న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ ‘క్రెడిట్ అవుట్‌రీచ్’ కార్యక్రమం కింద దాదాపు 2 లక్షల మంది రుణ గ్రహీతలకు రూ.11,168 కోట్ల రుణాలను అందజేసిందని ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ తెలిపారు. ఈ కార్యక్రమం కింద, బ్యాంకులు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రుణగ్రహీతలకు రుణాలను మంజూరు చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనితోపాటు పలు బ్యాంకులు రాయితీ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ వంటి పండుగ ఆఫర్‌లను ప్రకటించాయి. ‘ఆగస్టులో ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు మద్దతును అందించే క్రమంలో అక్టోబర్‌లో క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించాలని బ్యాంకులకు సూచించారు. దీనికి అనుగుణంగా, బ్యాంకులు జిల్లాల వారీగా, రంగాల వారీగా రుణ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి‘ అని ఆర్థిక మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. బ్యాంకులు–నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ), ఫిన్‌టెక్ సెక్టార్‌ల మధ్య సహ–రుణ ఏర్పాట్ల ద్వారా కేంద్రం క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
మంచి స్పందన
వివిధ కేంద్ర ప్రభుత్వ రుణ గ్యారెంటీ పథకాల కింద మంజూరు చేసిన, పంపిణీ చేసిన నిధుల పరిమాణంకంటే క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్ కింద జారీ అయిన రుణాలు అధికంగా ఉండడం గమనార్హం. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, దాదాపు లక్ష మంది లబ్ధిదారులకు రూ.6,268 కోట్ల వ్యాపార రుణాలు మంజూరు చేయగా, 5,058 మంది రుణగ్రహీతలకు రూ.448 కోట్ల విలువైన వాహన రుణాలు మంజూరయ్యాయి. 2021 అక్టోబర్ 20 నాటికి 3,401 మంది రుణగ్రహీతలకు రూ.762 కోట్ల విలువైన గృహ రుణాలు మంజూరయ్యాయి. 2019 అక్టోబర్ – 2021 మార్చి మధ్య ఇలాంటి అవుట్‌రీచ్ కార్యక్రమాలను బ్యాంకులు నిర్వహించాయి. తద్వారా ఆర్‌ఏఎం సెక్టార్ (రిటైల్, వ్యవసాయం, లఘు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) అన్ని రకాల రుణ అవసరాలను నెరవేర్చాయి. అప్పట్లో ఈ కార్యక్రమం కింద రూ.4.94 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ పండుగ సీజన్‌లో కూడా చిన్న రుణగ్రహీతలకు సరసమైన వడ్డీ రేట్లలో భారీ ఎత్తున ఈ కార్యక్రమం కింద రుణాలను అందజేయాలని కేంద్రం నిర్దేశిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment