
ఆస్తులకు ధీమా... అవసరానికో బీమా!
• జీవిత బీమా, వైద్య బీమా కొంత తప్పనిసరే
• వాహనం, గృహ రక్షణకు వివిధ పాలసీలు
• చిన్న వయసులో తీసుకుంటే తక్కువ ప్రీమియం
• ఆన్‌లైన్లో తీసుకుంటే ఇంకాస్త చౌక
ఉండటానికి ఇల్లుండాలి. రాకపోకలకు వాహనం ఉండాలి. అవసరమైతే ఆసుపత్రికీ వెళుతుండాలి. కాకపోతే... ఇవన్నీ ఉన్నా వీటిని కవర్ చేయడానికి బీమా పాలసీలుండటం చాలా ముఖ్యం. ఎందుకంటే వీటిలో ఏ ఒక్కదాన్లో తేడా వచ్చినా భరించటం మన వల్ల కాదు కాబట్టి!! సంపాదించే వ్యక్తికి జీవిత బీమా, వైద్య, వాహన, యాక్సిడెంట్, గృహ బీమా పాలసీలు ఎంత తప్పనిసరో వివరించేదే ఈ ప్రాఫిట్ కథనం...
(సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం)
చాలామంది బీమా అంటే డబ్బులు వృ«థా చేయడమనుకుంటారు. పాలసీలకు చెల్లించే ప్రీమియంలను వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చని భావిస్తారు కూడా. కానీ అనుకోనిదేదైనా జరిగితే!!? సంపాదించే వ్యక్తికి దురదృష్టవశాత్తూ ఏదన్నా జరిగితే? అప్పుడు ఆ కుటుంబం స్థితిగతులు పూర్తిగా తల్లకిందులవుతాయి. సంపాదించే వ్యక్తి ఏదైనా యాక్సిడెంట్‌కు గురై, అంగ వికలుడైతే కుటుంబ జీవనోపాధి దెబ్బతింటుంది. ఏదైనా పెద్ద జబ్బు బారిన పడితే అప్పటివరకూ దాచుకున్నదంతా ఆసుపత్రికి ధారపోయాల్సి ఉంటుంది. చికిత్స కోసం 3–4 రోజులు హాస్పిటల్‌లో ఉంటే, ఆ ఖర్చు పదేళ్ల వైద్య బీమా ప్రీమియంలతో సమానంగా ఉంటుంది.
ఆన్‌లైన్లో కాస్త చౌకే!
మానసిక ప్రశాంతత కోసం మీరు ఎంత వెచ్చించాల్సి ఉంటుందంటే... మహా అయితే 35 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.2,000–3,000 వరకూ!! అది చేస్తే తన కుటుంబ ఆర్థిక భవిష్యత్తు పట్ల భరోసాగా ఉండొచ్చు. ఒక వ్యక్తి తప్పనిసరిగా తీసుకోవలసిన ఐదు బీమా పాలసీలకు నెలవారీ అయ్యే ఖర్చు ఇది. ఈ పాలసీలన్నీ చౌకైనవి. కమిషన్ తక్కువగా వస్తుంది కాబట్టి వీటిని విక్రయించడానికి ఏజెంట్లు ఆసక్తి చూపరు. అయితే ఈ పాలసీలకు ఏజెంట్ల బెడద లేదు. వీటిల్లో ఎక్కువ భాగం ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయవచ్చు. ఏజంట్ల ద్వారా కొనటం కన్నా ఆన్‌లైన్లో కొంటే కాస్తంత చౌక కూడా!!.
జీవిత బీమా తప్పనిసరి...
ఒక వ్యక్తి వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్లు బీమా అవసరమనేది సాధారణ లెక్క. ఇది అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని వేసిన అంచనా. సంపాదించే వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణిస్తే, ఆ వ్యక్తి తీర్చాల్సిన అప్పులు పోగా ఆ కుటుంబం సాఫీగా గడవటానికయ్యే ఖర్చులన్నీ కవరయ్యేలా ఈ బీమా ఉండాలి. దీనికి టర్మ్ బీమా పాలసీలు ఉత్తమం. వీటి ద్వారా తక్కువ ప్రీమియం కే ఎక్కువ బీమా రక్షణ పొందవచ్చు. 30 ఏళ్ల వ్యక్తి రూ.కోటికి బీమా తీసుకుంటే ఆ వ్యక్తి చెల్లించాల్సిన ప్రీమియం ఏడాదికి రూ.10,000 మాత్రమే. అంటే ఒక్క రోజుకు రూ.28 మాత్రమే ఖర్చవుతుంది.
రకరకాల టర్మ్ ప్లాన్‌లు..
బీమా కంపెనీలు వినియోగదారులు, పరిస్థితులకు తగ్గట్లుగా వివిధ రకాలైన టర్మ్ పాలసీలను అందిస్తున్నాయి. ఏటా పెరిగే ద్రవ్యోల్బణానికి తగ్గట్టు బీమా కవరేజీ ఉండే టర్మ్ ప్లాన్‌లూ అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఏటా ప్రీమియం చెల్లించడం తలనొప్పి అనుకుంటే ఒకేసారి ప్రీమియం చెల్లించి ఊరుకునే సింగిల్ టర్మ్ ప్లాన్‌లు కూడా ఉన్నాయి. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే, ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వకుండా 10–15 ఏళ్లపాటు నెలవారీగా చెల్లించేవి... టర్మ్ పూర్తయ్యాక మీరు చెల్లించిన ప్రీమియంలు పూర్తిగా వెనక్కి ఇచ్చే టర్మ్ ప్లాన్‌లు... ఇలా చాలానే ఉన్నాయి. కాకపోతే వీటికి ప్రీమియం కొం చెం ఎక్కువ.
ప్రీమియం, బీమా రక్షణ తర్వాత బీమా పాలసీ కాల వ్యవధే కీలకం. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 20 సంవత్సరాల కాలానికి టర్మ్ పాలసీ తీసుకున్నాడనుకుందాం. అతడు చెల్లించాల్సిన ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. కానీ అతడికి బీమా అవసరాలు అధికంగా ఉన్న వయస్సులోనే ఈ ప్లాన్ ముగిసిపోతుంది. ఆ వయస్సులో కొత్త పాలసీ తీసుకోవాలంటే ఖర్చులు తడిసిమోపెడవుతాయి. అప్పు డు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే, బీమా నిరాకరించే అవకాశాలూ ఉంటాయి. అందుకని 50 ఏళ్లు వచ్చే సమయంలో ముగిసే బీమా పాలసీలు కాకుండా 60–65 ఏళ్ల వయస్సులో ముగిసే పాలసీలు తీసుకోవడం ఉత్తమం. చిన్న వయసులోనే బీమా పాలసీ తీసుకుంటే, ప్రీమియం తక్కువగా ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ వివిధ స్థాయిల్లో బీమా రక్షణను సమీక్షించాల్సిన అవసరం కూడా ఉంది.
గ్రూప్ బీమా కవరేజ్ ఉన్నాసరే..
కొంతమంది తమకు కంపెనీ గ్రూప్ బీమా కవరేజ్ ఉందని వైద్య బీమా పాలసీలు తీసుకోరు. ఇవి ఉండడం మంచిదే అయినా, ఇవి సరిపోవని గ్రహించాలి. వీటికి మినహాయింపులు, షరతులు అధికంగా ఉంటాయి. మీరు ఉద్యోగిగా ఉన్నంతవరకూ అవి వర్తిస్తాయి. మీరు ఉద్యోగం మానేస్తే ఈ బీమా రక్షణ లభించదు. అందుకని సొంతంగా వైద్య బీమా పాలసీ తీసుకోవడం తప్పనిసరి. మీకు గ్రూప్ బీమా కవరేజ్ ఉంటే. ఈ బీమా కవర్‌ను మరింతగా పెంచుకోవాలనుకుంటే, టాప్ అప్ ప్లాన్‌లు తీసుకోవచ్చు. వ్యయాలు ఒక పరిమితికి మించితేనే ఇవి వర్తిస్తాయి. కాబట్టి ఇవి చౌకగా ఉంటాయి. ఉదాహరణకు మీకు గ్రూప్ కవర్ రూ. 3 లక్షలు ఉందనుకుందాం. మీరు రూ.2 లక్షల టాప్ అప్ ప్లాన్‌ను రూ.2 లక్షల పరిమితితో కొనుగోలు చేస్తే, . మీ వైద్య ఖర్చులు రూ.2 లక్షల వరకూ గ్రూప్‌కవర్ భరిస్తుంది. రూ.2 లక్షలను మించితే టాప్‌అప్ ప్లాన్ వర్తిస్తుంది.
అదనంగా... ప్రమాద బీమా
భారత్‌లో యాక్సిడెంట్లు అధికం. యాక్సిడెంట్ కారణంగా తాత్కాలిక లేదా శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే, ఈ పాలసీ ఆదుకుంటుంది. అందుకని యాక్సిడెంట్ డెత్ అండ్ డిజేబిలిటీ కవర్ ముఖ్యమైన మూడో బీమా పాలసీ. యాక్సిడెంట్ కారణంగా మరణం సంభవిస్తే పాలసీ తీసుకున్న వ్యక్తి నామినీకి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తారు. అంగవైకల్యం సంభవిస్తే బీమా సంస్థ తగిన మొత్తంలోనే పాలసీ తీసుకున్న వ్యక్తికి సొమ్ములు చెల్లిస్తుంది. యాక్సిడెంట్ కారణంగా పనులు చేసుకోలేని పరిస్థితుల్లో నెలవారీ ఆదాయం కావాలనుకుంటే, అదనపు కవర్‌తో కూ డిన పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి.
కలల ఇంటికి రక్షణ... హోమ్ ఇన్సూరెన్స్
మనిషికి అత్యంత ఖరీదైన ఆస్తుల్లో ఇల్లొకటి. ఈ విషయం అర్థం చేసుకున్న కొద్దిమంది మాత్రమే హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. డ్యామేజీ జరగకుండా రక్షణ కోసం రూ.లక్షకు రూ.40 కనిష్ట ప్రీమియంతో ఈ తరహా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. మీ ఇల్లు ఎంత విలువైనదో అంత మొత్తానికి పాలసీ తీసుకోనక్కర్లేదు. పునర్నిర్మాణానికి అయ్యే విలువకే బీమా తీసుకోవాలి. ఉదాహరణకు వెయ్యి చదరపు అడుగుల ఇంటికి రూ.18–30 లక్షల పాలసీకి బీమా చేయిస్తే, ఏడాదికి చెల్లించాల్సిన ప్రీమియమ్ రూ.800–2,400 రేంజ్‌లో ఉంటుంది. వీటిల్లో ఫైర్, ఇతర పాలసీలు కూడా ఉంటాయి. కానీ సమగ్రమైన ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడమే ఉత్తమం. ఇంట్లో ఉండే ఖరీదైన వస్తువులకు కూడా బీమా కవర్ తీసుకోవచ్చు. సహజ, మానవ ఉత్పాతాల కారణంగా పాడయ్యే వస్తువుల రక్షణకోసం ఈ పాలసీలు తీసుకోవచ్చు. రూ.పది లక్షల విలువైన వస్తువుకు ఏడాది ప్రీమియం కనిష్టంగా రూ.255 ఉంటుంది. దోపిడీ, తదితర విధ్వంసాల రక్షణకు కూడా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.
వాహన బీమా తప్పనిసరి కూడా!!
మీ వాహనాలకు బీమా కవర్ తీసుకోవడం ముఖ్యమైనదే కాదు... తప్పనిసరి కూడా. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే... రిపేర్లకు అయిన బిల్లులను బీమా కంపెనీ భరిస్తుంది. బీమా ఉన్న వాహనానికి యాక్సిడెంట్ అయితే, యాక్సిడెంట్‌కు గురైన వ్యక్తికి పరిహారం కూడా బీమా సంస్థే చెల్లిస్తుంది. ఒక్కోసారి ఈ పరిహారం లక్షల్లో ఉండొచ్చు. అన్ని వాహనాలకు థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. యాక్సిడెంట్‌లో గాయాలైనా, ఎవరైనా చనిపోయినా, అపరిమిత బీమా రక్షణ ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ధర్డ్ పార్టీ ప్రీమియమ్‌లు పెరిగాయి. ఏడాదికి ఇవి రూ.2,000 రేంజ్‌లో ఉంటాయి. తమ వాహనం పాతదైపోయిందంటూ చాలా మంది బీమా పాలసీ తీసుకోవడం నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది ఖరీదైన తప్పు అని చెప్పవచ్చు. దొంగతనం, డ్యామేజ్‌ల కోసం బీమా పాలసీలు తీసుకోకపోయినా, థర్డ్ పార్టీ లయబిలిటీ పాలసీ మాత్రం తీసుకుంటేనే మేలు. ఈ లయబిలిటీపై పరిమితి విధించాలని సాధారణబీమా కంపెనీలు ఎన్నో ఏళ్లుగా లాబీయింగ్ చేస్తున్నాయి. వచ్చే ప్రీమియం కంటే చెల్లించే పరిహారమే అధికమని ఈ సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి.
వైద్య ఖర్చులకు బీమా మార్గం!
జీవిత బీమా పాలసీ తర్వాత తీసుకోవలసిన ముఖ్యమైన పాలసీ వైద్య బీమా. కొందరైతే జీవిత బీమా కంటే వైద్య బీమాయే ముఖ్యమని కూడా అంటారు. ఎందుకంటే వైద్య ఖర్చులే భారీగా పెరుగుతున్నాయి. 3–4 రోజులు ఆసుపత్రిలో ఉంటే కనీసం రూ.50,000–60,000 ఖర్చు అవుతోంది. అయితే ఏడాదికి వైద్య బీమా వ్యయం రూ.10,000–15,000 రేంజ్‌లోనే ఉంటుంది. ఆదాయపు పన్నును పరిగణనలోకి తీసుకుంటే 30 శాతం పన్ను పరిధిలో ఉన్నవారికి వైద్య బీమా వ్యయం ఏడాదికి రూ.7,000–10,500 రేంజ్‌లోనే ఉంటుంది. మా పాలసీ తీసుకుంటే బోలెడు ప్రయోజనాలంటూ చాలా బీమా కంపెనీలు ఊదరగొడుతుంటాయి.
ప్రయోజనాలున్న స్థాయిలో మినహాయింపుల కూడా ఉంటాయి. మనకు అవసరం లేని ప్రయోజనం కోసం ఎక్కువ మొత్తం చెల్లించాల్సి రావచ్చు. వైద్య బీమా పాలసీల డాక్యుమెంట్లు చిత్ర విచిత్రమైన న్యాయపరమైన, వైద్య పరమైన పదబంధాలతో మనల్ని అయోమయానికి గురి చేస్తాయి. అందుకని నగదు రహిత, లేదా వైద్య సేవలనంతరం వ్యయాలను రీయింబర్స్ చేసే సాదా సీదా ఇండెమ్నిటీ పాలసీ తీసుకోండి. అదనపు బీమా కవర్ కావాలనుకుంటే, సంబంధిత ప్రయోజనాలందించే పాలసీని ఎంచుకోండి. కుటుంబంలో పెద్దలుంటే వారికోసం ప్రత్యేకమైన పాలసీ తీసుకుంటేనే మంచిది.