శాతం డివిడెండ్ ఇచ్చే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పటికే నేను హెచ్‌డీఎఫ్‌సీ ప్రుడెన్స్ ఫండ్‌లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నాను. తగిన సలహా ఇవ్వండి.
–జాన్సన్, విజయవాడ
ఇన్వెస్ట్‌మెంట్స్‌పై రాబడులు పెంచుకోవాలంటే మీరు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. గత రెండేళ్లలో ఈక్విటీ మార్కెట్ మంచి పనితీరు కనబరిచింది. దీంతో బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ మంచి రాబడులనిచ్చాయి. అయితే అన్ని రోజులూ ఇలాగే ఉంటాయని లేదు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులమయంగా ఉంటుంది. మార్కెట్ పడిపోతే మీ పెట్టుబడుల విలువ తగ్గిపోతుంది. రిటైరైన తర్వాత రెగ్యులర్ ఆదాయం మీకు అవసరముంటుంది. ఇందుకోసం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఫండ్స్ వంటి స్థిర ఆదాయాన్నిచ్చే సాధనాలపై ఆధారపడి ఉండాల్సి ఉంటుంది.