సిగరెట్లు తాగినా... ఆ విషయం దాచొద్దు
మల్టీ నేషనల్ కంపనీలో పనిచేసే రమేష్... వారాంతాల్లో పార్టీలకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు సిగరెట్లు కాలుస్తుంటాడు. తాను రెగ్యులర్‌గా సిగరెట్లు తాగడు కనక అదేమీ పెద్ద విషయం కాదనుకుని, ఆ వివరాల్ని బీమా పాలసీ తీసుకున్నప్పుడు పేర్కొనలేదు. ఇలా అప్పుడప్పుడు సిగరెట్లు కాల్చే చాలామంది ఆలోచన విధానం ఇదే విధంగా ఉంటుంది. కానీ బీమా పాలసీ తీసుకునేటప్పుడు మాత్రం సిగరెట్ కాల్చే అలవాటు గురించి మాత్రం తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే ఇప్పుడు బీమా కంపెనీలు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాయి. దీన్ని బట్టే మీరు చెల్లించే ప్రీమియాన్ని కూడా నిర్దేశిస్తున్నాయి.
ముఖ్యంగా ఆన్‌లైన్‌లో టర్మ్ పాలసీలను పోటీ పడి మరీ తక్కువ ప్రీమియంకే అందిస్తుండటంతో కంపెనీలు ఇటువంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. సిగరెట్ కాల్చేవారు ఆ అలవాటు లేని వారితో పోలిస్తే 1.5 నుంచి 2 రెట్లు అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది.
మూడు రకాలు..
ఇప్పుడు చాలా బీమా కంపెనీలు పొగాకు ఉత్పత్తులు వినియోగించే వారిని స్మోకర్, నాన్ స్మోకర్, ప్రిఫర్డ్ నాన్ స్మోకర్ అనే మూడు రకాలుగా విభజించి దాని ప్రకారం ప్రీమియంను లెక్కిస్తున్నాయి. పూర్తి ఆరోగ్యంగా ఉండి, ఎటువంటి చెడు అలవాట్లు లేని వారికి ప్రీమియంలు తక్కువగా ఉంటాయి. గత మూడేళ్లుగా నికోటిన్‌ను వినియోగించని వాళ్ళను నాన్ స్మోకర్లుగా పరిగణిస్తారు. అయితే ఈ నిబంధనలు ఒక్కో కంపెనీకీ ఒకొక్క విధంగా ఉంటాయి.
మీరు సిగరెట్లు అప్పుడప్పుడు కాలుస్తున్నా లేక, అలవాటు ఉన్నా.. వీరందరినీ స్మోకర్లుగానే కంపెనీలు భావించి ప్రీమియం నిర్ణయిస్తాయి. అప్పుడప్పుడు అలవాటు ఉన్న వారు కూడా పాలసీ తీసుకునేటప్పుడు ఆ విషయాన్ని పేర్కొనండి. లేకపోతే క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఆన్‌లైన్ టర్మ్ ప్లాన్ తీసుకుంటున్న వారు నాన్ స్మోకర్ అని పేర్కొంటున్న వారిపై ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నాయి. ఇలా అనుమానం వచ్చిన వారి మూత్ర, రక్త పరీక్షలను బీమా కంపెనీలు తీసుకుంటున్నాయి.
తర్వాత కూడా చెప్పాలి..
ఈ అలవాట్లు అనేవి ఎప్పుడు మొదలవుతాయో ఎప్పుడు ఆగిపోతాయో చెప్పడం కష్టం. ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత సిగరెట్ అలవాటు మొదలైతే ఆ విషయాన్ని బీమా కంపెనీకి చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. అలా కాకుండా పాలసీ తీసుకున్న తర్వాత సిగరెట్ అలవాటు మానేస్తే ఆ విషయాన్ని కూడా చెప్పండి. సిగరెట్ మానేసి ఏడాది దాటితే అప్పుడు మిమల్ని నాన్ స్మోకర్‌గా గుర్తిస్తారు. అప్పుడు మీకు తక్కువ ప్రీమియం రేట్లే వర్తిస్తాయి. ఇలా అలవాట్లు, ఆరోగ్య విషయాలను దాచకుండా వివరిస్తే క్లెయిమ్‌ల సమయంలో మీపై ఆధారపడిన వారికి ఇబ్బందులు ఉండవు.
- మునీష్ షర్దా,
ఎండీ,సీఈవో, ఫ్యూచర్ జెనరాలీ ఇండియా లైఫ్