న్యూఢిల్లీ: నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియంలో నికర చెల్లింపులు (క్లెయిమ్ రేషియో) 2023–24లో స్వల్పంగా తగ్గి 82.52 శాతంగా ఉన్నట్టు బీమారంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) నివేదిక ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 82.95 శాతంగా ఉంది. నాన్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ కలసి గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.90 లక్షల కోట్ల ప్రీమియాన్ని నమోదు చేశాయి. 12.76 శాతం పెరిగింది. ప్రభుత్వరంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియం 9 శాతం వరకు పెరిగి రూ.82,891 కోట్ల నుంచి రూ.90,252 కోట్లకు వృద్ధి చెందింది. ప్రైవేటు రంగ సాధారణ బీమా సంస్థల ప్రీమియం రూ.1.88 లక్షల కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1.58 లక్షల కోట్లుగానే ఉంది. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల లాభం రూ.10,119 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ రూ.2,556 కోట్ల మేర నష్టాలను నమోదు చేయడం గమనార్హం.
నివేదికలోని వివరాలు..
2023–24లో నెట్ ఇన్‌కర్డ్ (నికర) క్లెయిమ్‌లు 15.39 శాతం పెరిగి రూ.1.72 లక్షల కోట్లకు చేరాయి.
ప్రభుత్వరంగ బీమా సంస్థల ఇన్‌కర్డ్ క్లెయిమ్ రేషియో 2022–23లో 99.02 శాతంగా ఉంటే, 2023–24లో 97.23 శాతానికి తగ్గింది.
ప్రైవేటు రంగ సాధారణ బీమా సంస్థల ఇన్‌కర్డ్ క్లెయిమ్ రేషియో 76.49 శాతానికి మెరుగుపడింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 75.13 శాతంగా ఉంది.
స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల ఇన్‌కర్డ్ క్లెయిమ్ రేషియో 2022–23లో 61.44 శాతంగా ఉంటే, 2023–24లో 63.63 శాతానికి మెరుగుపడింది.
స్పెషలైజ్డ్ ఇన్సూరెన్స్ కంపెనీల ఇన్‌కర్డ్ క్లెయిమ్ రేషియో 66.58 శాతంగా ఉంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 73.71 శాతంగా ఉండడం గమనార్హం.
ఇదీ చదవండి: వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం ప్రత్యేక ప్లాన్
జీవిత బీమా కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.77 లక్షల కోట్లను పాలసీదారులకు చెల్లించాయి. పాలసీదారుల నుంచి వసూలు చేసిన మొత్తం ప్రీమియంలో చెల్లింపులు 70.22 శాతంగా ఉన్నాయి.
పాలసీల సరెండర్‌లు/ఉపసంహరణలకు సంబంధించిన ప్రయోజనాలు 15 శాతం పెరిగి రూ.2.29 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థల వాటా 58 శాతంగా ఉంది.
2023–24లో 18 జీవిత బీమా కంపెనీలు నికర లాభాలను నమోదు చేశాయి. జీవిత బీమా కంపెనీల ఉమ్మడి లాభం 11 శాతం పెరిగి రూ.47,407 కోట్లకు చేరింది.
ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థల (ఎల్‌ఐసీ) లాభం 11.75 శాతం పెరిగితే, ప్రైవేటు జీవిత బీమా కంపెనీల లాభంలో 5 శాతం వృద్ధి నమోదైంది.
మొత్తం బీమా వ్యాప్తి 2022–23లో 4 శాతంగా ఉంటే 2023–24లో 3.7 శాతానికి పరిమితమైంది. జీవిత బీమా వ్యాప్తి 3 శాతం నుంచి 2.8 శాతానికి తగ్గగా.. సాధారణ బీమా వ్యాప్తి (ఆరోగ్య బీమా సహా) ఒక శాతం వద్దే స్థిరంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment