
న్యూఢిల్లీ: కస్టమర్లతో ఏదో రకంగా బీమా పాలసీలను విక్రయించే విధానాలను బ్యాంక్‌లు అనుసరిస్తున్నాయనే విమర్శలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. బీమా ఉత్పత్తుల విక్రయాల కోసం అనైతిక విధానాలను అనుసరించొద్దని బ్యాంక్‌లను కోరింది. కస్టమర్లకు బీమా పాలసీల విక్రయాల్లో అనైతిక విధానాలు పాటించకుండా తగిన యంత్రాంగాన్ని అమల్లో పెట్టాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల అధినేతలను ఆదేశించింది. కస్టమర్లకు బీమా పాలసీలను విక్రయించే విషయంలో బ్యాంక్‌లు, బీమా సంస్థలు మోసపూరిత, అనైతిక విధానాలకు పాల్పడుతున్నాయంటూ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగానికి ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 75 ఏళ్లు దాటిన కస్టమర్లకు సైతం జీవిత బీమా పాలసీలను విక్రయించిన సందర్భాలను ప్రస్తావించింది.
సాధారణంగా కస్టమర్లు రుణాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు, టర్మ్ డిపాజిట్ చేస్తున్నప్పుడు బ్యాంక్‌లు బీమా ఉత్పత్తులను వారితో కొనిపించే ప్రయత్నం చేస్తుంటాయి. ఏదో ఒక బీమా కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులను కస్టమర్లతో బలవంతంగా కొనిపించే చర్యలకు దూరంగా ఉండాలని తాజా ఆదేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. బీమా ఉత్పత్తుల విక్రయాలపై ప్రోత్సాహకాలు ఇవ్వడం క్షేత్ర స్థాయి సిబ్బందిపై ఒత్తిడికి దారితీయడమే కాకుండా, బ్యాంక్‌ల ప్రధాన వాణిజ్య కార్యకలపాలపై ప్రభావం పడుతుందని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సైతం ఆందోళన వ్యక్తం చేయడాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అనైతిక, అనుచిత విధానాలను అనుసరించకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని, తగిన యంత్రాంగాన్ని అమల్లో పెట్టాలని కోరింది. బీమా పాలసీల విక్రయాలకు సంబంధించి నూరు శాతం కేవైసీ నిబంధనలు అమల్లో పెట్టాలని కూడా ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment