క్లెయిమ్‌ల పరిష్కారంలో తీవ్ర ఆలస్యం
ఆమోదించకుండా రోజుల తరబడి జాప్యం
కంపెనీల తీరుపై పాలసీదారుల అసహనం
ప్రతి 10 మందిలో ఎనిమిది మంది అసంతృప్తి
లోకల్ సర్కిల్ సంస్థ సర్వేలో వెల్లడి
సాక్షి, అమరావతి: అత్యవసర సందర్భాల్లో ఆదుకోవాల్సిన ఆరోగ్య బీమా అక్కరకు రావడం లేదని.. బీమా కంపెనీలు ఉద్దేశపూర్వకంగా క్లెయిమ్‌ల ఆమోదంలో ఆలస్యం చేస్తున్నాయని మెజారిటీ శాతం పాలసీదారులు వాపోతున్నారు. నిరీక్షణ రూపంలో పాలసీదారుల సహనానికి పరీక్ష పెడుతూ చివరకు తక్కువ క్లెయిమ్ మొత్తాన్ని అంగీకరించేలా కావాలనే జాప్యం చేస్తున్నాయని ప్రతి 10 మంది పాలసీదారుల్లో ఎనిమిది మంది పేర్కొంటున్నారు. ఆస్పత్రుల్లో చేరిన గంట లోపు నగదు రహిత క్లెయిమ్‌లను,
డిశ్చార్జి అయిన మూడు గంటల్లోగా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను పరిష్కరించాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) గతేడాది బీమా కంపెనీలకు స్పష్టం చేసింది. అయితే ప్రతి 10 మంది పాలసీదారుల్లో ఆరుగురికి క్లెయిమ్‌ల ఆమోదానికి ఆరు గంటల నుంచి రెండు రోజుల సమయం పడుతోందని లోకల్ సర్కిల్ సంస్థ సర్వేలో వెల్లడైంది. బీమా కంపెనీల సేవలపై దేశవ్యాప్తంగా 327 జిల్లాల్లో లక్ష మందికిపైగా పాలసీదారుల అభిప్రాయాలను సేకరించారు. సర్వేలో 67 శాతం పురుషులు, 33 శాతం మంది మహిళలు పాల్గొన్నారు.
పారదర్శకత లేదన్న 83 శాతం మంది
క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ కోసం బీమా కంపెనీలకు పారదర్శ కమైన వెబ్ ఆధారిత సమాచార వ్యవస్థలు లేవని భావిస్తున్నారా? అని 15,031 మందిని ఆరా తీయగా 83 శాతం మంది అవుననే సమాధానం ఇచ్చారు. ప్రతి దశలో వంద శాతం వెబ్ ఆధారిత ప్రాసె సింగ్‌ను తప్పనిసరి చేసేలా చూడాలని ఐఆర్‌డీఏఐని కోరారు. తొమ్మిది శాతం మంది మాత్రమే కమ్యూనికేషన్ వ్యవస్థలు సరిగానే పని చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఐఆర్‌డీఐఏ నివేదిక ప్రకారం 2024లో దేశంలో రూ.1.2 లక్షల కోట్ల క్లెయిమ్‌లు నమోదు కాగా అందులో 71.3 శాతం మేర మాత్రమే బీమా కంపెనీలు చెల్లింపులు జరిపాయి.
జాప్యం.. పాక్షిక ఆమోదం
గత మూడేళ్లలో క్లెయిమ్‌ల పట్ల బీమా కంపెనీల ప్రతిస్పందన ఎలా ఉందని 28,700 మందిని ప్రశ్నించగా చెల్లని కారణాలతో క్లెయిమ్‌లు తిరస్కరించారని 20 శాతం మంది, క్లెయిమ్ మొత్తంలో పాక్షికంగా ఆమోదించారని 49 శాతం మంది, మొత్తానికి ఆమోదం లభించిందని 25 శాతం మంది తెలిపారు. పది మందిలో ఐదుగురు పాలసీదారులు తమ క్లెయిమ్‌లను బీమా కంపెనీలు తిరస్కరించాయని, పాక్షికంగా ఆమోదించారని తెలిపారు. క్లెయిమ్‌ల తిరస్కరణ కారణంగా 50 శాతం మంది పాలసీదారులు ఇబ్బందులు పడుతున్నట్టు వెల్లడవుతోంది. ఆస్పత్రుల్లో చేరినప్పుడు దాఖలు చేసిన క్లెయిమ్‌లు ఆమోదానికి ఎంత సమయం పట్టిందని 30,366 మందిని ఆరా తీయగా 24–48 గంటల సమయం పట్టిందని 21 శాతం మంది, 12–24 గంటలని 12 శాతం మంది, 9–12 గంటలు తీసుకున్నారని 14 శాతం మంది, 6–9 గంటలు పట్టిందని 12 శాతం మంది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment