ఆరోగ్య బీమా అవసరాన్ని గతంతో పోలిస్తే నేడు ఎక్కువ మంది గుర్తిస్తున్నారు. డిజిటల్ వేదికలు విస్తృతం కావడం, స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఊపందుకోవడం హెల్త్ ఇన్సూరెన్స్‌పై అవగాహన పెరగడానికి సాయపడుతున్నాయి. కరోనా మహమ్మారి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అవసరాన్ని తెలిసేలా చేసింది. కానీ, ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో చాలా మందికి రకరకాల సందేహాలున్నాయి.
బీమా పాలసీని తీసుకునేందుకు ఇవి అడ్డుపడొచ్చు. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పనిచేసే విధానం, క్లెయిమ్‌కు సంబంధించి కూడా రకరకాల అపోహలు ఉన్నాయి. వీటిని తొలగించుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ తీసుకునేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తారు. ఇలాంటి కొన్ని అపోహలు, వాటికి సంబంధించి వాస్తవాలను నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ ప్రొడక్ట్స్, క్లెయిమ్స్ డైరెక్టర్ బబతోష్ మిశ్రా వెల్లడించారు.
ఆస్పత్రిలో చేరి కనీసం 24 గంటల పాటు చికిత్స తీసుకుంటేనే బీమా క్లెయిమ్‌కు అర్హత లభిస్తుందన్నది అపోహే. కానీ వాస్తవం వేరు. ఆధునిక పరిశోధన ఆధారిత ఔషధాలు, అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి రావడంతో చాలా చికిత్సలకు నేడు 24 గంటల పాటు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఏర్పడడం లేదు. వీటిని డే కేర్ ట్రీట్‌మెంట్స్‌గా (రోజులో వచ్చి తీసుకుని వెళ్లే వీలున్నవి) చెబుతారు. కీమోథెరపీ, రేడియోథెరపీ, క్యాటరాక్ట్ ఆపరేషన్, కిడ్నీల్లో రాళ్లు తొలగించే సర్జరీ ఇలాంటివన్నీ డేకేర్ ట్రీట్‌మెంట్స్ కిందకు వస్తాయి. డేకేర్ ట్రీట్‌మెంట్స్‌లో చాలా వాటికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో కవరేజీ లభిస్తోంది. కేన్సర్‌కు సంబంధించి ఓరల్ కీమోథెరపీకి అన్ని రకాల ఇండెమ్నిటీ హెల్త్ ప్లాన్లలో కవరేజీ
ఉంటోంది.
క్లెయిమ్ మొత్తం వస్తుందనుకోవద్దు
నియంత్రణ సంస్థ అనుమతి మేరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు వేటికి చెల్లింపులు చేయవో తెలియజేస్తూ ఒక జాబితా నిర్వహిస్తుంటాయి. పీపీఈ కిట్, మాస్క్, బ్యాండేజ్, నెబ్యులైజర్ తదితర ఇలా చెల్లింపులు చేయని వాటి జాబితాను బీమా సంస్థలు పాలసీ వర్డింగ్స్‌లో ప్రత్యేకంగా పేర్కొంటాయి. అందుకుని ఆస్పత్రిలో అయ్యే బిల్లు మొత్తాన్ని బీమా సంస్థలు చెల్లిస్తాయని అనుకోవద్దు. అయితే, వీటికి కూడా చెల్లింపులు చేసే రైడర్లను కొన్ని బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి.
రైడర్‌ను జోడించుకుని, కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా డిస్పోజబుల్స్‌కు సైతం క్లెయిమ్ తీసుకోవచ్చు. ఇక పాలసీల్లో మరికొన్ని ఇతర పరిమితులు కూడా ఉంటాయి. కోపేమెంట్, రూమ్‌రెంట్, డాక్టర్ కన్సల్టేషన్ చార్జీల పరంగా చెల్లింపుల పరిమితులు ఉంటాయి. అంటే వీటికి సంబంధించి బీమా సంస్థలు పాలసీ నియమ, నిబంధనల్లో పేర్కొన్న మేరకే చెల్లింపులు చేస్తుంటాయి. కనుక క్లెయిమ్ మొత్తం వస్తుందని అనుకోవద్దు. చెల్లింపుల్లో పరిమితులు ఉంటాయి.
ఉదాహరణకు సింగిల్ రూమ్ అని పాలసీ డాక్యుమెంట్‌లో ఉంటే.. హాస్పిటల్‌లో సాధారణ సింగిల్ రూమ్‌లో చేరినప్పుడే చికిత్సకు అయ్యే వ్యయాలపై పూర్తి చెల్లింపులు పొందడానికి ఉంటుంది. డీలక్స్ రూమ్/సూట్‌లో చేరితే అది పరిమితికి మించినది అవుతుంది. దీంతో క్లెయిమ్‌లో కొంత మేర కోత పడుతుంది. దీన్నే రూమ్ రెంట్ క్యాప్ అని కూడా అంటారు. వీటిపై పాలసీదారులు ముందే తగిన అవగాహనతో ఉండాలి. అందుకని కచ్చితంగా పాలసీ డాక్యుమెంట్‌ను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. లేదంటే బీమా సంస్థ కస్టమర్ కేర్ లేదా ఏజెంట్‌ను సంప్రదించాలి.
కూలింగ్ ఆఫ్ పీరియడ్
కూలింగ్ ఆఫ్ పీరియడ్ అన్నది పేషెంట్ కోలుకున్న తర్వాత నిర్ణీత కాలం పాటు అతనికి బీమా సంస్థ కొత్త పాలసీని ఆఫర్ చేయకపోవడం. కానీ, దీన్ని బీమా సంస్థలు కచ్చితంగా ఎత్తివేయాలని పాలసీదారులు భావిస్తుంటారు. అంతేకాదు, బీమా సంస్థలు ఆరోగ్యవంతులు, ఆస్పత్రి అవసరం ఏర్పడని వారికే పాలసీని ఆఫర్ చేస్తాయని అనుకుంటారు. కానీ, ఇది నిజం కాదు. కూలింగ్ ఆఫ్ పీరియడ్ వెనుక ఉన్న తార్కికత ఏమిటంటే.. ఒక ఆరోగ్య సమస్యకు చికిత్స తీసుకున్న తర్వాత ఏవైనా కొత్త సమస్యలు ఏర్పడతాయేమో అంచనా వేసేందుకు కావాల్సిన సమయంగా అర్థం చేసుకోవాలి. కరోనా చికిత్స లేదా సర్జరీ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత పాలసీదారులు మరింత కవరేజీకి అర్హత సాధిస్తారు. వీటిని ముందస్తు నుంచి ఉన్న సమస్యలుగా బీమా సంస్థలు పరిగణించవు. అలాగే క్లెయిమ్ సమయంలో అస్పష్టతను కూడా తగ్గిస్తుంది.
ఎక్కడైనా క్యాష్‌లెస్
బీమా క్లెయిమ్ ప్రక్రియను మరింత సులభతరం, పారదర్శకం, సౌకర్యంగా మార్చడంపై బీమా సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. క్లెయిమ్‌ను క్యాష్‌లెస్ (పాలసీదారు చెల్లించాల్సిన అవసరం లేకుండా) లేదా రీయింబర్స్‌మెంట్ విధానంలో దాఖలు చేసుకోవచ్చు. కానీ, నగదు రహిత చికిత్స సేవలు పొందాలంటే మీరు చేరే హాస్పిటల్.. బీమా సంస్థ క్యాష్‌లెస్ హాస్పిటల్ నెట్‌వర్క్‌లో భాగమై ఉండాలి. ఇలా కాకుండా పాలసీదారు చికిత్స తీసుకుని అందుకు సంబంధించిన మొత్తం వారే చెల్లించి తర్వాత బీమా సంస్థ వద్ద క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. ఇందుకోసం అన్ని రకాల పత్రాలను సమర్పించాలి. అప్పుడే బీమా సంస్థ క్లెయిమ్‌ను ప్రాసెస్ చేయగలదు.
క్యాష్‌లెస్ అన్నది సౌకర్యమైనది. దీనివల్ల ఆస్పత్రిలో చేరాల్సి వస్తే చికిత్సకు అయ్యే వ్యయాలను పాలసీదారు సొంతంగా సమకూర్చుకునే ఇబ్బంది తప్పుతుంది. పైగా డిశ్చార్జ్ ప్రక్రియ క్యాష్‌లెస్ విధానంలో సులభంగా పూర్తవుతుంది. బీమా వ్యాపారం అన్నది ప్రజల నిధులతో కూడుకున్నదని అర్థం చేసుకోవాలి. ప్రజల డిపాజిట్లకు సంరక్షకుడిగా బీమా సంస్థ అన్ని రకాల నిజమైన క్లెయిమ్‌లను గౌరవించాల్సి ఉంటుంది. బీమా సంస్థలు పాలసీ డాక్యుమెంట్‌ను అర్థం చేసుకునేందుకు వీలుగా సులభ పరిభాషతో రూపొందిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కొనుగోలుకు ముందు శ్రద్ధగా వీటిని చదవడం వల్ల.. క్లెయిమ్‌ల సమయంలో అనవసర తలనొప్పులను రాకుండా ముందే జాగ్రత్త పడొచ్చు.
అధిక కవరేజీ కోసం హెల్త్ చెకప్
పాలసీ జారీ చేసే ముందు అన్ని బీమా సంస్థలూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరడం లేదు. పెద్ద వయసులో ఉన్నారని లేదా అధిక కవరేజీ కోరుతున్నారని వైద్య పరీక్షలు కచ్చితంగా చేయించుకోవాలనేమీ లేదు. ఉదాహరణకు ప్రముఖ హెల్త్ ప్లాన్లు అన్నింటికీ ముందస్తు వైద్య పరీక్షలు అవసరం లేదు. కొన్ని ప్రత్యేక కేసుల్లోనే నిర్ధేశిత వైద్య పరీక్షలను బీమా సంస్థలు కోరుతుంటాయి. దరఖాస్తుదారులకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే లేదా గతంలో ఏవైనా ఎదుర్కోని ఉంటే ప్రస్తుత ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరతాయి. ఇందుకు అయ్యే వ్యయాలను బీమా సంస్థలు పూర్తిగా భరిస్తుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment