హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లలో దోమ కాటుదే మూడో స్థానం
మూడేళ్లలో దేశంలో రెట్టింపైన క్లెయిమ్‌లు
పెరిగిన మలేరియా, డెంగీ, టైఫాయిడ్ కేసులు, మరణాలు
పాలసీ బజార్ అధ్యయనంలో వెల్లడి
దేశంలో బీమా సొమ్మును దోమలు ఖాళీ చేస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లలో దోమల కారణంగా వచ్చే వ్యాధులది మూడో స్థానమంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దోమలతో వచ్చే రోగాల కేసులు అంతకంతకూ పెరుగుతుండగా.. అదే స్థాయిలో ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లూ రెట్టింపవుతున్నాయి.
సాక్షి, విశాఖపట్నం: ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ పాలసీ బజార్ ఇటీవల క్లెయిమ్స్‌పై దేశవ్యాప్తంగా అధ్యయనం చేసింది. దేశంలో హెల్త్ పాలసీలకు సంబంధించి ఏ ఏ వ్యా«ధులకు సంబంధించి క్లెయిమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయనే దానిపై చేసిన సర్వేలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. బీమా సంస్థలు నమోదు చేసిన ఆరోగ్య బీమా క్లెయిమ్‌లలో దాదాపు మూడింట ఒక వంతు సీజనల్ అంటు వ్యాధులకే అవుతున్నాయని సర్వేలో తేలింది.
వీటిలోనూ డెంగీ, మలేరియా తదితర సాంక్రమిత వ్యాధులదే అగ్రభాగంగా ఉంది. ప్రతి పది పాలసీల్లో 4 వరకూ దోమకాటుతో వచ్చే వ్యాధులవేనని పాలసీ బజార్ వెల్లడించింది. జూలై, ఆగస్ట్‌లలో ఎక్కువగా.. దోమకాటు కారణంగా క్లెయిమ్‌లు ఎక్కువగా రెండు నెలల్లోనే జరుగుతున్నాయి. జూలై, ఆగస్ట్‌లో వచ్చే క్లెయిమ్స్ దరఖాస్తుల్లో 60 శాతం వరకూ దోమకాటు వ్యాధులవే ఉన్నాయి.
సెప్టెంబర్ లోనూ ఈ తరహా దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని సర్వేలో తేలింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ దోమల బెడద ఎక్కువగా ఉందనడానికి ఇదే నిదర్శనంగా చెప్పొచ్చు. పాలసీ బజార్ ద్వారా నివేదించిన ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల అధ్యయనం ప్రకారం.. సీజనల్ వ్యాధుల క్లెయిమ్‌లలో డెంగీ, మలేరియా వంటి సాంక్రమిత వ్యాధులు 15 శాతం ఉన్నాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల చికిత్సకు సాధారణంగా రూ.50,000 నుంచి రూ.1,50,000 వరకూ ఖర్చవుతోంది.
జీర్ణకోశ వ్యాధులదీ అదే దారి..
వర్షాకాలంలో వచ్చే మరో అనారోగ్య సమస్య స్టమక్ ఫ్లూ వంటి జీర్ణకోశ వ్యాధులకూ క్లెయిమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి మలేరియాతో సమానమైన చికిత్స ఖర్చులుంటాయి. సీజనల్ క్లెయిమ్‌లలో 18 శాతం ఈ వ్యాధికి సంబంధించినవే. కాలానుగుణ అనారోగ్య క్లెయిమ్‌లలో మరో 10 శాతం వివిధ అలెర్జీలకు సంబంధించినవి ఉన్నాయి. అదే విధంగా.. చలికాలంలో శ్వాసకోశ వ్యాధులు, బ్రోన్కైటిస్ కారణంగా వచ్చే క్లెయిమ్‌లు 20 శాతం, సీజనల్ వ్యాధులకు మరో 12 శాతం క్లెయిమ్స్ జరుగుతున్నాయి. అయితే వీటి చికిత్స ఖర్చు రూ.25,000 నుంచి రూ.లక్ష వరకు మాత్రమే.
సీజనల్ వ్యాధులకే ఎక్కువగా క్లెయిమ్‌లు
దేశంలో సీజనల్ వ్యాధుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ వీటి బారిన ప్రజలు ఎక్కువగా పడుతున్నారు. దీనివల్ల క్లెయిమ్స్ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ వస్తోంది. ఇంతకు ముందు ఇళ్లల్లోనే చికిత్స పొందేవారు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పెరగడం వల్ల ఏ చిన్న అనారోగ్యం వచ్చినా.. క్లెయిమ్ చేసుకోవచ్చనే ధీమాతో మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు వస్తుండటం సానుకూల పరిణామంగా చెప్పొచ్చు. – సిద్ధార్థ్ సింఘాల్, పాలసీబజార్ ఇన్సూరెన్స్ హెడ్
Comments
Please login to add a commentAdd a comment