
ఇష్టానుసారంగా పాలసీలు విక్రయిస్తే..
బ్యాంకులు, ఉద్యోగులపై చర్యలు: ఐఆర్‌డీఐ
ముంబై: అధిక ప్రయోజనాలు వస్తాయని బీమా పాలసీలను ఎక్కువ చేసి విక్రయిస్తే బ్యాంకులు, సంబంధిత ఉద్యోగులు బాధ్యత వహించాల్సి ఉంటుందని బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) హెచ్చరించింది. ఉన్నవి, లేనివి కల్పించి బీమా పాలసీలు విక్రయిస్తే బ్యాంకులు, సంబంధిత ఉద్యోగులపై కొత్త బీమా చట్టం ప్రకారం చర్యలు తప్పవని ఐఆర్‌డీఏ చైర్మన్ టి. ఎస్. విజయన్ చెప్పారు. 2002 నుంచి బ్యాంకులు బీమా పాలసీలు విక్రయించడం ప్రారంభించాయి.
కొత్త బీమా చట్టం నేపథ్యంలో బ్యాంకులు బీమా పాలసీల విక్రయాలపై తగిన రికార్డ్‌లను నిర్వహించాలని విజయన్ చెప్పారు. అవసరమైనపక్షంలో ఆ రికార్డులను తమ పరిశీలనకు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. బ్యాంకులు విక్రయించే పాలసీలపై ఆయా బ్యాంకులకు, సంబంధిత ఉద్యోగులకు తగిన అవగాహన లేదని గతంలో తాము నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైందని వివరించారు. అందుకే ఈ కొత్త నిబంధనలు తెచ్చామని పేర్కొన్నారు.