ఖగపతి యమృతము తేగా
భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్
పొగ చెట్టై జన్మించెను
పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్
అని గిరీశం దొరవారు ఎన్నడో సెలవిచ్చారు. ఇప్పుడు పొగపురాణాన్ని తిరగరాసుకోవాల్సి వచ్చేలా ఉన్నది.
కమలపతి వడ్డన సేయగ
పొగచుట్టకు పన్ను పోటు బాగా ముదిరెన్
రెక్కలతో ధరలు ఎగరగ
అగ్గిపుల్ల లేకున్నా జేబులు కాలున్..అని కొత్తగా తోచిన పజ్జేలు రాసుకుని వాటిని పారాయణం చేసుకుంటూ గడపవలెను. దమ్ము కొట్టాలనిపించినప్పుడెల్లా.. నరాలు పట్టు తప్పి, జిహ్వ లాగి, భయం పుట్టి, వణుకుతో శరీరం కంపించి.. ఇక ఆ ఆలోచననే ధూమపాన ప్రియులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చేలా ఉన్నది మరి!
ఢిల్లీ పాలకులు సిగరెట్టుల మీద పన్ను పోటును ఏకంగా 35 శాతానికి పెంచేయాలని తలపోస్తున్న తరుణంలో.. సిగరెట్టును తలచుకుంటే చాలు.. పర్సు కాలి చురుక్కు మంటుందని అనుకోవాల్సిందే.
సిగరెట్టు అనగా ఏమిటి? మన లోలోపల గూడుకట్టుకుని ఉండే క్రియేటివిటీ అనే పదార్థాన్ని కరిగించి గంగాప్రవాహంలా వెలుపలికి లాక్కుని వచ్చే ధూమపరికరము కదా.. అని భాష్యం చెప్పగల మహానుభావులు మనకు చాలా మంది కనిపిస్తుంటారు.
‘భలే భలే ఓ సిగరెట్టు.. చేస్తావే బహు కనికట్టు.. చైతన్యానికి తొలిమెట్టు.. బద్ధకముంటే పని పట్టు..’ అంటూ సిగరెట్టు దమ్ము లాగి వదిలితే తప్ప తమలో జీవనోత్సాహం ఇనుమడించదని, దేహశకటం పరుగులెత్తదని నమ్మే ప్రబుద్ధ జీవులు కూడా కొందరుంటారు. పుర్రె బొమ్మ ఉన్నంత మాత్రాన చాపల్యం చావదని, చావు డప్పు మోగుతుందని తెలిసినా ధూమప్రేమ విలోమం కాదని నిరూపించే నిత్య సత్యమే సిగరెట్టు!
ఉదయముననే మేల్కాంచి తమ స్నానాలగదిలోకి దూరి తమ చుట్టూ ధూపం వేస్తే తప్ప కాలకృత్యపర్వం కూడా ముగించలేని నిత్య అంకితులు కొందరుంటారు. తమ మునివేళ్ల చివరల్లోమండే అందాల్ని తమకు దూరం చేయాలనే కుట్ర ఏదో అధికారాత్మకంగా జరుగుతున్నదని అనుమానించే సత్యశంకితులు కొందరు ఉంటారు! ఎవరి సంగతి ఎలా ఉన్నప్పటికీ.. సిగరెట్టు అనే పదార్థము తాజా పరిణామముల నేపథ్యములో.. నిప్పు లేకున్ననూ మండును.. మీ బతుకును పొగించడం మాత్రమే కాదు.. తెగించి ముట్టిస్తే నోటిచివర మండుట మాత్రమే కాదు సుమీ.. జేబులోని సొమ్ములను కూడా దహించి మసిచేయును.. అనే భావన ఇప్పుడు దేశ ప్రజలలో వేళ్లూనుకొనుచున్నది!
సిగరెట్టు మీది అపరిమితమైన ప్రేమతో, అది అమూల్యమైన వస్తువని గుర్తించి.. దాని విలువను ఆకసమునందలి నక్షత్రాల సరసన ఉంచినప్పుడే దానికి సద్గతి కలుగునని ఏలికలు గ్రహించడమే ఒక చిత్రమైన సంగతి. అందుకే జీఎస్టీ అను జోడింపులో కాస్త పెంపు జత చేసి 35 శాతం వడ్డించడం తగు విధాయకం అని నిర్ణయించడం తాజా తాజా సంగతి! ఇటువంటి పరిస్థితుల్లో సిగరెట్టు అను పరికరముతో దమ్ము కొట్టాలన్నా.. దాని వెంబడి శీతల పానీయములు అనబడు ద్రావకములు గుటక వేయాలన్నా.. బహు కష్టము అని ప్రజలు తెలుసుకోవడం ఒక్కటే ఇంకా పెండింగులో ఉన్నది.
ఇటువంటి వికట పరిస్థితులలో.. ధూమ ప్రేమికులకు గత్యంతరమేది? అను సందేహము జనులలో జనియించుట సహజము! పరిష్కారము బహు సులభము. ఓ తెల్లటి కాగితము మీద.. సిగరెట్టును చిత్రించి.. ఓ చివరన పెదవుల బంధమును, మరో చివరన పొగ కెరటములను చిత్రించి.. జిహ్వ లాగినప్పుడెల్లా దానిని చూచుకొనుచూ యుండవలెను. అటుల జేసిన యెడల.. జూచుచూ గడిపిన యెడల.. ధూమపానాసక్తులకు అనుభవైకవేద్యమైన పురాఅనుభవము.. పునః అనుభవములోకి వచ్చి ఆత్మానందము కలుగును. మరియొక మార్గము దుర్లభము. స్వస్తి. ..ఎం. రాజేశ్వరి
Comments
Please login to add a commentAdd a comment