న్యూఢిల్లీ: భారత బీమా రంగ దిగ్గజ సంస్థ– జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) తిరిగి మెడిక్లెయిమ్ బీమా పాలసీ సెగ్మెంట్‌లోకి ప్రవేశించడానికి ఆసక్తిగా ఉంది. ఈ విషయంపై రెగ్యులేటర్– ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు ఎల్‌ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ పేర్కొన్నారు.
మెడిక్లెయిమ్ పాలసీ అంటే...
మెడిక్లెయిమ్ పాలసీలు అంటే... నష్టపరిహారం (ఇన్‌డెమ్నిటీ) ఆధారిత ఆరోగ్య పథకాలు. అయితే మార్కెట్ నుండి ఈ పథకాలను ఉపసంహరించుకోవాలని 2016లో ఐఆర్‌డీఏఐ జీవిత బీమా సంస్థలను కోరింది. మూడు నెలల నోటీస్ పిరియడ్‌తో అప్పట్లో వాటి ఉపసంహరణ కూడా జరిగింది. జీవిత బీమా సంస్థలు ఇలాంటి ఆరోగ్య సంబంధ పథకాలు ఇవ్వడానికి సాంకేతికంగా అడ్డంకులు ఉన్నాయని అప్పట్లో రెగ్యులేటర్ భావించింది.
నష్టపరిహార ఆధారిత ఆరోగ్య బీమా పథకాల కింద బీమా చేసిన మొత్తం వరకు వైద్య చికిత్స కోసం ఖర్చు చేసిన డబ్బుకు బీమా సంస్థ రీయింబర్స్‌మెంట్ (చెల్లింపులు) చేస్తుంది. 2016లో ఉపసంహరణకు ముందు జీవిత బీమా సంస్థల ఆరోగ్య పోర్ట్‌ఫోలియోలో 90–95 శాతం నష్టపరిహార ఆధారిత ఆరోగ్య బీమా పథకాలు (ఇన్‌డెమ్నిటీ) ఉండేవి. దీని ప్రకారం పాలసీదారు వైద్యుడిని సందర్శించిన తర్వాత లేదా వైద్య ఖర్చులను భరించిన తర్వాత రీయింబర్స్‌మెంట్‌ను క్లెయిమ్ చేసే వీలుండేది.
మళ్లీ మార్పు ఎందుకు?
2030 నాటికి ప్రతి పౌరుడు ఆరోగ్య బీమా పాలసీని కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలన్న ఆదేశాల నేపథ్యంలో జీవిత బీమా సంస్థలు ఆరోగ్య విభాగంలోకి తిరిగి ప్రవేశించే సమయం ఆసన్నమైందని ఇటీవలే కొత్త ఐఆర్‌డీఏఐ చైర్మన్ దేబాశిష్ పాండా అన్నారు.అయితే జీవిత బీమా సంస్థలను ఆరోగ్య బీమా పాలసీలను విక్రయించడానికి అనుమతించడం వల్ల కలిగే లాభ నష్టాలను రెగ్యులేటర్ మదింపు చేస్తోందని, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా చాలా మార్కెట్లలో జీవిత బీమా సంస్థలు ఆరోగ్య పాలసీలనూ విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 24.50 లక్షల మంది జీవిత బీమా ఏజెంట్లు ఉండగా, సాధారణ, ఆరోగ్య బీమా విభాగంలో కేవలం 3.60 లక్షల మంది ఏజెంట్లు మాత్రమే ఉన్నారు. జీవిత బీమా సంస్థలను ఆరోగ్య బీమా రంగంలోకి అనుమతించినట్లయితే, ఏజెంట్ల సంఖ్య 600 శాతం పెరుగుతుంది. దీనివల్ల దేశంలో ఆరోగ్య బీమా వ్యాప్తి గణనీయంగా పెరుగుతుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment