
2020 డిసెంబర్ 31 వరకూ అందుతున్న సమాచారం ప్రకారం బ్యాంకులు, బీమా కంపెనీల వద్ద క్లెయిమ్ చేయని మొత్తం దాదాపు రూ.49,000 కోట్లని ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ రాజ్యసభకు తెలిపారు. బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని సొమ్ము రూ.24,356 కోట్లని వివరించారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్– ఐఆర్‌డీఏఐ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు బీమా సంస్థల వద్ద ఉన్న ఈ మొత్తాలు రూ.24,586 కోట్లని (2020 డిసెంబర్ నాటికి) వెల్లడించారు.
ఎవ్వరూ క్లెయిమ్ చేయని నిధుల వినియోగానికి 2014లో ఆర్‌బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌ను ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు వారిలో అవగాహన పెంచడం ఈ ఫండ్ లక్ష్యమన్నారు. ఇక బీమా కంపెనీలు తమ వద్ద గత పదేళ్లుగా క్లెయిమ్ చేయని నిధులను సీనియర్ సిటిజన్ సంక్షేమ నిధికి (ఎస్‌సీడబ్లూఎఫ్) ప్రతి యేడాదీ బదలాయిస్తాయని తెలిపారు. సీనియర్ సిటిజన్ల ప్రయోజనాల పరిరక్షణకు ఈ నిధులను ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment