
న్యూఢిల్లీ: కార్తీక్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఒక కారు, ఒక బైక్ ఉన్నాయి. నిత్యం కార్యాలయానికి కారులో వెళుతుంటాడు. ఇతర పనులకు బైక్ ఉపయోగిస్తాడు. దీంతో అతడు రెండింటికీ వేర్వేరు మోటారు బీమా పాలసీలను తీసుకుని ఉంటాడు. ఇకపై ఒక్కటే ఫ్లోటర్ పాలసీ తీసుకోవచ్చు. పైగా ప్రీమియం కూడా తక్కువకే వస్తుంది. ఎందుకంటే అతడు బైక్ వాడేది చాలా తక్కువ.
పైగా కార్యాలయం కూడా 8 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అలా చూసుకుంటే కారు వినియోగం కూడా తక్కువే. పైగా ఏకకాలంలో రెండు వాహనాలను వినియోగించడం అసాధ్యం. అందుకే అతడికి గతంతో పోలిస్తే ఇక మీదట ప్రీమియం చాలావరకు తగ్గనుంది. ఈ తరహా సంస్కరణలకు వీలు కల్పిస్తూ.. మోటారు ఇన్సూరెన్స్ పాలసీలకు అధునాతన ఫీచర్లతో కూడిన యాడాన్‌లను ప్రవేశపెట్టేందుకు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) అనుమతించింది.
కొత్త యాడాన్‌లు..: మోటారు ఓన్ డ్యామేజ్ (ఓడీ) అన్నది బేసిక్ మోటారు బీమా ప్లాన్. ఇందులో వాహనానికి ఏదైనా కారణం వల్ల నష్టం ఏర్పడితే కవరేజీ ఉంటుంది. ఇప్పుడు దీనికి ‘పే యాజ్ యూ డ్రైవ్, పే హౌ యూ డ్రైవ్’ అనే కాన్సెప్ట్ తోడు కానుంది. వాహనాన్ని నడిపిన మేరకు, నడిపే తీరుకు అనుగుణంగా బీమా సంస్థ టెక్నాలజీ సాయంతో ప్రీమియాన్ని నిర్ణయిస్తుంది.
ఉదాహరణకు తక్కువ దూరం నడిపేవారికి తక్కువ ప్రీమియం, ఎక్కువ దూరం నడిపేవారికి కొంచెం ఎక్కువ ప్రీమియం ఇలా అన్నమాట. లేదంటే తక్కువ దూరం, సురక్షిత డ్రైవింగ్ విధానాన్ని అనుసరించే వారికి తక్కువ ప్రీమియానికే మరింత కవరేజీ లభించొచ్చు. అలాగే, ఒకే వాహనదారుడికి ఒకటికి మించిన వాహనాలు ఉంటే అన్నింటికీ కలిపి ఫ్లోటర్ పాలసీ జారీ చేసేందుకు కూడా ఐఆర్‌డీఏఐ అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment