బీమా లేని చికిత్సా..? బాబోయ్‌!! | Mandatory health insurance | Sakshi
Sakshi News home page

బీమా లేని చికిత్సా..? బాబోయ్‌!!

Published Sun, May 28 2017 11:32 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

బీమా లేని చికిత్సా..? బాబోయ్‌!! - Sakshi

బీమా లేని చికిత్సా..? బాబోయ్‌!!

ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండాల్సిందే  
♦  రకరకాల పాలసీలను చూసి సందిగ్ధంలో పడొద్దు  ∙
వయసు, అవసరాన్ని బట్టి ఎంచుకోవాలి
ముందే వైద్య పరీక్షలు బెటర్‌ 
సబ్‌ లిమిట్స్, కో–పే వంటి పరిమితులు లేకుంటేనే నయం  


రాజారావు (42) ఉన్నట్టుండి ఛాతీ భాగంలో నొప్పిగా ఉందంటూ కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గుండెకు ఆపరేషన్‌ చేసి రాజారావు ప్రాణాన్ని నిలబెట్టారు. కుటుంబంలో తిరిగి సంతోషం వెల్లివిరిసింది. కానీ, ఆస్పత్రి బిల్లు రూ.4 లక్షలు చూశాక ఆ సంతోషం ఆవిరైపోయింది. కారణం రాజారావుకు వైద్య బీమా లేదు. తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి ఆ బిల్లు చెల్లించాల్సి వచ్చింది.

ఆ అప్పులు తీర్చడానికి వారికి రెండేళ్లు పట్టింది. వైద్య వ్యయాలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో బీమా లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటన్నది రాజారావును చూస్తే తెలియకమానదు. గుండె సంబంధిత చికిత్సలకు రూ.1.50 లక్షలకన్నా తక్కువ కావడం లేదు. కేన్సర్‌ చికిత్సకు రూ.3 లక్షల వరకు, ఫ్రాక్చర్, ఇతరత్రా చికిత్సలకూ రూ.లక్ష వరకు ఖర్చవుతున్న రోజులివి. అనారోగ్యం పాలైనపుడు ఇల్లు గుల్ల కాకూడదనుకుంటే వెంటనే బీమా పాలసీ తీసుకోవాల్సిందే...

బీమా పాలసీ ఎంపిక అన్నది ఓ పెద్ద ప్రహసనం. ఎన్నో నిబంధనలు, పరిమితులు, ఓ పట్టాన అర్థం కాని టెర్మినాలజీ పరిస్థితిని సంక్లిష్టం చేస్తున్నాయి. సబ్‌లిమిట్స్, కోపేమెంట్స్, వెయిటింగ్‌ పిరియడ్‌ తదితర కీలక అంశాల గురించి వివరించడంతోపాటు, ఏ పాలసీ అనువైనదో చెప్పేదే ఈ సమగ్ర కథనం.

వేచి ఉండే కాలం
ముందు నుంచి ఉన్న వ్యాధులకు కవరేజీ కోసం వేచి ఉండాలన్న నిబంధనను చూసి వ్యాధులను దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దు. తర్వాతి కాలంలో వైద్య పరీక్షల్లో ఆ వ్యాధి అప్పుడే మొదలైంది కాదన్న విషయం బయటపడితే క్లెయిమ్‌ను కంపెనీలు తీరస్కరించే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, పాలసీ రద్దు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే బీమా పాలసీ తీసుకునే ముందే సమగ్ర వైద్య పరీక్షలకు సిద్ధం కావడం (కంపెనీ కోరకపోయినా) మంచిది. ఎక్కువ శాతం బీమా కంపెనీలు ముందు నుంచీ ఉన్న వ్యాధులకు కవరేజీని ఇచ్చేందుకు నాలుగేళ్ల పాటు వేచి ఉండాలన్న నిబంధన అమలు చేస్తున్నాయి. అదే సమయంలో అపోలో మ్యూనిచ్‌ ఆప్టిమా రీస్టోర్, రాయల్‌ సుందరం లైఫ్‌లైన్‌ సుప్రీమ్, సిగ్నా టీటీకే ప్రో హెల్త్‌ ప్లస్‌ పాలసీల్లో మూడేళ్లుగానే ఉంది. మ్యాక్స్‌ బూపా హార్ట్‌బీట్‌ (ప్లాటినం, గోల్డ్‌ ప్లస్‌) పాలసీల్లో వెయిటింగ్‌ పిరియడ్‌ రెండేళ్లే. కాకపోతే ప్రీమియం ఎక్కువ.

యుక్త వయసులో ఉంటే...
30ఏళ్లలోపు అవివాహితులు ప్రీమియం తక్కువ ఉంది కదా అని ఏదో ఒక హెల్త్‌ పాలసీ తీసుకున్నారనుకోండి. 30 ఏళ్లు దాటాక ఎక్కువగా క్లెయిమ్స్‌ అవసరం ఏర్పడుతుంది. అప్పుడు మీరు తీసుకున్న పాలసీ ఆ అవసరాలను తీర్చకపోతే ఆర్థికంగా భారమే. ఉద్యోగం చేసే సంస్థ నుంచి గ్రూపు హెల్త్‌ పాలసీ ఉందన్న ధీమా పనికిరాదు. వాటిలో పలు మినహాయిం పులు ఉండొచ్చు. అందుకే వ్యక్తిగతంగా ఓ మంచి హెల్త్‌ పాలసీ ఉండితీరాలి. 30 ఏళ్ల వయసులో ఉన్న వారికి సాధారణ వైద్య బీమా పాలసీ సరి పోతుంది. సమ్‌ ఇన్సూర్డ్‌ రీస్టోరేషన్, నో క్లెయిమ్‌ బోనస్‌ కోసం చూడక్కర్లేదు. ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు లేకుంటే నాలుగేళ్ల ‘ప్రీ ఎగ్జిస్టింగ్‌ డీసీజెస్‌’ నిబంధన ఉన్న పాలసీ తీసుకోవడమే బెటర్‌. ఎందుకంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది.

ఏ పాలసీలు అనువు...
రెలిగేర్‌ హెల్త్‌ కేర్, రాయల్‌ సుందరం లైఫ్‌లైన్‌ సుప్రీమ్, మ్యాక్స్‌బూపా హెల్త్‌ కంపానియన్‌ వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ఈ పాలసీల్లో హాస్పిటల్‌ రూమ్‌ అద్దెలపై ఎటువంటి పరిమితులు, ఇతరత్రా ఎటువంటి చార్జీల విధింపు లేదు. రూ.5 లక్షల వైద్య బీమా కవరేజీకి ఏడాదికి ప్రీమియం రూ.5,500 – రూ.6,500 మధ్యలో ఉంటుంది.

వివాహితులకు
30–40 ఏళ్ల మధ్య వయసులో, వివాహితులైన వారికి ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలు అనువుగా ఉంటాయి. ఇందులో పాలసీదారుడితో పాటు అతని జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలకు కవరేజీ లభిస్తుంది.

40 ఏళ్లు దాటితే...
జీవిత భాగస్వాములు ఇద్దరూ 40 ఏళ్ల పైబడి ఉంటే... వారికి బీమా కవరేజీ తగినంత ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ వయసులో అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంటుంది. అందుకని రీస్టోరేషన్‌ సదుపాయం ఉన్న పాలసీని ఎంచుకోవాలి. ఒకవేళ హైపర్‌టెన్షన్‌ సంబంధిత సమస్యలు ఉన్న వారు ముందస్తు వ్యాధులకు కవరేజీ కోసం దీర్ఘకాలం పాటు చూసే నిబంధన ఉన్న పాలసీలను ఎంచుకోవద్దు.

60 ఏళ్లు దాటిన వారికి...
కొన్ని కంపెనీలు గరిష్టంగా 65 ఏళ్ల వరకే పాలసీ తీసుకునేందుకు అనుమతిస్తున్నాయి. కొన్నింటిలో ఏ వయసు వారైనా వైద్య బీమా పొందొచ్చు. బీమా పాలసీ తీసుకున్న తర్వాత ఏ వయసు వారికైనా రెన్యువల్‌కు తిరస్కరించడానికి లేదు. ఆరోగ్యంగా ఉండి ఉంటే సీనియర్‌ సిటిజన్‌ పాలసీలకు బదులు రెగ్యులర్‌ హెల్త్‌ పాలసీలు అనువైనవి. వీటిలో సబ్‌ లిమిట్స్, కో–పే నిబంధనలుండవు. రాయల్‌ సుందరం లైఫ్‌లైన్‌ సుప్రీమ్, మ్యాక్స్‌ బూపా హెల్త్‌ కంపానియన్, అపోలో మ్యూనిచ్‌ ఆప్టిమా రీస్టోర్‌ పాలసీల్లో కోపే లేదు.

రీస్టోరేషన్‌ సదుపాయం
ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలో ఒక ఏడాదిలో బీమా కవరేజీ మొత్తాన్ని ఒకరు వినియోగించుకున్నా, మరో వ్యక్తి రీస్టోరేషన్‌ కింద తిరిగి బీమా కవరేజీని అదే ఏడాదిలో పొందవచ్చు. ఉదాహరణకు నలుగురు సభ్యులున్న కుటుంబం రూ.5 లక్షల బీమా పాలసీ తీసుకుంటే అది వారి అవసరాలకు సరిపోదు. ఏకకాలంలో ఇద్దరు అనారోగ్యం బారిన పడితే బీమా కవరేజీ సరిపోకపోవచ్చు. అదే సమయంలో అధిక బీమా కవరేజీ తీసుకుంటే ప్రీమియం భారం కావచ్చు. ఇటువంటి వారికి రీస్టోరేషన్‌ సదుపాయం అక్కరకు వస్తుంది. ఇందులో ఉన్న నిబంధనల్లా ఒకరు వ్యాధి బారినపడి పూర్తి బీమా కవరేజీని వినియోగించుకుంటే రీస్టోరేషన్‌ కింద తిరిగి అదే వ్యక్తి అదే వ్యాధి కోసం ఆ ఏడాదిలో మళ్లీ పరిహారం కోరేందుకు అవకాశం ఉండదు. సదరు వ్యక్తి మరో వ్యాధికి గురైతే పరిహారం పొందొచ్చు. అలాగే కుటుంబంలోని మిగిలిన సభ్యులు సైతం పరిహారం పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ సదుపాయం వద్దనుకుంటే రూ.10లక్షల పాలసీపై ప్రీమియం రూ.1,000–2000 వరకు తగ్గుతుంది.

సబ్‌లిమిట్స్‌
పాలసీలో సబ్‌ లిమి ట్, కో పే ఆప్షన్లను ఎంచుకోవద్దు. వీటిని ఎంచుకోవడం వల్ల ప్రీమియం కొంచెం తగ్గొచ్చేమో కానీ, క్లెయిమ్‌ ఎదురైతే అధిక మొత్తం జేబులోంచి పెట్టాల్సి వస్తుంది. రూమ్‌ చార్జీలు సహా ఆస్పత్రి వ్యయ భారాన్ని కొంత తగ్గించుకునేందుకు కంపెనీలు ఈ నిబంధనను అమలు చేస్తుం టాయి. ప్రభుత్వ రంగ కంపెనీల వైద్య బీమా పాలసీల ప్రీమియం ప్రైవేటు కంపెనీలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. కానీ, ప్రభుత్వ రంగ బీమా కంపెనీల పాలసీల్లో సబ్‌లిమిట్స్‌ ఉన్నాయి. గది అద్దె, ఐసీయూ, అంబులెన్స్‌ ఇలా పలు రకాల చార్జీలపై పరిమితి ఉంటుంది. ఉదాహరణకు అంబులెన్స్‌కు రూ.10వేలు చార్జీ అయితే, బీమా కంపెనీ రూ.2,000కే పరిహా రాన్ని పరిమితం చేయవచ్చు. ఉదాహరణకు న్యూఇండియా అష్యూరెన్స్‌ ఫ్లోటర్‌ మెడిక్లెయిమ్‌ పాలసీ సమ్‌ ఇన్సూర్డ్‌ మొత్తంలో గది అద్దెను 1 శాతానికి పరిమితం చేసింది. రూ.5 లక్షల బీమా పాలసీలో రూమ్‌ అద్దె రూ.5 వేల వరకే కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ ఆస్పత్రిలో గది అద్దె రూ.10వేలు ఉందనుకుంటే మిగిలిన మొత్తాన్ని పాలసీదారుడే భరించాల్సి ఉంటుంది. ఈ కోత దీనికే పరిమితం కాదండోయ్‌. మిగిలిన క్లెయిమ్‌ మొత్తానికీ దీన్నే అమలు చేస్తాయి. ఉదాహరణకు క్లెయిమ్‌ రూ.లక్ష ఉందనుకుంటే రూ.50వేలే చెల్లిస్తాయి. గది అద్దె రూ.10వేలలో సగమే చెల్లిస్తున్నందున అదే నిబంధన మిగిలిన క్లెయిమ్‌ మొత్తానికీ వర్తిస్తుంది. రెలిగేర్‌ హెల్త్‌ కేర్, అపోలో మ్యూనిచ్‌ ఆప్టిమా రీస్టోర్, మ్యాక్స్‌ బూపా హెల్త్‌ కంపానియన్‌ తదితర పాలసీల్లో ఈ తరహా సబ్‌ లిమిట్స్‌ లేవు.

నో క్లెయిమ్‌ బోనస్‌
వైద్య బీమాలో ఓ ఏడాదిలో ఒక్క క్లెయిమ్‌ కూడా లేకుంటే కంపెనీలు కొంత బోనస్‌ను ఇస్తుంటాయి. వైద్యం ఏటేటా ఖరీదవుతున్నందున ఇది కొంత మేర ఉపశమనం ఇచ్చేదే. దాదాపు అన్ని కంపెనీలు ఈ సదుపాయాన్ని ఆఫర్‌ చేస్తున్నాయి. ఓ ఏడాదిలో క్లెయిమ్‌ లేకుంటే మరుసటి ఏడాది సమ్‌ ఇన్సూర్డ్‌ (బీమా కవరేజీ) 10 నుంచి 20 శాతం పెరుగుతుంది. దీనికి ఎటువంటి అదనపు ప్రీమియం చెల్లించక్కర్లేదు. బేసిక్‌ బీమా కవరేజీకి సమాన స్థాయి వరకూ నో క్లెయిమ్‌ బోనస్‌ రూపంలో కవరేజీ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అంటే రూ.లక్ష పాలసీకి ఏటేటా 20 శాతం నో క్లెయిమ్‌ బోనస్‌ చొప్పున ఐదేళ్ల పాటు బీమా కవరేజీ రూ.లక్ష వరకు పెరిగి మొత్తం రూ.2 లక్షలు అవుతుంది. రెండేళ్లపాటు నో క్లెయిమ్‌ బోనస్‌ రూపంలో రూ.లక్ష పాలసీకి రూ.44వేల కవరేజీ పెరిగిందనుకోండి. మూడో ఏట క్లెయిమ్‌ వస్తే అప్పుడు సమ్‌ ఇన్సూర్డ్‌లో 20 శాతం తగ్గిపోతుంది. ఆ తర్వాతి సంవత్సరంలోనూ క్లెయిమ్‌ వస్తే మరో 20 శాతం తగ్గి బేసిక్‌ సమ్‌ ఇన్సూర్డ్‌ దగ్గర ఆగిపోతుంది. అయితే, మ్యాక్స్‌ బూపా హెల్త్‌ కంపానియన్, రాయల్‌ సుందరం లైఫ్‌లైన్‌ పాలసీల్లో మాత్రం నో క్లెయిమ్‌ బోనస్‌ కింద సమ్‌ ఇన్సూర్డ్‌ ఏటా 20 శాతం పెరుగుతుంది. కానీ, ఆ తర్వాతి సంవత్సరాల్లో క్లెయిమ్‌ వచ్చినప్పటికీ ఈ పెరిగిన సమ్‌ ఇన్సూర్డ్‌లో కోత విధించడం లేదు. ఇదో ఆకర్షణీయాంశం.

కో పేమెంట్‌...
అంటే సహ చెల్లింపు. క్లెయిమ్‌ మొత్తంలో కంపెనీతోపాటు పాలసీదారుడూ కొంత శాతాన్ని భరించడం. ఉదాహరణకు 20 శాతం కోపే ఉంటే, ఆస్పత్రి బిల్లు రూ.2 లక్షలు వచ్చిందనుకుంటే బీమా కంపెనీ రూ.1.60 లక్షల పరిహారమే చెల్లిస్తుంది. మిగిలిన రూ.40వేలను పాలసీదారుడే భరించాల్సి ఉంటుంది.

హోమియో, ఆయుర్వేద చికిత్సలకూ...
సాధారణంగా ఎక్కువ పాలసీలు అల్లోపతీ వైద్య చికిత్సలకే బీమా కవరేజీని పరిమితం చేస్తున్నాయి. హోమియోపతి, ఆయుర్వేదం, యునానీ తరహా వైద్య విధానాలకూ కవరేజీ కోరుకునే వారి కోసం మాక్స్‌ బూపా హెల్త్‌ కంపానియన్, రాయల్‌ సుందరం లైఫ్‌లైన్‌ పాలసీలను పరిశీలించొచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement